‘ఊరు వెలుపలే’నా… ఈ ‘తెలుగు’ తబలా..!?

ఇ ఫర్ ఇంగ్లీష్

భాష అంటే కూసేదా? రాసేదా? ముందు కూసేది; తర్వాత రాసేది. చాలా భాషలు ఇప్పటికీ కూత దగ్గరే ఆగిపోయాయి. రాత వరకూ రాలేదు. మాట్లాడేదే భాష. ఈ వాగ్రూపానికి దృశ్యరూపం ఇస్తే అప్పుడు రాత. దీనినే మనం లిఖిత రూపం అనుకుంటాం. అదే లిపి.
తెలుగు లిపి లో అక్షరాలు గుండంగా వుంటాయి. కుదురుగా రాస్తే, ముత్యాలు గుదిగుచ్చినట్టే వుంటాయి. తెలుగు పలకటానికే కాదు, చూడటానికీ ముద్దుగా వుంటుంది. ఇంత అందమైన భాషకు దూరమవ్వాలని ఎవరికి వుంటుంది? అయినా అవుతుంటారు. పుట్టిన గడ్డకు దూరమై,పరసీమల్లో వున్న వారు ‘తెలుగు’ను ‘టెల్గూ’ చేసుకుని బతుకుతుంటారు. వారిపిల్లలు కూడా ఈ ‘టెల్గూ’ లో మాట్లాడతారు కానీ, రాయమంటే ‘ఇంగ్లీషు’లో రాస్తారు. వీరే ప్రవాసాంధ్రులు. ‘దూరమైన కొద్దీ పెరుగును అనురాగం’ కాబట్టి, వీరే తెలుగుకు విశేషమైన సేవ చెయ్యాలనుకుంటారు.
అందరూ అమెరికా,ఆస్ట్రేలియా, కెనడా,బ్రిటన్‌లు వలస వెళ్ళలేరు. వెళ్ళిన వారు అధిక శాతం ‘చిప్పు’ చేత బట్టి వెళ్ళిన వారే.(అపార్థం చేసుకోకండి. చిప్పకాదు. అందరూ రేయింబవళ్ళు శ్రమ చేసే వాళ్ళే.) అవును. ఇది ‘చిప్పు’ యుగమే. కంప్యూటర్‌ చిప్పు యుగమే. (ఈ ‘చిప్‌’కు తెలుగు అనువాదం చెయ్యవచ్చు. కానీ చేస్తే వారికి కూడా అర్థం కాదు.) చిత్రమేమిటంటే, కంప్యూటర్‌ మాతృభాష ఇంగ్లీషు. తెలుగు భాషకు ఏదైనా ప్రాగ్రాం చెయ్యాలన్నా, దానితో ఇంగ్లీషులోనే సంభాషించాలి లేదా కమ్యూనికేట్‌ చెయ్యాలి. విదేశాలు వెళ్ళకుండా ఇక్కడి ‘ఐటీ’ రాజధానుల్లో (హైదరాబాద్‌, బెంగుళూరు, నోయిడా లాంటి నగరాల్లో) బతకాలన్నా వీరు ఇవే చదువుల్ని ఇంగ్లీషులో చదవాలి. అలా చదివేశారు. అన్నట్లు వీరికి కూడా తెలుగంటే భక్తి. వీరిని చదివించిన తల్లిదండ్రులకయితే తెలుగంటే చెప్పలేని పిచ్చి. ‘అప్పటి తెలుగు పాటలు ఇప్పుడెక్కడివీ..? ఆత్రేయ, వేటూరీ … అబ్బ వాళ్ళ సాహిత్యమే వేరబ్బా..!’ అని పార్కుల్లో (ఓహో! ఉద్యాన వనాలు- అని అనాలు కాబోలు) ఆరోగ్యం కోసం సాయింత్రం పూట మందకొడి గా నడుస్తూ మాట్లాడుకుంటారు. అంటే వీళ్ళు నెమరు వేసేది కూడా ‘విన్న సాహిత్యం తప్ప, చదివిన సాహిత్యం’ కాదూ అన్నమాట. (కరోనా కారణంగా ఇప్పుడీ కబుర్లన్నీ ‘సోషల్‌ మీడియా’లోకి వచ్చేశాయి. అది వేరే విషయం.)

టి ఫర్ టెల్గూ

అయినప్పటికీ వీరందరికీ ఒక వార్త సంతోషాన్నిచ్చింది: ఆంధ్రప్రదేశ్‌లో ఆరో తరగతి వరకూ ఇంగ్లీషు మీడియం తప్పనిసరి కాదు. సర్కారు తెచ్చిన ఉత్తర్వు ( జీవో ఎంఎస్‌ నెం.85, తేదీ 20 నవంబరు 2019) ను హైకోర్టు 15 ఏప్రిల్‌ 2020న రద్దు చేసింది. ఇంటి పట్టున వుండి పోయిన ఈ ఎగువ మధ్యతరగతి ఈ వార్త విని ‘తెలుగు తల్లి’ కి సాష్టాంగ పడిపోతున్నారు. ఇంగ్లీషు మీద తెలుగు గెలుపు- అన్న అర్థంలో విజయోత్సవాలు జరిపేసుకుంటున్నారు. తల్లి భాష (ఒకప్పుడు మాతృభాష అనే వారు. తెలుగు ఎక్కడో తక్కువయిందనుకుని తల్లి భాష అని ఈ మధ్య ఎక్కువ అంటున్నారు లెండి.)ను రక్షించుకుందామని ప్రతినలు కూడా పూనుతున్నారు. ఇంగ్లీషు వారి చెరనుంచి ‘తెలుగు తల్లి’ ని తామే విడిపించినట్లు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏం చేసింది? తొలుత పాఠశాల, తదుపరి ఉన్నతపాఠశాల విద్యలో దశలవారీగా ఇంగ్లీషునే తప్పనిసరిగా బోధనా మాధ్యమం చెయ్యాలని నిర్ణయించింది. అదేమిటి? ఇంతవరకూ లేనట్లు కొత్త గా చెయ్యటమేమిటి? ఈ ప్రశ్న ఉదయిస్తుంది. చిన్నాచితకా ప్రయివేటు కాన్వెంటు స్కూళ్ళ దగ్గర నుంచి, ‘సూవర్‌ పవర్స్‌’ లాంటి కార్పోరేట్‌ సంస్థలు పెట్టిన ‘కాన్సెప్టు స్కూళ్ళ, టెక్నో స్కూళ్ళ వరకూ ఈ పాఠశాల విద్యను ఇంగ్లీషు మీడియంలోనే కదా- అందిస్తున్నదీ..?! ఇదంతా ‘ధర’కు దొరికే విద్య. ధరలేని విద్యను సర్కారీ బడుల్లోనే అందిస్తారు. ఈ ‘తప్పని సరి ఇంగ్లీషు విద్య’-కొనలేని వారికి మాత్రమే ఉపకరిస్తుంది. ఈ బడుల్లో చదవివే వాళ్ళు పేద వర్గాల వారు.
కాస్సేపు ‘వర్గాల’ పరదాలు తొలగిస్తే, ప్రయివేటు, కార్పోరేట్‌ స్కూళ్ళల్లో అధికంగా చదివేవారు, పై కులాలవారు. ప్రభుత్వ బడుల్లో (ప్రభుత్వ కళాశాలల్లో కూడా) చదివేది కింది కులాల వారు. అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఇలా అక్షరాల్లో… మరీ ముఖ్యంగా తెలుగు అక్షరాల్లో చదివితే ఈ నిర్ధారణ నమ్మబుధ్ది కాదు. ఈ వాస్తవాల్నే ఇంకోరకంగా అంకెల్లో పరికిద్దాం. ఆంధ్రప్రదేశ్‌ మొత్తం మీద ఇంగ్లీషు మీడియంలో ఈ పాఠశాల విద్యను చదువుతున్నవారిలో అగ్రవర్ణాల వారు 80 శాతం. కానీ ఎస్సీల్లో 49 శాతం, ఎస్టీల్లో 39 శాతం మాత్రమే వున్నారు. (వీరు కూడా ఎక్కువగా నాసిరకంగా ప్రయివేటు కాన్వెంట్లలో చదివే వారే ఎక్కువ.) అంటే ‘తప్పనిసరి గా ఇంగ్లీషు మీడియం’ చదవాల్సి వస్తే, అది అణగారిన కులాలకే వర్తిస్తుంది. ఈ వర్తింపు -ప్రయోజనం- అని ఆయా వర్గాల వారు ఎప్పటినుంచో భావిస్తుంటే, ఇప్పటికి ఈ సర్కారు నిర్ణయం తీసుకుంది.
ఒకప్పుడు బ్రిటిష్‌ పాలనలో, ఇదే తీరాంధ్రలో, అప్పటి ఇంగ్లీషు మీడియం విద్య వల్ల అధిక శాతం లబ్ధి పొందింది కూడా పైవర్ణాల వారే. అయినప్పటికీ, ‘తప్పని సరి’గా ఇంగ్లీషు మీడియంలో చదవటం వల్ల ఎస్సీలూ, ఎస్టీలూ కూడా అంతో, ఇంతో పరిమితంగా విద్యావంతులయ్యారు. కానీ తర్వాత తర్వాత ఇంగ్లీషు మీడియం విద్య ‘ప్రయివేటు రెక్కలు’ తొడుక్కుని, వీరు ఎగరలేనంత ఎత్తుకు ఎగిరిపోయింది.
ఇప్పుడు రాక, రాక, ఆ అవకాశం వస్తే, తెలుగు అంతరించి పోతోందని ‘తెలుగు భాషాభిమానులు’ కొందరు (అవును. ఆ కొందరే!) బాధపడ్డారు. విద్య అంటే ఉపాధి- అని నిర్వచనం అందరికీ ఒకేలా వర్తించాలి కదా! కానీ కింది వర్ణాల వారికి వచ్చేసరికి విద్య అంటే – ఉపాధి కాకుండా భాష- ఎలా అయ్యిందీ..!
మొత్తానికి హైకోర్టు లో ‘ఇంగ్లీషు మాధ్యమం తప్పనరి’ చెయ్యటం సరికాదన్న పిటిషనరు( సుధీష్‌ రాంభొట్ల, శ్రీనివాస్‌ గుంటుపల్లి) వారు చెప్పిందేమిటంటే, తొలిసారిగా బిడ్డల్ని పాఠశాలకు పంపిస్తున్న బీద తల్లిదండ్రులు ఇంగ్లీషులో వారికి సహాయ పడలేరు కదా! అవును. ఒకప్పుడు సంస్కృతంలోనూ కూడా సహాయ పడలేక పోయారు. వేద విద్యకు నోచుకోలేక పోయారు. (అందుకేనేమో .! వింటే చెవుల్లో సీసం పోయాలని అప్పట్లో తీర్పులు చెప్పారు.!?).
-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 18-25 ఏప్రిల్ 2020 సంచిక లో ప్రచురితం)

6 comments for “‘ఊరు వెలుపలే’నా… ఈ ‘తెలుగు’ తబలా..!?

Leave a Reply