మేల్‌! చావని నిజం!!

man beating womanసీన్‌1::::6ఎమ్మెల్యే పురుషోత్తమ్‌ తన భార్యను నాలుగు ఉతికి, (ఇస్త్రీ చేయటం మరచి) ‘స్త్రీలపై పెరుగుతన్న హింస’ అన్న అంశం మీద ‘మేల్‌ టీవీ (ఠీవి కాదు) లో చర్చాకార్యక్రమానికి ఇంటి దగ్గరనుంచి బయిలుదేరుట:

పురుషోత్తమ్‌ ఇంటి హాల్లో సినిమాతెరంత టీవీ సెట్‌ దానంతటదే పనిచేసేస్తోంది. దాన్ని ఎవరూ చూడటంలేదు. అదే అందర్నీ ఓ చూపు చూసేస్తోంది. టీవీలున్నదే అందుకు కదా! దానికదే ఓ పాట ఆడేసుకుంటోంది. పాడేసుకుంటోంది. ‘లేచిందీ, నిద్రలేచిందీ, మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం’. నెత్తిమీద నెరుస్తూ కనిపించే వయసును నల్లరంగుతో నొక్కేసిన యాభయ్యేళ్ళ పురుషోత్తమ్‌ గుమ్మం దాటబోతూ, ఏదో ఒక వస్తువును మరచిపోయినట్టుగా వెతుక్కుంటాడు. చేతిలో సెల్లూ, జేబులో పర్సూ, చంకలో న్యూస్‌ పేపర్లూ అన్నీ వున్నాయి, ఒక్కటితప్ప.

పురుషోత్తమ్‌:మొత్తం హాలునంతా కళ్ళతో ‘కూంబింగ్‌’ చేసేసి) వెళ్ళే ముందు ఎదురు రావే, ఎదవ మొకమా- అన్నాను, ఎక్కడ చచ్చింది ఇదీ..!

సౌండ్‌ కిందనుంచి వస్తే చూడటానికి తలవంచుతాడు. అతడి చెప్పుల్ని తుడిచి పాదాల దగ్గర ఉంచుతూ కనిపిస్తుంది భార్య సీత. ఇలాంటి పాత్రలకు సీత అని కాకుండా ఫూలన్‌ దేవి అనో, రుద్రమ దేవి అనో పేర్లు పెట్టరు కదా!

సీతాదేవి: (తలపైకెత్తి) మీరు అలా తలవంచటం బాగాలేదు. మీ చరణదాసిని కదా, పాదాల దగ్గర కాకుండా, మీ నెత్తి మీద ఎలా వుంటాను చెప్పండి. అనవసరంగా అక్కడ వెతుకుతున్నారు..!?

పురుషో:(చెప్పుల్లో కాళ్ళుపెట్టుకుని, చటుక్కున తలపైకెత్తేస్తాడు.) ఈ ఎదవ భక్తికేం లోటులేదు కానీ, నాకు ఎదవ సెంటిమెంటు ఒకటి ఏడిసింది కదా! వెళ్ళు వెళ్ళు. వెళ్ళీ ఎదవ నడకలు నడుచుకుంటూ ఎదురొచ్చేయ్‌!

సీత : ఎదవ.. ఎదవ…అనీ అన్ని సార్లు దీవిస్తూంటే, నాకు కళ్ళ నీళ్ళొస్తున్నాయండీ! (కళ్ళు చెంగుతో తుడుచుకుంటూ పైకి లేచి, గుమ్మందాటి వెళ్ళి ఎదురు వస్తుంటుంది.

పురుషో: ఓహో…! ఎదవేడుపొకటీ..? ఎదురొచ్చేటప్పుడయినా కాస్త నవ్వేడువు!

సీత : (కసుక్కున కత్తితో ఒక్క పోటు పొడిచినట్టు, కిసుక్కున ఒక నవ్వొకటి నవ్వేసి) ఇవి కన్నీళ్ళు కావు, ఆనంద భాష్పాలు!

పురుషో: ఏంటీ! నా తిట్లు దీవెనలా? నీ ఏడుపులు ఆనంద భాష్పాలా?

సీత : (ఎదురు రావటం మధ్యలో ఆపి పగల బడి నవ్వుతూ..శూన్యంలోకి చూస్తుంది)

ఇంటర్‌ కట్‌ లో, గోడమీద దండవేసి వున్న పురుషోత్తమ్‌ ఫోటో క్షణం పాటు కనపడుతుంది. వెంటనే అదృశ్యం అవుతుంది. సరిగ్గా అదే సమయానిక గన్‌మాన్‌ కిష్టప్ప పక్కనుంచి వచ్చి, ఆయన చంకలో వున్నన్యూస్‌ పేపర్లు విధేయంగా తీసుకుంటాడు. ఆ మాత్రం బరువుని కానీ, పరువుని కానీ, తన ‘సారు’ ఎక్కువ సేపు మొయ్యలేరని కిష్టప్పకు తెలుసు.

సీత:( నవ్వునుంచి తేరుకుని) మీ తిట్లలో నా భవిష్యత్తు కనపడుతుంటే, నాకు ఆనందం రాదండీ మరీ!

పురుషో: ఎదవ తెలివని, ఎదవ తెలివి. ఏడిసినట్టే వుందిలే! (అంటూ ముందుకి కదుల్తూ , కాస్త వెనగ్గా నడుస్తున్న కిష్టప్పకు వినపడేటట్టుగా) ఈ ఆడాళ్ళకీ, ఏళ్ళొస్తాయికానీ, మెదళ్ళు పెరగవురా..! తిట్లు దీవెలవుతాయా? వెర్రా? పిచ్చా?

కిష్టప్ప: ఎమ్మెల్యే పదవిలో వుండి కూడా, అమ్మగారిని పట్టుకుని అన్ని సార్లు ఎదవ. ఎదవ, ఎదవ అని అనేశాక, ఆవిడ ఆనంద పడకుండా ఎలా వుంటారయ్యా.!!

పురుషో: అంటే..?!

కిష్టప్ప:ఎలా చెప్పాలీ…? మీరు పోతేనే కదా… ఆవిడ యెదవయ్యేది. ఆవిడ యెదవయితే మీ తర్వాత ఆవిడే కదా ఎమ్మెల్యే! మన పార్టీ వోళ్ళు ఎదవలకి టికెట్టివ్వటంలో ఎనకా ముందూ సూడరు కదా!

పురుషో: (నడిచేవాడు కాస్తా ఆగి) అవున్రోయ్‌ కిట్టప్పా! మన మీద సింపతీతో ఇది గెలిచేద్దన్న మాట.

ఇంటర్‌ కట్‌లో సీతాదేవి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది.

పురుషో: (కోపంతో ఊగిపోతూ, వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతున్న భార్యవైపు చూస్తాడు) సీతా! ఓ సారి ఇటు రావే!

సీత అదే నవ్వుముఖంతో దగ్గరకు వస్తుంది. పురుషోత్తమరావు చాచి పెట్టి చెంప మీద ఒక్కటిస్తాడు. ఆమె గుర్రుగా అతని వైపు చూస్తుంది.

పురుషో: ఫో! పునిస్త్రీ ముండ!

సీత తన చెంప నిమురుకుంటూ వెనుతిరుగుతుంది. యధావిధిగా కిష్టప్పను వెంట బెట్టుకుని బయిటపడుతుంటారు.

పురుషో: కిట్టప్పా! భర్త వున్న భార్యను పునిస్రీ అనే కదా అంటారూ?

కిష్టప్ప: కరక్టే కానీ, చివర ‘ముండ’ అని కూడా అనేశారు కదా!

 

సీన్‌2:మేల్‌ టీవీలో ఫిమేల్‌ యాంకర్‌ ధరణి తోనూ, మహిళా సంఘ నాయకురాలు స్పృహతోనూ విభేదించి, చర్చలో గెలిచానన్న ఆనందంతో పురుషోత్తమ్‌ బయిటకు రావటం.

స్టుడియోలో లైవ్‌ మొదలయింది. అంతవరకూ సజీవంగా నవ్వుకున్న పురుషోత్తమరావు చచ్చినట్టు బిగుసుకున్నాడు. స్పృహ స్పృహలోనే వుంది.

యాంకర్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘స్త్రీకి రక్షణ వుందా?’ అనే అంశం మీద చర్చించటానికి మనస్టుడియోలో దుశ్శాసన…క్షమించాలీ… శాసన సభ్యులు పురుషోత్తమరావు గారూ, మహిళా సంఘ నాయకురాలు నిస్పృహ… సారీ స్పృహగారూ వున్నారు. (పురుషోత్తమ్‌ వైపు తిరిగి) భార్యగా స్త్రీ ఎన్నో పాత్రలు పోషిస్తుంది. ‘కార్యేషు దాసీ, శయినేషు రంభా, కరణేశు మంత్రీ’ అన్నారు.

పురుషోత్తమ్‌: (గతుక్కుమంటాడు) అమ్మనీ… మంత్రే…! నే పోతే నా భార్య ఎమ్మెల్యే అవ్వాలి కానీ, మంత్రి ఎలా అవుతుందీ..?

స్పృహ: (స్పృహలోకి వచ్చి) అన్యాయం.. దారుణం..!

పురుషోత్తమ్‌: కరెక్టు. దారుణమే. ఎమ్మెల్యే పోతే అతని భార్య ఎమ్యెల్యేనే అవ్వాలి. మంత్రి కావటం దారుణం!

స్పృహ: దారుణమన్నది ఆమె మంత్రి కావటం గురించి కాదు, ఎమ్మెల్యే గారు. మొదటఅన్నమాటగురించి

యాంకర్‌: (తెలివిలోకి వచ్చి) ఆ మాట వారికి ఊతపదం కావచ్చు.

స్పృహ: కాదు. బూతు పదం.

పురుషోత్తమ్‌: అమ్మనీ..! (నోరువెళ్ళ బెట్టి) నేనెప్పుడు బూతు మాట్లాడాను?

స్పృహ: అదుగో.. మళ్ళీ అన్నారు. ముందు వారు ఆ మాట వెనక్కి తీసుకోవాలి.

పురుషోత్తమ్‌: (స్పృహవైపు తిరిగి) ఇదుగో చూడమ్మా. నువ్వు నా సోదరి లాంటి దానివి. ఎనకో మాటా, ముందో మాటా నాకు తెలీవమ్మా. పొరపాటయితే తప్పొప్పుకుంటాను.

యాంకర్‌: సృహ గారూ! ఎమ్మెల్యే గారు తెలిసి మాట్లాడలేదంటున్నారు. ఇది ఇక్కడితో ఆపేద్దాం. ఆడపిల్లలకు రాజధాని నగరంలో కూడా రాత్రి పూట రక్షణ లేకుండాపోయింది. లైంగిక వేధింపులకూ, అత్యాచారాలకు గురవుతున్నారు. ఈ విషయం మీద ఒక శాసన సభ్యులుగా మీరేమంటారు?

పురుషోత్తమ్‌: మీరేమీ అనుకోక పోతే ఓ మాట అడుగుతాను. అర్థరాత్రిళ్ళు ఆడపిల్లకు పన్లేవుంటాయమ్మా?

సృహ: (అడ్డొస్తూ)మగాళ్ళకేముంటే అవే వుంటాయి.

పురుషోత్తమ్‌: (కొంచెం కోపం తెచ్చుకుని) మగాళ్ళు బార్లుకెళ్ళతారు. క్లబ్బులకెళ్తారు. అలాగని ఆడవాళ్ళు కూడా వెళ్తారా?

స్పృహ: వెళ్ళరు. ఒకవేళ వెళ్ళితే తప్పేమిటంటున్నాను.

పురుషోత్తమ్‌: సంసారులయితే వెళ్ళరమ్మా! అయినా నువ్వు ఒక భారతీయ స్రీవి అయివుండి కూడా ఇలా మాట్లాడటం ఏమీ బాగా లేదు.

స్పృహ: అంటే రాత్రిపూట రోడ్ల మీద కనిపించే వాళ్లంతా మీ దృష్టిలో తిరుగుబోతుల్లా కనిపిస్తున్నారా? మీరు ఓ బాధ్యత గల శాసన సభ్యుల్లా మాట్లాడటం లేదు.

యాంకర్‌: (కలగ చేసుకుని) ప్రతిపక్షనేత భోగరాజుగారు ఫోన్‌ ఇన్లో వున్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం.

భోగరాజు(వాయిస్‌): అన్నా పురుషోత్తమన్నా, నువ్వే మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అని, రాత్రిళ్ళు కాదు. పట్టపగలు అత్యాచారాలు జరిగిపోతున్నాయి. మీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక స్త్రీలకు రక్షణలేదు. మీరూ, మీ నేతలంతా చేతకాని వాజమ్మల్లా చూస్తున్నారు.జనం చేత ఛీ కొట్టించుకుంటున్నారు. పాలించటానికి మీకు అర్హతలేదన్నా మీకు. మీకే కనుక పౌరుషం వుంటే మీరు వెంటనే రాజీనామా చేయాలి.

పురుషోత్తమ్‌: ఏం మాట్లాడుతున్నావ్‌ భోగరాజన్నా! మీపార్టీ అధికారంలో వుండగా అత్యాచారాలు జరగలేదా? అప్పుడు మీరేం చేశారు? గాజులు తొడిగించుకున్నారా?

భోగరాజు:(వాయిస్‌) ఇదుగో పురుషోత్తమ్‌. ఇన్ని మాటలెందుక్కానీ, నువ్వే గనుక మగాడివయితే, ఇప్పుడు రాజీనామా చేసి, ఎన్నికల్లో నిలబడు!

స్పృహ: (కోపంగా యంకర్‌ వైపు చూస్తూ) ఏంటండీ ఇదీ! ఎందుకు పెట్టారీ చర్చ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, ఈ పెద్దమనుషుల చేత మహిళలను అవమానించటానికి పిలిచారా? ఏంటండీ ఈ మాటలూ? పౌరుషమేమిటీ? అంటే వీరత్వమనా? పురుషులకే వీరత్వముంటుందా? గాజులు తొడిగించుకోవటమేమిటీ? గాజులు తొడుక్కునే స్త్రీలు పిరికివాళ్ళనా? మగాడివయితే … అంటే మగాడే పెద్ద పోటు గాడనా? స్త్రీ కాదనా?

పురుషోత్తమ్‌: రామా అన్న బూతు మాట లాగుందే..! వార్నీ!

స్పృహ: ఇదుగో ఇది బూతు కాదా, ఇది బూతు కాదా అంటున్నాను.

పురుషోత్తమ్‌: (చటుక్కున పైకి లేచాడు) ఇదిగో అమ్మాయ్‌! ఏంటి..ఓ రెచ్చిపోతున్నావ్‌. ఇప్పుడు నేను మాట్లాడింది బూతు అని నిరూపించు. నేను హుస్సేన్‌ సాగర్‌ లో దూకి చచ్చిపోతాను.

స్పృహ: యస్‌. నేను రెడీ. నిరూపిస్తాను. నువ్వు రాజీనామా చెయ్యాల్సిందే.

యాంకర్‌: (మధ్యలో జోక్యం కలుగచేసుకుంటూ) ఇదీ ‘స్ల్రీలకు రక్షణ’ వుందా అని కార్యక్రమం. సెలవు.

 

సీన్‌:3 ఇంటి దగ్గర కారు ఆగేసరికి, గుమ్మంలో తన ఫోటోకి దండ వేసి వుండటం చూసి ఆశ్చర్యపోవటం.

కారు దిగి వేగంగా వచ్చేసరికి తలుపు వేసి వుంటుంది. పైకి చూస్తాడు.

పురుపోత్తమ్‌: ఎవడ్రా నేను బతికుండగా ఫోటోకి దండవేసిందీ?

కిష్టప్ప: ఇంకెవరండీ అమ్మగారే వేసుంటారు.

పురుషోత్తమ్‌: నేను బతికుండగానే ఇది ముండమోస్తదా..?

(కిష్టప్ప చేతిలో ఫోన్‌ మోగిన చప్పుడు.)

కిష్టప్ప: అమ్మగారండి.

పురుషోత్తమ్‌: స్పీకర్‌ ఆన్‌ చెయ్యి.

సీత:(ఫోన్లో) కిష్టప్ప. నేను హుస్సేన్‌ సాగర్‌ దగ్గరనుంచి మాట్లాడుతున్నారు. మీ అయ్యగారి బాడీ కోసం ఇక్కడ గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. నువ్వు కూడా తొందరగా రా. బాడీ దొరక్కానే పార్టీ ఆఫీసుకు తీసుకు వెళ్దాం. నేను బాడీ పక్కనే వుండాలి కదా! సింపతి బాగా వర్కవుటవుద్దీ అంటున్నారు. నువ్వు వచ్చెయ్‌.

స్పీకర్‌ ఆఫ్‌ అవుతుంది.

పురుషోత్తం: (షాకయి శూన్యంలోకి చూస్తాడు.)

కిష్టప్ప: ప్రాణత్యాగం చేస్తానని టీవీలో సవాలు చేశారు కదా! వెళ్దామా హుసేన్‌ సాగర్‌కి..!

-సతీష్‌ చందర్‌

(ఎం. వేదకుమార్ సంపాదకత్వంలో వెలవుడుతున్న దక్కన్ లాండ్ ఏప్రిల్ 2013 సంచికలో ప్రచురితం)

3 comments for “మేల్‌! చావని నిజం!!

  1. మన రాష్ట్రంలో నెలకొన్న కుటుంబ రాజకీయాలపై మీ వ్యంగాస్త్రం చాల చాలా బాగుంది సర్ ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *