సీనూ మారదు, శీనూ మారడు!
కామెడీ ట్రాక్ ముందు, కథ తర్వాత.
అది యెట్లా- అంటే శీను వైట్లా-అనాల్సి వస్తుంది.
పూర్వం టిఫిన్లు తినటం కోసం రెస్టారెంట్లకు వెళ్ళే వారు. కానీ ఈ మధ్య ‘బ్రేక్ ఫాస్ట్’ చేయటంలో కూడా ట్రెండ్ మారింది. చట్నీలు భోంచెయ్యటం కోసమే హొటళ్ళకు వెళ్తున్నారు. హోమియో గుళిక లాంటి ఇడ్లీ ముక్కను ఆరగించటానికి గంగాళాల కొద్దీ చట్నీలను వడ్డిస్తారు. దాదాపు సినిమాలో వైట్ల తెచ్చిన ట్రెండ్ ఇదే.
రెండు గంటల హాస్యానికి, అర్థ గంట కథను జోడిస్తారు.
మారాలి కాబట్టి, పాత్రల పేర్లూ, వరసలూ మారుతుంటాయి. హీరో, విలన్, హీరోయిన్, హీరోయిన్ తల్లీ, వీలయితే పిన్నీ, ఇంటికి చుట్టపు చూపుకొచ్చిన బావలూ, బామ్మలూ ఎవరయినా సరే చెయ్యాల్సింది ఒక్కటే . కామెడీ. మరీ కమెడియన్లకు మిగిలిందేమిటి? హీరోయిజం. ఇదే మరి- ‘చట్నీస్’ ప్రధానాహారం కావటమంటే.
కమెడియన్లు తొడలు కొట్టినా, మీసాలు మెలివేసినా, కడకు హత్యలు చేసినా ‘నవ్వులాట’ గా వుండదూ. కానీ కొట్టిన బలహీనమైన తొడనే పదే పదే కమెడియన్ కొడితే ఏమవుతుందీ.. ? డైలాగుల్లో ‘పంచ్’ పడుతుందో లేదో కానీ, కట్టిన ‘పంచె’ ఊడుతుంది. అయినా నవ్వొస్తుంది. కానీ ఊడిన పంచే, ఊడుతూ వుంటే జాలి వేస్తుంది. ఇక ముందు జరిగేది అదే.
ఇదే ఫార్ములా పట్టుకని వేళ్ళాడితే వరుసగా హిట్లే వస్తుంటాయి. కానీ ఆ హిట్ల క్రమం- సూపర్ హిట్, హిట్, మాములు హిట్.- ఇలా అవరోహణ క్రమంలో వుంటుంది. కానీ ఒక్కసారి ఫ్లాప్‌లు తగులుకుంటే మాత్రం ఆర్డర్ మారుతుంది. ఫ్లాప్, పెద్ద ఫ్లాప్, సూపర్ ఫ్లాప్- ఇలా వుంటుంది. ఇప్పటికయితే శీను ‘హిట్ల’ మధ్యే వున్నారు. అది వేరే విషయం.
‘దూద్‌షా'(దూకుడు ప్లస్ బాద్‌షా) చూశారా?
శీను వైట్ల గతంలో తీసిన సినిమాలను అలా వుంచితే, ఈ మధ్య తీసిన రెండు సినిమాలూ, ప్రేక్షకుల్ని ఆలోచనలో పడవేశాయి.
మరీ ముఖ్యంగా ‘దూకుడు’, ‘బాద్‌షా’. ఒకే సినిమాను తెలుగులోనే రెండు సార్లు తీసినట్టుంది. కాకుంటే చిన్న మార్పు: హీరోలు వేరు. అంటే ‘దూకుడు’ అనే తెలుగు సినిమాకు ‘బాద్‌షా’ మరో తెలుగు రీమేక్ అన్న మాట. అదే చిత్రాన్ని మహేష్ బాబుతో ఒక సారీ, జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక సారీ తీసినట్టుంది.
అందులోనూ ఇందులోనూ ‘రియల్టీ షో’లోకి బ్రహ్మానందం వెళ్ళిపోతాడు. కాకపోతే ‘దూకుడు’ లో ‘డ్రీమ్ మెషిన్’ అంటారు. ఎమ్మెస్ నారాయణ అందులో ‘హీరో’భ్రమలో బతికేస్తే, ఇందులో ‘డైరెక్టర్ అనే అపోహ’ లో జీవించేస్తాడు.
పరిశ్రమలో కోట్లకు కోట్లు లాభాలు తెచ్చిపెట్టగల శీనువైట్ల, ఈ ఫార్ములాను ఎందుకు ఎంచుకున్నట్లు? నిజంగానే ప్రేక్షకుల నాడిని పట్టుకుని ఆతరహా మార్గాన్ని ఎన్నుకున్నారా? కావచ్చు.
మొత్త తెలుగు సినిమా యే ‘ప్రేమ ప్లస్ ఫ్యాక్షనిజం’ అనే ఫార్ములాను అరగ్గొట్టి, అరగ్గొట్టి వదలి పెట్టింది. ఇప్పుడు ‘ప్రేమ’ చిక్కి శల్యమయ్యింది. ఫ్యాక్షనిజం ‘సీమ’ను దాటి పరసీమలకు పారిపోయింది. అది ముంబయి ‘మాఫియా’ కావచ్చు. లేదా బాంబు పేలుళ్ళ ‘ఉగ్ర హింస’ కావచ్చు. హింస ఇలాగే జరగాలన్న రూలు లేదు. ఎలాగయినా జరగొచ్చు. పాతబడిపోయిందేదయినా నవ్వులాటగానే వుంటుంది.
ఒకప్పటి సినిమాల్లో ‘అన్నా చెల్లెళ్ళు’ కూడా ‘హీరో హీరోయిన్ల’లాగా పాటలు పాడుకునే వారు. ఇప్పుడు ఆ పాటలు వింటే నిజంగానే నవ్వు పుడుతుంది.ఇప్పటి చెల్లి, అన్నను ‘అరేయ్ ఒరేయ్’ అంటూ పైకి గొడవ పడుతూ లోలోపలి ఆప్యాయతను ప్రకటిస్తుంది. ఇది ఇప్పటి ట్రెండు.
పేరడీయే కామెడీయా?
పాతపడి పోయిన దానిని ‘పేరడీ’ చేసి నవ్వించటంలో వైట్లకు ఓ ప్రత్యేకత వుంది. ఇప్పుడున్న హీరోలు అందరూ పాత ఫార్ములా ద్వారా ఎవరి ‘బ్రాండు’ వారు పొందిన వారే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ‘పంచ్’లతో అభిమానుల నోళ్ళలో నానిన వారే. ‘పంచ్’, ‘పంచ్’- అంటూ తెగ మురిసిపోతాం కానీ, ‘పంచ్’ లంటే – విలన్ల మీద పలికే ప్రగల్బాలే.(భారతంలో ఉత్తరకుమారుడు పలికితే ప్రగల్బమంటారు. హీరో పలికితే ‘పంచ్’ అంటారు. అంతే తేడా.) ‘నీ ఇంటి కొస్తా….’, ‘ఎవడు కొడితే..’, ‘ ఒక్కొక్కర్నీ కాదు షేర్ ఖాన్…’ ఇలా ‘ఒక్క ఐడియీ జీవితాన్నే మార్చేసినట్టు’, ‘ఒక్కో పంచ్ ఒక్కో హీరో ఇమేజ్’ నే మార్చేసింది. అలాంటి ఈ ‘పంచ్’లను అత్యంత బలహీనంగా, ‘అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను’ అని స్కూల్లో పద్యం ఒప్పగించిన రీతిలో , ఎమ్మెస్ నారాయణ లాంటి కమెడియన్ చెబితే, నవ్వు రాక చస్తుందా! ఇది మాటల ‘పేరడీ’.
ఇక హీరోల చేతల్ని అనుకరిస్తే ఇంకెలా వుంటుంది? ఆ పని ‘బ్రహ్మానందం’ లాంటి స్టార్ కమెడియన్ చేస్తే ఇంకెంత బాగుంటుంది? ఒక ‘పవర్ ఫుల్ ‘ పోలీస్ ఆఫీసర్‌లా హీరో రావటం, విలన్ల బాడీలను డెలివరీ చేయటం- ఇవన్నీ హీరోలు అరగదీసిన సీన్లు. ‘వాటిని బ్రహ్మానందం చేస్తాడు, మీకేమన్నా అభ్యంతరమా?’ అంటారు శీను వైట్ల. నవ్వొచ్చి తీరుతుంది.
కానీ ఎప్పుడూ? ఒక్క సారి చేస్తే..! పదే పదే చేస్తే..? నవ్వుకూ, ఏడుపుకీ మధ్య ,ఏదయినా భావప్రకటన వుంటే ,అది వస్తుంది.
కరెక్టే. ‘ప్రేమ ప్లస్ ఫ్యాక్షనిజం’ పోయి, ‘కామెడీ ప్లస్ హింస’ ఫార్ములా తెలుగు కమర్షియల్ సినిమాలోకి వచ్చేసింది. ఇతర దర్శకులు కూడా ఇదే పని చేస్తున్నారు. అందుకు కారణం మారిన ప్రేక్షకుల అభిరుచే.
మారిన ఫార్ములా!
తెలుగు టీవీ చానెళ్ళలలో తెలుగు సీరియల్స్‌ను చూడటం మొదలు పెట్టినప్పుడు, మధ్యతరగతి స్త్రీలు టీవీలకు అతుక్కుపోయి, సినిమా హాళ్ళకు ఎప్పుడో కానీ వెళ్ళి సినిమా చూసేవారు కారు. ఇక మిగిలింది పూర్తి ‘క్లాస్’ అనబడే కాలేజీ విద్యార్థులూ, చదువుకున్న మగవాళ్ళతో పాటు, కార్మిక, శ్రామిక వర్గానికి చెందిన ‘మాస్’ మాత్రమే చూసేవారు. ఈ కొసనీ, ఆ కొసనీ ముడివేయటం ఎలా? అనే స్థితిలో ఇలాగే ఒక ఫార్ములా వచ్చింది. ఫస్ట్ హాఫ్ ‘లవ్వూ’, సెకండ్ హాఫ్ ‘ఫ్యాక్షనిజం'( సీమలో అంతరించిపోతున్న సమయంలో ‘ఫ్యాక్షనిజాన్ని’ ఆకర్షణీయం చేశారు. దాదాపు ఈ ఫార్ములా దశాబ్దానికి పైబడి కొనసాగుతోంది. ఈ సినిమాలు ఎంతగా అరిగిపోయాయంటే, వీటిలో పుట్టిన ‘తొడ కొట్టుడు’ ప్రాక్టీసు సినిమాలను దాటి రాజకీయ ప్రచారాల వరకూ వచ్చేసింది.)
తర్వాత మళ్ళీ టీవీలే మరో మార్పునకు శ్రీకారం చుట్టాయి. సీరియల్స్‌ను మించి గేమ్‌షోలనూ, రియాల్టీ షోలనూ చూడటం మొదలు పెట్టారు. దంపతుల్ని పిలిచి టీవీలో డ్యూయెట్లను పాడించటం మొదలు పెట్టారు. వీటితో పాటు సినిమాల్లో కత్తిరించిన కామెడీ ట్రాక్‌లను ముక్క ముక్కలు గా ఇరవయి నాలుగు గంటలూ చూపించే చానెళ్ళు( జెమినీ కామెడీ లాంటివి) వచ్చేశాయి. ఇలా టీవీలు చూసిన వాళ్లు నగరాల్లోనూ , పట్టణాల్లోనూ మల్టీప్లెక్స్‌లలోనూ, ఖరీదయిన దియేటర్లకు వచ్చి చూస్తున్నారు.
వీరి కోసం ఎలాంటి చిత్రాలు తీయాలో అందరికీ పరీక్ష. ఇందుకు ఎవరి ప్రయోగాలు వారు చేస్తున్నారు. అందులో భాగంగానే- ‘కామెడీ ప్లస్ ఫ్యాక్షనిజం’ లేదా ‘కామెడీ ఫ్లస్ హింస’ ను ప్రయోగిస్తున్నారు.
అయతే ఈ కామెడీ ఒకప్పటిలాగే జీవితాన్ని వచ్చిందయితే బాగుండేది.
పదానికో ‘పంచ్’!
సరిగ్గా ఈ సందర్భంలోనే శీను వైట్ల తన ప్రయోగాలను మొదలుపెట్టారు. ఆయన అన్ని మార్కుల కామెడీ కన్నా ‘అనుకరణ’ లేదా ‘పేరడీ’ని ఇష్టం. ఇందులో భాగంగానే ‘మిమిక్రీ’లూ, ‘రికార్డింగ్ డ్యాన్స్’ లూ వచ్చాయి. రియాల్టీషోలను అనుకరించటమూ చేశారు. ఈ పని మిగిలిన దర్శకులు కూడా చేస్తారు. కానీ, ఈయన వీటినే ప్రధాన భాగం చేసి మధ్యలో కథ అల్లుతుంటారు. ఈ తరహా చిత్రాలను ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్, తర్వాత అల్లరి నరేష్ ల మీద తీసేవారు. పెద్ద పెద్ద హీరోల మీద ప్రయోగాలు చేసేవారు కారు. నిజానికి అప్పట్లో అలా చేసి వుంటే బెడిసి కొట్టేవి. కానీ శీను వైట్ల ధైర్యం చేశారు. సహజంగా ప్రతిభావంతుడు కావటం వల్ల నిజంగానే ప్రేక్షకులను మెప్పించి, పెద్ద పెద్ద హీరోల అభిమానులను కూడా ఒప్పించగలిగారు. అంత వరకూ ఓకే.
కానీ ఈ హడావిడిలో పడి మిగిలిన కథను చిన్న బుచ్చుతున్నారు. ఉదాహరణకు ‘బాద్‌షా’లో విలన్ల సంఖ్య పెంచారే తప్ప ‘విలనీ’ తీవ్రతను పెంచ లేక పోయారు. హీరోకు కలిగిన పగ ప్రేక్షకుడికి కలిగించ లేక పోయారు. ప్రతీ సంభాషణనూ వెటకారంగా ‘విరిచే’యటమే ‘పంచ్’లను కుంటూ పంచ్‌లకుండే అసాధారణతను తీసివేశారు. ఏదో అప్పుడప్పుడూ,అక్కడక్కడా ‘పంచ్’లు పడ్డప్పుడుండే చప్పట్లు, మరొకప్పుడు వుండవు.( మళ్ళా ఈ సంభాషణలు ఆయన రాశారా? కోన వెంకట్ రాశారా? అన్న వివాదం ఒకటీ! వీళ్ళు రాసిన సంభాషణలు ఎంత నవ్వు తెప్పించాయో తెలియదు కానీ, వీరి వివాదం మాత్రం నవ్వులాట గానే వుంది.)
ఇలా కొసరును అసలు చేసి. అసలును కొసరు చేయటం అన్ని వేళలా సాగదు. శీను వైట్ల లాంటి ప్రతిభావంతుడయిన దర్శకుడు, ఈ విషయాన్ని గమనిస్తే, భవిష్యత్తులో నిజంగానే పిక్కబలం వున్న కథతో సినిమా తీసి మెప్పించగలుగుతారు. లేకుంటే, ఆయనా పాత పడిపోతారు. రేపు ఈయన దర్శక శైలిని వెక్కిరించి , పేరడీ చేసి మరో దర్శకుడు వచ్చి నవ్వించగలడు. ఈ ప్రమాదాన్ని ఆయన గుర్తించాలి.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 26ఏఫ్రిల్-3 మే 2013 తేదీలు గల సంచికలో వెలువడింది.)