‘శివసాగరం’ కాదు – విప్లవ మహాభారతం!

శివసాగర్

శివసాగర్‌ ఒక యుగం పేరు! ఇది పొగడ్తా కాదు. తిట్టూ కాదు. ఏం అనుమానం లేదు. యుగమంటే కాలమే. కాలమే కవి కి జన్మనిస్తుంది.(శివసాగర్‌ మాటల్లోనే చెప్పాలంటే… ‘కాలం కడుపుతో వుండే’ కవిని కంటుంది.) ఆ కాలంలో అసలు కవితో పాటు చాలా మంది కవులు పుట్టుకొస్తారు. వారిని కాలం కనదు. వారు ‘స్వయంభువులు’. కాలం తో పాటు కొట్టుకుంటూ వెళ్తారు. అలాంటి వారు అనేకం వుంటారు. వారితో యుగానికి ఏమీ పనివుండదు. ఆ యుగంతోనే వారికి పని వుంటుంది.
శివసాగర్‌ అడవి కవి. అతడు రాసిన ప్రతిపదమూ ఒక వనమూలిక! యుగానికి అరణ్యం అవసరమయినప్పుడే శివసాగర్‌ని కన్నది. అయితే ప్రతీ యుగమూ పొదుపుగా ఒక్కణ్ణే కనాలన్న రూలేమీ లేదు. ఎంతమందినయినా కనవచ్చు. అది యుగస్వభావాన్ని బట్టి వుంటుంది. గురజాడ, శ్రీశ్రీలు అదృష్టవంతులు. వారు‘ఏక వచన’యుగంలో పుట్టారు. కానీ, శివసాగర్‌ సంధియుగంలో కవిగా అవతరించాడు. యుగం ‘ఏకవచన’ స్వభావం నుంచి, ‘బహువచన’ స్వభావానికి రూపాంతరం చెందుతున్న దశలో పుట్టారు. అంటే అప్పటికి యుగం నిజంగా ‘ప్రజాస్వామికవ్వటం’ మొదలయ్యింది. ఈ మార్పు పనిగట్టుకుని సాహిత్యరంగంలోనే చోటుచేసుకోదు. రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాల్లో చోటు చేసుకున్న మార్పే సాహిత్య రంగంలో ప్రతిఫలిస్తుంది. రాజకీయాల్లో కూడా ‘ఏకపక్ష’ ప్రభుత్వాలకి- డెభ్బయ్యవ దశకం చరమగీతం పాడిది. ‘ఏక పక్ష’,‘ఏకనాయకత్వ’ పాలన ‘ఎమర్జెన్సీ’తోనే నిలిచి పోయింది. ఆ తర్వాత వచ్చిన రాజకీయాలు ‘సంకీర్ణ పాలన’కూ ‘ఫెడరల్‌ పాలన’కూ బీజాలు వేశాయి.
సరిగ్గా ఈ పరివర్తన దశలోనే శివసాగర్‌ ‘ఉద్యమం నెలబాలుడు’ విల్లంబులతో అడవినుంచి అక్షరారణ్యంలోకి ప్రవేశించాడు. ఇది అడవిలో పుట్టిన వెన్నెలే కానీ, మైదానాల్లో కాచింది. నలుదిక్కులా ప్రసరించింది.
వెన్నెల అంటేనే స్వప్నం. వెలుతురు వుంటుంది కానీ, వేడిమి వుండదు. కానీ రేపటి వెచ్చదనాన్ని అది ఆవాహన చేస్తుంది. రేపటి సూర్యోదయానికి ఈ వెన్నెల రేయి ఒక ముందు మాట. రాత్రిలో పగలును దర్శించటమే వెన్నెల. నిద్రలో మెలకువను చూడటమే స్వప్నం. ‘ఉద్యమం నెలబాలుడు’ ఒక విప్లవ స్వప్నం.
ఈ మధ్య శివసాగర్‌ కవిత్వాన్నంతా గుది గుచ్చి ‘శివసాగర్‌ కవిత్వం’ పేరు మీద అచ్చు వేశారు. ఇందులో మహాభారత దశలున్నాయి. అరణ్య, అజ్ఞాత, యుధ్ధ పర్వాలున్నాయి.
‘ఉద్యమం నెలబాలుడు’ అరణ్యం
‘నెలవంక’ అజ్ఞాతం.
‘అలల పైన నిఘా!
అలలు కనే కలలపైన నిఘా!
అలలపై అనురాగం చూపించే
చిరుగాలి సితారా సంగీతం పై నిఘా!
అలలపై కదిలే
పడవలపై నిఘా!’
అరణ్య పర్వాన్ని జలభాషలో చెబుతున్నాడు. సముద్రమూ అరణ్యమూ తోబుట్టువులే. రెంటికి హద్దులుండవు.
అరణ్యం, విప్లవం అంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజే అందరికీ గుర్తుకు వస్తాడు.
ఈయనా స్వాప్నికుడే.
కానీ ఆయన కంటే ముందు మన్యం లో తెల్లవాళ్ళ పై తిరుగుబాటును స్వప్నించిన తెలుగువాడయిన మరో మన్యం యోధుడున్నాడు. ఆయన పేరు ద్వారబంధాల చంద్రయ్య.
కళ్ళముందే బ్రిటిష్‌ పోలీసులు, గిరిజన స్త్రీల పై అత్యాచారం చేస్తే, ఆ పోలీసులను అక్కడికక్కడే తెగనరికిన ఒక సాధారణ కూలీ చంద్రయ్య. పేరులోనే కాదు తీరులోనూ చంద్రుడు. చల్లని మనసున్న వాడు. దాగిన పొగరున్నవాడు.
శివసాగర్‌ స్పురణలో పెట్టుకుని రాశాడో, లేదో కానీ, నాకైతే- ఉద్యమం నెలబాలుడంటే ఈ చంద్రయ్య్గే గుర్తుకొచ్చేవాడు.
ఈ ‘ఖాకీ’చక వధ తర్వాత, చంద్రయ్య ఉద్యమాన్ని స్వప్నించాడు. అప్పుడతడు దాక్కున్నది అరణ్యం ఆనుకుని వున్న నీళ్ళ మీద. పడవల మీద….!
‘పడవల తెర చాపలపై నిఘా!
పడవల తెర చాపల తెల్లదనం పై నిఘా!’
అలలంటే ‘అన్న’లే. వారూ అలల్లా లేస్తారు. అదను చూసి ముంచెత్తి పోతుంటారు.
‘కడలిజనం! అలలు దళం!
అలలు కడలి ప్రాణ ప్రదం!’
కనురెప్పలు- కంటిపాపల్నే కాపాడతాయనుకుంటాం. కాదు. అవి కనే కలల్ని కూడా కాపాడతాయి.
జనమూ అంతే. వారి కోసం (పరితపిస్తున్నంత కాలం) పరితపించే ‘విప్లవ స్వాప్నికుల్నీ’ కాపాడుతుంటారు.
ఇది తత్త్వం. విప్లవ స్వాప్నిక తత్త్వం.
‘వసంత మేఘం’ గర్జిస్తున్న రుతువులో పుట్టిన కవి చేత కాలం పలికించిన యుగసారం.
అదే రాబోయే విప్లవ కవితకు తొలిపలుకు.
పంటి కింది పగే ఈ ‘నెలవంక’!
అజ్ఞాతం ఒక ఎరుక. స్వప్నం ఛిద్రం కాకుండా చూసుకునే సృహ. ఒక మెలకువ. ఒక పహారా. స్వప్నం విలువైనది. స్వప్నించిన వీరుడు. బిడ్డల్ని కన్న పులిలా తిరుగాడుతుంటాడు. తన స్వప్నం కోసం ప్రాణాలిస్తాడు. లేదా ప్రాణాలు తీస్తాడు. అజ్ఞాతం అపురూపమైనది. అయిదుగురు అన్నదమ్ముల అజ్ఞాతం, రేపు లక్షలాది సైనికుల మహాభారత యుధ్ధమవు తుంది.
అజ్ఞాతమంటే పంటికింది పగ. జమ్మిచెట్టు మీద విల్లు. జడ వేయని జుత్తు. పగ పట్టటం చేతకాని వాడికి ప్రేమ విలువ తెలీదు. దోపిడీ మీదా, దోపిడీ దారుల మీద పగ పట్టటం తెలీని వాడికి, పూటగడవని వారిని ప్రేమించటం కూడా తెలీదు. ఇంతటి పరమ పవిత్రమైన పగను కాపాడటం కోసం- వీరుడు అవసరమయితే ప్రాణాలను వదలు కుంటాడు. అదే అమరత్వం.
ఇది మామూలు చావు కాదు. చనిపోవటం గొప్ప కాదు. చనిపోవాలనుకోవటమూ గొప్ప కాదు. తమ కోసం తాము చనిపోయే వాళ్ళు అయితే పిరికవాళ్ళు కావాలి. లేదా పరమ అహంకారులు కావాలి. అలాగే చావును లెక్క చెయ్యని వాళ్ళందరూ వీరులు కారు. అయిదువేల రూపాయిల కోసం ముక్కూముఖం తెలీని వాణ్ణి హత్య చెయ్యటానికి సిధ్ధమయిన కిరాయి హంతకుడు కూడా చావును లెక్క చెయ్యడు. ‘బతికినంత కాలం రాజాలా బతుకుతాను’ అనే స్వార్థం వల్ల వచ్చిన తెగింపు.
ఈ దిక్కుమాలిన చొరవను కూడా త్యాగమంటే, అసలు త్యాగానికి విలువవుండదు. డెభ్భయ్యవ దశకంలో నెత్తురోడ్చాక- నిర్బంధం వచ్చి పడ్డాక, ‘ఉద్వమం నెలబాలుడు’ మబ్బు చాటు ‘నెలవంక’ అయ్యాడు. అవును. నిర్బంధమంటే అదే మరి. వెన్నెల విరగ కాయటం నేరం. కోకిలలు పాటలు పాడటం నేరం. అందుకే చందమామ కూడా రహస్యంగా ప్రకాశించాల్సిందే.
అందుకే నెలవంకలోని ‘శివసాగర్‌’ కవిత్వమంతా, నిశ్శబ్దంగా శోకిస్తున్న చందమామను ఊరడిస్తున్నట్టుంది.
ఆ మాట కొస్తే చంద్రుడిని మించిన అమరుడెవ్వడుంటాడు. వేడిమిని తాను మింగి వెలుతురు ఇవ్వటం కన్నా గొప్పత్యాగం ఏముంటుంది.
శివసాగర్‌ ‘నెలవంక’లోని ‘అమరత్వం’లో ఈ తత్త్వమే సాగుతుంది.
‘విత్తనం చనిపోతూ
పంటను వాగ్దానం చేసింది.
చిన్నారి పువ్వు రాలి పోతూ
చిరునవ్వుతో కాపును వాగ్దానం చేసింది.
అడవి దహించుకు పోతూ
దావానలాన్ని వాగ్దానం చేసింది.

అమరత్వం రమణీయమయింది’
శివసాగర్‌ ‘నెలవంక’ ఒక సింహావలోకనం. ఒక తలపోత. భీముడు వంట చేస్తూ గతాన్ని నెమరు వేసినట్టు, అర్జునుడు నాట్యమాడుతూ నిన్నటిని గుర్తు తెచ్చుకున్నుట్లు… శివసాగర్‌ తన ‘నిన్న’ ను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఈ గురుతు రేపటి యుధ్ధాని కి రిహార్సల్‌!

-సతీష్ చందర్
– ఆంధ్రప్రభ, నవంబర్‌ 2004

(అప్పుడు నేను ఆంధ్ర్రప్రభకు ప్రధాన సంపాదకుడిగా వున్నాను.)

ఈ వ్యాసాన్ని  తర్వాత నా విమర్శ గ్రంథం ‘నిగ్రహవాక్యం‘లో పునర్ముద్రించాను.

2 comments for “‘శివసాగరం’ కాదు – విప్లవ మహాభారతం!

Leave a Reply