ప్రజాస్వామ్యంలో రాచరికం!

టాపు(లేని)స్టోరీ:

దేవుడు లేక పోతే ఏమయింది? వెంటనే ఒక దేవుణ్ణి సృష్టించండి. ఇదో పాత సూక్తి. రాజులేక పోతే నష్టమేముంది? వెంటనే రాజునో లేక రాజునో సృష్టించండి. మన దేశ వర్తమాన చరిత్రను చూసినప్పుడెల్లా ఈ సూక్తిని ఇలా కొత్తగా మార్చుకోవాలనిపిస్తుంది. ఆలోచించటానికి బధ్ధకమయినప్పుడో, మృత్యువుభయపెట్టినప్పుడో-కొందరు నిజంగానే దేవుడుంటే బాగుండుననుకుంటారు. ఉన్నట్టు విశ్వసిస్తారు. ప్రజాస్వామ్యం వచ్చేశాక కూడా, రాచరికం మనస్సులో వుండి పోతుంది. కారణం కూడా అంతే. విముక్తి చెందటానికి ఓపిక లేనివారికీ, తమల్ని తాము పాలించుకునేంత దమ్ము లేని వారికీ, నిజంగానే ఒక రాజో, ఒక రాణీయో అవసరమవుతారు. మన రాచరికాన్నీ, బ్రిటిష్‌ రాచరికాన్నీ వదలించుకున్నా, ఇంకా మనం ‘రాజభక్తి’ ని వదలించికోలేక పోయాం. అందుకోసం గల్లీ స్థాయిలో గల్లీ రాజునీ, ఢిల్లీ స్థాయిలో ఢిల్లీ రాణినీ మనం సృష్టించుకుంటాం. రాజు ఎవరయినా కావచ్చు. స్వాతంత్య్ర సమరంలో ఆస్తులూ, పాస్తులూ పోగొట్టున్న వాడూ కావచ్చు, రాష్ట్రాన్నో, దేశాన్నో చాపలా చుట్టేసి రియల్‌ ఎన్టేట్‌ వ్యాపారం చేసుకున్న వాడూ కావచ్చు. శుధ్ధ అహింసావాదయినా కాచ్చు, పచ్చి నెత్తురు తాగే వాడయినా కావచ్చు. వచ్చి ముందు నిలబడితే, రాచరిక వ్యామోహంతో వున్న మన ప్రజలు రాజుని చేసేస్తారు. అచ్చంగా మామూలు మనిషిని బాబాగా మార్చుకున్నట్లే. జీర్ణ శక్తి మందగించి, వారాల పాటు ఆహారం తీసుకోని వాడినో, జీవితం మీద విరక్తితో వీధుల్లో తనమానాన తాను తిరిగి వాడినో బాబాగానో, దేవుడిగానో చేసేసుకోవచ్చు. ఒక్క సారి రాజు అయ్యాక, దించటం కష్టం. రాజు పోతే రాజు భార్యో, రాజు కొడుకో, రాణి పోతే రాణి కొడుకో, కోడలో- ఎవరో ఒకరు ఆ పోస్టులో కూర్చోవాలి. వారు కూర్చోవటానికి జంకినా, మన వాళ్ళు ఊరుకోరు. ప్రజాస్వామ్యం వచ్చేశాక కూడా ఈ ‘రాచరికపు’వ్యామోహాన్ని వదలించుకోలేని దేశాలు ఇంకా వున్నాయి. అయితే బ్రిటన్‌ లాంటి దేశం, ఈ సరదా తీరకే హోదా కు మాత్రమే పనికొచ్చే ‘రాణి’ భరిస్తున్నారు. మన దేశంలో అమ్మ వారికి జాతరలు , దేవుళ్ళకు పెళ్ళిళ్ళూ చేసిసంబరాలు జరుపుకున్నట్టు, అక్కడకూడా రాజకుటుంబీకుల పెళ్ళిళ్ళ సంబరాలను జరుపుకుంటారు. అంతే ఆ కుటుంబీకుల ప్రయివేటు వ్యవహారాలను సినీతారల ప్రేమ వ్యవహారాలను చర్చించుకున్నంత ముచ్చటగా చర్చించుకుంటారు. కానీ,పాలనలో, అధికారాల్లో వారికి పెద్దగా చోటివ్వరు. కానీ, మనవాళ్ళు అలా కాదు. దేవుళ్ళకు తలనీలాలే ఇస్తారు. కానీ, ఈ ‘నడమంతరపు’ రాజులకు ఏకంగా, తలకాయలే ఇచ్చేస్తారు. ఆలోచించటం మానేస్తారు.

ఈ స్థితి ప్రతీ రాజకీయ పార్టీలోనూ వుంటుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ వయసెక్కువన్న పార్టీ కాబట్టి, ఈ పార్టీలో ‘రాచరికానికి’ వయసెక్కువ. స్వాతంత్య్రం తెచ్చిన వారి ఖాతాలో తెలిసో, తెలియకో మనం – మొదటి వరసలో గాంధీ, నెహ్రూ పేర్లు రాసేసుకున్నాం. వారు చేసిన త్యాగాలకు అప్పట్లో ముచ్చట పడ్డాం. ఏ ‘రాజూ’ లేక పోతే, ‘త్యాగ’ రాజే, రాజయినట్లు, వీరి పేరు మీద వచ్చిన కుటుంబాన్ని ‘అనధికార రాచ కుటుంబం’ గా గుర్తించటం మొదలు పెట్టారు. నెహ్రూ నెత్తురునీ, గాంధీ పేరునీ పంచుకున్న ఇందిరమ్మ అయితే, ఈ వ్యవస్థను శాశ్వతంగా స్థిరపరచేశారు. అయితే ఇది ప్రజాస్వామ్యం కాదు, ‘రాచరికం’ అని- జనంతో పాటు, ఒక దశలో తాను కూడా నమ్మేశారు. ఫలితమే, ఆమె పెట్టిన ‘యమర్జన్సీ’ . అందుకు ఆమెను తాత్కాలికంగా తిరస్కరించి మళ్ళీ పట్టం కట్టేశారు. ఆ తర్వాత పలు పార్టీలు వచ్చాయి. వారసత్వాన్ని తిడుతూనే తమ పార్టీల్లో కూతుళ్ళనూ, కొడుకులనూ, వితంతువులనూ ‘రాచరికపు’ చట్రంలోకి నెడుతున్నారు. వీటిలో ప్రాంతీయ పార్టీలూ, ‘సామాజిక న్యాయం’ చేసే పార్టీలూ, ప్రత్యేక రాష్ట్రాలను కోరే పార్టీలూ అన్నీ ఉన్నాయి. ఏ సంక్షేమం పథకం పెట్టినా, అందులో వారసత్వం ధ్వనించాల్సింది. నిజమే. కాంగ్రెస్‌ సర్కారు ప్రవేశ పెట్టిన ప్రతీ పథకానికీ, ‘ఇందిరమ్మ’ పేరో, ‘రాజీవ్‌’ పేరే పెడుతూ వచ్చారు. అందుకనే సాక్షాత్తూ టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర రావు కుమారుడు కె. తారక రామారావు విద్యుత్‌ కోతలమీద విమర్శిస్తూ, ‘ఇందిరమ్మ విసనకర్రల పథకం, సోనియ జనరేటర్ల పథకం’ పడతారేమోనని ఎద్దేవా చేశారు. రేపు ప్రత్యేక తెలంగాణ వచ్చి ఆ రాష్ట్రానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ‘కేసీఆర్‌ నీటి పథకమో, కేసీఆర్‌ గాలి పథకమో’ ఏర్పాటు చేయకుండా వుంటారా? అలా వుండగలిగితే ‘రాచరికానికి’ అలవాటు జనం ఊరుకుంటారా?

న్యూస్‌ బ్రేకులు:

షార్ట్‌ సైట్‌

వైయస్‌ తమ ముందు కొస్తే, ఆయన్ని విమర్శిస్తున్న మంత్రులు ఆయన కళ్ళల్లోకి చూడగలరా?

-వైయస్‌. విజయమ్మ, వైస్సార్‌ కాంగ్రెస్‌ గౌరవాధ్యక్షురాలు

అవును. ఆయన కూడా జనం కళ్ళల్లోకి చూడగలరా? తన పథకాలు తానే కొనసాగించలేక పోయే స్థితి వస్తే అంతే కదా!!

రైల్వే బడ్జెట్‌ లాగే, దళితులకూ, గిరిజనులకూ ప్రత్యేక బడ్జెట్‌ వుండాలి.

-జూపూడి ప్రభాకర్‌, ఎమ్మెల్సీ, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

మరీ అంత సరదాగా వుంటే, అంబేద్కర్‌ మీద గౌరవం వుంటే, దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయమనండి. చూద్దాం.

ట్విట్టోరియల్‌:

భూమి ‘డొల్ల’లా వుంది!

భూమి ఎలాగుంది? ఈ ప్రశ్నకు ‘బల్లపరుపు’లాగుందని కొన్నాళ్ళు సెటిలయిపోయారు. తర్వాత గుండ్రంగా వుందనుకోవాటనికి సమయం తీసుకున్నారు. ఆ తర్వాత ఇదే ప్రశ్నను కమ్యూనిస్టులకు వేస్తే, ‘భూమి ఎలాగుందో’ తెలియదు కానీ,’భూమి ఎందుకుందో’ చెబుతామన్నారు. ‘దున్నుకునేదే భూమే’ అనుకున్నారు. అ తర్వాత ‘రియల్‌ ఎస్టేట్‌ ‘ వారొచ్చారు. ‘ఆక్రమించుకునేదే’ భూమి అనుకున్నారు. వీరందరి నిర్వచనాలు తప్పని, ఇటీవల మన రాజకీయ నాయకులు తేల్చారు. ‘భూమి ఎలాగుంది?’ అంటే ఇన్నాళ్ళూ ఉపరితలాన్ని చూసే నిర్వచించారు కానీ, భూగర్భంగురించి ఎవరూ మాట్లాడలేదు. అలా చూసినప్పుడు, ‘దున్నేవాడిది కాదు, తవ్వుకునే వాడిదే భూమి’ అని తేల్చేసే వారు. తవ్వుకునే కొద్దీ బొగ్గూ, బైరటీస్‌ రాళ్ళూ, రంగు రాళ్ళూ వస్తాయనే బ్రహ్మ రహస్యాన్ని ఇటీవలనే కని పెట్టారు. దీంతోనే, రాజకీయాలు నడవవచ్చనీ తెలుసుకున్నారు. ఇలా తవ్వగా తవ్వగా యూభయేళ్ళ తర్వాత ‘కాగ్‌’ భరత భూమి అంటే ‘డొల్ల’ అని తేల్చి పారేస్తుంది. అప్పటికి తవ్వి పారేస్తారు కదా!

‘ట్వీట్‌’ ఫర్‌ టాట్‌

”కేజీ’వాల్‌

పలు ట్వీట్స్‌: కేజ్రీవాల్‌ అవినీతి వ్యతిరేకోద్యమాన్ని మళ్ళీ మొదలుపెట్టారు

కౌంటర్‌ ట్వీట్‌: అవును. ఆయన ఎప్పటికప్పుడు మొదలు పెడుతూనే వుంటారు. ఎప్పుడూ ‘కేజీ’ వాలే, ‘పీజీ’ వాల్‌ కాదు.

ఈ-తవిక:

‘సెట్ల’ వేదాంతం

మెట్ల మీద కాకుండా

‘సెట్ల’ మీద నడిచిందే చదువు.

వోట్ల మీద కాకుండా

నోట్ల మీద వచ్చిందే కొలువు

ప్లాట్లేమీ లేకుండా

పాట్లతో గడిచిందే బతుకు.

 

బ్లాగ్‌((9 ((బ్లాక్‌)) స్పాట్‌:

‘చిరంజీవినీ పీసీసీ చీఫ్‌ గా చేస్తారట కదా!’

‘అవును. కండువా మార్చినవాళ్ళే కండువా మార్పించగలరు’

కొట్టేశాన్‌(కొటేషన్‌)

డబ్బు నల్లన, బొగ్గు నల్లన, వేషం తెల్లన.

-సతీష్ చందర్

27-9-12

 

 

 

 

 

1 comment for “ప్రజాస్వామ్యంలో రాచరికం!

  1. Sir,వై ఎస్ రాజాశేఖర రెడ్ది గారి కంటి చూపె రాజ్యంగం, చట్టం. వారికి చట్టాలు రాజ్యంగం అక్కరలెదు. వారికి మన ప్రియతమ బాబ సాహెబ్ అంబెద్కర్ రాజ్యంగం అక్కరలెదు. పార్లమెంట్ చెసిన చట్టాలు అక్కరలేదు. వారి కంటి చూపె రాజ్యంగం చట్టం. అందుకె వారిని కంట్లొ చూసి మాట్లాడలేరు. బానిస వ్యవస్తె వారికి కావలి. అంబెద్కర్ విగ్రహానికి డండవేయాలి. వొట్లు కోసం దండలు వేయాలి. తరువాత రాజ్యంగాన్ని అగౌరవ పరచాలి.

Leave a Reply