‘ట్రంపే’ ఇంపు


ట్రంప్‌ మొండి. ఉత్త మొండి కాదు. జగమొండి. వణకడు.
తొణకడు. గెలిచాడు. ఓడాడు. మళ్ళీ గెలిచాడు.
పీక చుట్టుకున్న కేసులకూ అదరలేదు. చెవిపక్కనుంచే దూసుకుపోయిన బులెట్‌కూ బెరవలేదు. పడ్డ చోటనే లేచాడు. ఖాళీచేసిన శ్వేతసౌధంలో మరో నాలుగేళ్ళు వుండటానికి సిధ్ధమయ్యారు.
ఇప్పటి (2024) గెలుపు మామూలు గెలుపు కాదు. ఇది త్రివిధ విజయం. అమెరికా వోటర్లు ప్రత్యక్షంగా వేసిన (పాపులర్‌) వోటులోనూ ఆధిక్యమే. ప్రాతినిథ్య ఎలక్టర్లలోనూ (ఎలక్టొరల్‌ కాలేజ్‌) మెజారిటీయే. ఇది కాక, సెనేట్‌లోనూ తన (రిప్లబికన్‌)పార్టీకి పై చెయ్యే.
ఇప్పుడు ట్రంప్‌ అలంకరించబోతున్న అధ్యక్ష పదవి కేవలం అందలం మాత్రమే కాదు. తానే ఏకపక్షంగా శాశించగల అధికారం. దీంతో ట్రంప్‌ ఏమయినా చెయ్యగలరు.

‘తెల్ల’వోటు కోసమే కల్లా, కపటం!
అమెరికన్‌ వోటర్లు తుది వరకూ గట్టి పోటీ ఇచ్చిన కమలాహారిస్‌కు తీవ్ర నిరుత్సాహం మిగిల్చారు. తండ్రి వైపు ఆఫ్రోఅమెరికన్‌ సంతతి. తల్లివైపు భారత సంతతి. ఆమెను ఆఫ్రోఅమెరికన్లు (నల్లజాతీయులు) తమ మనిషిగా భావించారు. కానీ అమెరికాలోని భారతీయ వోటర్లు మాత్రం పూర్తిగా ఆమెను ఆదరించలేదు. ఆమెకు భారతీయులు సింహభాగంగా వున్న ఆసియన్లు 56 శాతం వేస్తే, బ్లాక్స్‌ 86 శాతం వేశారు. ఇందుకు ట్రంపే కారణం కూడా. ఆమెకు భారతీయ ముద్ర వెయ్యాలని ఆయన ఆదినుంచీ ప్రచారం చేశారు. ఆమె భారతీయ(హిందూ) వేడుకల్లో పాల్గొన్న చిత్రాలను కూడా ట్రంప్‌ ప్రచార బృందం బహిర్గతం చేసింది. అలా చెయ్యటం వల్ల అక్కడ క్రైస్తవులుగా వున్న శ్వేత జాతీయులకు హారిస్‌ పట్లకొంత వైముఖ్యం కలుగుతందని ఆయన వ్యూహం కావచ్చు. మొత్తానికి ఆయన అనుకున్నట్లే జరిగింది.
ఇక శ్వేత జాతీయుల్లో ట్రంప్‌కు 55 శాతం వేస్తే, 43 శాతం మాత్రమే కమలా హారిస్‌కు వేశారు. అలాగే మతపరంగా చూసినప్పుడు క్రైస్తవులుఅటు కేథలిక్కులూ, ఇటు ప్రొటస్టెంట్లూ కలసి దాదాపు 60 శాతం ట్రంప్‌కే వేశారు. అంతే కాదు. కడవరకూ ఊగిసలాడే చరిత్రవున్న ఏడు ‘స్వింగ్‌ స్టేట్సూ’ ( పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్‌ కరోలినా, మిషిగాన్‌, ఆరిజోనా, విస్కాన్సిన్‌, నివేదాలు) గుంప గుత్తగా ట్రంప్‌ వైపే తిరిగిపోయాయి. చిట్ట చివరి ప్రచార ఘట్టంలో ట్రంప్‌ గ్రామీణ అమెరికా మీద దృష్టి పెట్టి వోట్లను తనవైపు ఆకర్షించారు. ఫలితమే ఈ విజయం.

జో కు జై అన్న మహిళలే హారిస్‌కు చెయ్యిచ్చారు!
ప్రజాస్వామ్య దేశంగా సుధీర్ఘ చరిత్ర వున్న అమెరికాలో ఇంతవరకూ మహిళ దేశాధ్యక్షురాలు కాలేక పోయారు. కానీ రెండు సార్లు అభ్యర్థిగా పోటీ పడ్డారు. 2016లో హిల్లరి క్లింటన్‌, 2024లో కమలా హార్రిస్‌. రెండూ సార్లు ఓడిపోయారు. చిత్రమేమింటే ఆ ఇద్దరినీ ఒక్కరే ఓడిరచారు. ఆయనే డోనాల్డ్‌ ట్రంప్‌. ఇద్దరు మహిళలూ డెమాక్రటిక్‌ పార్టీ అభ్యర్థులే. గత రెండు ఎన్నికలలోనూ అమెరికాలో మహిళా వోటర్లు, రిపబ్లికన్‌ పార్టీకన్నా, డెమక్రటిక్‌ పార్టీ వైపే మొగ్గు చూపుతూ వచ్చారు. కానీ ఆ పార్టీకి పురుష అభ్యర్థి (జో బిడెన్‌) వున్పప్పటి ఎన్నికల్లో కన్నా , మహిళా అభ్యర్థి (కమలా హారిస్‌) వున్నప్పటి ఈ ఎన్నికలలోనే తక్కువ శాతం మహిళలు వోటు వేశారు. కాస్త విడ్డూరమే. ఎందుకంటే అప్పటికన్నా మహిళలు ఇప్పుడు ఎగబడి వెయ్యాలి కదా? లేదు. జోబిడెన్‌ వున్నప్పుడు 57 శాతం వేస్తే, కమలా హారిస్‌కు 54 శాతం మాత్రమే వేశారు.
అలాగే ఒక సారి అధ్యక్షుడయిన నేత రెండో సారి ఎన్నిక కావటం అమెరికాకు కొత్త కాదు. ఇలా అయిన వాళ్ళందరూ వెంట వెంటనే అవుతారు. అంటే పదవీ కాలం ముగియగానే జరిగిన ఎన్నికలలో గెలుపొందుతారు. కానీ 132 యేళ్ళ అమెరికన్‌ చరిత్రలో, వెంట, వెంటనే కాకుండా, మధ్యలో ఒక పదవీ కాలం విరామంతో అయిన అధ్యక్షుల్లో ట్రంప్‌ రెండవ నేత.

మెడపట్టి తొయ్యటానికే ‘మాగా’ మంత్రం!
ఇన్ని ఆశ్చర్యాల మధ్య గెలిచిన ట్రంప్‌ పాలన ఎలా వుండబోతోంది? ఆయన చెప్పినట్లే వుంటుంది. ఆయనే ఒక మాట ఇచ్చాడు. అదే ‘మాగా’( ఎం.ఎ.జి.ఎ. ఆ మాటే మంత్రం అయ్యింది. అంటే మరేమీ కాదు. ‘మరోమారు అమెరికాను మహోన్నతం చెయ్యండి’ (మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగెయిన్‌) అని పిలుపు ఇచ్చారు. ఇలా చెయ్యటానికి కొన్ని దారులు సిధ్ధం చేశాడు. ఆవే ఆయన హామీలయ్యాయి:
పత్రం, పధ్ధతిలేకుండా అమెరికాలో తిష్ట వేసిన పరాయిదేశస్తుల్ని ఖాళీ చెయిస్తాను అని మాత్రమే ట్రంప్‌ అన్నారు. ఇంత పెద్దయెత్తున వెళ్ళగొట్టటం చరిత్రలో ఎప్పుడూ చూసి వుండరు అని కూడా శపథం చేశారు. మొత్తం 33.5 కోట్ల అమెరికా జనాభాలో దాదాపు 13.8 శాతం విదేశాల్లో పుట్టినవారే. అంటే 4.6 కోట్లమంది వరకూ వుండవచ్చు. ఇలా వచ్చిన సముదాయాల్లో భారత సముదాయం మూడో స్థానం లో వుంది. నిబంధనల బధ్దులయి ప్రవేశించిన వారి సంగతి వేరు. కెనడా, మెక్సికో భూభాగంలోనుంచి ఎక్కువ మంది భారతీయులు ఇటీవల కాలంలో అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణలు వచ్చాయి. ఏ దేశపు దంపతులయినా ఆమెరికాలో బిడ్డకు జన్మనిస్తే, ఆబిడ్డకు సహజంగా పౌరసత్వం లభింపచేసే అధికరణాన్ని రద్దు చేస్తానని కూడా అన్నారు. ఆ దంపతుల్లో ఒకరికి అమెరికా శాశ్వత పౌరసత్వం వుంటేనే, బిడ్డకు పౌరసత్వం కలిగేలా సవరిస్తూ ‘ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌’ ను జారీ చేస్తానని చెప్పారు.
యుధ్ధాన్ని ఆపేస్తానని అన్నారు. తాను యుధ్ధం చెయ్యటానికి రాలేదు అన్నారు. నమ్మి తీరాలేమో ప్రతీ అధ్యక్షుడి పదవీకాలంలోనూ అమెరికా ఏదో యుధ్ధంలో వుంది. కానీ ట్రంప్‌ పాలించినప్పుడు (20162020) మధ్య కాలంలో ఆమెరికా ఏ యుధ్ధమూ చెయ్యలేదు.
` అంతే కాదు, చైనా ఉత్పత్తులను అమెరికాలో కట్టడి చేసే విధంగా భారీ సుంకాలను విధిస్తానన్నారు. ఆ మాటకు కట్టుబడి వుండే అవకాశం వుంది.
ఈ హామీల పైనే అమెరికన్‌ వోటర్లు తీర్పు నిచ్చారు. అంతే కాదు. జోబిడెన్‌ హయాంలోని అమెరికా ఆర్థిక వ్యవస్థ గొప్పగా వున్నట్టు కనిపించినా, అది ధనిక, పేదల మధ్య అగాధాన్ని పెంచింది. బిడెన్‌ సర్కారు పై వ్యతిరేకత ఆప్పటి ఉపాధ్యక్షురాలయిన కమలా హారిస్‌ మీద పడకుండా వుంటుందా? పడిరది.
ట్రంప్‌ అన్నంత పనీ చేస్తాడని వోటర్లు నమ్మారు. అలా విశ్వసించిన వారిలో భారత సంతతికి చెందిన అమెరికన్‌ వోటర్లు కూడా వున్నారు. అలా నమ్మే వోటు వేశారు కూడా. అదేమంటే, భారత సంతతకి మాత్రమే కాదు, తెలుగు మూలాలు వున్న ఉషా చిలుకూరి భర్త జెడి వాన్సేను చూపించ వచ్చు. ఈ చిరు ఆనందాన్ని మినహాయిస్తే, ట్రంప్‌ పాలనలో భారతీయ విద్యార్థులకూ, ఉద్యోగార్థులకూ అమెరికా ఇక స్వప్న సీమ కాలేదు. కానీ ఇప్పటికే స్థిరపడి పెద్ద పెద్ద వ్యావారాలు చేస్తూ, ఆమెరికా ఖజానాకు ఆదాయాన్ని చేకూరుస్తున్న భారత సంతతికి చెందిన అమెరికన్లకు మాత్రం ఏ నష్టం వుండదు. ఇది చాలేమో ప్రవాస భారతీయులు సంతృప్తి చెందటానికి..!! మరి పట్టా కోసమే, పొట్ట కూటి కోసమో, అమెరికా వీసాల కోసం క్యూలు కట్టే భారతీయుల సంగతి ఏమిటి? ఇంత తెలిసికూడా ‘హారిస్‌ను కాదని ప్రవాస భారతీయులు సైతం ఎందుకు వోటు వేసినట్లూ..? ‘ట్రంపే ఇంపనా!?

సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్రవార పత్రిక 9 నవంబరు 2024ల సంచికలో ‘పొమ్మన్న ట్రంప్ కే పిలిచి పట్టం కట్టారు‘ శీర్షికన ప్రచురితమైన సంపాదకీయం)

Post navigation