‘వినోదా’నంద రెడ్డి!

caricature:balaram

caricature:balaram

పేరు : ఆనం వివేకానంద రెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘దృష్టి మళ్ళించు వాడు’ (ఇలాంటి ఉద్యోగం రాజకీయాల్లో కూడా వుంటుందని చాలా మందికి తెలియదు. రాష్ట్రమంతా రైతుల నష్టపరిహారం గురించి మాట్లాడే సమయంలో, నేనెక్కడో పబ్లిక్‌లో సిగరెట్టు తాగాననుకోండి, మీ మీడియా వాళ్లు నా గురించే మాట్లాడుతారు. ఏ సర్కారుకయినా ఇంతకంటే మేలు ఎవరు చేస్తారు. ఈ పోస్టుకు తగిన వాడు ‘రేవంత్‌ రెడ్డి’ వున్నా, ఆయన తెలంగాణలో వుండి పోయాడు కనుక, ఆంధ్రప్రదేశ్‌లో ఆ స్థానం ఖాళీగా వుండి పోయింది. ఈ పోస్టుకు నా కన్నా అర్హుడెవరు? అందుకని ఇలా దరఖాస్తు చెయ్యగానే, అలా అంగీకరించేశారు. ‘బయ్‌ వన్‌ గెట్‌ వన్‌ ‘ స్కీమ్‌ కింద, నా తమ్ముడు రామ్‌ నారాయణ రెడ్డిని కూడా ఆయన కిస్తున్నాను.)

వయసు : నల్ల కళ్ళ జోడు పెట్టే వయసే.( అంటే మనం ఎవరివైపు చూస్తున్నామో, ఎవరూ గమనించలేరు. వాలు చూపులూ, పక్క చూపులూ, ఏ చూపులు చూసినా చెల్లి పోతుంది. అపార్థం చేసుకోకండి. నేను రాజకీయార్థంలో మాట్లాడుతున్నాను. నేను ‘తెలుగు దేశం ‘ వైపు చూస్తున్నట్లు చివరి వరకూ ఎవరికీ తెలియదు.)

ముద్దు పేర్లు :‘వినోదా’నంద రెడ్డి (నెల్లూరులో జనానికి సేవ చేయటానికి తమ్ముడు రామ్‌ నారాయణ రెడ్డి వున్నాడు. వినోదాన్నిచ్చే పనిని నేను పెట్టుకున్నాను. నేను ఏ పని చేసినా ఆ మాత్రం ఎంటర్‌టైన్‌ మెంట్‌ వుంటుంది. నగల దుకాణానికి వచ్చిన హీరోయిన్‌ మెడలో హారం వేసినా వినోదం, నడి రోడ్డు మీద పోలీసులతో గొడవకు దిగినా వినోదమే.) ‘వివాదా’నంద రెడ్డి. ( మీ మీడియా వారికి కావలసింది కాంట్రోవర్సీ. అది నా దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు వుంటుంది.)

‘విద్యార్హతలు :కోటి విద్యలు ‘వోటు’ కొరకే. అందుకే ఒక్క విద్యతో సరిపుచ్చుకోవటం సరికాదు. మీకు ఏ విద్య కావాలో చెప్పండి. ఆ విద్యను తక్షణం ప్రదర్శిస్తాను.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: మార్చటం. అదే నల్ల కళ్ళజోడు. ఇవాళ పెట్టింది రేపు పెట్టను. కారు అంతే. ఈ సీజన్లో వున్నది; వచ్చే సీజన్లో వుండదు. అలాంటప్పడు పార్టీ మార్చకుండా వుంటానా? పాలిటిక్స్‌ అంటేనే మార్చటం. ‘ఒపీనీయన్స్‌ చేంజ్‌ చెయ్యనిదే పాలిటిష్యన్‌ కాలేడు’ అని గిరీశం చెప్పాడంటారు మనకి అంతగా తెలియదు లెండి.

రెండు: దూకటం. గోడలని కాదు. ఎంత పెద్ద అవరోధాన్నయినా నవ్వుతూ దాటెయ్యగలను. పార్టీ కూడా అందుకే దూకాను. మునిగి పోతున్న పడవనుంచి, గట్టు మీదకు దూకటాన్ని కూడా తప్పు పడితే, నేనేం చేసేది చెప్పండి?

సిధ్ధాంతం :సిధ్ధాంతాలు వల్లించటం నా పని కాదు, ఆచరణ నా విధానం. అది జీవితం కావచ్చు, సినిమా కావచ్చు. నటన అనేది ప్రసక్తి లేదు. రాజకీయాల్లో అయినా, సినిమాలో అయినా సరే ఏ పాత్ర ఇచ్చినా జీవిస్తాను. అని ఎప్పుడో తెగేసి చెప్పేశాను. కడకు రేప్‌ సీనయినా సరే… నటించటం లేదు… జీవించటమే.. అని తెగేసి చెప్పేశాను. ( దాంతో ‘రేప్‌’ మీద వ్యాఖ్యలు చేసిన రాజకీయ ప్రముఖుల జాబితాలో నేనూ చేరిపోయాను. అఫ్‌కోర్స్‌, మహిళా సంఘాల వారు తప్పు పట్ట వచ్చు. నేను చేయగలిగింది లేదు.)

వృత్తి : ‘పొగతాగటం- పొగతాగించటం’ లేదా ‘పీల్చు- పీల్పించు’ ( ఈ విషయంలో చట్టబధ్ద మైన హెచ్చరికలు చట్టం చేస్తూ వుండాల్సిందే. కాదనను.) పొగ తాగనన్న ఒక బాలుడికి నేను ఇచ్చిన (సిగరెట్టు) ‘పీకో’పదేశం ఇంకా ‘యూట్యూబ్‌’లో పదిలంగానే వుంది. దీనిపై ఒక ‘ధూమ’ కవితకూడా చెప్పాను: ‘సిగ రెట్టు తాగని వాడు సిగ్గు లేని వాడు. సిగరెట్టు తాగు వాడు శివుడి కొడుకు. బీడీ తాగు వాడు భీముడి కొడుకు’ . ఏం బాగా లేదా? ‘పొగ తాగని వాడు దున్న పోతై పుట్టున్‌’ అని ఉటంకించాడట కదా ‘గిరీశం’ ఎక్కడో..! ఇదీ అంతటి కవిత కాక పోదా..?

హాబీలు :1. రోజుకో సినిమా… తీయటం కాదండోయ్‌! చూడటం. అదీ అనుచర గణంతో ధియేటర్‌ కు వెళ్ళి మరీ చూస్తాను.

2. పూటకో వ్యాఖ్య… పాపం టీవీలు పెరిగిపోయాయి. అవీ బతకాలి కదా? వాటి టీఆర్‌పీ రేటింగ్స్‌ పెరగాలి కదా! అందుకే సహకరిస్తాను.

అనుభవం : తిట్టిన వాళ్ళనే పొగడాల్సి రావటం; పొగడాల్సిన వాళ్ళనే తిట్టాల్సి రావటం. ఈ రెంటినీ తట్టుకుంటే, రాజకీయాల్లో మనకి తిరుగే వుండదు. టీవీ చర్చల్లో, చంద్రబాబు నాయుడిని రకరకాలుగా తిట్టి పోశాను. తెలుగు దేశం పార్టీలో చంద్రబాబు ఎవరినీ ఎదగ నివ్వరన్నాను. కానీ ఇప్పుడు ఆయన నాకూ, తమ్ముడికీ నిచ్చెన వేశారు. నాయకుడంటే అదీ…!

మిత్రులు : ‘ఆనం సోదరులు’ అంటారు కానీ, మిత్రులు అనరు. మా దగ్గరకు వచ్చిన వారిని మేము బంధువులంగానే చూస్తాం.

శత్రువులు : మేకపాటి వారని చెప్పుకుంటారు. కానీ నిజం కాదు. చంద్రశేఖర రెడ్డే మాకు ముందు ఆహ్వానం పలుకుతున్నారు.

మిత్రశత్రువులు :నేనే నటుణ్ణి. నా ముందు నటించే వాళ్ళుంటారా? నేను నమ్మను.

వేదాంతం : కాంగ్రెస్‌ ఒక మిథ్య. ఇది ఇప్పటి వేదాంతం.

జీవిత ధ్యేయం : నేతగా జాతీయ స్థాయిలో వినోదం పంచి, ‘లాలూ’ వారసుడిగా నిలవాలని.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ అంధ్ర వారపత్రిక 5-12డిశంబరు2015 వ సంచికలో ప్రచురితం)

Leave a Reply