సన్నాఫ్‌ ‘చంద్ర’ మూర్తి!

caricature: balaram

caricature: balaram

పేరు : నారా లోకేష్‌ బాబు

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సన్‌ రైజర్స్‌’ టీమ్‌ కెప్టెన్‌.( క్రికెట్‌ గురించి కాదు, నేను పాలిటిక్స్‌ గురించే మాట్లాడుతున్నాను. ‘సన్‌ రైజర్స్‌’ అంటే ‘పొడుచు కొస్తున్న సూర్యులు’ కాదు, ‘తోసుకొస్తున్న కొడుకులు’. కావాలంటే ఈ టీమ్‌లో ‘కేటీఆర్‌’ కూడా చేరవచ్చు.)

వయసు :‘ఎగిరే’ వయసే! అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ‘ఎగురుతున్నా’నని అపార్థం చేసుకునేరు…! అంటే ‘ఫ్లయ్‌’ చేసే ఈడొచ్చిందని. కాబట్టే… దేశదేశాల్లో ఫ్లయ్‌ చేస్తున్నాను.

ముద్దు పేర్లు : నా ‘రాకుమారుడు'( రాజు కుమారుణ్ణే కదా!), నారా ‘షోకేస్‌'( నాన్నగారి కీర్తి ప్రతిష్టల్ని చాటటంలో నడిచే ప్రదర్శన శాల లాంటి వాడిని) ‘నారా’క్‌ ‘బాబొ’మా!( పేరు వింతగా అని పిస్తుంది కదూ! ఎందుకో నేను అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో కలిశాక నన్ను నేను అలా పిలుచుకోవాలనిపిస్తుంది. సన్నాఫ్‌ ‘చంద్ర’ మూర్తి?( నాన్న ఎలాగూ మూర్తీభవించిన చంద్రుడే. అదీకాక, ఈ మధ్య ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమా చూశాను లెండి. నాన్న గారి గురించి ఒక్కరు కూడా చెడ్డగా అనుకోకూడదు- అని పంతం పట్టి తిరుగుతాడు అందులో హీరో.నా ఉద్దేశ్యం కూడా అదే. నాతో మాట్లాడిన ప్రతి వారూ, నాన్న బెటరు, అని అనుకుంటున్నారా? లేదా?)

‘విద్యార్హతలు : ఒకటి కాదు, రెండు కాదు, మూడు అర్హతలున్నాయి. ఒకటి: ఎన్టీఆర్‌ మనుమణ్ణి. రెండు: బాలయ్య అల్లుణ్ణి. మూడు: చంద్రబాబు తనయుణ్ణి. ఇంతకు మించి అర్హతలు ఏమి కావాలి? ఇవి చాలవా… బరాక్‌ ఒబామాతో కరచాలనం చెయ్యటానికి; ఇతర దేశాధినేతలతో చర్చలు జరపటానికి

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: మాట ఇస్తే తప్పను. (అందుకనే నాన్నగారి తర్వాత నేనే ముఖ్యమంత్రి అభ్యర్థినని ఇంతవరకూ మాట ఇవ్వలేదు.)

రెండు: అనుకున్నది అనుకున్నట్లు అనేస్తాను. ( కేసీఆర్‌ను హిట్లర్‌ తో పోల్చాను. టీఆర్‌ఎస్‌ వారు హర్ట్‌ అయ్యారు. నా దృష్టిలో ‘హిట్‌ తర్వాత హిట్‌ ఇచ్చే వాడే హిట్లర్‌’ పొగిడినా ఫీలయితే నేనేం చెయ్యను. అఫ్‌ కోర్స్‌ ఆయనెప్పుడూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్నే హిట్‌ చేస్తాడనుకోండి…అది వేరే విషయం.)

సిధ్ధాంతం : నాన్న గారిది సిధ్ధాంతం, నాది ఆచరణ. మరో రకంగా చెప్పాలంటే… ఆయనది (రాజధాని) కట్టుబడి; నాది ‘విదేశీ’ పెట్టుబడి. పెట్టుబడి లేకుండా కట్టుబడి వుండదు కదా!?

వృత్తి : నాన్న గారి ‘బూటు’ జాడల్లో నడవటం. ఎప్పుడూ ‘బూట్లు’ లేకుండా ఆయన నడవరు కదా? కాబట్టే ‘అడుగు జాడలు’ కనపడవు. ఆయన బిల్‌ క్లింటన్‌ ను ఎలా కలిశారో, నేను బరాక్‌ ఒబాను అలా కలిశాను.

హాబీలు :1.వినేవాళ్ళుండాలి కానీ, ఉపన్యాసాలివ్వటానికి వెనకాడను.

2. అధికారులకు విధులు ఎలా నిర్వర్తించాలో చెప్పటం. (వారికి తెలియదు అని కాదు కానీ, చెప్పటం నా హాబీ)

అనుభవం : రాజకీయకుటుంబంలో పుట్టాను; పుట్టినప్పటి నుంచీ రాజకీయాలు చూస్తున్నాను. కా బట్టి నా వయసెంతో, నా అనుభవమూ అంతే.

మిత్రులు : తప్పు. అనుచరులూ.. అనాలి. ఉన్నారు.

శత్రువులు : వారు మాత్రం ‘వారసత్వ సంపద’ గా వస్తుంటారు.

మిత్రశత్రువులు :నా చుట్టూ చేరి పాయింటు లేకుండా నన్ను పొగడే వారు.

వేదాంతం : రాజకీయాల్లోకి వచ్చాక చేసే సేవను కూడా బిజినెస్‌ అంటారు.

జీవిత ధ్యేయం : నాన్న గొప్పముఖ్యమంత్రి అని నిరూపించాలి. (వెంటనే ఆ పదవిని నేను చేసేస్తే ఆ పేరు ఎలాగూ వస్తుంది. కానీ నాకా కోరిక లేదు.)

-సతీష్ ఛందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 15-21 మే2015 వ సంచికలో ప్రచురితం)

1 comment for “సన్నాఫ్‌ ‘చంద్ర’ మూర్తి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *