వోటు హక్కూ, వోటు హక్కూ- అని ఎవరూ గొంతు చించుకోనక్కర్లేదు.
వోటు హక్కు అంటే- వోటు కొనే హక్కూ, వోటు అమ్మే హక్కూ- అని వోటు రాని వాడిక్కూడూ తెలిసిపోయింది. ఎటొచ్చీ ఏ రేటుకి అమ్మాలీ, ఏ రేటుకి కొనాలీ- అన్న విషయంలోనే గందరగోళం- వుంది.
అన్నింటా బక్క వాడే నష్టపోతున్నాడు. పండిన పంట అమ్ముకోవటానికి పేద రైతుకు ఎన్ని కష్టాలున్నాయో- పేద వోటరుకి కూడా అన్ని కష్టాలున్నాయి. పంటకన్నా ‘మద్దతు ధర’ ఒకటి వుంటుంది. కానీ వోటుకి అలా కాదే..! ఏ రేటిస్తే, ఆ రేటే యిచ్చుకోవాలి.
‘ఇదేమి దురన్నాయం బాబూ!’ అంటే పట్టించుకునే నాధుడే లేడు.
వాన దేవుడు కరుణిస్తే, ఏడాదికి రెండు పంటలు చేతికొస్తాయి. కానీ ఎన్నికలు అలే కాదే అయిదేళ్ళ కొక్కసారే దిగుబడి. ఏదో సెంటిమెంట్ల పుణ్యం వల్లా, సానుభూతుల దయవల్లా, మధ్యలో ఉప ఎన్నికలొస్తున్నాయి కానీ, లేకపోతే వోటరు ముఖాన్ని అయిదేళ్ళ వరకూ ఎవరూ చూడరు కదా!
కావాలంటే ఎన్నికకో రేటూ, ఉప ఎన్నికకో రేటూ నిర్ధారించుకోవచ్చు.
అంతే కానీ, బొత్తిగా ఎన్నికలలో అభ్యర్థుల మీదా, పార్టీల మీదా వదిలేస్తే, రేట్లు రోజు రోజుకూ తగ్గిస్తారు కానీ, పెంచరు కదా!
అయిదేళ్ళ క్రితం ఇచ్చినట్టే ‘ఇంద వంద’- అంటే, తమ గతేంకావాలీ- అని అంటున్నారు- పలు వోటర్లు.
తామేసిన వోట్లతో గెలిచి ఎమ్మెల్యేలూ, ఎంపీలూ, మంత్రులూ అయ్యాక వారు చేసే స్కాములు- కోట్లలో వుంటున్నాయి.
‘మాకిచ్చేవి వందలు, మీరు కొట్టేది కోట్లా?- అని కడిగెయ్యాలనే ప్రతీ సారీ అనుకుంటున్నాం. కానీ వోటర్లలో ఐక్యత వుంటే కదా! మరి అదే విచిత్రమంటే…! గంగమ్మ తల్లి కడుపులోని ఇసుక అమ్ముకునే వాళ్ళకు సంఘం వుంది కానీ మాకు సంఘం లేదేమిటి?- అని ప్రతీ సారీ అనుకుంటునే వున్నాం. కానీ, ఆ ఒక్క పనీ చెయ్యలేక పోతున్నాం.’
అన్న ఆవేదనలూ కూడా అప్పుడప్పుడూ వోటర్లనుంచి వినిపిస్తుంటాయి.
ఆమధ్యే ఎవరో ఎన్నికల్లో అభ్యర్థి వచ్చి ‘వోటు వెయ్యి’ అనడిగాడట!
వెంటనే ఒక ముసలమ్మ వచ్చి- ‘ఆ మాట మీదే నిలబడు’ అందట. అప్పుడాభ్యర్ధి అవాక్కయి- ‘నాకు వోటేస్తానని మాటివ్వాల్సింది నువ్వు. మాట మీద నిలబడాల్సింది నువ్వు. నన్ను అంటావేమిటి?’ అన్నాడట.
అందుకా ముసలమ్మల అందుకుని- వోటు ‘వెయ్యీ’ అన్నావ్. రేపు నీ మనుషులొచ్చి నా చేతిలో వెయ్యి బదులు, వంద పెడితే, ఎవరూ జవాబు దారీ? నువ్వు కాదా..?’ అని ఎదురు ప్రశ్న వేసింది.
‘ముసలమ్మా! వెయ్యి అంటే నేను వెయ్యి ఇస్తానని కాదు, నిన్ను వోటు వెయ్యమని కోరుతున్నా- అంతే!’ అని చెప్పి జారుకున్నాడు.
అతడు ఇలా వెళ్ళగానే, అతడి ప్రత్యర్థి కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి కొచ్చాడు. ఇదే ముసలమ్మ అతడికీ ఎదురయ్యింది.
వెంటనే ‘వందనాలమ్మా! వోటెస్తావు కదూ!’ అన్నాడట. అప్పుడా ముసలమ్మ ‘ నీ నిజాయితీని మెచ్చుకుంటున్నావ్. ఎంత ఇవ్వగలిగితే అంతే ఇస్తానని చెబుతున్నావ్? కానీ వోటుకు ‘వంద’ గిట్టుబాటు కాదు.’ అని తెగేసి చెప్పేసింది.
‘నేను వోటుకు వందే ఇస్తానని అనలేదు కదా!’ అని బిక్కముఖం పెట్టాడా పెద్ద మనిషి.
‘వంద- ణాలు- అని అన్నావ్ కదా! ఇప్పుడు అణాలూ, అర్థణాలూ ఎక్కడున్నాయి నాయినా! వంద రూపాయిలే అనుకున్నాను. అవి కూడా ఇవ్వవా?’ అంది ముసలమ్మ.
ఎన్నికలంటేనే అలా వుంటుంది. ప్రతీ మాటకు అర్థాలు మారిపోతుంటాయి.
‘రేపు బహిరంగ సభ వుంది. జయ ప్రదం చెయ్యాలి’ అంటే- ‘వచ్చి జై కొట్టాలి. ఎంతిస్తారు? చేలోదిగి పురుగు ముందు కొడితేనే రోజుకు నాలుగు వందలిస్తున్నారు మరి?’ అని అడుగుతారు. అంతే మరి. వారికి ‘జైకొట్టడానికీ, స్ప్రే కొట్టటానికీ’ వారి దృష్టిలో తేడాలేదు. ఒక వేళ ఉన్నా వారు గమనించరు. ‘జై కొడితే’ చీడ పురుగులు పెరుగుతాయి. ‘స్ప్రే కొడితే’ చీడ పురుగులు చస్తాయి.
పేద కూలీలు నాట్లు కాలానికీ, కోతల కాలానికీ ఎలా ఎదురు చూస్తారో- ఎన్నికల కాలానికి కూడా అలాగే ఎదురు చూస్తారు. ఒకరకంగా ఇది కూడా ‘కోతల’ కాలమే అనుకోండి. నేతలు కోసేవి- అన్ని కాక పోయినా, చాలా వరకూ కోతలే కదా!
ఎన్నికల తేదీ ఇంకా ప్రకటించకుండానే పరోక్ష ప్రచారాలు మొదలవుతాయి.
ప్రతిపక్షంలో వున్న వారయితే ‘ధర్నాలు’ నిర్వహిస్తారు. వాటికి జనసమీకరణ చెయ్యాలనుకున్నప్పుడు కూడా నిలదీసే ముసలమ్మలు వుంటారు.
‘ధర-నా అంటున్నావు. కూలి ధరలేకుండా బేవార్సుగా వచ్చేస్తామనుకుంటున్నావా?’ అని నిలదీస్తే, ఏం చేస్తారు? ఎంతో కంత ముట్ట చెప్పాల్సిందే.
ఎన్నికలంటే చాలు- ఏదో ఒక పని దొరుకుతుంది. ఊరేగింపులో పాల్గొనే పనీ, ఉపన్యాసాలు వినిపెట్టే పని, రోడ్ షోల్లో గుమి కూడే పనీ- ఇలా అన్నీ పనులే. అన్ని పనులకు కూలి ఇస్తారు కానీ, రేట్లే ఒక్కోరకంగా వుంటున్నాయన్నది వోటర్ల ఆవేదన.
‘నాకు గ్లామర్ వుంది కదా! నేను కూడా ఇంత ఇవ్వాలా? ‘ అని వోటు రేటులో డిస్కౌంట్ అడుగుతాడు జనాకర్షక నేత.
‘సెంటిమెంటు వుంది కదా! ఏదో తిండి ఖర్చులు ఇవ్వగలం కానీ, కూలి ఇచ్చుకోలేమంటాడు’ ఉద్యమకారుడి పోజు పెట్టి ఇంకో నేత.
ఇలా ఎగవేత రాయుళ్లు నానాటికీ పెరగడం పట్ల వోటర్లలో పెరిగన ఆందోళన అంతా ఇంతా కాదు.
మొత్తానికి అటు లీడరూ, ఇటు వోటరూ ఒకే ఒక విషయం తేల్చారు: వోటు విలువయినది.
ఆ విలువను తానే నిర్ణయిస్తానంటాడు లీడరు. కాదు- ‘నిర్ణయించాల్సింది నేను కదా’ అంటాడు వోటరు. ఇదే మరీ డెమాక్రసీ!
(ఆంధ్ర భూమి దినపత్రిక 13 మే 2012 సంచికలో ప్రచురితం)
-సతీష్ చందర్
అయ్యా , మీరు రాసిన పద్దతి , శైలి , వెటకారము అన్నీ బాగున్నాయి. విషయము కూడా మంచిదే. కానీ దీనివలన చదివినవారికి ఏదైనా ఉపయోగము ఉండాలి అని నా ఉద్దేశము. కొంత అవగాహన ఉన్నవారైతే నవ్వి ఊరుకుంటారు. మరికొందరికిది వినోదము… ఈ రెండింటివల్లా ఏమీ నష్టము లేదు. కానీ చిన్నవయసులో ఉండి , అంత అవగాహన లేనివారు ఇది చదివితే , వారు ‘ ఓటుకి సరైన రేటు ఏది , దాన్ని ఎలా వసూలు చేయాలి ? ” అనో , లేక , ” ఓటుతో నా అవసరాలుతీర్చుకునే సదుపాయము ఉంది ” అనో అనుకునే ప్రమాదము ఉంది. ఆమధ్య ఒక అబ్బాయి తన కిడ్నీ అమ్ముకుని ఐ పాడ్ కొన్నాడట !! కాబట్టి మీకు ఉన్న ప్రతిభతో నలుగురికి ఉపయోగపడేలా రాయమని మనవి… అన్నట్టు , మీ రచనలు కొన్ని ఇంతకు ముందే చదివి ఉన్నాను. బాగున్నాయి. ఒకరకంగా నేను మీకు అభిమానిని కాబట్టి నా ఈ అభిప్రాయాన్ని మరోలా అనుకోరని భావిస్తూ ,
జనార్దన్