‘సూటేంద్ర’ మోడీ!

caricature: balaram

caricature: balaram

పేరు : నరేంద్ర మోడీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘విదేశాంగ’ ప్రధాన మంత్రి ( ఇంతవరకూ విదేశాంగ శాఖ కు ఒక మంత్రి బాధ్యత వహించేవారు. నేను వచ్చాక, ఇందుకు మంత్రి మాత్రమే సరిపోరనీ, ఆ శాఖను నిర్వహించటానికి ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి వుండాలనీ నిర్ణయించాను. ఇందుకు విదేశాంగ మంత్రిగా వున్న, సోదరి సుష్మా స్వరాజ్‌ నొచ్చుకోకూడదు.)

వయసు : వయసుకీ ముచ్చటకీ సంబంధంలేదు. ఇరవయ్యవ పడిలో వేసిన దుస్తులే పదేపదే వేసేవాణ్ణి. ఈ అరవయ్యే పడిలో చూడండి గంటకో డ్రెస్‌తో మారుస్తున్నాను. ఈ డ్రెస్‌తో విమానం ఎక్కితే, అడ్రస్‌తో దిగాలని రూలు లేదు కదా?

ముద్దు పేర్లు : ‘సూటేంద్ర’ మోడీ ( ఏడాది క్రితం ‘ఛాయే’ంద్ర మోడీని. కానీ కాంగ్రెస్‌ వారికి ఈ పేరు ఇష్టం కాలేదు. ముఖ్యంగా రాహుల్‌కి నచ్చలేదు. నా సర్కారుకి ‘సూటు- బూటు’ సర్కారు అని పేరు పెట్టారు. ఆయన ముచ్చట నేనెందుకు కాదనాలి? నాది ‘సూట్‌ కేసు’ సర్కారు కాదు కదా!) ‘భూమ్‌’ బాయ్‌ (శక్తిలో ‘భీమ్‌’ బాయ్‌ నే. కానీ భూమిని ఎత్తగల హెర్య్యూలెస్‌ వంటి శక్తి ఇటీవలనే వచ్చింది. కాబట్టే రైతునుంచి ‘భూభారాన్ని’ నా తలకెత్తుకుని, పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే ఆర్డినెన్స్‌ తెచ్చాను.)

‘విద్యార్హతలు :పువ్వు పుట్టగానే పరిమళించిందీ- అంటారు. నా విషయంలో ఈ సామెతను కొంచెం మార్చాలి. ‘పువ్వు పుట్టగానే ప్రసంగించిందీ’ అనాలి. టీచర్‌ వేసే మార్కుల కన్నా, సాటి విద్యార్థుల కొట్టే చప్పట్లే నాకు గొప్పగా అనిపించేవి.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: మా పార్టీ మొత్తం మీద ‘నోరూ, పేరూ ‘ వున్న ఏకైక నేతనని అంటుంటారు. కానీ నాకు ఇలాంటి పొగడ్తలు నచ్చవు.

రెండు: అందరి పనీ నేనే చేస్తాను. నా కేబినెట్‌ సహచరులను అధికంగా శ్రమ పెట్టటం నాకు ఇష్టం వుండదు.

సిధ్ధాంతం : నాదీ ‘శోష’ లిజమే. కాకుంటే ‘కంఠశోష’ లిజం. ఉపన్యాసంలో దిట్టను కదా! అనవసంరంగా కమ్యూనిస్టులు నన్ను అపార్థం చేసుకుంటారు.

వృత్తి : కాంగ్రెస్‌ ప్రముఖులను ఆరాధించటం. ( సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశానా? గాంధీ పేరు మీద ‘స్వఛ్ఛ భారత్‌’ పెట్టానా? మదన్‌ మోహన్‌ మాలవ్యా కు భారత రత్న అవార్డు ఇచ్చానా? రేపోమాపో నెహ్రూ పేరు మీద కూడా ఏదో ఒకటి ప్రారంభించగలను.) కానీ వారి ప్రముఖుల్ని నేను తస్కరిస్తున్నానని నా మీద అభియోగం మోపుతున్నారు. ఇదేమన్నా న్యాయంగా వుందా?

హాబీలు :1.తుడిచెయ్యటం. చెత్తలా కనిపించేదదయినా సరే.

2. చరిత్రను సృష్టించటం, మార్చెయ్యటం. ( పురాణాన్నే చరిత్రగా భావించే చరిత్ర కారుల చేత, చరిత్రను కొత్తగా రాయించటం. రేపు పాఠ్యపుస్తకాల్లో ‘క్రీపూ, క్రీశ’ బదులుగా ‘నశ( నరేంద్రుడి శకం) నపూ (నరేంద్రుడి పూర్వం) అని ఉండినా ఆశ్చర్య పోనవసరంలేదు.

అనుభవం : ఒక రాష్ట్రంలో గెలిచాక, దేశంలో గెలవటం గొప్ప కాదనిపించింది- నేను ప్రధానినయ్యాక. కానీ దేశంలో గెలవటం అంత సులువు కాదు, రాష్ట్రంలో గెలవటం అని అనిపించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఓడాక.

మిత్రులు : ఒకప్పుడుండే వారు, అందరూ విధేయులుగా మారిపోయారు. నేనేం చెయ్యను? దోషం నాది కాదు, నేను కూర్చున్న కుర్చీది.

శత్రువులు : ఆరెస్సెస్‌ లో వుండగా ‘మనకి ముగ్గురు శత్రువులుంటార’ని చెప్పారు, వారు: కమ్యూనిస్టులు, క్రైస్తవులు, ముస్లింలు. కానీ ఏడాది పాలనలో ఈ ముగ్గురుతోనే అనివార్యంగా స్నేహం చేయాల్సి వచ్చింది. ఆసియాలో అతి కీలకమైన దేశం కమ్యూనిస్టు చైనా. ఆ దేశంతో ఎంత స్నేహం చేశాను? కాషాయనేతకు కమ్యూనిస్టుల స్వాగతం! ఎంత గొప్పగా వుంది? కాశ్మీరులో ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ తో (పీడీపీ నేత)తో పొత్తు పెట్టుకున్నానా? ఇక సాక్షాత్తూ అమెరికా నేత బరాక్‌ ఒబామాతో స్నేహం అంటే క్రైస్తవునితో స్నేహమే కదా?

మిత్రశత్రువులు :భావసారూప్యం కలిగిన పార్టీల నేతలు. ఉదాహరణకు మహరాష్ట్రలో ‘శివసైనికులు’.

వేదాంతం : నేను ఎక్కువ పని చెయ్యటాన్ని తప్పుపడుతున్నారు. ప్రజల కోసం పనిచెయ్యటమే నేరమయితే, ఆ పనిని పదే, పదే చేస్తాను. ( ఎవర్నీ పని చెయ్యకుండా నేను పని చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి, ‘వన్‌ మ్యాన్‌ షో’ అంటారేమిటి?

జీవిత ధ్యేయం : ముమ్మారు ముఖ్యమంత్రి చేసినట్లే, ముమ్మారు ప్రధాన మంత్రి చెయ్యాలని.

-సతీష్‌ చందర్‌

26 మే 2015 తో నరేంద్ర మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా…

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 23-30 మే 2015 సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *