నాన్న కూడా అమ్మే.
నిఖిలకు న్యూయార్క్ వెళ్ళిన రోజే ఈ రహస్యం తెలిసిపోయింది. వీడియో కాల్ చేస్తే చాలు. ఏడుపే ఏడుపు. పోటీపడి మరీ రాగాలు తీశారు. అమ్మకది మామూలే. కానీ నాన్నకు ఈ రాగ జ్ఞానం ఎలా అబ్బిందో తెలియటం లేదు. అందుకోవటం అందుకోవటమే ఆరున్నర శ్రుతిలో అందుకున్నారు.
మొదటి రోజు కదా ఆ మాత్రపు ఏడుపు దృశ్యాలు సహజంలే, అని సరిపెట్టుకుంది. వారం గడిచింది. నెల ముగిసింది. ప్రతీరోజూ అదే రాగం. అదే శ్రుతి. అదే లయ. ఏడుపును మించిన అంటువ్యాధి మరొకటి వుండదు. కాకపోతే, దగ్గరగా వున్న వాళ్ళకి నెమ్మది గానూ, దూరంగా వున్నవాళ్ళకి వేగంగానూ సోకుతుంది. వేల కిలోమీటర్ల దూరంలో వుందేమో, తనకి ఇట్టే అంటేసుకుంటుంది.
ఏడుపే ప్రశ్న; ఏడుపే సమాధానం. ‘తిన్నావా?’; ‘తిన్నా.’
ఇండియాలో వుండే పేరెంట్స్ అంతా సమావేశమై, ఇదే ప్రశ్నఅడగాలని ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారో ఏమో, ఏ తండ్రయినా, తల్లయినా ఇలాగే అడుగుతారు. ఇంకోలా అడగరు. పంపించింది చదువుకి కదా! చదివావా?- అని అడగొచ్చు కదా! అడిగితే వాళ్ళ సొమ్మేం పోతుందీ? లక్షల సొమ్ము పోగుట్టుకునే కదా, పిల్లల్ని అమెరికా పంపించేదీ! కొత్తగా పోయేదేముందీ?
ఏడుపే ప్రశ్న; ఏడుపే సమాధానం. ‘తిన్నావా?’; ‘తిన్నా.’
ఇండియాలో వుండే పేరెంట్స్ అంతా సమావేశమై, ఇదే ప్రశ్నఅడగాలని ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారో ఏమో, ఏ తండ్రయినా, తల్లయినా ఇలాగే అడుగుతారు. ఇంకోలా అడగరు. పంపించింది చదువుకి కదా! చదివావా?- అని అడగొచ్చు కదా! అడిగితే వాళ్ళ సొమ్మేం పోతుందీ? లక్షల సొమ్ము పోగుట్టుకునే కదా, పిల్లల్ని అమెరికా పంపించేదీ! కొత్తగా పోయేదేముందీ?
నెల తిరక్కుండా తిరుగు ప్రయాణం. చదివేది ఎంత పేస్ యూనివర్శటీ అయినా, నెల నెలలా గడవలేదు. అమెరికాలో కార్లూ, మెట్రోలూ, అన్నీ వేగంగానే తిరిగాయి. ఒక్క గడియారాలే మందకొడిగా కదిలాయి. చలికి వణికి చచ్చాయి కాబోలు. తొమ్మిది రోజులు సెలవులు. ఫ్లయిట్లూ, రైళ్ళూ కలుపుకుని వచ్చిపోయే ప్రయాణానికి నాలుగున్నర రోజులు, పగటి నిద్రను రాత్రినిద్రగా మార్చుకునే ’జెట్ లాగ్‘ కు మధ్యలో ఒకటిన్నర రోజూ పోగా మధ్యలో మిగిలేవి మూడు రోజులే. అందుకు ప్రయాణం ఇతరేతర ఖర్చుల ఖరీదు మూడు లక్షలు. నాన్న సిధ్ధమయి పోయారు.
’డాడీ! మీ బెంగ ఖరీదు రోజుకు లక్షా?‘
న్యూయార్క్ లో అబుదబి వరకూ వచ్చే ఇతిహాద్ ఫ్లయిట్ ఎక్కి, మొబైల్ ను ఫ్లయిట్ మోడ్లో పెట్టే ముందు వీడియో కాల్లోనే అడిగింది నిఖిల.
’అబ్బే అరలక్షే! సగం బెంగ మమ్మీది కదా!’
నవ్వేశారు నిఖిల వాళ్ళ నాన్న. నెల ముసురు తర్వాత ఎండకాస్తే ఆకాశం ఎలా వుంటుందీ? అలా వుంది ఆయన ముఖం. మరి అమ్మ ముఖం? చూడాలనిపించింది కానీ, వీడియో కాల్లోకి రాలేదు. కిచెన్లో వుందేమో?
తన అర్థాంతరపు ప్రయాణానికి మూడు లక్షలంటే పాపం నాన్నకు ఆరు నెలల జీతం కదా- అనుకుంది. అబుదబి చేరుకున్నాక, మళ్ళీ హైదరాబాద్ ఫ్లయిట్ ఎక్కేలోపు షాపింగ్ చేయాలనుకుంది. తల్లిదండ్రులకు ఏమయినా కొని తీసుకువెళ్ళాలనిపించింది. కానీ, మళ్ళీ అంతలోనే వాయిదా వేసుకుంది. ఆ ఖర్చూ నాన్నకే పడుతుంది కదా- అని మానుకుంది. కనెక్ట్ ఫ్లయిట్ లో తనకి ఐల్ సీటు వచ్చింది. కూర్చుని సమయం చూసుకుంది. తెల్లవారు ఝాము నాలుగున్నర గంటలు. ఇంకా చీకటి విడిపోలేదు.
’పాపా! పక్కసీట్లోకి వెళ్తావా?’
పెద్ద గొంతు. పెద్దాయన గొంతు. ఎత్తుగా, ధృఢంగా వున్నాడు. కింది నుంచి పైకి చూసింది. చెక్కిన కఠిన శిలలా వుంది ముఖం. ఆయాస పడుతూ, బరువయిన రెండు నల్లని బ్రీఫ్ కేసుల్ని బలవంతాన కేబిన్లో పట్టిస్తున్నాడు. అప్పుడు సంకోచ వ్యాకోచాలు చెందిన ముక్కు రంధ్రాలు అతడి వయసును పట్టిచ్చాయి. డెభ్బయికి పైనే వుండవచ్చు.
’నో‘ అనాలనే ఆలోచనే రాలేదు నిఖిలకి. ’విండో‘ సీటుకు జరిగింది. చీకట్లో బయిట చూసేదేముంటుంది? రన్వేను వెలిగించే విద్యుద్దీపాలను తప్ప. అతడూ భారంగా సీట్లో కూలబడ్డాడు. అతనే కాదు ఫ్లయిట్లో అందరూ చక్కబడ్డారు. క్షణాల్లో ఎయర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయ్యింది.
’అమెరికా చదువా?‘
’అవునంకుల్. మీరూ..?‘
’అబుదబీ ఉద్యోగం.‘
పొడిగా మొదలయింది సంభాషణ. ఈలోగా గొంతు తడిచేసుకునే అవకాశం అతనికొచ్చింది.
’ఎక్స్యూజ్ మీ సర్. మే ఐ సర్వ్ యూ ఎ డ్రింక్?‘ ఎయిర్ హోస్టెస్ వేగవేగంగా మాట్లాడింది.
’విస్కీ?‘ అని ఆశగా అడిగిన అతను, పక్కనున్న నిఖిల ముఖం చూసి, ’నో‘ అనేసి, మంచినీళ్ళను ఎత్తిపోసుకున్నాడు.
’సెలవు మీద వస్తున్నావా? ఎన్నిరోజులుంటావ్ పాపా?‘
పాపా అని పిలిపించుకోవటం ఎందుకనో నిఖిలకు నచ్చలేదు. ’నాపేరు నిఖిల అంకుల్. మూడురోజులుంటాను.‘ అని అంది.
’మూడే రోజులా?‘ అని చిన్నగా నవ్వి, ’నా పేరు సమాధానం‘ అన్నాడు.
ఈ సారి నిఖిల కిసుక్కుమంది. ’ఏమిటీ? సమాధానమా? ప్రశ్న కాదా?‘ అని పైకి అనేసింది కూడా.
ప్రశ్న అంటే ప్రశ్నతోనే వచ్చింది ఎయర్ హోస్టెస్ మళ్ళీ. ’వెజ్ ? ఆర్ నాన్ వెజ్?‘
’వెజ్‘ అని నిఖిల, ’నాన్ వెజ్‘ అని సమాధానమూ, సమాధానాలిచ్చారు.
’సమాధానమా? ఇలా కూడా పెడతారా పేర్లూ..?‘ అని అంది నిఖిల తన ఫుడ్ ప్యాకెట్ ను తాను అందుకుంటూ. అతని దగ్గర సమాధానం లేదు. అతడికి నచ్చని ప్రశ్న వేశానని గ్రహించి, తేరుకుని ’మీరు సెలవు మీదనే వస్తున్నారా? ఎన్నిరోజులు అంకుల్?‘ అని మాట మార్చింది. ’నెలరోజులే నికిలమ్మా!’ అని బదులిచ్చి, తానూ తినటం మొదలుపెట్టాడు సమాధానం.
’లాస్ట్ టైమ్ ఎప్పుడొచ్చారూ?‘
‘రెండేళ్ళయ్యిందమ్మా’
సమాధానమిచ్చిన సమాధానానికి నిఖిలకి కొద్ది సేపు మాట పడిపోయింది.
‘మీదేవూరంకుల్?’
‘మామిడి పేట.‘
నిఖిలకు నవ్వురాబోయి ఆగిపోయింది. తుమ్మురాబోయి ఆగిపోతే ఎలా వుంటుందీ? ఈ స్థితీ అలాంటిదే.
అనుమానం. కావాలనే తిక్కగా చెబుతున్నడేమోనన్న అనుమానం.
‘మామిడితోట వుంటుంది. మామిడి పేట ఎక్కడ వుంటుంది?‘
‘ఉంటుంది తల్లీ! రైలు పట్టాలకు ఇటు వైపు మామిడి పల్లి, అటు వైపు మామిడి పేట.‘
‘అంటే మీదీ.. గోదావరి.. ఐ మీన్.. నర్సాపురం కాదు కదా..? మాదీ ఆ వూరే అంకుల్! శివాలయం వీధీ, కోవెల పక్కన, కార్నర్లో వుంటుంది, పాతకాలపు మేడ…‘ ఉత్సాహంలో ఒక్కడోర్ నెంబర్ తప్ప, కొరియర్ సర్వీస్ వాళ్ళకి కావాల్సిన వివరాలన్నీ చెప్పేసింది. సమాధానం ఆనందపడలేదు, కనీసం యాంత్రికంగానయినా ‘ఓహో!’ అని అనలేదు. నిఖిల ముఖం వైపు తేరిపార చూసి వూరుకున్నాడు.
మాటల్లేవ్. మధ్యలో ఎయిర్ క్రాఫ్ట్ కుదువులూ, ’ఎ లిటిల్ టర్బులెన్స్. ఐ రిగ్రెట్ ది ఇన్కన్వీయెన్స్.‘ అన్నపైలట్ వివరణలూ తప్ప.. అంతాపూర్తి నిశ్శబ్దం.
‘నికిలమ్మా! మూడు రోజుల కోసం వచ్చేస్తున్నావ్.. అమ్మానాన్నల మీద బెంగా ?’ నిద్రగొంతుతో ప్రశ్నవేశాడు సీటు వెనక్కి చేరబడి వున్న సమాధానం.
’యస్. అంకుల్. అవును. మీరు బెంగతోనే వస్తున్నట్టున్నారు. పిల్లల మీదా..? సారీ.. మీకు గ్రాండ్ చిల్ల్రన్ కూడా వుండి వుంటారు. వాళ్ళ మీదా..?’
‘కాదు తల్లీ. అమ్మమీద.’ అంటూనే పూర్తి నిద్రలోకి జారుకున్నాడు. కానీ అతడికి తెలియదు, ఆ మాటతో తాను నిఖిలను ఒక్కసారిగా దిగులులోకి తోసేస్తానని.
‘అమ్మ అసలు వుందా?’ మనసు క్రూరజీవి. లేకుంటే ఇంత దయలేని ఊహ చేస్తుందా? ఇండియాను వదిలేటప్పుడు ఎయిర్ పోర్ట్ డిపార్చర్స్ గేట్ దగ్గరకు మూడు సార్లు వెనక్కి వచ్చి, తాను హత్తుకున్న అమ్మగురించే ఈ ఊహ. మూడోసారి వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రం ’ఏడుస్తూ వెళ్ళకూడదే, పిచ్చిమొఖమా?‘ అని కొంగుతో తనముఖాన్ని తుడిచింది. అమ్మే పిచ్చిది. అమ్మ చేతుల్లోకి తన ముఖాన్ని తీసుకుని ఇలా తుడిచిందో లేదో, అలా తడిచింది. ఆ కన్నీళ్ళతనవి కావు అమ్మవి. లోకం మొత్తం మీద, ఏడవవద్దంటూ ఏడ్చేది ఒక్క అమ్మే కావచ్చు.
బయిల్దేరే ముందు చేసిన వీడియో కాల్లోకి అమ్మ రాలేదు. ఎందుకంటే కిచెన్లో వుందన్నారు నాన్న. అంతేకాదు, తనకి ఫ్లయిట్ టికెట్లు బుక్ చేసిన రోజునుంచే, నాన్న ఒక్కరే ఫోన్లో మాట్లాడుతున్నారు. అమ్మ ప్రస్తావన చేస్తున్నారు కానీ, అమ్మచేత మాట్లాడించటం లేదు. అంటే..అమ్మకు ఈ రెండు మూడు రోజుల్లో ఏదన్నాఅయ్యిందా? అందుకే తనను రప్పించుకుంటున్నారా?
పేద్ద కుదుపు. పేద్ద టర్బులెన్స్. ముందు ఫ్లయిట్ కే అనుకుంది నిఖిల. కానీ పక్కన వున్న సమాధానం తొణక లేదు, బెణకలేదు. మంద్రస్థాయిలో గుర్రుపెడుతూనే వున్నాడు. అప్పుడర్థమయ్యింది అది కుదుపు కాదూ, తనకు మాత్రమే వచ్చిన వణకూ అని.
‘అమ్మ అసలు వుందా?’ మనసు క్రూరజీవి. లేకుంటే ఇంత దయలేని ఊహ చేస్తుందా? ఇండియాను వదిలేటప్పుడు ఎయిర్ పోర్ట్ డిపార్చర్స్ గేట్ దగ్గరకు మూడు సార్లు వెనక్కి వచ్చి, తాను హత్తుకున్న అమ్మగురించే ఈ ఊహ. మూడోసారి వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రం ’ఏడుస్తూ వెళ్ళకూడదే, పిచ్చిమొఖమా?‘ అని కొంగుతో తనముఖాన్ని తుడిచింది. అమ్మే పిచ్చిది. అమ్మ చేతుల్లోకి తన ముఖాన్ని తీసుకుని ఇలా తుడిచిందో లేదో, అలా తడిచింది. ఆ కన్నీళ్ళతనవి కావు అమ్మవి. లోకం మొత్తం మీద, ఏడవవద్దంటూ ఏడ్చేది ఒక్క అమ్మే కావచ్చు.
ఏం కాకూడదు. అమ్మకేం కాకూడదు.
కాల్ చేసేద్దామని మైబైల్ తీసింది. ఫ్లయిట్ మోడ్! ఉలకదు. పలకదు. మొబైలే కాదు. పక్కనున్న సమాధానం కూడా అంతే. స్లీప్ మోడ్. ఉలకడు, పలకడు. విమానం హైదరాబాద్ లో లాండ్ అయ్యేవరకూ కాల్ చెయ్యటానికి లేదు. ఏడ్చిఏడ్చి ఊరుకుంది. మనసు అంతే. సాదుజీవిలా మారిపోయింది. ఇంకేం చేస్తుందీ? అమ్మకేం కాదులే అని నమ్మబలికేసింది. అలే పట్టిన కునుకు నుంచి, ఫ్లయిట్ ల్యాండింగ్ కుదుపుతో మెలకువ వచ్చింది.
’పాపా! ఈ ఎర్రఎయిర్ బ్యాగ్ నీదే కదా?’ నిలువెత్తు సమాధానం వేసిన ప్రశ్న. అప్పటికే లేచి ఫ్రెష్ అప్ అయిపోయినట్టున్నాడు. అవునన్నట్టు తలూపి, ఆయనతో పాటే ఎయర్ క్రాఫ్ట బయిటకొచ్చింది. అప్పడు తెలిసింది. అది ఉదయమూ కాదు, మధ్యాహ్నం కాదూ అని. ఎయిర్ పోర్ట్ లో చెక్డ్ లగేజ్ కూడా బెల్ట్ మీదనుంచి తీసేసుకున్నాక, నిఖిల కూడా ఫ్రెష్ అప్ అయ్యింది. ఎయిర్ పోర్ట్ వెలుపల ఫుడ్ లాంజ్ లో ’బ్రంచ్‘ చెయ్యాలనుకున్నారు. నిఖిల కూర్చుంది. సమాధానం ట్రే తీసుకుని వస్తున్నాడు. అప్పుడు కానీ గమనించలేదు ఆయన నడకలో తేడా వుందని. కుడి కాలు తేల్చివేస్తున్నాడు. దాంతో ట్రే లోని బర్గర్లు బుధ్ధిగానే కూర్చున్నా, కోక్ టిన్స్ మాత్రం డాన్సు కొడుతున్నాయి.
’సారీ అంకుల్, అన్నీ మీ చేతే మోయిస్తున్నాను.‘ అని అనేసి, ’మీ కాలికి ఏమయిందంకుల్?‘ అంటూ ట్రే అందుకుంది నిఖిల.
‘కాలికి కాదు. బుర్రకయ్యింది’ సమధానం ఇచ్చిన సమాధానం. ఈ ప్రయాణం పుణ్యమా అని ఈ సమాధానాలకు నిఖిల కూడా అలవాటు పడింది. మరీ దెబ్బలు ఎక్కువ తిన్నవాళ్ళతో ఇదే సమస్య. వాళ్ళ అనుభవాలు అనుభవాల్లా వుండవు. పొడుపు కథల్లాగానో, ఎత్తిపొడుపు కథల్లాగానో వుంటాయి.
‘యాక్సిడెంటా?’ అని నిఖిల అడిగితే, ’కాదు కానీ, అలాంటిదే. ’అబుదబీలోనే డ్రైవరు గా వుండేవాడిని. ఇప్పడు పనిచేస్తున్న షేక్ దగ్గరే. హైవే మధ్యలో కారు ఆపమన్నాడు షేకు. బ్రేకు తొక్కుతున్నాను. కానీ వెహికిల్ ఆగటం లేదు. వెనక సీట్లో షేకు ఒకటే అరుపులు.‘
’బ్రేకు ఫెయిలయిందా?‘
’ఫెయిలయ్యింది బ్రేకు కాదు. నా కాలు.’
’ఇందాక బుర్ర అన్నారూ..?’
’అదే చెబుతున్నా తల్లీ! బ్రేకు మీద అడుగు వేసినా వెయ్యనట్టే వుంది. ఎందుకనుకున్నావ్? బ్రెయన్ లో ఫ్యూజు కొట్టేసింది. తర్వాత డాక్టర్ చెప్పాడు స్ట్రోక్ అని. ఇంజనాపి ఏదో మేనేజ్ చేశాననుకో. షేకు మాత్రం కుంటి గుర్రాన్ని ఏం చేసుకుంటాడూ..? స్టోర్స్ లో సేల్స్ కౌంటర్ దగ్గర కూర్చోబెట్టాడు.’
’దయగల వాడే!?‘ అంది నిఖిల.
’కాదు. తెలివిగలవాడు. నా మీద నమ్మకం. షేకు దృష్టిలో నమ్మకమే అమ్మకం. ఒక్క దీనార్ జారిపోదు నేను కౌంటర్లో వుంటే.’ వివరించాడు సమాధానం.
ఆపరేసన్కు మత్తెందికిత్తారో అప్పుడే తెలిసిందిరా సంటోడా- అని మా నాయన చాలా సార్లు చెప్పేవాడు. తను కడుతున్న ఇంట్లోనే ఫుల్ గా తాగి పడుకున్నాడు. మధ్యలో మెలకువొచ్చేసరికి, ఎడమ కాలు కనపడట్లేదు. ఏంట్రా.. అని వెతుక్కున్నాడు. అప్పటికే అది కొండచిలువ నోట్లో వుంది. మా నాయన నడుముకి ఎప్పుడూ కత్తి వుండేది. దాని నోటి నుంచి నడుము వరకూ.. బ్యాగు జిప్పుతీస్తామే.. అలా కోసి, తన కాలు తను తీసుకున్నాడు. అప్పటికే అది చప్పరించాల్సినంత చప్పరించేసింది.
‘అంకుల్! మీరు గల్ఫ్ వెళ్ళక ముందు ఏం చేసేవారు? ఏం చదువుకున్నారు?’ ఊహించని సమాధానాలు ఆసక్తిగా వున్నాయో యేమో, రెండు ప్రశ్నల్నీ జమిలిగా వేసేసింది నిఖిల.
‘తుపాకులు తుడిచేవాడిని. అందుకు పదికూడా చదవక్కర్లేదు. అయినా చదివేశాను.’ సమాధానమిచ్చిన ఈ లఘుసమాధానాలకు ఆమె తుపుక్కున నవ్వింది. కిసుక్కున నవ్వటం చేతకాక కాదు. కోక్ గుటకవేస్తున్నప్పడే నిఖిలకు నవ్వొచ్చింది.
’సిపాయి.. సిపాయి అంటారు కానీ, అతడు ఎప్పడూ తుపాకిని తుడుస్తునే వుంటాడు. ఎప్పుడోకాని పేల్చడు. యుధ్ధాలు ఊరికే రావు కదా. వస్తేకనక. ముందు పోయేది అతడే. నేనూ అంతే. తక్కువ యుధ్ధాలతో రిటయరయ్యాను.‘ తర్వాత ప్రశ్ననిఖిల అడక్కపోయినా చెప్పుకుపోతున్నాడు సమాధానం.
’అయితే మీరు ఆర్మీలో చేరింది ఇష్టంతో కదా?‘ నిఖిల అడక్కుండా వుంటుందా? అడిగేసింది.
‘కాదు. కష్టంతో. నాన్న పొలం దున్నుతూ పోయాడు. ఆయనా నాలాగే అవిటివాడు. నాకు కుడికాలయితే. ఆయనకు ఎడమకాలు. అవిటి తనం ఎలా వచ్చిందంటే..?‘
’ఆయన కూడా గల్ఫ్ వెళ్ళాడా?’ చెప్పేవరకూ ఆగలేక, మధ్యలో అడిగేసింది.
‘బాగా ఊహించావు. అప్పుడూ రంగూనే గల్ప్.‘
’కాలెందుకు దెబ్బతిందీ? ఏం పనిచేసేవాడూ?‘
’ఇటుకలు!’
’చేసేవాడా?‘
‘కాదు. మోసేవాడు. తర్వాత పేర్చటం నేర్చాడు. ఇళ్ళుకట్టటం వచ్చేసింది. అప్పుడే జరిగింది.‘
‘ఏమిటీ యాక్సిడెంటా?‘
‘కాదు. ఆపరేషన్. ఆపరేసన్కు మత్తెందికిత్తారో అప్పుడే తెలిసిందిరా సంటోడా- అని మా నాయన చాలా సార్లు చెప్పేవాడు. తను కడుతున్న ఇంట్లోనే ఫుల్ గా తాగి పడుకున్నాడు. మధ్యలో మెలకువొచ్చేసరికి, ఎడమ కాలు కనపడట్లేదు. ఏంట్రా.. అని వెతుక్కున్నాడు. అప్పటికే అది కొండచిలువ నోట్లో వుంది. మా నాయన నడుముకి ఎప్పుడూ కత్తి వుండేది. దాని నోటి నుంచి నడుము వరకూ.. బ్యాగు జిప్పుతీస్తామే.. అలా కోసి, తన కాలు తను తీసుకున్నాడు. అప్పటికే అది చప్పరించాల్సినంత చప్పరించేసింది. అంతే. ఆ తర్వాత ఆ కాలుని ఎప్పటికీ ముడవలేక పోయాడు. కాలు ముడవలేనోడు ఇళ్ళేం కడతాడని.. ఏకంగా ఇంటికే పంపించేశారు. ఇండియా వచ్చేశాక వ్యవసాయం మొదలెట్టాడు. ఆయన పిచ్చిగానీ. కాలు ముడవలేనోడు పొలం ఎలా దున్నుతాడు? కాడి లాగే దున్నకు కూడా లోకువయ్యాడు. దమ్ము చేస్తూ బురదలో పడిపోతే, దున్నలుతొక్కేశాయి. ఆయన పోయాక, నేనెక్కడికి పోవాలి? అందుకే ఆర్మీకి పోయాను. పాపం అమ్మ! నాయన పోయినప్పడు కూడా అంత ఏడుపు రాలేదు. రైల్వేస్టేషన్ పక్కనే కదా మా ఇల్లూ..? ఆర్మీలో సెలక్టయ్యాక, సర్టిఫికెట్ల కోసం మా వూరొచ్చాను. చెప్పా చెయ్యకుండా వూరు వదలి అప్పటికి పది రోజులయ్యింది. రెలు పట్టాలకు ఆమడ దూరంలో చింత చెట్టు వుంది. అక్కడే అమ్మ కూర్చుండి పోయింది, ’నా కొడుకు తిరిగొస్తాడూ‘ అని. నేను రైలు దిగాక దూరం నుంచి అమ్మను చూశాను. కానీ కనపడకుండా దాక్కొంటూ, వూళ్ళోని టేలర్ హైస్కూలుకు వెళ్ళి, సర్టిఫికెట్లు తెచ్చుకని, సాయంత్రం బండి ఎక్కుదామని స్టేషన్ కు వచ్చాను. అమ్మ అలాగే కూర్చుని వుంది. అప్పుడు మాత్రం నాకు ఏడుపాగలేదు. అయినా ఊపిరి బిగబట్టినట్టు, ఏడుపును అదిమి పట్టాను. ఈలోగా పేద్ద భూతంలా వచ్చింది రైలింజను. స్టీం ఇంజన్లు కదా, పెద్ద పెద్ద కూతలు పెట్టేవి. వాటి చప్పుడులో కలుస్తుంది కదా- అని బావురుమన్నాను.‘
ఇంకా చెప్పుకుపోయావాడే కానీ, వింటున్న నిఖిల ముఖంలో ఆందోళన కనిపించి మధ్యలో ఆగి ’ఏమిటి అన్నట్లు‘ ఆమె వైపు చూశాడు.
‘మమ్మీ. మమ్మీతో మాట్లాడాలి. వీడియో కాల్ చేసిన ప్రతీ సారీ డాడీయే మాట్లాడుతున్నారు. మమ్మీకేమయ్యిందో.. మూడు లక్షలు ఖర్చుపెట్టి మరీ నన్ను రప్పిస్తున్నారు. పైకి బెంగ అంటున్నారు కానీ, నా కెందుకో సందేహంగా వుంది. అమ్మకు…ఛఛ..! అలా జరగదు. జరక్కూడదు. ఒక్కనిమిషం అంకుల్!‘ కళ్ళుతుడుచుకుంటూ మొబైల్ చెవిదగ్గర పెట్టుకుని కాస్త దూరం వెళ్ళింది.
సమాధానానికి నిఖిల మాట్లాడుతున్న దృశ్యం కనిపిస్తుంది కానీ, మాటలు వినిపించటంలేదు. కొద్దిసేపటికి తేరుకున్నట్లు ఆమె కదలికలను బట్టి సమాధానం పోల్చుకున్నాడు. అంతలోనే ఆమె కాస్త వంగి మరీ నవ్వింది. అలా నవ్వుకుంటూనే సమాధానం కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చింది.
’ఇంతా చేసి.. మౌనవ్రతం అంట అంకుల్. నేను క్షేమంగా రావాలని ఈ వ్రతం చేస్తుందట మమ్మీ. డాడీ కసలే సైగలు అర్థం కావు. కానీ మమ్మీ ఆయన్ని వాటితోనే వేధిస్తోంది. నేను ఇంటికి వెళ్ళాక కానీ మాట్లాడదట.’ నిఖిల చెప్పుతూ నవ్వింది; నవ్వుతూ చెప్పింది. సమాధానం మాత్రం నవ్వలేదు. పైపెచ్చు తన డాడీ మాటల్ని శంకించినట్లు ముఖం పెట్టాడు.
ఇక ఆ తర్వాత హైదరాబాద్ సిటీకి ఎవరికి వాళ్ళు వెళ్ళి, ఎవరి షాపింగులు వారు చేసుకుని, ముందుగా అనుకున్నట్లుగా, రాత్రి అయ్యేసరి సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకుని, టీటీఈని మంచి చేసుకుని, ఒకే ’సెకండ్ ఏసీ బోగీలో‘ సీట్లు వచ్చేలా చూసుకున్నారు.
సమాధానం వుందని తెలిస్తేనే ప్రశ్న పుట్టుకొస్తుంది. లేకుంటే అది ప్రశ్న ఎందుకవుతుందీ? మహా అయితే ’చిలుక ప్రశ్న’ అవుతుందిద. అంతే. సమాధానం ఎదురుగా వున్నాడేమో, నిఖిల మళ్ళీ ప్రశ్నలు కురిపించింది.
’మీ అమ్మ చింత చెట్టు నుంచి తర్వాతయినా వెళ్ళారా?’
’నీకు తెలుసా? ఆమెకు చింత చెట్టే నివాసం. వండుకు తిని పడుకోవటానికే ఇల్లు. తెల్లవారిందో చింత చెట్టుకిందకే వస్తుంది. పొద్దున్నే తొమ్మది గంటలకు దిగిన చిట్టచివరి పాసింజరు కనుమరుగయ్యే వరకూ అక్కడే కూర్చుంటుంది. ఇది ఇప్పటి విషయం కాదు. ఆమె మా నాయన్ని కట్టుకున్నప్పటి నుంచీ అంతే. ఆమెకు కావలసిన వాళ్ళెప్పుడూ దేశాల పట్టే తిరుగుతుంటారు. నాయన రంగూన్ వెళ్ళిపోయాడు. నేనన్నా దేశంలో వుంటాననుకుంది. నేను సైన్యంలో చేరి సరిహద్దు వరకూ వెళ్ళిపోయాను. నాకు పెళ్ళాయ్యాక సెలవు మీద వచ్చిన నెల్లాళ్ళే నా భార్యతో కాపురం. అలా పుట్టిన నా కొడుకులిద్దరంటే కూడా నా తల్లికి ప్రాణం. మనుమలయినా ఇంటిపట్టున వుంటారంటే.. వాళ్ళూ అంతే. ఒకడు కువైట్ కూ. ఇంకొకడు కతార్ కీ.’
’ఎందుకలా?‘ అడిగేసింది నిఖిల.
’ఎందుకేమిటి? ఊరవతల వాళ్ళం కదా? ఊళ్ళో మాకు పనులుండవు. దేశాలు దాటాల్సిందే. దిక్కులు దాటాక మాత్రం ఏం పనులుంటాయి? అన్నీ దిక్కుమాలిన పనులే. మగాళ్ళయితే కూలీలూ, డ్రైవర్లూ. ఆడాళ్ళయితే పనిమనుషులూ, ఆయాలు.’ సమాధానం ఈ సమాధానం ఇస్తున్నప్పుడు మాత్రం గొంతు జీరబోయింది.
రైలు కుదుపు ఊయల ఊపుగా మారిందేమో, కంటి మీదకు కునుకు వాలింది ఇద్దరికీ. ఎదురు బదురు లోయర్ బెర్త్ ల మీద ఎవరి బెడ్ రోల్స్ వారు పరుచుకని, లైట్స్ ఆఫ్ చేసుకుని పడుకున్నారు.
’అంకుల్! మీకు తెలుసా? ఇంటికి వెళ్ళితే, ఇప్పటికీ మంచం మీద అమ్మా, నాన్న మధ్యలో పడుకుంటాను. నిద్రలో ఎవరి మీదయినా నేను కాలు వెయ్యవచ్చు. ఛాయిస్ ఈజ్ మైన్..! మీ పిల్లలూ అంతేనా? ’ అంది నిఖిల నిద్రలోకి జోగుతునే.
’లేదు తల్లీ! నా పిల్లల్నే కాదు. నా మనవల్ని కూడా పక్కలో వేసుకోను. బెంగ పడతారు. చూసిన బెంగ కన్నా, తాకిన బెంగ పెద్దది. మిలట్రీ నుంచి సెలవుకొచ్చినప్పడు నా పెద్దకొడుకు నా పక్క వదిలేవాడు కాదు. నేను వెళ్ళిపోయిన నెలవరకూ నిద్రలో లేచి తలుపు తీసుకుని వచ్చేవాడట. అంతే కాదు. ’ నాన్నా, ఒంటేలు ఎంతసేపు పోసుకుంటావ్. బేగే రా.’ అని అరుస్తూనే వుండేవాడట. అందుకే వున్నది కొన్నిరోజులయినా ఎవర్నీ దగ్గరికి తీసుకోను. ఒకప్పడు మమ్మల్ని ఊళ్ళోవాళ్ళెవరూ తాకేవారు కాదు. ఇప్పడు మా కడుపున పుట్టిన వాళ్ళనే మేం తాకటానికి లేదు. వాళ్ళది అసహ్యం. మాది భయం. ’ ఈ మాటలు చెబుతున్నప్పడు సమాధానానికి రెప్పల మీదకు వచ్చిన నిద్ర కూడా రెక్కలు కట్టుకుని ఎగరిపోయింది కాబోలు.
’పొద్దున్నే మీ అమ్మగారిని చింత చెట్టు కింద చూడవచ్చా అంకుల్ ?‘ దాదాపు పూర్తిగా నిద్రలోకి జారుకుంటూ అడిగింది.
నర్సాపురం స్టేషన్ ఎప్పడొచ్చిందో తెలీదు. అందరూ దిగుతున్నారు. సమాధానం ఫ్లయిట్లో ఎలా నోరుతెరచి గుర్రు పట్టాడో, అలాగే పడుతున్నాడు.
’అంకుల్ లేవండి. చింతచెట్టు…సారీ నర్సాపురం వచ్చేసింది.’ అంటు అతని భుజాన్ని తాక బోయి ఆగిపోయింది నిఖిల. అంతలోనే లేచి, వేగం వేగంగా టాయలెట్ కు వెళ్ళివచ్చి, సామాను దించటానికి ప్రయత్నించే లోగా మామిడి పేట వాళ్ళు వచ్చేశారు. ’బాయ్యా‘ అని ఒకళ్ళూ, ’మాయ్యా‘ అని మరొకళ్ళూ, ’తాతియ్యా‘ ఇంకొకళ్ళూ వచ్చి, ’మాకేంతెచ్చావ్‘ అంటూ బ్యాగేజి అంతా దించేస్తుంటే, నిఖిల ముచ్చటగా చూసింది. తెలియకుండా వాళ్ళనే వెంబడించింది. పట్టాలు దాటింది. ’జాగ్రత్త తల్లీ!’ అని సమాధానం వెనక నుంచి అంటూ, ’అదుగో చూడూ, అదే చింత చెట్టు.’ అని ఆమెకు వేలెత్తి చూపించాడు.
ఆశ్చర్యం! చెట్టుకింద ముసలి అవ్వ! తెల్లని చీర కట్టుకుని తెల్లని కుర్చీలో కూర్చుని వుంది. అంతే తెల్లని ముగ్గుబుట్టలాంటి జుట్టు. చిత్రం! నిలబడటానికి వాడే ఊత కర్రను, కూర్చుని కూడా పట్టుకునే వుంది. ఎందుకో ఆక్షణంలో సమాధానం ముఖం చూడాలని అనిపించింది నిఖిలకు. ఎందుకంటే, ఇప్పడు వెయ్యటానికి నిఖిల దగ్గర ప్రశ్న ఏమీలేదు. అతడి ముఖం మీద పొద్దుపొడుపు ఎండపడింది. ఆనందం కోసం వెతుకులాడింది నిఖిల. ఎప్పుడో చెక్కేసిన శిల్పానికి కొత్తగా అనుభూతులెక్కడనుంచి వస్తాయి? ఎప్పటిలాగే వుంది సమాధానం ముఖం. చింత చెట్టు దగ్గరకు వచ్చాక, మెట్లలా వేసిన రాళ్ళను ఎక్కి, చింత చెట్టున్న గట్టు ఎక్కింది నిఖిల.
అవాక్కయ్యింది. ఆ తెల్లని ఆకారం అమ్మ కాదు. ఉత్త బొమ్మ. సిమెంటుతో చేయించి, తెల్లరంగు వేసిన బొమ్మ. నిజానికి నిఖిలకు ఇప్పుడు కదా ప్రశ్న పుట్టుకు రావల్సిందీ? కానీ మాటలతో ఆమె ప్రశ్నను నిర్మించ లేకపోతోంది. సమాధానమన్నది వేసిన ప్రశ్నకే కాదు, వెయ్యాలనుకున్న ప్రశ్నకూ వుంటుంది:
’ మా అమ్మది కూడా మౌనవ్రతమే. పాతికేళ్ళనుంచి చేస్తుంది.‘ అని మధ్యలో ఆగిన సమాధానం, బొమ్మ చేతిలోని ఊత కర్రపట్టుకుని జారుతూ చతికలబడ్డాడు. ఆ కర్రను నెమరుతూ బొమ్మ ముఖాన్ని చూస్తూ, ’అమ్మ చావుకి రాలేక పోయాను. అబుదబీ నుంచి రావటమంటే ఖర్చు కదా! ఆ డబ్బుతో మా కుటుంబం ఆర్నెల్లు బతికేస్తుంది. తర్వాత ఏడాదికి షేకు నన్ను ఇండియాకు వదిలాడు. అప్పుడే అమ్మ బొమ్మ ఇలా చెయించాను. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అమ్మలు ఎదురు వస్తే మంచి జరుగుతుందంటారు కదా? నాకు అలా కాదు. నేను ఎక్కడనుంచి వచ్చినా అమ్మ ఎదురు చూడాలి. అందుకే ఇలా.’ అని బొమ్మ కాళ్ళ మీద కు ఒరిగాడు సమాధానం.
’నిఖీ!’
అమ్మ మాట్లాడింది. నిఖిల తల్లి మాట్లాడింది. మౌనవ్రతం వీడింది. రైలు పట్టాల అవతల నుంచి ఆమె కేకలు. ఎవరి బతుకులు వారికున్నప్పడు, ఎవరి బెంగలు వారికుండవా?
(ఆదివారం ఆంధ్రజ్యోతి 8 డిశంబరు 2024 సంచికలో ప్రచురితం )
సతీష్ చందర్