Category: ‘భయో’డేటా

‘వంక’ల నాయుడు!

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘ప్రత్యేక హోదా’ (నాకు కాదు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి) ఎన్డీయే సర్కారు అధికారంలోకి రానప్పుడు, యూపీయే అధికారంలో వున్నప్పుడు దరఖాస్తు చేశాను. ఇప్పుడు ఎన్డీయే సర్కారు అధికారంలో వుంది. ‘ఇచ్చే హోదా’ లో వున్నాను, కానీ ‘రూల్సు’ అడ్డు వస్తున్నాయి.

వయసు : ‘పెద్ద’ వాణ్ణే. ఎప్పడూ ‘పెద్దల సభ’ నుంచే వచ్చే వాణ్ణి కదా! కానీ అయనా ఏం లాభం? ‘హౌస్‌’ ను ..ఐ మీన్‌ … సభను చక్కదిద్ద లేక పోతున్నాను. పైపెచ్చు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని కదా!

ముద్దు పేర్లు : ‘వంక’ల నాయుడు ( నేనేం నిజం చెప్పినా ప్రతిపక్షాల వారికి ‘వంక’ చెబుతున్నట్టుంది. ప్రత్యేక హోదా ఇవ్వటానికి ‘ఆర్డినెన్స్‌’ సరికాదు… అందుకు పార్లమెంటు సమ్మతి కావాలంటే వినరే!)

క్యాంపస్‌ టెర్రరిస్ట్‌!

పేరు : సీనియర్‌ విద్యార్థి

దరఖాస్తు చేయు ఉద్యోగం: కింగ్‌ ఆఫ్‌ ర్యాగింగ్‌ ( జూనియర్‌ కి ‘ర్యాంకింగ్‌’ ఎంత ముఖ్యమో, సీనియర్‌ కు ‘ర్యాగింగ్‌’ అంత ముఖ్యం. ర్యాంకింగ్‌ లేక పోతే సీటు రాదు. ‘ర్యాగింగ్‌’ లేక పోతే ‘రాటు’ దేలరు. ఇది మా సిధ్ధాంతం.)

వయసు : సీనియర్‌ అంటే సీనియర్‌. మరీ పెద్ద వయసుండాలా? ఎల్‌కేజీ వాడికి యూకేజీ వాడు సీనియర్‌, పాకే వాడికి, డేకే వాడు సీనియర్‌. ఫస్టియర్‌ ఇంజనీరింగ్‌ వాడికి సెకండ్‌ ఇయర్‌ సీనియర్‌ సీనియర్‌. చాయ్‌ తాగేవాడికి, బీరు తాగే వాడు సీనియర్‌.

‘సూటేంద్ర’ మోడీ!

పేరు : నరేంద్ర మోడీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘విదేశాంగ’ ప్రధాన మంత్రి ( ఇంతవరకూ విదేశాంగ శాఖ కు ఒక మంత్రి బాధ్యత వహించేవారు. నేను వచ్చాక, ఇందుకు మంత్రి మాత్రమే సరిపోరనీ, ఆ శాఖను నిర్వహించటానికి ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి వుండాలనీ నిర్ణయించాను. ఇందుకు విదేశాంగ మంత్రిగా వున్న, సోదరి సుష్మా స్వరాజ్‌ నొచ్చుకోకూడదు.)

వయసు : వయసుకీ ముచ్చటకీ సంబంధంలేదు. ఇరవయ్యవ పడిలో వేసిన దుస్తులే పదేపదే వేసేవాణ్ణి. ఈ అరవయ్యే పడిలో చూడండి గంటకో డ్రెస్‌తో మారుస్తున్నాను. ఈ డ్రెస్‌తో విమానం ఎక్కితే, అడ్రస్‌తో దిగాలని రూలు లేదు కదా?

కాంగ్రెస్‌ ‘మానియా’!

పేరు : సోనియా గాంధీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఉత్తమ మాతృమూర్తి (పిల్లల్ని ప్రయోజకుల్ని చేసిన తల్లిని ఈ దేశంలో ఇలా పిలుస్తారని తెలుసుకున్నాను. ఎంత సమయం పట్టినా సరే రాహుల్‌ గాంధీని ప్రయోజకుణ్ణి చేసి తీరతాను.)

వయసు : భారత స్వాతంత్య్రానికున్న వయసు కన్నా, నా వయసు తొమ్మిది నెలలు ఎక్కువ. అంతే.

ముద్దు పేర్లు : సో ‘నియంత’! ( నేను పార్టీలో ఎంత ప్రజాస్వామికంగా వున్నా- నియంత లా వున్నావు, నియంత లా వున్నావు- అని అంటే నాకు విసుకొచ్చి ‘సో.. నియంత నే!.. అయితే ఏమిటి?’ అని అనాలని కూడా అనిపిస్తుంది. కానీ నేను నిజంగానే ప్రజాస్వామ్యవాదిని కదా, అందుకనే అలా అనలేదు.),

సన్నాఫ్‌ ‘చంద్ర’ మూర్తి!

పేరు : నారా లోకేష్‌ బాబు

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సన్‌ రైజర్స్‌’ టీమ్‌ కెప్టెన్‌.( క్రికెట్‌ గురించి కాదు, నేను పాలిటిక్స్‌ గురించే మాట్లాడుతున్నాను. ‘సన్‌ రైజర్స్‌’ అంటే ‘పొడుచు కొస్తున్న సూర్యులు’ కాదు, ‘తోసుకొస్తున్న కొడుకులు’. కావాలంటే ఈ టీమ్‌లో ‘కేటీఆర్‌’ కూడా చేరవచ్చు.)

వయసు :’ఎగిరే’ వయసే! అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ‘ఎగురుతున్నా’నని అపార్థం చేసుకునేరు…! అంటే ‘ఫ్లయ్‌’ చేసే ఈడొచ్చిందని. కాబట్టే… దేశదేశాల్లో ఫ్లయ్‌ చేస్తున్నాను.

‘దురద్‌’ యాదవ్‌!

పేరు : శరద్‌ యాదవ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: స్త్రీ పక్షపాతి.( ఎందుకంటే, నేను స్త్రీలమీద చేసిన వ్యాఖ్యల్ని అపార్థం చేసుకుంటున్నారు. దక్షిణాది స్త్రీలు నల్లగా వున్నా, అందంగా వుంటారనీ, వారి దేహాలు ఎంత అందంగా వుంటాయో వారి అంతరంగాలు కూడా అంతే అందంగా వుంటాయనీ అన్నాను… తప్పా..?)

‘యమ్‌’ పాల్‌!

పేరు : సంత్‌ రామ్‌పాల్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం:’యమ్‌’పాల్‌ ( నా ఆశ్రమంలో కొస్తే మృత్యువును చూస్తారు.)

ముద్దు పేర్లు :’దేరా’ బాబా( నేను హర్యానాలో చేపట్టిన ఆధ్యాత్మిక సామాజిక ఉద్యమం లెండి.) కానీ నన్నిప్పుడు ‘డేరా’ పీకించేసి ‘డేరా బాబా’ను చేశారు.

‘విద్యార్హతలు :’ఐటిఐ’లో డిప్లమా. (ఐటిఐ- అంటే ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్సిట్యూట్‌ అనుకుంటున్నారా? అబ్బే. ఇంటిలిజెంట్‌ టోకరా ఇన్సిట్యూట్‌. అందుకే నా ఆశ్రమంలో బోర్డు పెట్టాను. విరాళాలిచ్చే భక్తులు నేరుగా నాకే ఇమ్మంటాను. ఈ విషయంలో ఏ ‘వాల’ంటీర్‌నీ నమ్మను. ‘వాల’మంటేనే తోక- కదా! ఎలా నమ్ముతాను చెప్పండి.)

‘గురివింద్‌’ కేజ్రీవాల్‌!

పేరు : అరవింద్‌ కేజ్రీవాల్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: రెండు నెలల ముఖ్యమంత్రి.( మొదటి సారి ఢిల్లీకి ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు 49 రోజులు చేసి రాజీనామా చేశాను. ఈ సారి 60 రోజులు చేసి రాజీనామా చెయ్యాలన్నది నా కోరిక.)

ముద్దు పేర్లు :”గురివింద్‌’ కేజ్రీవాల్‌ (గురివిందకి అంతా ఎరుపే. ఎక్కడో కొంచెం నలుపు. అందుకే కోబోలు వచ్చిన ఢిల్లీ పీఠాన్ని వదలు కొన్నాను.’కాశీ’ వెళ్ళి ఓటమిని తెచ్చుకున్నాను.) ‘శోక్‌’ పాల్‌. ( లోక్‌ పాల్‌ బిల్లు రానంతవరకూ ‘లోక్‌ పాల్‌ … లోక్‌ పాల్‌’ అంటాను. తీరా వచ్చాక, అది ‘జన లోక్‌ పాల్‌’ కాదే..! అని శోకిస్తాను.)

‘పవర్‌’ లిఫ్టర్‌!

పేరు : కన్నా లక్ష్మీనారాయణ

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఇంకేం ఉద్యోగం? ‘కాషాయం’ కట్టేశాను. ఐమీన్‌ భారతీయ జనతా పార్టీలో చేరిపోయాను. కాంగ్రెస్‌తో నాలుగుదశాబ్దాల అనుబంధానికి గుడ్‌బై కొట్టేశాను.

ముద్దు పేర్లు :’పవర్‌’ లిఫ్టర్‌( విద్యార్థిగా వుండగా ‘వెయిట్‌ లిఫ్టింగ్‌’ చేసేవాణ్ణి. ఆ అనుభవంతోనే రాజకీయాల్లోకి చేరాను. పాలిటిక్స్‌ అంటే ‘పవర్‌ లిఫ్టింగే’ కదా! కాంగ్రెస్‌లో వున్నన్నాళ్ళూ ‘పదవుల్ని ఎత్తుతూనే వున్నాను’ ( నేదురుమిల్లి జనార్థన రెడ్డి, వైయస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌ కేబినెట్లలో మంత్రిగా పనిచేస్తూనే వున్నాను.) కానీ ఈ ఏడాది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జనమే కాంగ్రెస్‌ను ‘లిఫ్ట్‌’ చేసి పడేశారు.

‘దత్త’ పుత్రుడు

పేరు : బండారు దత్తాత్రేయ.

దరఖాస్తు చేయు ఉద్యోగం:ఢిల్లీకి మంత్రి నయినా, గల్లీకి నేతగానే వుండాలి. శాశ్వతగల్లీనేతే నేను కోరుకునే ఉద్యోగం.

ముద్దు పేర్లు :’దత్తన్న’, ‘దత్త’పుత్రుడు.(కేంద్ర కేబినెట్లో, ఆంధ్రప్రదేశ్‌ కు ప్రాధాన్యం వుంది కానీ, తెలంగాణకు లేదనే ఉద్దేశ్యంతో, నన్ను దత్త పుత్రుడిగా స్వీకరించారు).

‘విద్యార్హతలు :’ఖాకీ నిక్కరు, తెల్ల చొక్కా’ కన్నా గొప్ప అర్హత ఏదయినా వుందా? ‘ప్రచారక్‌’ అంటే, ‘కాషాయ రాజకీయాల్లో’ పీజీ చేసినట్లే. ఒకప్పటి (రాష్ట్రీయ స్వయం) ‘సేవక్‌’ లందరూ, ఇప్పుడు ‘నాయక్‌’లు అయిపోతున్నారు.

‘క్వశ్చన్‌’ రెడ్డి!

పేరు : జి.కిషన్‌ రెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: భావి(2019) తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి.( ప్రధాని అభ్యర్థిని ముందుగా ప్రకటించే ఆనవాయితీ మా పార్టీకి ఎలాగూ వుంది కాబట్టి, తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ముందుగా ప్రకటించవచ్చు. )

ముద్దు పేర్లు : ‘క్వశ్చన్‌’ రెడ్డి( అసెంబ్లీలో నిత్యమూ ప్రతి పక్షంలో వుండటం వల్ల ప్రశ్నించటం అలవాటయి పోయింది. సమాధానాలతో నాకు పని వుండదు అధ్యక్షా! ఇంతకీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చినా, నేను తెలంగాణ అంతా తిరిగినా మా పార్టీ తెలంగాణలో ఎందుకు ఓడిపోయినట్లు అధ్యక్షా?)

‘విద్యార్హతలు : బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ పోస్ట్‌ మార్టెమ్‌ ( కాబట్టే తెలంగాణలో బీజేపీ ఓటమికి గల కారణాలను విశ్లేషించగలిగాను. అఫ్‌ కోర్స్‌ కారకుల్లో నేనూ ఒకణ్ణని కొందరు సభ్యులు తేల్చారు.)

‘మెగా’హీరో- గిగా జీరో!!

పేరు : చిరంజీవి

దరఖాస్తు చేయు ఉద్యోగం: వర్థమాన తెలుగు హీరో( ఎంత మెగా స్టార్‌నయినా మళ్ళీ సినిమా కేరీర్‌ను మొదలు పెడుతున్నాను కదా! మధ్యలో అయిదేళ్ళు ‘కమర్షియల్‌’ సారీ.. ‘పొలిటికల్‌’ బ్రేక్‌ ఇచ్చాను కదా)

ముద్దు పేర్లు : మెగా హీరో (సినిమాల్లో), గిగా జీరో (రాజకీయాల్లో) 2014 ఎన్నికల్లో నేను ప్రచార సారథ్యం వహించినా కాంగ్రెస్‌కు ఒక్క స్థానమూ దక్కలేదు.

‘విద్యార్హతలు : ఏం చదివితే ఏం? వోటర్ల మనసుల్ని చదవటం రాలేదే…! ప్రేక్షకుల మనసులయితే ఒక సినిమాకి కాకపోయినా మరొక సినిమాకయినా అర్థమవుతాయి. ఇక్కడ ఆ అవకాశమే లేదు.

ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌!

పేరు : జానా రెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: ప్రొటెం ముఖ్యమంత్రి ( ఈ పోస్టు ఉండదని నాకూ తెలుసు. కానీ ఉంటే బాగుండునన్నది నా ఆకాంక్ష. ప్రొటెం స్పీకర్‌- అనే పదవి ఉన్నది కాబట్టే కదా, కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినా తెలంగాణ శాసన సభ్యుల చేత ప్రమాణం స్వీకారం చేయించేందుకు ప్రొటెం స్పీకర్‌గా ఎంపికయ్యాను చూశారా?)

ముద్దు పేర్లు : ‘ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌’ (ప్రొటెం స్పీకర్‌ పదవి ఒక్కరోజు తోనే ముగుస్తుంది.)

‘విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఆఫ్‌ మిస్‌అండర్‌స్టాండింగ్‌(మనం ఒకటి మాట్లాడితే, జనానికి ఇంకోలా అర్థమవుతుంది. నేను హోం మంత్రిగా వున్నప్పుడుకూడా నా వ్యాఖ్యానాలు అర్థం కాక పోవటం వల్లనే నక్సలైట్లు నన్ను టార్గెట్‌ చెయ్యలేదు.)

‘కమలం’బాటి పురంధేశ్వరి

పేరు : దగ్గుబాటి పురంధేశ్వరి

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘కాషాయ’ మంత్రి (‘ఖద్దరు’ మంత్రిగా చేసేశాను. ఇక చేయాల్సింది అదే కదా! ‘అన్న’ కూతురుగా అన్ని సార్లూ సెక్యులర్‌ పార్టీలోనే మంత్రి పదవి చేయాలని లేదు.)

ముద్దు పేర్లు :రాజకీయ ‘దురంధేశ్వరి'( బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి, విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి ఎంత సునాయాసంగా రాగలిగానో, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి కూడా అంతే సులువుగా వచ్చాను.) ‘కమలం’ బాటి పురంధేశ్వరి

సుష్మా ‘హిందూ’ రాజ్‌!

పేరు : సుష్మా స్వరాజ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: తొలి మహిళా ఎన్డీయే ప్రధాని అభ్యర్థిని( వెంటనే కాదు లెండి. సార్వత్రిక ఎన్నికలు జరగాలి. అత్యధిక సీట్లు సాధించిన ఏకైక కూటమిగా ఎన్డీయే నిలవాలి. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఇంకా డెభ్యయ్యో, ఎనభయ్యో సీట్లు తక్కువ కావాలి. అప్పుడు ప్రాంతీయ పార్టీలు నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని నిరాకరించాలి. అప్పుడు మహిళ ప్రధాని కావాలి-అని దేశమంతటా ఉద్యమం తేవాలి. అప్పుడు మనకి ఛాన్స్‌ వుంది. అయితే నేను ప్రధాని అయితే, గుండు గీయించుకుంటాను అని ఏ కాంగ్రెస్‌ మహిళా నేతా శపథం మాత్రం చెయ్యకూడదు. ఎందుకంటే, 2004 లో సోనియాని ప్రధానిని చేస్తారని అనుకున్నప్పుడు, నేను అలాంటి శపథమే చేశాను లెండి.)

‘నెలవంక’య్య నాయుడు

పేరు : ఎం.వెంకయ్య నాయుడు

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సీమాంధ్ర చాంపియన్‌-4’ ( మొదటి మూడు స్థానాలు నిండిపోయాయి. జగన్‌, కిరణ్‌, బాబులు వాటిని సాధించారు. అయినా సరే, ప్రయత్నిస్తే ఎప్పుడోకప్పుడు మొదటి స్థానానికి చేరక పోతామా- అన్నది పట్టుదల)

ముద్దు పేర్లు : ‘నెల వంక’య్య నాయుడు.( అవును. నెలవంక అంటే ‘చంద్రుడే’. తెలుగు ‘చంద్రుడే’. బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడెల్లా, చంద్రాబునాయుడుతో మాట్లాడటానికి, వెంకయ్య నాయుడు- అను నాతో పని వుంటుంది కదా)

‘కాంగ్రేజీ’ వాల్‌!

పేరు :కేజ్రీవాల్‌
దరఖాస్తు చేయు ఉద్యోగం: అర్థాంతరపు ముఖ్యమంత్రి

ముద్దు పేర్లు : ‘కాంగ్రేజీ’ వాల్‌ (కాంగ్రెస్‌తో ‘చెయ్యి’ కలిపాను కదా!), ‘ముప్పావు కేజీ’ వాల్‌ (ఇంక్కొక్క పావు కేజీ (ఎనిమిది) సీట్లు వచ్చి వుంటే, నా అంతట నేనే, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవాడిని.

విద్యార్హతలు : మొన్నటి వరకూ ‘ఐఆర్‌ఎస్‌'( ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌), నేటి నుంచి ‘ఐ డబ్ల్యూ ఎస్‌’ (ఇండియన్‌ వాటర్‌ సర్వీస్‌), ప్రతీ ఇంట్లో ‘ఏడు వందల బాల్చీల(లీటర్ల) నీళ్ళు’ పోద్దామనుకుంటున్నాను. (ఇవ్వక పోతే ముఖ్యమంత్రిగా నేనే బాల్చీ తన్నాల్సి వుంటుంది.)

‘పగటి వేషా’ద్‌!

పేరు :శివ ప్రసాద్‌
దరఖాస్తు చేయు ఉద్యోగం: ప్రిన్సిపాల్‌, ‘తెలుగు’ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, ఎన్టీఆర్‌ట్రస్ట్‌, హైదరాబాద్‌
ముద్దు పేర్లు : ‘పగటి’ వేషాద్‌! ( పూటకో వేషం) ‘శైశవ’ ప్రసాద్‌ ( కొందరికి నేను చేసేవి పిల్ల చేష్టల్లా అని పించవచ్చు.)
విద్యార్హతలు : ‘వైద్యో నారాయణో హరీ’ అన్నారని డాక్టర్‌ చదివాను. ఇలా అని అంటే, కొందరేమన్నారో తెలుసా- ‘అన్నా, నీ వైద్యానికి నారాయణుడు కూడా- హరీ- అన్నాడా?’ అంటారు. పది మందిని చంపితేనే కానీ డాక్టరు కాలేడంటారు. కానీ నేను నమ్మను. ఆ మాట కొస్తే, ఒక్క డాక్టరేమిటి? యాక్టర్‌ కూడా అంతే. ఓ వందమందిని చంపితేనే కానీ, ఒక యాక్టరు కాలేడు. నన్ను చూడండి. పార్లమెంటు ముందు నా పగటి వేషం చూసినప్పుడెల్లా చచ్చి ఊరుకుంటున్నారు.

గోడ మీద ‘బొబ్బిలి పులి’!

పేరు : బొత్స సత్యనారాయణ

దరఖాస్తు చేయు ఉద్యోగం: సమైక్యవాద నేత (నేను కూడా సమైక్యవాదినని, సీమాంధ్ర వాసులు ఒప్పుకుంటే అదే పదివేలు. గతంలో నేను రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన విషయాన్ని వారు మరచిపోవటం కోసం, నేను ఏం చెయ్యటానికయినా సిద్ధంగా వున్నాను.)

ముద్దు పేరు :సత్తి బాబు, ‘సమైక్య’ బాబు. గొడ మీద బొబ్బిలి పులి.( ఎటు కావాలంటే అటు దూకుతుంది.)

‘మోడ్వా’నీ

పేరు :లాల్‌ కృష్ణ అద్వానీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: లేదు. పోస్టు భర్తీ చేయబడినది. నా కన్నా చిన్నవాడయిన నరేంద్రమోడీతో ఆ ఖాళీని(బీజేపీ 2014 ఎన్నికల ప్రధాని అభ్యర్థిని) పూరించారు. ఇప్పుడు అద్వానీ అన్నది పేరు కాదు, చరిత్రలో పోస్టుగా కూడా మిగులుతుంది. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్న ఆనందంతో ‘కృష్ణా! రామా!’ అంటూ గడిపేస్తున్నాను.

ముద్దు పేర్లు :‘మోడ్వా’నీ ( మోడీ యే ప్రధాని గా బాగుంటాడని ఒప్పేసుకున్నాను లెండి.)’