టాపు(లేని) స్టోరీ:
పెళ్ళికొడుకూ మారవచ్చు. పెళ్ళికూతురూ మారవవచ్చు. కానీ పురోహితుడు అవే మంత్రాలు చదువుతాడు. వాయిద్యకారులు అవే భజంత్రీలు వాయిస్తారు.
బడ్జెట్ మారవచ్చు. బడ్జెట్ ప్రసంగమూ మారవచ్చు. కానీ, అధికార పక్షం నేతలు అవే పొగడ్తలు పొగడుతారు. ప్రతిపక్షనేతలు అవే సణుగుళ్లు సణుగుతారు.
‘ఇది ప్రజల సంక్షేమం కోరే బడ్జెట్’. ఇంత పెద్ద బాకా ఎవరు ఊదుతారు? పాలక పక్ష సభ్యులు తప్ప.
‘ఇది అంకెల గారడీ. పేద వాడి కడుపు కొట్టే బడ్జెట్’ ఈ కడుపు నొప్పి ఎవరిదో అర్థమయ్యింది కదా! ఇది సదరు ప్రతిపక్ష సభ్యులది.
ఇవే ప్రకటనలు ఏ బడ్జెట్ కయినా వస్తాయి. అది కేంద్ర బడ్జెట్ కావచ్చు. రాష్ట్ర బడ్జెట్ కావచ్చు. ఈ ప్రకటనల్లో ఒక మాట కూడా మారదు. ఈ మాత్రం ప్రకటనలు చెయ్యటానికి సభలో ఆర్ధిక మంత్రి బడ్జెట్ సమర్పించేంత వరకూ ఎదురు చూడనవసరం లేదు. ముందు కూడా అనవచ్చు. ఈ మాత్రం ప్రకటనలకు బడ్డెట్ ప్రసంగాన్ని విననవసరం లేదు. చదవనవసరం లేదు. ఒక వేళ చదివినా అర్థం చేసుకోనవసరం కూడా లేదు. అర్థం కాక పోయినా కొంపలు ఏమీ మునిగి పోవు.
‘ద్రవ్యలోటు’ ఏమిటో, ‘రెవెన్యూ మిగులు’ ఏమిటో తెలియక పోయినా ఫర్వాలేదు. తెలుసుకున్నా చేసేదేమీ వుండదు. అందుకని, ఆ గొడవంతా పాత్రికేయులకూ, విశ్లేషకులకూ వదిలేసి, వివిధ పార్టీనేతలు ఈ ప్రకటనలతో రోజు గడిపెయ్య వచ్చు.
ఏబడ్జెట్టు గురించయినా పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోవలసిన అవసరంలేదు. కానీ సాధారణ పౌరుడు అనే ఆయన ఒకరు ఉంటారు. ఆయనకు మాత్రం-ఈ బడ్జెట్ నా కేమిచ్చింది?- అని వెతుక్కునే అవకాశం వుంది.
వెంటనే స్థానిక ఎన్నికలూ, ఏడాడి లోగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలూ ఉన్నాయి. ఈ సందర్భంలో వెలువడిన బడ్జెట్‌ను అర్థం చేసుకోవటానికి సాధారణ అర్థ శాస్త్ర జ్ఞానమూ, వాణిజ్యశాస్త్ర దృష్టీ సరిపోవు. కొంత ఎన్నికల జ్ఞానం కూడా వుండాలి. అప్పుడు మాత్రమే బడ్జెట్ అర్థమవుతుంది. మంత్రి తన ప్రసంగం చదివేటప్పుడు ‘కోట్లు’ ‘కోట్లు’ అని చదువు తుంటారు. కానీ వాటిని ‘వోట్లు, వోట్లు’ అని అర్థం చేసుకోవాలి.
అలాగే ‘ఖర్చులు’ గురించి చదివేటప్పుడు కూడా జాగ్రత్తగా వినాలి. ‘ప్రణాళికా వ్యయం’ అంటారు. ఎన్నికలకు ఇంతఖర్చవుతుందని ముందుగా అనుకుంటాం- ప్రచారానికింత, హోర్డింగులకంత, బహిరంగ సభలకింత, ర్యాలీలకింతా అని అర్తం చేసుకోవాలి. ‘ప్రణాళికేతర వ్యయం’ వుంటుంది. అది ముందు చెప్పలేం. 2014లో వోటుకు రేటు ఎంత వుంటుందో ఎలా చెప్పగలం? ఇవాళ వోటుకు వెయ్యి రూపాయిలు పుచ్చుకున్న వోటరు, రేపు రెండువేలు రూపాయిలు డిమాండ్ చెయ్యవచ్చు. ‘ద్రవో’ల్బణం పెరుగుతునే వుంటుంది. ( మీరు సరిగానే చదివారు. ద్రవమే. మద్యం రేటు ఇవాళ వున్నది, ఏడాది తర్వాత వుంటుందా? మద్యం పుచ్చుకున్న వోటరు పడి పోతాడు కానీ, మద్యం రేటు పైకి లేస్తూనే వుంటుంది. అలా ద్రవం రేటు పోటెత్తటాన్నే ‘ద్రవో’ల్బణం అంటారు.)
అయితే ఇలా ఇచ్చేది కాకుండా, ప్రణాళికాబధ్ధంగా ఇచ్చేటప్పుడు కూడా పౌరుల్ని బట్టి కాక, అధికార పక్షంలో వున్న పార్టీకి దక్కని వోటు బ్యాంకుల వారీగా కేటాయిస్తారు. ఉదాహరణకు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మజ్లిస్ ముస్లింలకు చేయిచ్చింది. కాబట్టి అర్జెంటుగా వారి సంక్షేమం చూసినట్టుగా భావించాలి. ఎస్సీ,ఎస్టీలు వైయస్సార్ కాంగ్రెస్ వెంటో, మరో పార్టీ వెంటో వెళ్ళి పోతున్నారని కాంగ్రెస్ అనుమాన పడిందనుకోండి. ‘వారి నిధుల్ని మళ్ళించటం లేదు’ అని మరో మారు భరోసా ఇస్తారు. రైతులు ఒక వేళ పాదయాత్రలు చేస్తున్న షర్మిల, చంద్రబాబుల వంక చూస్తున్నారన్న భయం వేసిందనుకోండి. వారికీ ‘పైపూతల’ వంటి తాయిలాలు ఇస్తారు. ఇలా చూసినా బడ్జెట్ అర్థమవుతుంది.
ఆదాయ మార్గాలంటారా? అదే మరి మ్యాజిక్కు. ఈ వర్గాల వోటర్లు తమ కుడి జేబు నిండిందనుకుంటారు. ఒక్క సారి ఎడమ జేబు తడిమి చూడండి. మొత్తం ఖాళీ. అవే పన్నులు. అయినా సరే చివర్లో ‘ద్రవ’లోటు అని ఎందుకు రాసుకుంటారో- అర్థం కావటంలేదు. ఎక్సయిజు వారు ఏం చేస్తున్నట్లు. మద్యం నిల్వలు సంపూర్ణంగా లేక పోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూలి పోదూ…?(ప్రజారోగ్య వ్యవస్థ కన్నా, ఆర్థిక వ్యవస్థే మనకు ముఖ్యం కదా!)
న్యూస్ బ్రేకులు:
దరిద్రమా వర్థిల్లు!
ప్రస్తుత బడ్జెట్ తో పెరిగేది సంక్షేమం కాదు, సంక్షోభమే.
-యనమల రామకృష్ణుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత
పుణ్యం చేసుకోవాలంటే, దరిద్రులు వుండాల్సిందే. ఎన్నికల ముందు సర్కారు పుణ్యం(సంక్షేమం) చేసుకోవాలంటే, అప్పటివరకూ దరిద్రం (సంక్షోభం) కొనసాగేటట్టు చూసుకోవాలి.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా, వ్యవసాయానికి తక్కువ నిధులు కేటాయించారు.
-ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ నేత
అవును, రైతు ప్రాణాలు తీసుకోవాలంటే పురుగు మందయినా కొనుక్కోవాలి కదా! కనీసం అందుకోసం కూడా కేటాయింపులు లేవు.
ట్విట్టోరియల్
‘సతి’ పక్షాలు
దెబ్బ తగలకుండా కొడుతుంటే, ఎన్నిసార్లయినా కొట్టించుకోవాలని అనిపిస్తుంది. ప్రేమతో తిడుతుంటే ఎన్ని సార్లయినా తిట్టించుకోవాలనిపిస్తోంది. సత్యభామకు ముచ్చటొచ్చి తన్నుతానంటే, శ్రీకృష్ణుడు కాదన్నాడా? దానివల్ల శ్రీకృష్ణ పాత్రకు ఆనందం పెరిగిందే తప్ప తగ్గలేదు. రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ఈ సౌఖ్యం అనుభవిస్తోంది. ముగ్గురు సతుల ముద్దుల మగనిలాగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు మురిసిపోతోంది. అప్పుడెప్పుడో, ప్రధాన ‘సతి’ పక్షానికి(తెలుగుదేశానికి) మురిపెం (అవిశ్వాసం) వచ్చి తన్నబోయింది. సర్కారు కూలలేదు. ఇప్పుడు మిగిలిన రెండు ‘సతి’ పక్షాలకూ(వైయస్సార్‌కాంగ్రెస్‌కూ, టీఆర్‌ఎస్‌కూ) ఇంకాస్త మురిపెం ఎక్కువ అయి ఒకే సారి తన్న బోయాయి. పాపం వారి సుకుమారమైన పాదాలు కందిపోయాయి కానీ, కాంగ్రెస్ సర్కారు మహదానందంగా నవ్వుకుంది. దానికున్న నమ్మకం ఒక్కటే. ముగ్గురు ‘సతు’లూ ఒక్క సారిగా తన్న రని.
‘ట్వీట్ ‘ఫర్ టాట్
ఇంట్లో ఇటలీ!
పలు ట్వీట్స్: మన మత్స్యకారుల్ని కాల్చిన ఇటలీ నావికుల్ని మన వాళ్ళు వదిలేశారట.
కౌంటర్ ట్వీట్: ఎక్కడికి పోతారు?ఇటు ఇండియాలోనూ, అటు ఇటలీలోనూ వున్నది ఇటలీ నేతలే కదా!
ఈ- తవిక
ఎన్నికల పండగలు
ప్రజాస్వామ్య దేశంలో
పండగలేల దండగ.
అడుగడుగున ఎన్నికలు
ఎదురొస్తూ వుండగ
స్వీటు హాటు వండిస్తే
మిగుతుంది అప్పు.
వోటుకో వెయ్యిస్తే
ఊగుతుంది కప్పు?
బ్లాగ్ (బ్లాక్) స్పాట్:
‘అమ్మా! తమ్ముడు కొత్త బూతులు తిడుతున్నాడే!’
‘ముందు టీవీ ఆపు. వాడు అసెంబ్లీ సమావేశాల లైవ్ చూస్తున్నట్టున్నాడు’
కొట్టేశాన్( కొటేషన్):
ఉద్యమం తల్లి వంటిది. రాజకీయం ప్రియురాలి వంటిది. ఉద్యమం రమ్మంటుంది. రాజకీయం తెమ్మంటుంది.
-సతీష్ చందర్
(సూర్య దినపత్రిక 14 మార్చి 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)