శేఖర్ కమ్ముల ఫార్ములా: ఏకలయినా ఒకేలా! ఏకథయినా అదేలా!!

దర్శకుడన్నాక తిరగాలి. తిరగక పోతే కథలు రావు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. పాపం. కొత్తతరం దర్శకులు తిరుగుతున్నారు. ఈ తిరుగుడు రెండు రకాలుగా వుంటుంది. ఒకటి: ఇంగ్లీషు సినిమాల చుట్టూ తిరగటం . రెండు: తమ సినిమాల చుట్టూ తాము తిరగటం.

వీరిలో ఏ ఒక్కరూ జీవితం చుట్టూ తిరగరు. అదే విషాదం.

మొదటి రకం కన్నా, రెండవ రకం దర్శకులే మెరుగు. కాపీ కొడితే, తమను తామే కాపీ కొట్టుకుంటారు. వీరి మీద సానుభూతి వుంటుంది కానీ, చులకన భావం వుండదు. ఆ కోవకు చెందిన వారే శేఖర్‌ కమ్ముల.

ఆయన తీసి, విడుదల చేసిన తాజా చిత్రం పేరుకు ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అన్నారు కానీ, అక్కడ కొత్తగా చూపించిన ‘లైఫ్‌’ అంటూ లేదు. అంతా పాత చిత్రాల్లోని జీవితమే.

ఆయన ఇందులో చెప్పి ఒక సినిమా(హ్యాపీ డేస్‌)నూ, చెప్పకుండా రెండు సినిమాల(ఆనంద్‌, గోదావరిల)నూ, బుధ్ధిగా(‘డ్యూటి’ఫుల్‌)గా కాపీ చేశారు. నిజానికి పూర్తి భిన్నంగా తీసిన సినిమా ‘లీడర్‌’. దానిని అంతే భిన్నంగా వుంచేశారు కానీ, అందులోనుంచి పెద్దగా ఏమీ తీసుకోలేదు.

పాత వాటిని అనుకరించటం ఒక యెత్తు. అనుకరించటంలో వాటిని దాటి ఏమాత్రం ముందుకు వెళ్ళలేక పోవటం మరో యెత్తు.

దీంతో శేఖర్‌ కమ్ముల కథకు ఒకే ఒక ఫార్ములా వుందన్నది దాదాపు తేలిపోయింది.

‘హ్యాపీ డేస్‌’ తీసినప్పుడు అందులో తన ప్రతినిథిగా హీరోను చూడలేక పోయాడు. అందుకోసం వేరే ‘టైసన్‌’ అనే పాత్రను సృష్టించుకున్నాడు. ఎదుటివాడు బలవంతుడూ, తనను తన్నగలడూ అతడి మనసులోని అభిప్రాయాన్ని చెబుతుంటాడు. అందుకు సరిపడా తన్నులు కూడా తింటుంటాడు. సౌందర్యారాధనకు సైతం ధైర్యం కావాలనే చాటే పాత్ర అది. తాను జూనియర్‌ అయి వుండీ, సీనియర్‌ సరసన వున్న అమ్మాయి(సోనియా)ని ‘ఇంటరెస్టింగ్‌’ వుందంటాడు. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ లో గోల్డ్‌ ఫేజ్‌ (సంపన్న వర్గాల) అమ్మాయి అని తెలిసి కూడా, ఆ అమ్మాయి బోయ్‌ ఫ్రెండ్స్‌ ముందే ‘పారూ’ అని ఏకవచనంలో ముద్దుగా పిలిచి తన్నులు తింటుంటాడు అభి అనే ఈ అభినవ ‘టైసన్‌’. అందులో టైసన్‌ కు కండ తక్కువ. ఇందులో అభికి ఎత్తు తక్కువ. అంతే తేడా.

అలాగే అన్ని ఫార్ములా సినిమాల్లోనూ హీరోకు ‘సైడ్‌ కిక్‌’ లా వుంటూ, సహకరించే పాత్రను ‘కమెడియన్‌’ గా మలుస్తారు. కానీ, శేఖర్‌ కమ్ముల, ఈ పాత్రలో హీరో కుండాల్సిన ‘చొరవ’నీ ‘దూకుడు’నూ చూపిస్తాడు. మొరటు తనాన్నీ, భయం లేని తనాన్నీ, వాటినన్నిటినీ మించి మంచి తనాన్నీ ఈ పాత్రకు చొప్పిస్తారు. ‘హ్యాపీ డేస్‌’ లో రాజకీయ నాయకుడి కొడుగ్గా కాలేజీ కొచ్చిన పాత్రా(నిఖిల్‌ సిద్దార్థ), ‘లైఫ్‌ ఈ జ్‌ బ్యూటిఫుల్‌’లో ‘నాగరాజు’ (సుధాకర్‌) పాత్రా అలాంటివే. ఇవి రెగ్యులర్‌ చిత్రాల్లో హీరో కుండే హీరోయిజాన్ని ప్రదర్శిస్తూనే, కమెడియన్‌లా మధ్య మధ్యలో భంగపడుతూ నవ్విస్తుంటారు.

మరి ఇంతకీ అసలు హీరో ఏంచేస్తాడు? ఏమీ చెయ్యడు. రొటీన్‌ గా ప్రేమిస్తాడు. ‘హ్యాపీ డేస్‌’లో వరుణ్‌ సందేశ్‌ ఏం చేశాడో, ఇందులో శ్రీనివాస్‌ పాత్ర పోషించిన అభిజిత్‌ అదే చేస్తాడు. ఈ రొటీన్‌ హీరోతో కానీ, హీరోయిన్‌తో కానీ దర్శకుడు ‘ఐడెంటిఫై’ కాడు, ఇదీ శేఖర్‌ కమ్ముల మూస నిర్మాణం.

శేఖర్‌ కమ్ముల సమాజాన్ని కూడా చాలా సుఖంగా, సింపుల్‌ గా రెండు వర్గాలుగా విభజించేసుకుంటాడు. అక్కడ ‘సీనియర్స్‌- జూనియర్స్‌’ విభజన. ఇక్కడ ‘సంపన్నులు- పేదలు’ విభజన. ఇంతే సూక్ష్మంగా వుంటే నిజంగా బాగుండేది. కానీ దురదృష్టవశాత్తూ అలా వుండదు. కులం, మతం, జెండర్‌- ఆవన్నీ విభజనను జటిలం చేస్తాయి. వాటి జోలికి పోనవసరం లేదు. కానీ వాటి ప్రభావం పాత్రల మీద వుంటాయన్నది గుర్తు పెట్టుకోవాలి కదా!

టీన్స్‌లో వున్న అబ్బాయిలు, కాస్త వయసెక్కువ వున్న (ప్రౌఢ) స్త్రీలపై మోజు పడతారన్న విషయాన్ని దృష్టిలో వుంచుకుంటారు. (వీరికి ‘ఆంటీ’లనే పేరు స్థిరపడింది లెండి!) అందుకే అందులో ‘కమలినీ ముఖర్జీ’ , ఇందులో ‘అంజలా ఝవేరీ’ లు సాక్షాత్కరిస్తారు.

పాత సినిమాల్లో (రేప్‌) ‘బలాత్కారపు’ దృశ్యాలు కూడా, శేఖర్‌ కమ్ముల చిత్రాల్లో ‘బలాత్కార యత్నాలు’ (అటెమ్ట్స్‌ టు రేప్‌)గా పునరావృతమవటం విశేషం. పైకి సంస్కారంగా కనిపించే ‘హైసొసైటీ’ అబ్బాయి వెంట వద్దంటూండగా పడే శేఖర్‌ హీరోయిన్లు ఇలాంటి ప్రమాదం నుంచి తృటిలో తప్పుకుంటూ వుంటారు. ‘ఆనంద్‌’ లో కమలినీ ముఖర్జీ, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ లో అమల పాత్రలు ఇలాగే తప్పించుకుని జ్ఞానోదయం పొందుతాయి.

అలాగే ఈ ‘హైసొసైటీ’ అబ్బాయిల అసలు రంగు బయిట పెట్టటానికి పరీక్షగా ‘బలాత్కారాన్నే’ కాక, ‘యాక్సిడెంటు’ను కూడా వాడుతుంటారు. ప్రమాదం ముంచుకొస్తే, ‘గోదావరి’లోనూ, ‘లైఫ్‌ యీజ్‌ బ్యూటిఫుల్‌’లోనూ ఈ ‘అబ్బాయిలు’ మృత్యువంటే భయపడి హీరోయిన్లను వదలిపారిపోతారు. అక్కడ ప్రమాదం ‘లాంచి’ కి వస్తే, ఇక్కడ ‘ఫ్లయిట్‌’ కు వస్తుంది. అంతే తేడా. మృత్యు ముఖంలో కూడా తోడు వుండే వాడే ప్రియుడు- అనే ఒక్క పాయింటును ఇలా పలు సినిమాల్లో ఒకే విధంగా నిరూపిద్దామని కంకణం కట్టుకున్నట్టున్నారాయన.

యువతరం మీద సినిమా తీస్తున్నప్పుడు, ఆయన ఎప్పటి యువతరాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాడన్నది కూడా పాయింటే. నిజానికి ‘హ్యాపీ డేస్‌’ 2007లో వచ్చిన సినిమా. ఇందులో పాత్రలకు పెట్టిన ‘నిక్‌ నేమ్స్‌’ 1980 వ దశకం నాటివి. బాగా బక్క పల్చగా వున్న పాత్రను, అప్పటి బాక్సర్‌ ‘మైక్‌ టైసన్‌’ తోనూ, బొద్దుగా వుండే అమ్మాయిని అప్పటి ‘ఏసియాడ్‌ సింబల్‌’ గా వున్న ‘అప్పు’ (పిల్ల ఏనుగు)తోనూ పోలుస్తాడు. ఈ కాలపు యువత నోళ్ళలో, ఆ కాలపు వ్యక్తులూ, విషయాలే నానుతుంటాయి. శేఖర్‌ మ్ముల తాను విద్యార్థిగా వున్నప్పటి విషయాలను తెచ్చినట్టున్నారు.

ఇప్పటి కాఫీడేలనూ, బర్గర్‌లనూ, పిజ్జాలనూ, మోటార్‌ బైక్‌లనూ చూపించి, అప్పటి యువతరపు మనోభావాలనే చూపిస్తే ‘మిస్‌ మ్యాచ్‌’ అవుతుంది. ఇప్పటి యువతరపు ఆలోచనలు, వారు ఇప్పటి టెక్నాలజీకి అలవాటు పడ్డ తీరూ వేరుగా వుండవచ్చు. ఒక్క ‘మొబైల్సూ, మెస్సేజ్‌’లూ మినహా, ఎక్కడ ‘ఫేస్‌బుక్‌లూ, ట్విట్టర్‌’లూ వాటితో ముడిపడ్డ యూత్‌ జీవితమూ ఎందుకో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ లో కూడా కనిపించలేదు.

అంతే కాదు, శేఖర్‌ కమ్ముల జీవితం కూడా హైదరాబాద్‌ కే ఎక్కువ పరిమితంగా వుంటుంది. అందుకే విశాఖ పట్నం నుంచి హైదరాబాద్‌ వచ్చిన వారు కూడా ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ లో హైదరాబాదీయుల్లాగా ప్రవర్తిస్తారు.

ఇన్ని పరిమితులున్నా శేఖర్‌ మ్ముల చిత్రాలు హాయిగా, ప్రశాంతంగా వుంటాయి. మధ్యమధ్యలో మనుషుల మధ్య వున్న చిన్ని చిన్న అనుబంధాలను చూపించినప్పుడు కళ్ళు చెమరస్తూ వుంటాయి.

కానీ పాటల బాణీలతో పాటు, సర్వం ఇలా తన చిత్రాలను తానే అనుకరించుకుంటూ పోవటం వల్ల, ఆయన సౌందర్య దృష్టికి కూడా పరిమితి ఏర్పడుతుంది.

ఇద్దరికీ ప్రమాణాల్లో ఏ మాత్రం పోలిక లేదు కానీ, గతం లో ఎస్వీ కృష్ణా రెడ్డి కూడా ఇలాగే మూస చిత్రాలు తీసి, తన దర్శకత్వానికి తానే శుభం కార్డు వేసుకున్నారు.

కానీ, శేఖర్‌ కమ్ములు, అభిరుచీ, పరిణతీ, విశ్వజనీనతా వున్న దర్శకులు.

ఆయన జీవితం వైపు తొంగి చూస్తే, ఎన్నో కొత్త జీవితాలూ, కథలూ కనిపిస్తాయి.

అప్పుడు ఆయనకే ‘స్క్రిప్ట్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అనిపిస్తుంది. దర్శకత్వంలో ‘హ్యాపీడేస్‌’ తిరిగి వస్తుంది.

-సతీష్‌ చందర్‌

 

 

3 comments for “శేఖర్ కమ్ముల ఫార్ములా: ఏకలయినా ఒకేలా! ఏకథయినా అదేలా!!

  1. మొత్తానికి “ఆపాత”మధుర సినిమాలను చూస్తే..ఇది చూడక్ఖర్లేదు అంఅటున్నారు..కాని రేపు తీసే సినిమాని గమనించమని అంటున్నారు. 🙂

  2. Nice analysis. I wish Sekhar Kammula will do as you said. i.e. జీవితం వైపు తొంగి చూస్తే, ఎన్నో కొత్త జీవితాలూ, కథలూ కనిపిస్తాయి. But I have no hopes.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *