బోగీల్లోకి సరుకులు-పట్టాలపైకి బతుకులు!

తలుపు వెయ్యటం సులువే, తీయటమే కష్టం. విమానం టేకాఫ్‌ కావటం తేలికే; లాండ్‌ కావటమే ఇబ్బంది. పద్మవ్యూహంలోకి వెళ్ళటం సులభమే, రావటమే దుర్లభం- తెలివి వుంటే తప్ప. ఇంటికి కాదు, ఏకంగా దేశానికే తాళం వేసిపారేశారు. ఒక తాళం అయితే సరిపోదని ఎక్కడికక్కడ రాష్ట్రాలు ఎగబడి తాళం మీద తాళం ఎగబడి మరీ వేసేశారు. కారణం కోవిద్‌-19. తీస్తారు, తీస్తారు- అనేలోగా ముమ్మారు లాక్‌ డౌన్‌ పొడిగించారు. నాలుగోసారికి సిధ్ధమవుతున్నారు. అదేమంటే- ఈ రోగానికి మందులేదు. అస్వస్థతకు గురయితే అన్ని ఆసుపత్రులు లేవు; ఆసుపత్రులు వున్నా అన్ని పడకల్లేవు; పడకలు వున్నా అంతమంది వైద్య సిబ్బంది లేరు; సిబ్బంది వున్నా వారి ముఖాలకు అన్ని ఎన్‌-95 మాస్కులు లేవు; మాస్కులు వున్నా అన్ని వ్యక్తిగత రక్షణ సామాగ్రి(పిపిఇ)లు లేవు. కాబట్టి 135 కోట్ల ప్రజల ప్రాణ రక్షణకు ఒక్కటే మార్గమని ‘లాక్‌ డౌన్‌’ ను ప్రయోగించారు.
ఎప్పుడో మార్చి నాలుగో వారం ప్రారంభంలో ప్రధాని మోడీ చెప్పారని ‘చప్పట్లు కొట్టి’ ఇళ్ళల్లోకి వెళ్ళారు. అది మొదలు, ఇప్పటి దాకా ఇళ్ళున్నవాళ్ళు గడప దాటితో వొట్టు. ఇలా ఓ 40 రోజులు దాటి పోయాక, ప్రభుత్వాలకు గొప్ప ధర్మ సందేహం వచ్చింది. తత్త్వ వేత్తలకు రావాల్సిన సందేహం. మన అదృష్టం కొద్దీ, మన పాలకులకు వచ్చింది: ప్రజలకు ఏది ముఖ్యం? బతుకా? బతుకు తెరువా? జరుగుబడి వున్నవారికి బతుకు ముఖ్యం; జరుగుబడి లేని వారికి బతుకు తెరువు ముఖ్యం. ఇంత చిన్న సమాధానం ఏలికలకు తెలియక కాదు. ఇదే ప్రశ్న ప్రజలు పాలకులను తిరగేసి అడగవచ్చు. ‘మీకు మార్కెట్‌ ముఖ్యమా? మనుషులు ముఖ్యమా?’ మరీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లాగా ‘మార్కెట్టు’కే డైరెక్టుగా టిక్కు పెట్టక పోయినా, దానిని కొంచెం మార్చి ‘ఆర్థిక వ్యవస్థ’ ముఖ్యం కదా- అని ప్రధాని, ముఖ్యమంత్రులు ఇట్టే చెప్పగలరు. ఎంత దూరం దూరంగా కూర్చున్నా, ఈ విషయం లో వారి మనసులు అంత దగ్గరగా వున్నాయి. దాంతో ‘లాక్‌ డౌన్‌’ కు విరుగుడు కనిపెట్టారు. దాని పేరే ‘సడలింపు’. ఈ సడలింపులు ఆర్థిక వ్యవస్థ కోసమంటారు. కొన్ని షాపులకు మినహాయింపు ఇస్తారు. అవును. నిజంగా ఆర్థిక వ్యవస్థ స్పృహ తప్పి పడివుంది. దీనికి తక్షణం ‘గ్లూకోజ్‌’ ఎక్కించాలి. మందేమిటి? మందే. అవును మందే. అందుకే ‘మందు’ (మద్యం) షాపులు తెరిచేశారు. వాటి మీద 14 నుంచి 100 శాతం వరకూ ఆయా రాష్ట్రాల నేతలు తమ శక్తి మేరకు ‘కోవిద్‌ ’ సుంకాన్ని విధించారు.పడుకున్న మార్కెట్‌ కూర్చుంది. ఇప్పుడు దానిని నిలబెట్టాలి. భవన నిర్మాణపు పనులు వాటికి సంబంధించిన షాపులూ తెరచుకోవచ్చని సెలవిచ్చారు. సిమెంటూ, ఇనుప చువ్వలూ, గ్రానైట్‌ రాళ్ళూ- షాపుల్లో కొంటారు.
మరి కూలీలో..!? కొసేసుకోవచ్చు కదా, షాపుల్లో. దొరికితే అదే పని చేస్తారు. ఈ కూలీల్లో అధిక శాతం ‘వలస కూలీలు’. ఈ కూలీలు ఎక్కడున్నారు? ఇది కాదు ప్రశ్న. ‘ఎక్కడ వుండ నిచ్చారు?’ ఇదీ అసలు ప్రశ్న. ‘కట్టుకున్న వాడు కొట్టి తరిమేస్తే, కన్న వారు తిట్టి తోసేశారు’ అని గృహహింసకు గురయ్యే స్త్రీ చెప్పుకునే సంకట స్థితిలాగా వుంది, వలస కూలీ అవస్థ. పనిచేయించుకున్న రాష్ట్రం వుండనివ్వదు; సొంత రాష్ట్రం రమ్మనదు. రాష్ట్రాల హద్దులు మూత పడ్డాయి. వాహనాలు లేవు. ఎలా బడితే అలా వెళ్తున్నారు. వంద నుంచి రెండు వందల కిలో మీటర్ల దూరం కాలి నడకన వెళ్ళేవారు కొందరు. పోలీసులకు కనపడకుండా, చక్రాల సిమెంటు మిక్స్చర్‌లో దాక్కుని ప్రయాణించే వాళ్ళు కొందరు. ముంబయి నగరంలోనే రెండు సందర్భాల్లో వేల సంఖ్యలో వీధుల్లో కి వచ్చారు. అలా బయిలు దేరి ఔరంగదాబాద్‌లో (8 మే 2020న) రైలు పట్టాల మీద ముక్కలయి పోయారు 16 మంది వలస కూలీలు. అప్పటికే వంద కిలోమీటర్లు నడిచారు. మహారాష్ట్రనుంచి స్వరాష్ట్రమయిన మధ్యప్రదేశ్‌ కు వస్తున్నారు. రాత్రి అలసి పోయి, రైలు పట్టాల మీద దూరదూరంగా (భౌతిక దూరం పాటిస్తూనే) పడుకున్నారు. పట్టాల మీదే ఎందుకు పడుకోవాలి? వారి నిర్లక్ష్యమే వారిని బలిగొన్నది- అని సులభంగా నిర్ధారణలు చేసెయ్యవచ్చు.
అలా పడుకోవటానికి రెండే కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి: లాక్‌ డౌన్‌ కారణంగా రైళ్ళు తిరగటం లేదన్న భరోసా, రెండు: పక్కనే పల్లాన పడుకుంటే పాములూ, పురుగులూ తిరుగుతాయి. పట్టాలు కాస్త ఎత్తుగా వుంటాయి కాబట్టి ఎంచుకున్నారు. కానీ గూడ్సు రైలు వస్తోంది. సాధారణంగా అయితే గంటకు 25 కి.మీ వెళ్తుంది. కానీ పాసింజరు రైళ్ళు తిరగకపోవటం వల్ల రెట్టింపు వేగంతో వచ్చి, వారి మీదనుంచి వెళ్ళిపోయింది. అయితే అందులో నలుగురు మాత్రం దగ్గరకొచ్చాక పక్కకు దూకే ప్రయత్నం చేశారు. అయితే చనిపోయిన వాళ్ళ దేహపు ముక్కల్ని వెతికి తేవటం పోలీసులకు కష్టమయ్యింది. అంతేకాదు. పట్టాల మీద చిందరవందరగా ‘నెత్తురంటిన చపాతీలు’ వారికి ‘బతుకు తెరువు ’ ఎంత ముఖ్యమో ధృవీకరిస్తున్నాయి.. అయితే గూడ్సులు ఎందుకు తిరుగుతున్నాయి? ఆర్థిక వ్యవస్థకు జీవం పోయాలి కాబట్టి సరకు రవాణా కీలకం. అలాగే ఇప్పుడే వలస కూలీలలను తమ సొంత రాష్ట్రాలకు చేర్చటానికి రైళ్ళను కూడా పునరుధ్ధరించారు. ‘వెళ్ళే వాళ్ళు వెళ్ళ వచ్చు; ఉండే వాళ్ళు ఉండవచ్చు’ అని కూడా సర్కారులు తమ ఔదార్యాన్ని ప్రకటించాయి. ఇన్నాళ్ళూ ఆగి ఇప్పుడు రైళ్ళను పట్టాల మీదక వదలేటప్పుడు, పట్టాల ముందస్తు తనిఖీలు, హెచ్చరికలూ చెయ్యరా- అన్నది ఒక సందేహం.
ఇది జరగటానికి ఒక రోజు ముందు. విశాఖపట్నం ఆర్‌ ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌.జి. పాలిమర్స్‌లో తెల్లవారు ఝామున స్టయిరన్‌ గ్యాస్‌ లీక్‌ అయ్యి పది మంది చనిపోతే, వేల మంది అస్వస్థులయ్యారు. నలభయి రోజులు లాక్‌ డౌన్‌ తర్వాత ఈ ఫ్యాక్టరీని తెరిచారు. మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రజలు దిక్కుతోచక పరుగులు తీశారు. ఈ విషవాయు ప్రభావం అక్కడి ప్రజల మీద శాశ్వతంగా కూడా వుండే ప్రమాదం వుంది. ఈ ఘటన ఒక్కసారిగా 1984 నాటి భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ ను గుర్తు చేసింది. అయితే దాని తీవ్రత చాలా ఎక్కువ అది వేరే విషయం. ఎల్‌.జి.పాలిమర్స్‌ దక్షిణ కొరియాకు చెందిన వారి యాజమాన్యంలో నడుస్తోంది. ఇన్ని రోజుల తర్వాత ఎక్కువ మోతాదులో ఈ వాయువును ఎలా వదలి పెట్టగలిగారు? అసలు నైపుణ్యం వున్న కార్మికులతోనే ఈ పనిని చేశారా? సరే. మృతులకు చెందిన ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయిలు ఇచ్చి ఆదుకుంటోంది. గొప్ప విషయమే. కానీ ఆర్థిక వ్యవస్థను వెంటనే తెరవాలనే ఆతృతలో, అధికారులు, ఇతర జాగ్రత్తలు తీసుకోవటం లేదు.
ఇప్పుడయినా గుర్తించాలి ఆర్థిక వ్యవస్థను మోస్తున్నది కూలీలు. వారిలో అధిక శాతం వలస కూలీలే. 2017 ఆర్థిక సర్వే ప్రకారం. మనదేశంలో ఒక చోటనుంచి ఒకచోటకు వెళ్ళే వలస కార్మికులు 13.9 కోట్లు వున్నారు. వీరిని మనం 40 రోజుల పాటు రోడ్ల మీదా, రైలు పట్టాల పైనా విసిరేసుకున్నాం. ఇప్పుడు ‘రారమ్మని ఆహ్వానిస్తున్నాం’ . దేశానికిది మంచిది కాదు. కార్మిక భారతం భుజాల మీదనే కార్పోరేట్‌ భారతం నిలుచుందన్న వాస్తవాన్ని ఇప్పటికయినా దేశ ఆర్థిక విధాన నిర్ణేతలు యోచించాలి.

-సతీష్ చందర్

(గ్రేట్ఆంధ్ర వారపత్రిక 9-16 మే 2020 సంచికలో ప్రచురితం)

3 comments for “బోగీల్లోకి సరుకులు-పట్టాలపైకి బతుకులు!

  1. Dear sir good evening.
    No counters for ur counters.
    Morveless and matchles.
    We proudof you dear sir.
    All the best.

    -DR B A N D I.

  2. బోగీల్లోకి సరుకులు-పట్టాలపైకి బతుకులు!
    …@

  3. వలస కార్మికులని మనుషులుగా ఎక్కడ చూసారు?
    పనిముట్లుగానే చూసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *