‘సమైక్య’ బరిలో మూడు పందెం కోళ్ళు

సమైక్యాంధ్ర ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ ఎవరికి దక్కబోతోంది! ఇప్పుడు నిజంగా అసెంబ్లీలో ( జనవరి 23 వరకూ) నడుస్తున్నది ఈ పోటీయే!

చర్చ జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన బిల్లు మీదనే. ఈ బిల్లు చర్చకు రావటం వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏ మేరకు ప్రయోజనం వుందో తెలియదు కానీ, సీమాంధ్ర శాసన సభ్యులకు మాత్రం ఇది చాంపియన్‌షిప్‌కు జరుగుతున్న పోటీలాగే అనిపిస్తోంది.

ఇంకా చెప్పాలంటే, సంక్రాంతి పండగప్పుడు దించే పందెం కోళ్ళలాగా మూడు పార్టీలూ కనిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే, ముందుగానే బరిలోనుంచున్న పందెం కోడి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తెలంగాణ ఏర్పాటు మీద నిర్ణయం తీసుకోక ముందే, తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిథుల చేత రాజీనామా అస్త్రాలను సంధింప చేసి, సమైక్యవాదాన్ని అందుకున్నది వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, కాబట్టి, సమైక్యాంధ్ర చాంపియన్‌ షిప్‌లో ఇప్పటి వరకూ వైయస్సార్సీపీ నేత జగన్‌మోహన్‌ రెడ్డే ముందుకు దూసుకు పోతున్నారు.

అయితే మరో రెండు పందెం కోళ్ళు ఆలస్యంగా బరిలోకి వచ్చాయి. ఒకరు: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మరొకరు: అధిష్ఠానాన్ని ‘ధిక్కరించినట్టు’ నమ్మింపచేస్తూ, కాలికి కత్తి కట్టుకుని ‘జై సమైక్యాంధ్ర’ అంటూ, కాస్త ఆలస్యంగా దూకిన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి.

ఇద్దరూ ఇద్దరే. (ఇలా అనటం కంటే, ‘దొందూ, దొందే’ అనటం బాగుంటుందేమో!) రాష్ట్రాన్ని విభజించమని ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించిన తర్వాత, ఈ ఇద్దరూ తొలుత ప్రదర్శించిన వైఖరికీ, తర్వాత వీరంగం ఆడిన తీరుకీ చాలా వ్యత్యాసం వుంది. చంద్రబాబు అయితే, ముందు విభజనని స్వాగతిస్తూ, సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటుకు నాలు లక్షల కోట్ల రూపాయిలు అడిగారు. అంతే ‘విభజన అన్యాయం సుమీ!’ అని నెత్తీ,నోరూ బాదుకోలేదు. ఇక కిరణ్‌ సంగతి సరేసరి. ఈ ప్రకటన వెలువడిన పది రోజుల పాటు తన సెక్రటేరియట్‌ కు రాలేదు. అలిగి కోపగృహంలోకి వెళ్ళిన రాణి లాగా, ఆయన ‘క్యాంప్‌ ఆఫీస్‌’లోనే మౌనంగా వుండిపోయారు.

ఆ తర్వాత ఈ ఇద్దరు నేతలూ బయిటకు వచ్చారు. చంద్రబాబు నాయుడు బయిటకు వచ్చారు. ‘రెండు కొబ్బరి చిప్పల’ సాక్షిగా, ‘ఇద్దరు బిడ్డల’ సాక్షిగా, రెండు ప్రాంతాలకూ ‘సమన్యాయం’ అడిగారు. ఈ ‘సమన్యాయం’ తెలంగాణ వాదులకు ‘సమైక్యవాదం’లాగా, ‘సమైక్యవాదులకు’ ప్రత్యేక వాదంలాగా అనిపించింది. అయతే తెలంగాణలో తనకు జాగా దొరకటం లేదని తెలిసి, చంద్రబాబు నాయడు మెల్లగా ‘సమన్యాయం’లోనే ‘సమైక్యవాదం’ చూపించే ప్రయత్నం చేశారు. అలా సమైక్యాంధ్ర చాంపియన్‌ షిప్‌ జగన్‌ కు దక్కకుండా చేసి, తానే సంపాదించుకోవాలని ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

ఇక కిరణ్‌ ‘కోపగృహం’ నుంచి రావటం, రావటమే, ‘సమైక్యనినాదం’ అందుకున్నారు. దానికి తోడు ఏపీఎన్జీవో నేత అశోక్‌ బాబు పార్టీలకతీతంగా ఉద్యోగులతో నడిపినట్టు చెప్పిన ‘సమైక్యాంధ్ర ఉద్యమాన్ని’ కిరణ్‌ వైపు చాక చక్యంగా మళ్ళించే ప్రయత్నం చేశారు.

ఈ రాష్ట్ర పునర్విభజన బిల్లును ఎప్పుడయితే రాష్ట్రపతి, రాష్ట్ర అసెంబ్లీకి పంపారో, ఈ చాంపియన్‌షిప్‌ పోటీకి అసెంబ్లీ వేదికయిపోయింది. ఈ బిల్లుపై చర్చ, రాష్ట్ర ప్రజలందరూ టీవీలో వీక్షించగలిగే ‘ఇన్‌డోర్‌’ గేమ్‌ లాగ సాగుతోంది.

కారణాలేమయితేనేం? మూడు విడతలుగా సాగే ఈ ‘గేమ్‌’లో రెండో విడత ముగియ వస్తోంది. తాము జగన్‌ను మించిన సమైక్యవాదులమని చెప్పటానికి, కిరణ్‌, చంద్రబాబు తమ వ్యూహాలు తాము చేశారు. కానీ, శాసనసభలో వైయస్సార్సీపీ మాత్రం, బిల్లుపైన చర్చకు ఒప్పుకుంటే, విభజన ప్రక్రియకు అంగీకరించినట్లేనని వాదిస్తూ రావటమే కాదు, సమైక్య తీర్మానం చెయ్యాలని పట్టు పట్టింది. తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేతలు, ముందు వివరాలు లేని బిల్లు మీద చర్చేమిటి- అంటూ అని అంటూ వచ్చారు కానీ, అంతిమంగా చర్చ జరగాలన్న వాదన వైపు వెళ్ళారు. కిరణ్‌ నేతృత్వంలోని సీమాంధ్ర కాంగ్రెస్‌ వర్గం చర్చతో పాటు వోటింగ్‌ జరగాలని పట్టు పట్టటం మొదలు పెట్టారు.

ఒక దశకు వచ్చాక, బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుపడుతోందని వైయస్సార్సీపీ మీద కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు జమిలిగా ప్రచారం చేశాయి. కానీ వైయస్సార్సీపీ సభ్యులను సస్పెండ్‌ చేయించటానికి ముందు భయపడ్డాయి. అలా చేస్తే ఆ పార్టీ ‘సమైక్యాంధ్ర ‘ చాంపియన్‌ అయి పోతుందేమోనని బెంగపడ్డారు. కానీ అంతిమంగా రెండు పార్టీలు ఏకమయి సస్పెన్షన్‌ చేయించాయి. ఇప్పుడు, బిల్లు మీద చర్చించి, వోటింగ్‌కు పట్టుబట్టి, బిల్లును ఓడించి పంపి, చాంపియన్‌ కావచ్చని కిరణ్‌ వ్యూహం పన్నుతున్నారు. ఇటు జగన్‌కీ, అటు కిరణ్‌ కీ ఈ ఖ్యాతి రానివ్వకుండా చూడాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు కానీ, ఇప్పటికయితే ఆయన ‘సమన్యాయం’ విధానం వల్ల కాస్త వెనకబడే వున్నారు. ఆయనకు ఇంకా తెలంగాణ ప్రాంతంలో సీట్లు మీద కూడా ఆశ చావక పోవటం వల్లనే, ఇలా వెనకబడ్డారన్నది కూడా ఒక విమర్శ లేక పోలేదు. మొత్తానికి బిల్లు ‘విభజన’ కోసం జరుగుతున్నా, ‘చర్చ’ ప్రక్రియ ఎన్నికల కేంద్రంగా జరుగుతోందని అర్థమయిపోతోంది.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 11 -16 జనవరి 2014 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *