ఒకప్పుడు గ్లామరే రాజకీయం. నేడు వ్యూహమే సర్వస్వమయిపోయింది. కేవలం వ్యూహమే వుండి, జనాకర్షణ లేకపోయినా దిగులు లేదు. తర్వాత అదే జనాకర్షణగా మారుతుంది. ఉత్త జనాకర్షణ వుండి వ్యూహం లేక పోతే.. ఆ మెరుపు ఎన్నాళ్ళో నిలవదు.
జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీల విషయంలో అదే జరిగింది. రాహుల్ గాంధీకి జనాకర్షణ అన్నది వారసత్వ సంపద. ఆయన్ని ప్రజలు అనేక రకాలుగా అన్వయించుకోవచ్చు. రాజీవ్ గాంధీ కొడుకు; ఇందిరమ్మ మనుమడు, తొలి ప్రధాని నెహ్రూ మునిమనుమడు. మరి నరేంద్ర మోడీకి..? ముందు శూన్యం; వెనుక శూన్యం. తనకు తానుగా ‘కాషాయం’ నీడన ఎదిగారు.
వ్యూహం లేదు కాబట్టి, రాహుల్ గాంధీ వయసు ముదిరిపోయినా ‘యువనేత’గానే మిగిలిపోయారు. (బ్రిటన్‌లో ప్రిన్స్ చార్లెస్‌ను వృధ్ధుడయిపోయినా ‘యువరాజే’ అంటారు. రాచరిక పారంపర్యంలో చెల్లుతుంది. ప్రజాస్వామ్యంలో కూడా చెల్లాలంటే ఎలా? అసలు ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలుండాలా..?) దాంతో ప్రత్యర్థులకూ, రాజకీయ విశ్లేషకులకే కాదు.. కాలమిస్టులకూ, కార్టూనిస్టులకు కూడా రాహుల్ లోకువ అయిపోయారు.’తల్లి చాటు బిడ్డ’గానే ఇప్పటికీ ఆయన్ని చిత్రిస్తున్నారు. రాహుల్ కాన్వెంటు దుస్తుల్లో వున్నట్లూ, తల్లి సోనియా జాగ్రత్తలు చెబుతూ స్కూలు దగ్గర దించుతున్నట్లూ ఎన్ని కార్టూన్లు వచ్చాయి..? కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి అధ్యక్షపదవికి సోనియా తప్పుకుని రాహుల్‌కి దారిస్తున్నా కూడా.. రాహుల్ ఆ పదవికి అర్హుడా..? అనే అనుమానాలు వస్తున్నాయి. ఆ మాటకు వస్తే, పి.వి.నరసింహరావు, సీతారామ్ కేసరిల వరుస నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చిన్నాభిన్నం అయ్యాక, సోనియా రంగ ప్రవేశం చేసినప్పుడు కూడా ఆమె గురించి ఇలాంటి వ్యాఖ్యలే వినపడ్డాయి. ఆమెకు రాజకీయానుభవం లేదని గగ్గోలు పెట్టారు. పార్టీ అధ్యక్ష పదవిని ఆమె అలంకరించేటప్పుడు ఆనవాయితీగా వస్తున్న ‘ఏకగ్రీవ’ ఎన్నికకు తిలోదకాలిచ్చారు. పోటీ వుండి తీరాల్సిందే అన్నారు. అప్పుడు సీనియర్ నేత జితేంద్ర ప్రసాద ను కొందరు ఎగదోశారు. పార్టీ ఎన్నికలు జరిగాయి. జితేంద్ర ప్రసాద అవమానకరంగా ఓడిపోయారు. అంతే కాదు, కాంగ్రెస్ నుంచి వేరు పడి మహారాష్ట్రలో శరద్ పవార్, పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ వేరు కుంపట్లు( నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు) పెట్టుకున్నారు. అప్పుడు సోనియాను ‘శూన్యం’ గా ప్రత్యర్థులు అభివర్ణించారు. ఆమెకు రాజకీయోపన్యాసం ఇవ్వటం తెలీదని కూడా విశ్లేషకులు అనే వారు. పార్టీలో సహాయకులు ఏది రాసిస్తే అది చదివేస్తారని చెప్పేవారు. కడకు ‘లాండ్రీ జాబితా’ ఇచ్చినా చదివేస్తారని ఛలోక్తులు కూడా వేసేవారు. కానీ అదే సోనియా కాంగ్రెస్ ను 2004లో అధికారంలోకి తెచ్చారు; మన్‌మోహన్ సింగ్‌ణు ప్రధానిని చేసి తాను ‘యూనీయే’ చైరపర్సన్ గా వుండి ప్రభుత్వంలో పదేళ్ళ పాటు చక్రం తిప్పారు. కారణం వ్యూహం. అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ వంటి ఉద్దండులు వ్యూహరచన చేసేవారు. అలా తనకు రాజీవ్ భార్యగా వచ్చిన ‘జనాకర్షణ’కు వ్యూహాన్ని జోడించారు. కానీ రాహుల్ దాదాపు కాంగ్రెస్ అధికారంలో వున్న పదేళ్ళూ సమయాన్ని వృధా చేశారు. వ్యూహాన్ని తాను జోడించలేదు; ఎవరినీ జోడించ నివ్వలేదు. అందుకే నానాటికీ ‘చిన్నబోతూ’ వచ్చి, కడకు 2014లో కాంగ్రెస్ పరాజయం తర్వాత కళ్ళు తెరిచారు. కానీ, అప్పటికే ఆలస్యం అయిపోయింది.
మోడీ హీరో- అమిత్ షా దర్శకుడు
కానీ నరేంద్ర మోడీ అలా చెయ్యలేదు. అద్వానీ ‘హిందూత్వ’ రాజకీయాలను మరోలా కొనసాగించారు. విమర్శకులు అంటున్నట్లు అవి ‘ద్వేష రాజకీయాలే’ కావచ్చు. మైనారిటీ మతస్తులను శత్రువుగా చూపించి, అన్నికులాల వారినీ వారికి వ్యతిరేకంగా కూడ గట్టి ‘మెజారిటీ హిందూత్వ’ వోటును సాధిస్తే సాధించ వచ్చు. అద్వానీ ఇదే పనిని ‘బాబ్రీ’ ని చూపించి చేస్తే, మోడీ ‘గోద్రా’ను తర్వాత ‘ముజఫర్ నగర్ అల్లర్లనూ ‘లవ్ జిహాద్’ ఆరోపణలనూ చూపించి చేశారు; చేస్తూనే వున్నారు. అందుకనే అద్వానీ కి వచ్చిన ఆకర్షణే మోడీకీ వచ్చింది. కానీ అద్వానీ తన గ్లామర్‌కి, తన వ్యూహాన్నే జోడించే వారు. కానీ మోడీ అలా కాదు. తన ఆకర్షణకు అమిత్ షా వ్యూహాన్ని జోడించారు. ఈ వ్యూహం లేకుంటే గుజరాత్ ను పాలించిన ఒకానొక ముఖ్యమంత్రి లాగే మిగిలి పోయేవారు. ప్రధాని పీఠాన్ని సునాయాసంగా చేరుకునే వారు.
పాశ్చాత్య దేశాల్లో లాగా ఇప్పుడు ‘వ్యూహం’ మార్కెట్లో దొరకుతోంది. సెఫాలజిస్టులూ( సర్వేల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల నాడిని పట్టుకునే వారూ), వ్యూహకర్తలూ లభ్యమవుతున్నారు. విద్యావంతులు సైతం బధ్ధకించకుండా వోటు వెయ్యటం మొదలు పెట్టినప్పటి నుంచి వీరి ప్రాధాన్యం బాగా పెరిగింది. యోగేంద్ర యాదవ్ లాంటి సెఫాలజిస్టులు తన చెంతన వుండటం వల్లనే ‘మోడీ’ గాలిని మళ్లించి ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని స్థాపించారు. ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తలు కూడా ‘సామాజిక మాద్యమాల’ను వినియోగించుకుని పలుచోట్ల పలు పార్టీల విజయానికి దోహద పడ్డారు.
ఈ రహస్యాన్ని రాహుల్ గ్రహించి దాదాపు మూడేళ్ళవుతోంది. అందుకే బీజేపీ వ్యతిరేక వోటును చీలిపోకుండా వుండటానికి, ఎవరితోనైనా చేతులు కలపగలుగుతున్నారు. కాంగ్రెస్ గెలవటం కన్నా బీజేపీని వోడించటం అన్న అంశాన్ని తొలి ప్రాధమ్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు గుజరాత్‌లో కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. పటేల్ రిజర్వేషన్ ఉద్యమం తెచ్చిన హార్దిక్ పటేల్‌తో పాటు, బీసీ నేత అల్పేష్ ఠాకూర్, దళిత నేత జిగ్నేష్‌లను తన వైపునకు తిప్పుకున్నారు. అందుకనే ఇప్పటికీ సర్వేల ప్రకారం బీజేపీయే ముందంజలో వున్నా కూడా, కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే స్థితికి ఎదిగి పోయింది. ఇది కూడా రాహుల్ సారథ్యంలోనే. అంటే వ్యూహాన్ని వాడుకుంటున్నారన్న మాట. ఈ పని ముందు చేస్తే సోనియా ఇంకాస్త ముందు రిటయరయ్యేవారు.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రికలో ప్రచురితం)