వన్-టూ-టెన్ జగనే..జగను

వైయస్సార్‌ పార్టీలో పుట్టుకొస్తున్న నేతలు

తల్లి విజయమ్మతో జగన్

జగన్‌ తర్వాత…?

అవును. జగన్‌ తర్వాత పార్టీలో ఎవరు కీలకం?

నెంబర్‌ వన్‌ జగన్‌ అయితే, నెంబర్‌ టూ ఎవరు? అసలు రెండు, మూడు, నాలుగు… పోనీ అయిదో స్థానంలోనయినా ఆయనకున్న ఆకర్షణ, దక్షత వున్నవారున్నారా?

బహుశా, ఇదే ప్రశ్న 2009 ఎన్నికల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎదురయింది. వైయస్‌ నెంబర్‌ వన్‌ అయితే నెంబర్‌ టూ ఎవరు? పదవ స్థానం వరకూ ఆయనతో సరితూగకలిగిన వారు లేరు. ఈ స్థితే అప్పట్లో ఆ పార్టీ హైకమాండ్‌కు కూడా నచ్చలేదు.

ఇప్పుడూ జగన్‌ స్వంత పార్టీలోనూ అదే ప్రశ్న. పార్టీయే తానై, తానే పార్టీ అయ్యాక రెండవ స్థానంలో ఎవరుంటారు? ఆయన తో వున్న వాళ్ళు మూడే వర్గాలు వుంటారు: అనుయాయులు, అనుచరులు, అభిమానులు. వీరి నుంచే జగన్‌ తర్వాత స్థానంలో నేతలు ఏర్పడాలి.

ఇన్నాళ్ళూ తండ్రిపై వున్న సానుభూతినే ఆలంబనగా చేసుకుని జగన్‌ వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీని నిర్మాణం చేసి, నడిపించారు. కాబట్టే ఓదార్పు యాత్ర అంత సుదీర్ఘ కాలం నడిచింది. అదే జగన్‌ బలమూ, బలహీనతా- రెండూ అయ్యాయి. అలా తండ్రి పేరు మీదనే తన రాజకీయ ప్రస్థానం సాగించకుండా వుంటే, తన పార్టీకి సీమాంధ్రలో

( తెలంగాణలో ఓదార్పు నడవలేదు) ఇంతటి జనాదరణ వుండేది కాదు. అలా చేయటం వల్ల ‘వారసత్వం’ తనకే సంక్రమించి మరెవ్వరూ నాయకులు కాలేక పోయారు. ఇదే బలహీనత.

అయితే కేసులు ఒక దాని తర్వాత ఒకటి తరము కొచ్చి, ఆయన జైలుకు వెళ్ళే స్థితి వచ్చింది. సిబిఐ పెట్టిన చార్జిషీట్‌లో నిజానిజాలు ఎలాగూ విచారణలో తేట తెల్లమవుతాయి. అయితే జగన్‌ వెంట వున్న జనం ఎవ్వరూ ‘అవినీతి ఆరోపణల’ను తీవ్రంగా గణించటంలేదు. ఒక రకంగా విచారకరమే. అదే సమయంలో విచారణ నిమిత్తం జగన్‌ను ప్రశ్నించినా, అరెస్టు చేసినా-‘వేధింపు చర్య’గా నమ్మటానికి సిధ్ధంగా వున్నారు. ఇది భారతీయ వోటర్లలో వుండే వెనుకబాటుతనం కూడా.

ఒకప్పుడు మానవహక్కులనూ, పౌరహక్కులనూ ఎమర్జన్సీ పేరిట ఇందిరాగాంధీ హరించారు. ఫలితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయి, జనతాపార్టీ ప్రభుత్వం వచ్చింది. ఆమె చేసిన ‘నేరాల’ పై విచారణ జరిపిస్తూంటే ఆపని ‘వేధింపు చర్యగా’ భారతీయ వోటర్లకు తోచింది. ఆమె ముతక ఖద్దరు చీర ధరించి దేశమంతా చేతులూ జోడిస్తూ తిరగ్గానే ఆమె పై సానుభూతి పెల్లుబికింది. ఇప్పుడు సీమాంధ్రలోనూ జరుగుతున్నది అదే, జగన్‌ ఆస్తుల మీద జరుపుతున్న విచారణను ‘వేధింపు చర్య’గా అక్కడ జనం చూస్తున్నారు. ఉప ఎన్నికల ముందు నిజంగానే, జగన్‌ జైలులో కూర్చోవాల్సి వస్తే, సానుభూతి పెరిగి అత్యథిక స్థానాలను, అత్యధిక మెజారిటీలతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ చేజిక్కించుకొనే అవకాశం వుంది.

అధికార రాజకీయాలు ఇలాగే వుంటాయి. సంక్షోభాలే తిరిగి సరికొత్త ఆవకాశాలు ఇస్తూ వుంటాయి. ఇప్పుడు ఉప ఎన్నికల తర్వాత వైయస్సార్‌ కాంగ్రెస్‌కు విజయం వల్ల వచ్చే ఆనందం తక్కువ సేపే వుంటుంది. వెంటనే నాయకత్వ సంక్షోభం వస్తుంది. అదే అవకాశాన్ని కూడా ఇస్తుంది.

వైయస్సార్‌ మృతి వల్ల వచ్చిన సానుభూతి ఒక కొత్త రాజకీయ శక్తికి ఎలా అవకాశమిచ్చిందో, అలాగే జగన్‌ నిర్బంధం ఆ రాజకీయ వేదిక ను మరింత పెద్దది చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. అయితే ఇప్పుడు కూడా జగన్‌ తల్లి విజయమ్మే ఆయన స్థానంలో ప్రచారసారథ్యం వహిస్తారు. అప్పుడు మళ్ళీ, జనం విజయమ్మనే నాయకురాలిగా స్వీకరిస్తారుకానీ, మిగిలిన వారిని స్వీకరించరు.

అయితే ప్రజల సానుభూతి కట్టలు తెంచుకుని జనం స్వఛ్చందంగా రోడ్ల మీదకు వస్తే మాత్రం, వారికి నేతృత్వం వహించటానికి నాయకులు ఆయనకున్న అనుయాయలు, అభిమానులూ, అనుచరులనుంచే పుట్టుకు రావచ్చు. వారిని గుర్తించి, ముందుకు పోవటానికి అనుమతిస్తే, కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది. లేకుంటే ఒక తెలుగుదేశం లాగా, ఒక టీఆర్‌ఎస్‌లాగా- కుటంబ పార్టీగా మిగిలిపోయే అవకాశం వుంది.

అయితే విజయమ్మ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలరా? జగన్‌ స్థానాన్ని అన్ని విధాలా భర్తీ చెయ్యగలరా? అంటే, వెంటనే నిర్థారణకు రావటం కష్టం. ఆమె శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యాక అసెంబ్లీలో ప్రత్యర్థులను ఎత్తిపొడిచే రీతిలో చేసిన ఉపన్యాసం చూస్తే, కొంత దూసుకు రాగలరేమో అని పిస్తుంది. కానీ, ఇతర బహిరంగ వేదికల మీద నుంచి ఆమె ప్రజల్ని ఆకట్టుకునేటంత ఉపన్యాసం చేయలేదు. ఇక పార్టీని అంతర్గతంగా నడిపించగలిగే దక్షత ఎ్కడా రుజువు కాలేదు.

ఏ మాటకామాటే చెప్పాలి. రాజీవ్‌ గాంధీ మరణానంతరం వెంటనే సోనియా గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి రాలేదు. వచ్చాక కూడా వెను వెంటనే రాణించలేదు. ఏది రాసిస్తే అది వేదికల మీద యాంత్రికంగా చదివేవారు. కానీ, నేడు అదే సోనియా గాంధీ తన పార్టీకే కాకుండా ఇతర భాగస్వామ్య పక్షాలకు కూడా అధినాయకత్వం వహిస్తూ, రాజకీయాల్లో చక్రం తిప్పగలగుతున్నారు. ఆమె ఎఐసిసి పగ్గాలు చేపట్టేనాటికి కూడా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లేదు. కాబట్టి విజయమ్మకు దక్షత వుండదని చెప్పటం కూడా వీలు కాదు.

 

ఉప ఎన్నికల తర్వాత వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అసలు సవాళ్లు వున్నాయి.

అత్యథిక స్థానాలు గెలుచుకున్నా సరే- ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆ పార్టీకుండదు. ఈ గెలుపు వల్ల అసెంబ్లీలో అదనంగా పెరిగే బలమేమీ వుండదు. తమ వద్ద వున్న శాసనసభ్యులే, సాంకేతికంగా తిరిగి తమ పార్టీనుంచి ఎన్నిక అవుతారు అంతే.

కూల్చాలంటే రెండు పరిణామాల్లో ఏదో ఒకటి జరగాలి:

ఒకటి: కూల్చివేతకు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వాలి.

రెండు: ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నుంచి, తెలుగుదేశం నుంచీ ఇబ్బడి ముబ్బడిగా వైయస్పార్‌ కాంగ్రెస్‌లో చేరి పోవాలి.

ఈ రెండూ జరగవు. ఎందుకంటే-

ఇప్పటికిప్పుడు సర్కారును కూల్చేసి ఎన్నికలు తెచ్చుకోవటం వల్ల- ఇటు సీమాంధ్రలోనూ, అటు తెలంగాణలోనూ తెలుగుదేశం ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. కొన్నాళ్ళాగితే తెలుగుదేశం పార్టీకి జనాదరణ పెంచుకోవచ్చన్న ఆశతో ఆ పార్టీ వుంటుంది.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌తో పాటు, ఆయనకు ఆయన తండ్రికీ ఆస్తులను, పెట్టుబడులనూ కూడబెట్టుకోవటంలో సహకరించారన్న అనుమానం వున్న అధికారులనూ, మంత్రులను సైతం సిబిఐ వదలకుండా వున్నప్పుడు, ఆ పార్టీకీ, ఆ పార్టీ నాయకత్వాన్నీ నమ్ముకొని భారీ యెత్తున వలసలు జరగటం కష్టం.

దానికన్నా మరో ఏడాదిన్నరో, రెండేళ్లో- ఉన్న పార్టీల్లోనే తల దాచుకుంటే మేలన్న స్థితిలోకి కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు భావించే అవకాశం వుంది.

 

ఒక వేళ అన్నీ అనుకూలించి ప్రభుత్వాన్ని కూల్చగలిగే శక్తి వైయస్సార్‌ కాంగ్రెస్‌కు వచ్చేసి, కూల్చేసి, మధ్యంతరాన్ని తెచ్చేసుకుంటే- ఆ పార్టీకి వచ్చే తక్షణ ప్రయోజనమేమిటి? ఆ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించగలదా?

సీమాంధ్రలో మాత్రమే జనాదరణ వుండి, తెలంగాణలోకి ఇంకా తొంగి చూడాల్సి వున్న ఈ స్థితిలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలంటే, మరొకరి మద్దతు కావాలి. ఎవరి మద్దతు తీసుకుంటారు? టీఆర్‌ఎస్‌ దా? అప్పుడు జగన్‌ ‘తెలంగాణ నినాదం’ ఇవ్వగలుగుతారా? ఒక వేళ ఇచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకోసం కేంద్రం లో ఎవరివైపు చూడాలా? ఇవన్నీ సమస్యలే. ఇంతటి అసందిగ్ధ స్థితిలో ఆ పార్టీ మధ్యంతరాన్ని ఆహ్వానించలేదు. కాబట్టి ఎలా చూసినా 2014 ఎన్నికలకు సన్నధ్ధం కావటం తప్ప, రాష్ట్రంలో వున్న అన్ని కాంగ్రెసేతర పార్టీలకూ మరో మార్గం లేదు.

అప్పటి వరకూ వైయస్సార్‌ కాంగ్రెస్‌ సీమాంధ్రలో వేడి తగ్గకుండా చూసుకోవాలి. తెలంగాణలో ప్రాచుర్యం పెంచుకోగలగాలి. అందుకోసం తెలంగాణ అంశం పై స్పష్టమైన వైఖరి ఏర్పరచుకోవాలి.

అంతేకాదు. ఈలోపుగా వచ్చేస్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకొని, నాయకులను పెంచుకోగలగాలి. అన్నిటికన్నా ముఖ్యం: జగన్‌మోహన్‌ రెడ్డి అన్ని కేసులనుంచీ నిరపరాధిగా బయిట పడగలగాలి. ఇవన్నీ జరిగితేనే ఒక పార్టీగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ కు భవిష్యత్తు వుంటుంది.

సానుభూతులూ, సామాజిక వర్గాల విధేయతలూ వోట్ల రాజకీయాల్లో స్థిరంగా వుండవు.

రావలసిన చారిత్రక సందర్భం వస్తే, అవి క్షణాల్లో మారిపోతాయి.

వీటన్నిటినీ గణనలోకి తీసుకున్న నాడు ఒక ఆరోగ్యవంతమైన ప్రాంతీయ పార్టీగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ రాణిస్తుంది.

-సతీష్‌ చందర్‌

(‘గ్రేట్ ఆంధ్ర’ రాజకీయ వార పత్రిక 25-31 మే2012 వ సంచికలో ప్రచురితం)

 

 

 

 

3 comments for “వన్-టూ-టెన్ జగనే..జగను

  1. జగన్ కి ఉన్న దక్షత …ఆకర్షణ…. అతని తండ్రి వదలి వెళ్ళిన లక్షకోట్ల వల్ల వచ్చినవే..అవితీసేస్తే అతను సున్నా. ఇందిరపైనున్న కేసులకన్నా జగన్ పైకేసులు తీవ్రమైనవి. హత్యానేరను వాటిలో ఒకటి. పైగా ప్రజలు ఇందిర కాలము నాటి మూర్ఖులు కాదు. ఓదార్పు సభల్లో డబ్బు పాత్రలేకపోతే జగన్ తనని తాను ఓదార్చుకోవలసి వచ్చేది.
    ఇక విజయమ్మ తెరవెనుక ఉండి ఒక ఆకర్షణని కలిగించగలదేమో గాని జనాల్లోకి రాలేదు , వచ్చినా హుళక్కే.
    ఇంతవరకూ జగన్ కి ఉన్న బలము తనబలము కాదు. కాంగ్రెస్ లోనే ఉంటూ వై ఎస్ ఆర్ కు బంటులైన వారు రహస్యంగా ఇచ్చే మద్దతే అతని బలము. డబ్బుపోతే వారుకూడా పోయేవారే.

  2. జగన్ అరెస్టయినా….రెండు నెలల్లోగానే బెయిల్ తో బయటకు వస్తాడు. ఇక అపరాధా, నిరపరాధా అన్నది కొన్ని దశాబ్దాల తర్వాత మాత్రమే
    తేలుతుంది ( భారతీయ న్యాయ వ్యవస్థకు అతను రుణపడి ఉండాలి. ) . ఈలోగా లాలూప్రసాద్ యాదవ్ లాగా రాజకీయాల్లో తన గేమ్ తాను ఆడొచ్చు. ఇక జగన్…ప్రభుత్వాన్ని కూల్చకపోవచ్చు. కానీ 2014లోగా మరిన్ని ఉపఎన్నికలను తీసుకొచ్చే ( కేసీఆర్ టైప్ స్ట్రాటజీ) అవకాశం ఉంది. ( జగన్ పిలుపుతో ఇప్పటికిప్పుడు రిజైన్ చేయడానికి క్యూలో చాలా మందే ఉన్నారు. ). ఈ ఉపఎన్నికల ద్వారా … కాంగ్రెస్, టీడీపీలను ఊపిరితీయకుండా చేయడం…ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా చేయడం అనే రెండు సానుకూలాంశాలు జగన్ కు ఉన్నాయి. జగన్ పై కేసులు, అరెస్టులు అతనికి సమస్య కాబోవు. పైగా సానుభూతిని పెంచే అవకాశమే ఎక్కువ. ఇక తెలంగాణకు అనుకూలంగా వైఖరి తీసుకుని …. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన బలమైన ఎమ్మెల్యేలను ఆకర్షించి…ఎక్కువ సీట్లు సాధించడంపై ఫోకస్ చేయవచ్చు. టీఆరెఎస్ కు గట్టిపోటీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. పకడ్బందీ వ్యూహంతో ముందుకెళుతున్న జగన్ … 2014 తర్వాత స్టేట్ పాలిటిక్స్ లో చక్రం తిప్పే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

Leave a Reply