పదివసంతాలు దాటిన రాజకీయ వార పత్రిక
తెలుగు మేగజైన్ జర్నలిజం చరిత్రలో మైలురాయి
నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక, తెలుగు వారుండే పొరుగు రాష్ట్రాలలో అత్యధిక పాఠకాదరణ వున్న ఏకైక తెలుగు రాజకీయ పత్రికగా ‘గ్రేట్ ఆంధ్ర’ కొనసాగుతోంది.
పత్రిక తేవటం వేరు; తెచ్చి నడపటం వేరు; నడిపి నిలపటం వేరు.
దశాబ్దం గడచింది. గ్రేట్ ఆంధ్ర వార పత్రిక పదకొండవ సంవత్సరలో ప్రవేశించింది. తెలుగు మేగజైన్ జర్నలిజం చరిత్రలో ఇది ఒక మైలు రాయి. ఇదే ఫిబ్రవరి నెల 2012లో ఈ పత్రిక ప్రారంభమయ్యింది. వారం వారం క్రమం తప్పకుండా వచ్చింది.
నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక, తెలుగు వారుండే పొరుగు రాష్ట్రాలలో అత్యధిక పాఠకాదరణ వున్న ఏకైక తెలుగు రాజకీయ పత్రికగా ‘గ్రేట్ ఆంధ్ర’ కొనసాగుతోంది. ఇందుకు ప్రచురణ కర్తగా వెంకట్ అరికట్లా, అప్పటి నుంచీ సంపాదకుడిగా వున్న నేనూ మా పాఠకులకు రుణపడి వున్నాం.
అది 2002 నాటి మాట. నేను ఆంధ్రప్రభ దినపత్రికకు సంపాదకుడుగా వున్నాను. వెంకట్ నన్ను కలిశారు. అప్పటికే ఆయన ఆమెరికాలో స్థిరపడ్డారు. గ్రేట్ ఆంధ్ర డాట్ కావ్‌ు వ్యవస్థాపన గురించి మాట్లాడారు. వెబ్ జర్నలిజం అప్పుడప్పుడే ఊపు అందుకొంటోంది. నేను అప్పటికే (2000)లోనే ‘వార్త’ దినపత్రిక తరపున ‘వార్త డాట్ కావ్‌ు’ ను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో నడిపి వున్నాను. ( నేను వార్త దినపత్రిక సహవ్యవస్థాపక సంపాదకుడిని లెండి!). దాని సాధక బాధకాలు నాకు తెలుసు. కొన్ని చెప్పాను. రాజకీయాలనూ, సినిమాలనూ మేళవించి తేబోతున్నట్టు చెప్పారు. అప్పటికి అలా చెయ్యటం కొత్త. నా సహకారాన్ని అందిస్తానన్నాను. ఇంగ్లీషు కంటెంట్ కొంత రాసి ఇస్తుండే వాడిని అంతే. కానీ ఆయనే సర్వం ఆయి గ్రేట్ ఆంధ్ర డాట్ కావ్‌ు ను అనతి కాలంలో, అతి ఎక్కువ మంది సందర్శకులున్న వెబ్ సైట్ ను చేశారు. రాజకీయ విశ్లేషణలన్నా, సినిమా కబుర్లన్నా, అన్నింటినీ మించి సినిమా సమీక్షలన్నా విశ్వవ్యాపితంగా వున్న తెలుగువారికి ఏకైక విలాసంగా ‘గ్రేట్ ఆంధ్ర డాట్ కావ్‌ు’ అయ్యింది. సినిమా ప్రేమికులు ఇప్పటికీ సినిమా చూడాలంటే ‘గ్రేట్ ఆంధ్ర రేటింగ్’ ఎంత అని చూడాల్సింది. ఇందుకు కొందరు నొచ్చుకునే వారు; బెదరించేవారు. అయినా ఆయన ఎక్కడా భయపడింది లేదు; వెనక్కి తగ్గింది లేదు.
విశ్లేషణకు స్వేఛ్చ అవసరం. నా వరకూ అయితే ఏ పత్రికలోనైనా స్వేఛ్చ వున్నంత వరకే సంపాదకుడిగా వున్నాను. స్వేఛ్చ వుండదనుకున్న రోజున అక్కడ వుండే వాడిని కాదు.
గ్రేట్ ఆంధ్ర డాట్ కావ్‌ుకు పదేళ్ళు నిండాక, 2012లో మళ్ళీ నాదగ్గరుకు ఓ ముఖ్యమైన ప్రాజెక్టుతో వచ్చారు. అది ముద్రణా మాధ్యమానికి సంబంధించింది. గ్రేట్ ఆంధ్ర ను ప్రింట్‌లో వార పత్రికగా తేవాలని చెప్పారు. మళ్ళీ రాజకీయాలూ, సినిమాలే. ఇదే కంటెంట్ గా పత్రిక తెద్దామన్నారు. నన్ను సంపాదకుడిగా వుండమన్నారు. తెలుగు మ్యాగజైన్ జర్నలిజంలో వున్న ఇబ్బందులు ఆయనకు వివరించాను. ముఖ్యంగా తెలుగునాట రాజకీయ వారపత్రికలుగానీ, పక్షపత్రికలుగానీ పెద్దగా నిలదొక్కుకో లేక పోయాయి. అప్పటికి గొప్పగా నడచినవి రెండే రెండు. ఒకటి: ఇండియాటుడే (తెలుగు). రెండు: సుప్రభాతం. (‘సుప్రభాతం’ పత్రికకు నేను కూడా కొన్నేళ్ళు సంపాదకత్వం వహించాను.) ‘మనం భిన్నంగా తెద్దాం.’ అన్నారు. నాకు పూర్తి స్వాతంత్య్రం ఇచ్చారు. కొందరు యువపాత్రికేయులను వెంట బెట్టుకుని చేరాను. పత్రాలకంరణ ( పేజినేషన్) నుంచి, ముద్రణ ప్రమాణాల వరకూ ఎక్కడూ రాజీ పడలేదు. పత్రిక వస్తున్నట్లు ముందు ప్రచారం చెయ్యాలి కదా! ప్రకటనలు గుప్పించాలి కదా! అవేమీ చెయ్యలేదు. మరి పత్రిక వస్తున్నట్లు లోకానికి ఎలా తెలుస్తుంది? పాఠకులకు ఎలా చేరుతుంది? ఈ విషయంలో నా భయాలు నాకున్నాయి. కానీ వెంకట్‌కి అలాంటి అపోహలేమీ లేవు. పైగా ఆప్పుడు ఆయన చెప్పిన మాట నాకు ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తు వుంటుంది. ‘రెగ్యులర్ గా తెచ్చి స్టాల్స్ మీద పెడితే, అదే క్లిక్ అవుతుంది’ అన్నారు. నిజమే ప్రచురణ కర్తగా ఆయన ఆది నుంచీ రెండు ప్రాథమిక సూత్రాలు నమ్ముతూ వచ్చారు. ఒకటి: క్రమం తప్పకుండా పత్రిక తేవటం. రెండు: ఏది ప్రచురించినా పఠనీయత వుండటం. ఇవే ఆయన విజయ రహస్యాలు.
నాలుగు వాక్యాలున్న ‘టిట్ బిట్’ దగ్గరనుంచి నాలుగు కాలాల ‘ఫీచర్’ వరకూ, ‘గ్రేట్ ఆంధ్ర’లో ఏది కనిపించినా, అది దానంతట అది చదివించుకుంటుంది. ఎంతో మంది ఫ్రీలాన్సర్లూ, రచయితలూ, పేరొందిన రచయితలూ ఈ పదేళ్ళలో ‘గ్రేట్ ఆంధ్ర’కు రాశారు; రాస్తున్నారు; రాస్తారు కూడా. అందరిలోనూ వున్న సామాన్యలక్షణం పఠనీయత.
ఈ దశాబ్ది కాలంలోని రాజకీయాలకు తెలుగు వారికి ఎప్పుడూ గుర్తుండి పోతాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రం అనే ఏకవచనం, తెలుగు రాష్ట్రాలు అనే బహువచనం గా ఏర్పడింది ఈ దశకంలోనే. రెండు చోట్లా రెండు ఆందోళనలు: సమైక్యం, ప్రత్యేకం. పత్రికలది విషమ పరీక్ష. ఈ సమయంలో సమతూకం పాటించటం పాత్రికేయులకు ‘వృత్తి’ మీద సామే. అప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీ మాయలో పడకుండా వుండిపోయిన పత్రికలు తక్కువే. అలాంటిది ప్రధాన స్రవంతి రాజకీయ వార పత్రికగా ‘గ్రేట్ ఆంధ్ర’ కేవలం రెండు ప్రాంతాలలోని నేతల ద్వంద్వ వైఖరినీ ఏకి పారేస్తూ, ఆ ప్రాంతాల ప్రజల మనోభావాలకు అద్దం పడుతూ మాత్రమే విశ్లేషణలు చేసింది. రాష్ట్ర విభజనానంతరం కూడా అంతే, ‘రాజధాని’ పేరు మీద జరిగిన రాజకీయాన్నే కాదు, వాణిజ్యాన్నీ ఎండగట్టింది.
విశ్లేషణకు స్వేఛ్చ అవసరం. నా వరకూ అయితే ఏ పత్రికలోనైనా స్వేఛ్చ వున్నంత వరకే సంపాదకుడిగా వున్నాను. స్వేఛ్చ వుండదనుకున్న రోజున అక్కడ వుండే వాడిని కాదు. కానీ, ఈ పదేళ్ళ కాలంలో ఏ ఒక్క సందర్భంలోనూ, వెంకట్ గారు ‘ఇలా రాయకుండా వుంటే బాగుండేది’ అని అనలేదు. ఇది సంపాదకుడికి మాత్రమే వున్న స్వేఛ్చ కాదు. ఈ పత్రికలో రాసే ఫ్రీలాన్సర్ కు సైతం వున్న స్వేఛ్చ.
స్వేఛ్చే బాధ్యత కూడా. నా అంతట నేనే, పత్రిక మనుగడనూ, భవిష్యత్తునూ దృష్టిలో వుంచుకుని, సంపాదకీయాలు రాసేవాడిని; రచనలు చేసేవాడిని; ఇతరుల రచనలు చూసేవాడిని. నాతో వచ్చిన యువపాత్రికేయులే, సీనియర్ పాత్రికేయులై ఇప్పటికీ ఈ పత్రికలో కొనసాగుతూ, ప్రతి సూక్ష్మ విషయాన్నీ మా ఇద్దరి దృష్టికి తెస్తుంటారు.
ఈ పత్రికను ప్రోత్సహించటంలో ప్రకటన కర్తల, పంపిణీ దారుల పాత్ర కీలకమైనది. ప్రతి ముఖ్యసందర్భంలోనూ పేజీలో వార్తలతో పాటు, ప్రకటనలతో కళకళలాడేలా చేసింది ప్రకటన కర్తలయితే, అన్ని ముఖ్యమైన స్టాల్స్‌లోనూ అందుబాటులో వుంచింది పంపిణీ దారులు. ఉత్తమాభిరుచిగల మా పాఠకులతో పాటు, వారికి కూడా ఈ సందర్భంగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
అభినందనలు సార్. మీ కృషి ప్రశంసనీయం. గ్రేట్ ఆంధ్ర మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నాను.
– దోర్బల బాలశేఖరశర్మ
గ్రేట్ ఆంధ్ర పదకొండవ వసంతం లోకి అడుగుపెడుతున్న శుభసందర్భాన మీకివే శుభాకాంక్షలు . గ్రేట్ ఆంధ్ర పాఠకులు ఇంకా ఎక్కువ కావాలని, గ్రేట్ ఆంధ్రను దినపత్రిగా చేయాలని కోరుకుంటూ మీ- కర్ణ కుమార్
ఒక రాజకీయ పత్రిక పదేళ్లు విజయవంతంగా నడిచి, ఆ నడకను మరింత దృఢంగా సాగిస్తున్న దింపే.. ప్రధాన కారణం.. సమర్ధుడైన సంపాదకుడే. సతీష్ చందర్ గారికి అభినందనలు.