.కరోనా! కరోనా! ప్రపంచ దేశాల నోట కరోనా నామ స్మరణే. వచ్చేస్తే, ‘వచ్చేసింది బాబోయ్’ అని. రాకుంటే ‘ఎప్పుడొస్తుందో..ఏమో!’ అని. ఇది దేశాధినేతల బాధ. ఇక ప్రజల తీరు వేరు. మన దేశంలో అయితే, 135 కోట్ల మందిని గృహనిర్బంధం చేశారు. వారూ ‘కరోనా’నే జపిస్తున్నారు. ఒకప్పుడయితే ఒక ఇంటి గోల ఒక ఇంటికి వినిపించేది కాదు. కానీ, ఇప్పుడలా కాదు. ఇంటి గోడలకు చెవులే కాదు, కళ్ళూ, నోళ్ళూ వచ్చేశాయి. నెట్టు పుణ్యం. ఇంటర్నెట్టు పుణ్యం. ఇంకా ఇంటర్నెట్టేమిటి కానీ, ‘ఇంటి’ర్నెట్టు- అని అనుకోవచ్చు కదా! మరీ ముఖ్యంగా ఈ మాట మధ్యతరగతి వారికి బాగా వర్తిస్తుంది.
అందరూ ఇంటిపట్టునే వుంటున్నారేమో…! ఉన్న కళలు సరే… లేని కళలు తన్నుకొచ్చేస్తున్నాయి. ఎవరికి వారే గాయకులయి పోతున్నారు. వీరి స్వరాలు విన్నాక.. వీరి సేవల్ని ప్రభుత్వాలు ఎందుకు వినియోగించుకోవటంలేదో- అన్న అనుమానం కలుగుతుంది. అనవసరంగా పోలీసులకు లారీలు ఇచ్చి, రోడ్ల మీద నిలబెట్టి, లాక్ డౌన్లనూ, కర్ఫ్యూల నూ అమలు జరుపుతున్నాయి. అలాకాకుండా ఈ ‘గార్ధభ గాయకులకు’ మైకులిచ్చి సెంటర్‌కొకర్ని నిలబెడితే.. ఒక్కడు రోడ్ల మీదకు వస్తే వొట్టు.
ఇక కవులు మాత్రం తక్కువ తిన్నారా..? మీటర్ల లెక్కన కాదు..కిలోమీటర్ల లెక్కన ఫేస్ బుక్ లాంటి‘సోషల్ మీడియా’ ప్లాట్ ఫాంల మీద పరిచేస్తున్నారు. దానికి తోడు కొన్ని పత్రికలు కూడా ఊతమిస్తున్నాయి. ఎలాగూ పంపిణీ వ్యవస్థ లేక కొన్ని దిన పత్రికలు దెబ్బతిన్నాయి. కవిత్వం ముఖం కూడా చూడని, సాహిత్యానికి ఒక పేజీ కూడా పరవని ఓ ప్రముఖ దినపత్రిక ఏకంగా కవితల పోటీ నిర్వహిస్తోంది. దాంతో ‘రూపాయి ఖర్చులేని అక్షర దానమే కదా’- అని చేసి పారేస్తున్నారు కవులు. చూడ బోతే లోకకళ్యాణార్థం- ఈ పత్రిక ముందు చూపుతో వ్యవహరిస్తోందేమో- అనిపిస్తోంది. రేపు కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చి, క్వారంటెన్ సెంటర్ల కిటకిట లాడిపోతే… కొత్తవారికి చోటివ్వలేక..ప్రభుత్వాలు తల పట్టుకుంటే ఎలా..? ఈ ఆలోచనే ఆ పత్రికను ఈ మహాయజ్ఞానికి పురికొల్పివుండాలి. ఇలా పోటీల్లో గెలిచిన కవుల జాబితాను అధికారులు ముందుంచుకొని, ఒక్కొక్కర్నీ ఒక్కొక్క రోజు క్వారంటైన్ సెంటర్లకు తిప్పి, కవితా గానం చెయ్యిస్తే చాలు, బెడ్లన్నీ ఎప్పటికప్పుడ ఖాళీ అవుతాయి…! వేరేలా కాదు..! వారంతా స్వస్థత పొంది డిశ్చార్జి అవుతారని. అందుకనే ఒక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుగానే- కరోనా మీద – కవిత్వం రాయమని పురి కొల్పారూ..!
మృత్యుభయాన్ని మించిన భయం వుండదంటారు. కరోనా ఈ భయాన్ని టన్నుల కొద్దీ కలిగిస్తోంది. కానీ ఈ భయమే మనుషుల్ని సంస్కార వంతుల్ని చేస్తుందంటే ఆశ్చర్యంగానే వుంటుంది. ఆ లెక్కన చూస్తే కరోనా ‘టూ ఇన్ వన్’లాగా వుంది. టాలీవుడ్ వాళ్ళకి ఈ పాటికే కొత్త స్టోరీ లైన్స్ వచ్చేసి వుంటాయి.‘నేనే రాజు- నేనే మంత్రి’ మాదిరిగా ‘నేనే హీరో- నేనే విలన్’ అనే టైటిల్ తో కరోనా మీద చిత్రాన్ని చిటికెలో తీసెయ్యగలరు. కబళించటంలో చిన్నా,పెద్దా;ముసలీ ముతకా, ధనికా పేదా.. తేడాలు పాటించటం లేదని ఒక పక్కఅనిపిస్తోందా? అలాగే సంస్కరించటంలోనూ అదే పని చేస్తోంది.
ఈ సంస్కరణలు పలు కోణాల్లో వున్నాయి. కుల, మత, వర్గ,జెండర్, ప్రాంత, జాత్యహంకరాలతో ఊగిపోయిన వారి తిత్తులు తీసి మరీ కూర్చోబెడుతోంది. ఒకప్పుడు కొందరే అస్పృశ్యులు. ఇప్పుడు ప్రతీ వాడికీ పక్క వాడు అస్పృశ్యుడే. నిజంగానే కుల వ్యవస్థ మీద ‘కరోనా’ వేసిన సెటైర్ ఇంత వరకూ ఎవ్వరూ వెయ్యలేదు.ఒకప్పుడు ‘పంచములు’ అనబడే వారు ఊరు లోపలకి వస్తే, మెడకు ముంత కట్టు కోవాల్సి వచ్చేది. ఎందుకూ వారి ఉమ్మి వస్తే, అందులో వుండే నీటి బిందువులతో పవిత్ర భూమి పంకిలమవుతుందని. మరి ఇప్పుడూ…? ముంత బదులు మాస్కు ధరించాలి. లాలాజల బిందువులోనే.. కోవిద్-19 అనబడే కరోనా వైరస్ కొన్ని రోజుల పాటు జీవించి వుండగలదు. ‘పంచముల్ని’ తాక రాదు. వారికి కనీసం ఇప్పటిలాగే మూడు మీటర్ల దూరంలో వుండాలి. మరి ఇప్పుడో..! ఇల్లు దాటి బయిట కొస్తే చాలు ‘అగ్రహారికుడు’ కూడా ‘పంచముడే’. కరోనా! ఎంత పెద్ద శిక్ష వేసావే!!
మతమంటారా..? గాలిలోంచి విభూది, నీటి నుంచి పెట్రోలూ తీసే స్వాములేరీ..? అరచి గీ పెట్టి, ప్రార్థించి, మనుషులను దొర్లించి, స్వస్థత చేకూరుస్తామన్న బోధకులేరీ..? స్త్రీలకు ముసుగులు వేసి,తాము మాత్రమే దైవసన్నిధికి వెళ్ళి కాళ్ళు ముడిచే భక్తులేరీ..? వీరు ఏం పంచుకుంటూ తిరుగుతున్నారు…?ఔషధాన్నా..? రోగాన్నా…? గోమూత్రాలూ, ప్రార్థించిన కొబ్బరి నూనెలూ, తాళ్ళూ, తావీదులూ…ఏమయ్యాయి? ఎప్పుడో మలేరియా కు మానవమూర్తి కనుగొన్న ‘హైడ్రాక్సీ క్లోరొక్విన్’ నే పంపమని భారత్‌ను ప్రపంచ దేశాలు కోరాయి కానీ, పైన పేర్కొన్న మంత్ర సామగ్రిని కావు.
సంపన్నుడూ వణికి పోతున్నాడు, రాజూ వణికి పోతున్నాడు, బ్రిటిష్ రాకుమారుణ్ణీ, ప్రధానినీ కరోనా వణికించేసింది; రోడ్డు పక్క సామాన్యుణ్ణీ మట్టి కరిపించేసింది.
వంటింటితోనాకేమి పని- అని వీధుల్లో తిరిగిన పురుషాహంకారులను వంటిళ్ళల్లోకి పంపించింది. ‘నేను చేసిన బిర్యానీ ఇది; నేను చేసి దద్దోజనం ఇది’ అని ఫేస్ బుక్ పోస్టుల్ని పెట్టిస్తోంది.
అగ్ర రాజ్యాలనూ, ఉగ్రరాజ్యాలనూ గజగజ లాడించింది.
కానీ మాయావి ‘కరోనా’ కూడా పక్షపాతే. నెల రోజులు కాదు, వారం రోజులు ఇళ్ళల్లో ఉండిపోతే… ఇళ్ళల్లోనే శిధిలమయ్యే బతుకులు కోటాను కోట్లు. ఒళ్ళమ్ముకుని జీవించాల్సిన తల్లులు, తమ శరీరాలను ‘నెట్’ లో ప్రదర్శించి, చిల్లర పంపించమంటున్నారన్న వార్తలు చదువుతుంటే, తడవటానికి కళ్ళల్లో నీళ్ళు కూడా లేవు. గాయాలను కడిగే సిస్టర్లూ, మురికిలో దిగే ‘పారిశుధ్ధ్య కార్మికులూ’ (ఎదురు పడితే, సమాజం వారిని పిలిచే పిలుపులు వేరు), కింది కులాలూ, వర్గాలనుంచే వచ్చే కానిస్టేబుళ్ళూ.. మృత్యువును ఇప్పుడు మరింత దగ్గరగా చూస్తున్నారు. సమాజం అస్థిపంజరాన్ని సమాజానికి చూపి పగలబడి నవ్వమంటోంది కరోనా..! వెక్కి వెక్కి ఏడ్వమంటోంది కరోనా..!
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక తాజా సంచికలో వెలువడిన సంపాదకీయం)
అద్భుతం సర్….
కరోనా గురించి ఎవరెన్ని రాసినా….మీ తరువాతేగా..
కరోనా నీకు వందనాలు
కులం మతం లేకుండా మనుషులందరూ
సమానం అని చాటి చెప్పింది
Corona is corona which equals all. As you said sir there are too many comparisons from history to now. Some lifes can be defined as before corona and after corona.
కరోనా ….. బయటికోస్తే ..అగ్రహరికుడు కూడా పంచముడే పంచ్ అదిరింది సార్
కరోనా ….. మనుష్యులు ఇంటి నుండి బయటికోస్తే ‘అగ్రహరికుడు’ కూడా ‘పంచముడే’ పంచ్ అదిరింది సార్ supper