‘మూడు’తలాకులూ..’ఆరు’తడబాట్లూ..!

మూడు ముడులు వేస్తే పెళ్ళి. ఇది ఒక ఆచారం. మూడు మాటలంటే విడాకులు. ఇది ఇంకో ఆచారం. ఈ రెండు ఆచారాలు, రెండు వేర్వేరు మత విశ్వాసాలకు చెందినవి. ‘మూడు’ అనే సంఖ్య తప్ప రెంటికీ వేరే ఏ పోలికా లేదు. పైపెచ్చు వైవాహిక జీవితానికి  ఇదే ‘మూడు’ఒక చోట ఆహ్వానం; మరొక చోట వీడ్కోలు.కాకుంటే ఈ రెండూ మన దేశంలో ఒకే రాజ్యాంగం కింద ‘పర్సనల్‌ కోడ్ల’ రక్షణలో  వున్నాయి..

అప్పుడప్పుడూ సినిమాల్లో చూపిస్తూ వుంటారు.. ఇష్టపూర్వకంగానే కాదు, ఎక్కడికో తీసుకు వెళ్ళి, ఇష్టంలేకుండా హిందూ స్త్రీ మెడలో, హిందూ పురుషుడు మూడు ముడులూ వేసేస్తే పెళ్ళి.. అని. ‘తాళి’కి హిందూ సమాజం అంత విలువ ఇస్తుందన్నమాట. ఇప్పుడు ముస్లిం పురుషులు పెళ్ళి విషయంలో హఠాత్తుగా వార్తల్లోకి ఎక్కారు. ‘తలాక్‌.. తలాక్‌.. తలాక్‌’ అని కేవలం నోటితో మాత్రమే కాదు; వాట్సాప్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా అనేసి, కట్టుకున్న భార్యని క్షణల్లో వదలిసే, ఇంకో పెళ్లికి తయారయి పోతున్నట్లు బాధితుల కథనాలు.

మతానికి చెప్పే మనువాడాలి..!

రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు వ్యవస్థలు మారుతున్నప్పుడే మతం పరిధి మారుతూ వస్తుంది. ‘రాజ్యం’ మీద మతం పట్టు కోల్పోతూ వుంటుంది. రాజ్యం తర్వాత వ్యక్తి స్వేఛ్చ మీద అంతటి ప్రభావం చూపే వ్యవస్థ ‘కుటుంబం’. ఎక్కువ సందర్భాల్లో పెళ్ళి ద్వారా మాత్రమే ఏర్పడే కుటుంబాలకు మతమే కాపలా దారుగా వుండిపోతుంది. కాబట్టి ‘కుటుంబాన్ని’ ప్రజాస్వామీకరించే ప్రతీ ప్రయత్నాన్నీ మతం అడ్డుకుంటుంది. అప్పటికప్పుడు విడాకులిచ్చే ఈ ‘ట్రిపిల్‌ తలాక్‌’ విధానాన్ని తీసి వెయ్యటాన్ని, మన దేశంలో మెజారిటీ ముస్లిం సమాజం అడ్డుకుంటోంది. ముస్లిం స్త్రీల సమ్మతితో పనిలేకుండా వున్న విడాకులు ఇచ్చే ఈ పధ్ధతిని సంపూర్ణంగా రద్దు చెయ్యటానికి వారు సుముఖంగా లేరు.

ఒక్క సారి అరవై యేళ్ళ వెనక్కి వెళ్ళితే ఇదే దేశంలో మత పెద్దలు కూడా ఇదే పని చేశారు. స్వతంత్ర భారతంలో తొలి న్యాయశాఖమంత్రిగా అంబేద్కర్‌ ‘హిందూ వివాహం’ లో సంస్కరణలకు చట్ట బధ్ధత కల్పించబోతే, అప్పటి హిందూ మత పెద్దలతో పాటు, రాజకీయాల్లోని ‘హిందూత్వ’ వాదులు కూడా ఇలాగే వ్యతిరేకించారు. భార్యాభర్తలిద్దరూ ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకునే పధ్ధతికీ, ఒక భర్తకు ఒక భార్య మాత్రమే వుండే దాంపత్యానికీ, కులాంతర వివాహానికీ ..మార్గం సుగమం చేస్తూ ఆయన హిందూ కోడ్‌ బిల్లును సిధ్ధం చేస్తే… ససేమి కాదన్నారు. విసుగొచ్చి ఆంబేద్కర్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

చిత్రమేమింటే, అనాడు ఆ సంస్కరణను వ్యతిరేకించిన (హిందూత్వ) భావజాలానికి రాజకీయ వారసులుగా వున్న బీజేపీ పాలకులు(కేంద్రంలో మోడీ, ఉత్తరప్రదేశ్‌లో యోగి) , నేడు ‘ట్రిపిల్‌ తలాక్‌’ రద్దు చెయ్యాలంటూ ‘సంస్కరణల్ని’ బలపరుస్తున్నారు.ఒకే రాజ్యాంగం కింద స్త్రీ పురుషులకు వేర్వేరు న్యాయాలా..అని ప్రశ్నిస్తున్నారు. పెళ్ళిలోకి ప్రవేశించటానికి కానీ, విడిపోవటానికి కానీ స్త్రీ, పురుషుల ‘సమ్మతి’ ముఖ్యం. ఇరువురికీ సమాన హక్కులు వుండాలి. ‘ట్రిపిల్‌ తలాక్‌’ వ్యవస్థ నిజంగానే స్త్రీ హక్కుల్ని హరిస్తోంది. ఉన్నట్టుండి మస్లిం స్త్రీని నడిరోడ్డు మీదకు విసిరేస్తోంది. కాబట్టి ‘ముస్లిం స్త్రీల’కు బాసటగా నిలుస్తున్నందుకు ఇప్పటి పాలకులను అభినందించాల్సిందే.

మహిళలూ ‘తలాక్’ అనవచ్చా?

ఈ ‘ట్రిపిల్‌ తలాక్‌’ కావాలంటున్న ముస్లిం పెద్దలు కూడా (ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సహా) దీనిని దుర్వినియోగ పరుస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నారు. స్త్రీ అభీష్టానికి వ్యతిరేకంగా తమ చట్టంలో లేదంటున్నారు. వీరి వాదనల్లో  నిజం లేక పోలేదు. వారి విశ్వాసం ప్రకారం వివాహం స్త్రీ పురుషులు ఇద్దరూ చేసుకున్నఒక ‘ఒప్పందం’. మధ్యలో రద్దు చేసుకునే హక్కు పురుషుడికి మాత్రమే ఆచరణలో కనిస్తుంది. కానీ స్త్రీ కూడా తను రద్దు చేసుకునే అవకాశాన్ని అవసరమైతే తీసుకుంటానని ‘ఒప్పంద'(నిఖానామా)లో రాయించుకోవచ్చు. కానీ ఇలా వినయోగించుకున్న వాళ్ళు దాదాపు అరుదు. అలాగే ‘తలాక్‌ తలాక్‌ తలాక్‌’ అని ఒక్క సారి అంటేనే విడిపోదు. మూడు నెలల వ్యవధిలో మూడు మార్లు పెద్దల సమక్షంలో చెప్పాలి. కానీ ఇలా జరుగుతున్నట్లు ఎక్కడా కనపడటం లేదు. కాబట్టే స్త్రీకి అన్యాయం జరుగుతోందని ముస్లింలో స్త్రీలు కొందరు ఇప్పుడిప్పుడూ అడగటం మొదలు పెట్టారు.

దీనికి సంబంధించిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారిస్తూ అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం :వివాహాన్ని రద్దు చేసుకోవటానికి ఇది సరయిన పద్ధతి కాదు- అని కూడా వ్యాఖ్యానించింది. నిజమే. ముస్లింలు మెజారిటీగా వున్న పాకిస్తాన్‌, సౌదీ అరేబియా, మొరాకో, ఆఫ్ఘనిస్తాన్‌లలోనే ‘ట్రిపిల్‌ తలాక్‌’ ను రద్దు చేశారు. మరి భారత దేశంలో ముస్లిం పెద్దలు ఎందుకు వ్యతిరేకంగా వున్నారు? ఈ ప్రశ్నలోనే సమాధానం వుంది.

ముస్లిం దేశాల్లో లేనిది మనకెందుకు? 

ముస్లింలు మెజారిటీగా వున్న దేశంలో మతపరమైన అభద్రత వుండదు. కాబట్టి అందరూ కలసి తమకు ఏది మేలో, ఏది కీడో యోచన చేసి సంస్కరణలు చేసుకోగలుగుతారు. కానీ మైనారిటీలు గావున్న దేశాల్లో ఆ పనిని మెజారిటీగా వున్న ఇతర మతస్తులు చేస్తానంటే ఒప్పుకోరు. భయపడతారు. ఇండియాలో సాంఘిక, రాజకీయ వాతావరణాలు ఆది నుంచీ వారిలోని అభద్రతను పెంచుతూ వస్తున్నాయి. ఇక్కడ వున్న సాంఘిక, రాజకీయ వాతావరణాలు ముస్లిం మైనారిటీలను అణచిపెట్టే విధంగానే వున్నాయని అంబేద్కర్‌ ఆనాడే అభిప్రాయ పడ్డారు.

ఈ అభద్రత కాంగ్రెస్‌ హయాంలోనూ వుంది. కాబట్టే విడాకులు పొందిన ముస్లిం మహిళ షాబానోకు మనోవర్తి ఇవ్వాలని ఇచ్చిన కోర్టు తీర్పును పూర్వ పక్షం చేస్తూ ప్రధానిగా రాజీవ్ గాంధీ చట్టం చేయించారు. ముస్లిం వోట్ల కోసం ‘బుజ్జగింపు’ పద్ధతిని కాంగ్రెస్‌ వినియోగించేది కాబట్టి వారి డిమాండ్లకు తల వొగ్గింది. కానీ ఇప్పటి బీజేపీ విధానం అది కాదు. ముస్లింకు ఒక్క టిక్కెట్టుకూడా ఇవ్వకుండా ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో గెలిచింది. ముస్లిం వ్యతిరేకతనే మెజారిటీ అనుకూలతగా మార్చుకుంటుందనే ముద్ర కూడా బీజేపీ మీద వుంది.

నిజంగే భారతీయ ముస్లిం స్త్రీలకు న్యాయం చెయ్యాలనుకుంటే, ముస్లిం సమాజంలోని అభద్రతా భావాన్ని తీసివేయాలి. సంస్కరణలు ఆ సమాజం నుంచే రానివ్వాలి.

-సతీష్ చందర్

19-5-17

1 comment for “‘మూడు’తలాకులూ..’ఆరు’తడబాట్లూ..!

Leave a Reply to Mesa David Cancel reply