నోరు తెరవటమే కాదు, నోరు మూసుకోవటం కూడా గొప్ప విద్యే. ఎప్పుడూ మాట్లాడని వాడిని, ఓ రెండు నిమిషాలు వేదిక ఎక్కి మాట్లాడమంటే, ఎంత కష్టంగా వుంటుందో; ఎప్పడూ వాగే వాడిని ఒక్క నిమిషం నోరు మూసుకోమనటం కూడా అంతే కష్టంగా వుంటుంది.
అందుకనే మౌనం చాలా కష్టమైన విషయం.
స్కూళ్ళలో టీచర్లు పాఠం చెప్పటానికి ఎంత శక్తి ఖర్చు చేస్తారో తెలియదు కానీ, అంతకు రెండింతలు ‘సైలెన్స్’ అనటానికి వెచ్చిస్తారు.
ఇంకో బ్రహ్మరహస్యం ఏమిటంటే, ‘సెలెన్స్’ అన్నప్పుడే చప్పుడు చెయ్యాలని అని అనిపిస్తుంది. ఆ మాట కొస్తే నిశ్శబ్దాన్ని కున్న శక్తి శబ్దానికి వుండదు.
కావాలంటే హైదరాబాద్ రోడ్ల మీద ఒక్క గంట పాటు, మోటారు వాహనాలకి వున్న ‘సైలెన్సర్’లు పీకేసి తిరగనివ్వండి చూద్దాం. నగరంలో వున్న జనాభా మొత్తం వేరే నగరానికి పారిపోతారు.
అయితే నిశ్శబ్దం వేరు. మౌనం వేరు.
శబ్దం లేక పోవటం నిశ్శబ్దం; మాట్లాడక పోవటం మౌనం.
నిశ్శబ్దం మనుషులకే కాదు, ఇతర జీవులకూ, కడకు యంత్రాలు వంటి నిర్జీవులకు కూడా వర్తిస్తుంది. కానీ మౌనం కేవలం మనుషులకు మాత్రమే వర్తిస్తుంది.
మౌనం మాట కన్న గొప్పదని పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు. కానీ అది నిజమని అనుభవంలోకి వస్తే కానీ తెలియదు.
నటనకు మౌనం ప్రాణం. తెర మీద నటనకే కాదు, జీవితంలో నటనకు కూడా. తక్కువ మాట్లాడే వాళ్ళలో ఎక్కువ నటన వుంటుంది.
ఎవరన్నా మేధావిగా పేరు తెచ్చుకోవాలని అనుకున్నారనుకోండి. అన్ని విషయాల మీద అనర్గళంగా మాట్లాడేయాలని ఆశలు పెంచుకోకూడదు. అది జరిగే పని కూడా కాదు. దానికన్నా, మౌనంగా వుండటాన్ని ప్రాక్టీసు చేశారనుకోవాలి. వెంటనే మేధావి అనే కీర్తి కొట్టేయవచ్చు.
‘రాష్ట్ర విభజన రాజ్యాంగ బధ్ధంగా జరుగుతున్నట్లేనా?’ అని అడిగినప్పుడు, ఎంత వివరణ ఇచ్చినా మిమ్మల్ని మేధావిగా గుర్తించక పోవచ్చు. అలాకాకుండా ఓ చిన్న నవ్వు నవ్వి, శూన్యంలోకి చూశారనుకోండి. ఆ నవ్వుకి ఎవరికి తోచిన భాష్యం వారు తీసుకుని వెళ్ళిపోతారు. ‘ఇలాగా విభజన జరిగేదీ?’ అని అనుమానించినట్టుగా ఒకరికి అర్థమయితే, ‘ఇలా కాకుండా ఇంకెలా విభజిస్తారు?’ అని అన్నట్లుగా ఇంకొకరికి అర్థమవుతుంది.
మౌనంతో అల్పులు కూడా మహాత్ములూ, తాత్వికులూ, స్వాములూ కూడా అయిపోయారు.
తక్కువ మాట్లాడేవాళ్ళ పట్ల ఆకర్షితులు కూడా అవుతారు. ‘వాడెప్పుడు బెల్లం కొట్టిన రాయిలా వుంటాడు. ఉలకడు, పలకడు. ఆ అమ్మాయి వాడికెలా పడిందిరా?’ అని కాలేజీ క్యాంపస్‌లలో కూడా ఆశ్చర్యపోతుంటారు.’ల
తక్కువ మాట్లాడే వాడు మేధావి మాత్రమే కాదు, మంచి వాడు కూడా అవుతాడన్నది లోకం లెక్క. ఇదే లెక్కల్లో ఆమ్మాయిలు కూడా పప్పులో కాలేస్తారు. ( పప్పు వరకూ.. ఐమీన్ పప్పన్నం పెట్టే వరకూ… అంటే పెళ్ళయ్యే వరకూ వచ్చి బావురు మంటే పప్పులో కాలేసినట్లే లెక్క!) అలా కాకుండే, ‘మౌనాన్ని’ వేగంగా నమ్మేసి, పెళ్ళి వరకూ వచ్చేలోగానే ‘తప్పు’ లో కాలేసేవారు కూడా వుంటారు.
ఇలా బుక్కయి పోయిన ఓ అమ్మాయి, తన స్నేహితురాలితో తన విషాదాన్ని ఇలా పంచుకుంటోంది.
‘పరిచయమైన మొదటి రోజు నా అంతట నేనే కాఫీడే కు తీసుకు వెళ్ళి ‘ఐ లవ్యూ’ చెప్పాను. అతను ఎగిరి గెంతేసి, ‘ఐ లవ్యూ’ చెబుతాడనుకున్నాను. కానీ నా వైపు తీక్షణంగా చూసినవ్వాడు. అలా ఓకే చెప్పాడనుకున్నాను. ప్రతీ రోజూ కలుస్తున్నాం. ఎప్పడూ నేనే మాట్లాడుతున్నాను. అతను వింటున్నాడు పెళ్ళి చేసేసుకుందామనుకున్నాం. ఒప్పేసుకున్నాడు. రిజిస్టర్ మేరేజ్ చేసేసుకున్నాను. అప్పడూ మాట్లాడలేదు. కడకు తొలి రాత్రి ఓ రహస్యం తెలిసింది.’
‘ఏమిటది? మూగవాడనా?’
‘కాదు. చెప్పేది పూర్తిగా విను. అతడు .’లాదా’ అన్నాడు.’
‘లాదా? అదెవరు?’
‘నేనేనే. రాధా అని పిలవబోయి, అలా అన్నాడు.’
‘నత్తి వాడా? అయితే ఏమిలే..! సర్దుకు పో!’
‘ పూర్తిగా వినకుండా మాట్లాడకు. ‘లాదా! లాకు లీకంటే ముందు లజనీతో పెళ్ళయింది’ అన్నాడు చల్లగా.’
ఇదీ సంగతి. అతడేం మోసం చేసినట్లు కాదు. ఎందుకంటే ‘మాట’ మాట్లాడి వుంటే, తర్వాత ‘మాట’ తప్పాడనీ, ‘యూ’ టర్న్ తిరిగాడనీ అనవచ్చు. మాట తప్పినట్టు ‘మౌనం’ తప్పటం వుండదు కదా!
అందుకే తన సమైక్యాంధ్ర ఉద్యమంలో ‘మౌన వ్రతాన్ని’ ఆయుధంగా ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.
-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రిక 9 ఫిబ్రవరి 2014వ తేదీ సంచికలో ప్రచురితం)