పేరు : సి(చెన్నంశెట్టి). రామచంద్రయ్య
ముద్దు పేరు : సి ఫర్ ‘కాపు’ చంద్రయ్య.(కాపులను బీసీలో చేర్చాలని కోరుతున్నాను.)
విద్యార్హతలు : లెక్కల్లో మనిషిని.(ఒకప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్‌ను లెండి.) ఇప్పుడు కూడా లెక్కలు తప్పటం లేదు. కాపులు+బీసీలు= కాంగ్రెస్ అని అంటున్నాను. (సీమాంధ్రలో రెడ్లూ, దళితులూ వైయస్సార్ కాంగ్రెస్‌లోకి జారుకుంటున్నారు కదా! అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చిరునామా మిగలాలంటే నా ‘లెక్క’ను పాటించాల్సిందే. (కాపుల్ని కూడా బీసీల్లో కలిపేస్తే మొత్తం బీసీలయిపోతారు.)
హోదాలు : భగవంతుడికీ, భక్తుడికీ అనుసంధానమైనది…’దర్బార్ అగర్ బత్తి’ అనుకుంటున్నారా? కాదు. ‘దేవాదాయ శాఖ’. అదిప్పుడు నా చేతిలో వుంది.
గుర్తింపు చిహ్నాలు : ఒకటి: తెలుగు జాతి మనది. నిండుగ వెలుగు జాతి మనది- అనే జాతీయ గీతాన్ని ఆలపించేవాణ్ణి- తెలుగుదేశంలో వున్నప్పుడు.
రెండు: కాంగ్రెస్ అంటే కాపులు, కాపులంటే కాంగ్రెస్- అంటున్నాను- పీఆర్పీ ద్వారా కాంగ్రెస్‌లో చేరాక.
అనుభవం : ప్రతీ అడుగూ, ఆచి తూచి వేస్తే, పదవులు వాటంతటవే నడిచి వస్తాయి. తెలుగుదేశం లో వున్నప్పుడూ మంత్రినయ్యాను. పీఆర్పీలో చేరి, కాంగ్రెస్‌లోకి వచ్చి కూడా మంత్రి నయ్యాను. మానేత (కాంగ్రెస్‌లో చేరినా కూడా మా గ్రూపునకు నేత చిరంజీవి)’స్టెప్పు’లు సినిమాల్లో ఎంత వేగంగా వేస్తారో. నేను కూడా రాజకీయాల్లో అంతే వేగంగా వేస్తాను.
వేదాంతం : పార్టీకో కులం వుంటుందన్నది అర్థంలేని ఆరోపణ. కులానికో పార్టీ వుంటుందన్నది నిజం. (నేడు మారిన సమీకరణల ప్రకారం: కమ్మవారికి తెలుగుదేశం, రెడ్లకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాపులకు కాంగ్రెస్ పార్టీ, వెలమలకు టీఆర్‌ఎస్ పార్టీలు వున్నాయి. మిగిలిన కులాల వారు వీలును బట్టి ఈ నాలుగు పార్టీల్లోనూ తల దాచుకుంటారు. ‘ధర్మం’ నాలుగు పాదాలా నడవటం అంటే ఇదే మరి. అందుకనే కాపునేతని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని చేయమంటున్నాను తప్పేమిటి?
వృత్తి : సలహాలు ఇవ్వటం. ( నాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకూ సలహాలు ఇచ్చాను. నేడు కాంగ్రెస్‌లో విలీనమయి వేరు గ్రూపుగా కొనసాగుతున్న పీఆర్పీ నేత చిరంజీవికీ సలహాలు ఇస్తున్నాను. కానీ ఇద్దరికీ ఒకటే తేడా. చంద్రబాబుకు నచ్చే సలహాలే చంద్రబాబుకు ఇచ్చే వాడిని. కానీ ఇప్పుడు నాకు నచ్చే సలహాలను చిరంజీవికి ఇస్తున్నాను.)
హాబీలు :1. ‘చిరు’భజన( పేరుకు రామచంద్రుణ్ణయినా, వృత్తికి మాత్రం హనుమంతుణ్ణి. అందుకే నిత్యమూ ‘చిరు’నామ స్మరణ చేస్తాను. ఫలితాలు చూశారు కదా! ఎమ్మెల్సీనయ్యాను. మంత్రినీ అయ్యాను.
2.’మెగా’ భజన( ఇదీ హనుమంతుడి వృత్తే కానీ, ఊరంతా దద్ధరిల్లేటట్టు భజన చేయటం. చిరంజీవే ముఖ్యమంత్రి అభ్యర్థి- అని వీలయినంత ముందుగా ఎక్కువ అల్లరి చేయటం.( దమ్ముంటే-మెగాస్టార్ ముఖ్యమంత్రి కాకూడదనుకునే వాళ్ళు ఆపటానికి ఈలోగా తమ ప్రయత్నాలు తాము చేసుకోవచ్చు.)
నచ్చని విషయం : జనాకర్షక లేని నేతలతో ఎన్నికలకు పోవాలని పార్టీలు నిర్ణయించుకోవటం.
మిత్రులు : భక్తుడికి సాటి భక్తులే మిత్రులవుతారు. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ఫ్యాన్ అసోసియేషన్ నడుపుతున్నాను కదా- అందులో చేరిన సభ్యులందరూ నాకు మిత్రులే.
శత్రువులు : కాపుల్ని బీసీలో చేర్చవద్దంటున్న బీసీలు..
జపించే మంత్రం : జై చిరంజీవ!
విలాసం : రోజుకో గుడి.(దేవదాయ మంత్రిగా పర్యటించటం లేదు. చిరజీవి భక్తుడిగా ప్రదక్షిణాలు చేస్తున్నాను.)
గురువు : శత్రుశిబిరంలో వున్న చంద్రబాబే. (ఆయన నాకు అన్ని విద్యలూ నేర్పారు. ఒక్కటి తప్ప. నిజం. ‘వెన్నుపోటు పొడవటం’ నాకిప్పటికీ రాదు. కాబట్టే చిరంజీవి వెన్నంటి నేను నడుస్తున్నా, ఆయన నన్ను అనుమానించరు.
జీవిత ధ్యేయం : ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేయటానికి నాదెండ్ల భాస్కరరావు నాడు ఎంతటి కృషి చేశారో, చిరంజీవిని ముఖ్యమంత్రిని చెయ్యటానికి అంతటి కృషి చెయ్యాలన్నది నా జీవిత ధ్యేయం. (ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఏమి చెయ్యాలన్నది తర్వాత చూసుకోవచ్చు.)
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 18-24 మే 2013 సంచికలో ప్రచురితం)