నా (సతీష్ చందర్) 17 వ పుస్తకం ’నిగ్రహ వాక్యం‘ (సాహిత్య విమర్శ) గ్రంధాన్ని అక్టోబరు 29 సాయింత్రం సుందరయ్య విజ్నాన కేంద్రం, మినీ హాలులోప్రముఖ కవి కె.శివారెడ్డి ఆవిష్కరించారు. సభకు దిగంబరకవితోద్యమ సారధి నగ్నముని అధ్యక్షత వహించారు. మొత్తం నాతో పాటు పది మంది మాట్లాడారు. ( నాది ’స్పందన‘ సమర్పణే లెండి. నేను వందన సమర్పణను అలా అంటుంటాను.) అయినా ఎవరి పరిశీలన వారు చేశారు.
నగ్నముని: మూడు దశాబ్దాల తెలుగు సాహిత్య చరిత్రలోని ముఖ్య పరిణామాలు ఈ పుస్తకంలో వున్నాయి. నా ’కొయ్యగుర్రం‘ మీద సతీష్ చందర్ రాసిన వ్యాసం నన్ను ముగ్ధుణ్ణి చేసింది.’బిబ్లికల్‘ అవగాహన అందుకు బాగా తోడ్పడింది. ముప్పయ్యేళ్ళ క్రితం చేసిన రచన, ఇవాళ రాసినంత తాజాగా పఠనీయత కోల్పోకుండా వుండటం విశేషం.
కె.శివారెడ్డి: విమర్శ ను పఠనీయంగా రాయటం చాలా కష్టం. కానీ సతీష్ వాక్యం దానంతటదే చదివించుకుంటుంది. మూడువందలకు పైగా వున్న ఈ మొత్తం గ్రంథాన్ని, ఒక నవల చదివినట్లుగా చదివేశానంటే నమ్మండి.
కె.శ్రీనివాస్: శ్రీశ్రీ మీద సతీష్ చందర్ చేసిన పరిశీలన ఆశ్చర్యం కలిగించే విధంగా వుంటుంది. ‘ఈ శతాబ్దం నాది‘ అన్నశ్రీశ్రీకి మిగిలింది అర్థశతాబ్దమేనని సమర్థవంతంగా చెప్పగలిగారు. తాను నమ్మిన వాదాన్ని ముందుకు తీసుకు వెళ్ళటం కోసం తనని తాను నిగ్రహించుకోవటం తనకి తెలుసు.
జూలూరు గౌరీశంకర్: తెలుగులో గుర్తుండిపోయే సాహిత్య విమర్శ గ్రంథాలు అరుదుగా వచ్చాయి. రాచమల్లు రామచంద్రారెడ్డి వంటి ఉద్దండుల గ్రంథాల సరసన ’నిగ్రహ వాక్యం‘ వుంచవచ్చు. తెలంగాణ అస్తిత్వాన్ని పోల్చుకోవటమే కాకుండా, మద్దతు పలుకుతూ నా పుస్తకానికి (’ముండ్లకర్ర‘కు) 2002లోనే ముందు మాట రాసిచ్చారు.
సి.మ్రుణాళిని: కవిమీద రాసినా, రచయిత మీద రాసినా సతీష్ చందర్ ఆ కవి, రచయిత మీద వున్న అపారమైన ప్రేమ కనిపిస్తుంది. అంత ప్రేమలోనూ ఆ కవి లేదా రచయిత గొప్పతనాన్ని తర్కబధ్ధంగా నిరూపిస్తారు.ఆయన బాగా చదువుకున్నారు. కానీ కొందరిలాగా ఆ విషయాన్ని పైకి ప్రదర్శించరు. కానీ విశ్లేషణల్లో అంతర్భూతంగా అది కనిపిస్తుంది.
పి.వి.సునీల్ కుమార్: సతీష్ చందర్ ’ఆల్ రౌండర్‘. కవిత్వం, కథ, విమర్శ, వ్యంగ్యం- అన్నీ రాసి మెప్పించగలరు. నాకు రచనలో ఏ సందేహం వచ్చినా ఆయన్నే అడుగుతాను.
కె.సత్యనారాయణ: దళిత సాహిత్య వాద వివాదాల్లో ఆయన పాత్ర కీలకమయినది. అందరూ ఒక్కటయినా, ఒంటి చేత్తో వారి విమర్శలను ఎదుర్కొన్నారు.
తెలకపల్లి రవి: దళిత అస్తిత్వ వాదాన్ని సతీష్ చందర్ ఆవిష్కరించినా, మార్క్సిస్టు కోణం నుంచి కూడా విమర్శ చేశారు.
ఎం. చేతన: చెస్ బోర్డులో ఏ పావును ఎక్కడ వుంచాలో అక్కడ వుంచినట్లు, సతీష్ చందర్ రచయితల్ని వారి వారి స్థానాల్లో చారిత్రంగా వుంచగలిగారు.
ఎ.పి. కాలేజ్ ఆఫ్ జర్నలిజం, కరస్పాండెంట్ ఎం. గౌరీ చందర్ సభకు స్వాగతం పలికారు.
Congrats..naturally MS Chander is great n modern poet n writer, but some are quoting him as a dalit poet, dalit writer is very unfortunate…