కరోనా పక్కనే కల్చరల్‌ వైరస్‌ కూడా!

కరోనా. లోకంలో ఈ మాట తప్ప మరొకటి వినపడటం లేదు. మరో మాట వినటానికి కూడా లోకానికి ఇష్టం లేదు. కరోనా అసలు పేరు కోవిద్‌-19. ఇదో ఒక వైరస్‌ పేరు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఈ ఒక్క వైరస్‌ తో యుధ్ధం చేస్తున్నాయి. మందు లేని రోగం. మందు కనుగొనటానికి సమయమివ్వని జాడ్యం. ఎక్కడ నుంచి వచ్చిందో కూడా కనిపెట్టేటంత ఆస్కారాన్ని కూడా ప్రపంచానికి ఇవ్వలేదు. ఈ రోగం బారిపడిన రోగుల్ని తొలుత చైనాలో గుర్తించారు కాబట్టి,చటుక్కున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ వైరస్‌ మీద కూడా ‘మేడిన్‌ చైనా’ అని రాసెయ్యబోయారు. ‘చైనా రోగం’ అని అనేశారు కూడా. ఒక సారి కాదు. రెండో సారి కూడా. ఆ తర్వాత కానీ ఆయనకు అర్థం కాలేదు. ఇది ‘జాత్యహంకార’ విమర్శ అని.

ఇక మనకు సోషల్‌ మీడియా వుండనే వుంది. ఇది సంప్రదాయక మీడియాలా కాదు. పత్రికలో, టీవీలో అయితే ధ్రువపడ్డ పుకారులో, లేక వినవస్తున్న పుకార్లో రాస్తాయి, చూపిస్తాయి. కానీ సదరు ‘ఫేస్‌ బుక్‌’, ‘వాట్సాప్‌’ తదితర సామాజిక మాధ్యమాలున్నాయే…! వాటిలో ఘటనలూ, పుకార్లు కాదు… కేవలం కోరికలే వార్తలవుతాయి. ఈ ‘వైరస్‌’ చైనావాడే కనిపెట్టి వుంటే బాగుండును.’ అన్నది కోరికే. ఈ కోరిక పుట్టగానే కారణం కూడా కనిపెట్టేస్తాడు ామన సామాజిక మాధ్యమజీవి: ‘అడ్డమైన జంతు, క్రిమి, కీటక భక్షణ చేస్తే రాదూ మరి!’ అని.  ఈ కారణాలేమీ శాస్త్రజ్ఞులు ప్రకటించ లేదు. కాకుంటే జంతువులతో కలసి వుండటం వల్ల వచ్చిన వ్యాధిగా నిర్ధారించారు. చికిత్స లేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నెత్తీ నోరూ బాదుకుని చెప్పవచ్చు. కానీ మన సోషల్‌ మీడియా వాళ్లు మందు వుంటే బాగుండుననీ, అది గోమూత్రమో, లేక ఏ ఆయుర్వేద ఔషధమో అయివుంటే బాగుండుననీ కోరుకుంటారు. వెంటనే, ఆ కోరికను ఔషధంలాగా ప్రచారం చేస్తారు.
ఇక మన దేశానికి ఈ రోగాన్ని ఎవరు తెస్తున్నారు? అంటే విదేశాలనుంచి మనదేశం వచ్చేవారు. ఇలా అనగానే ఏదో ఒక మైనారిటీ మతానికి చెందిన వారి వల్ల వస్తుందని చెబిదే బాగుండననే కోరిక ఇలా పుట్టేస్తుంది. వారి పుణ్యక్షేత్రం దేశం కానీ దేశంలో వుంది కాబట్టి, అక్కడికి వెళ్ళిన వారి వల్లనే వచ్చిందని సామాజిక మాధ్యమాల్లో ఈ వైరస్‌ గురించి ‘వైరల్‌’ చేస్తారు. వీళ్ళంతా చదువులు వెలగబెట్టిన వాళ్ళే. వీళ్ళ బంధు మిత్రుల్లో ఎవరో ఒకరు, ఉద్యోగం నిమిత్తమో, చదువు నిమిత్తమో పరసీమల్లో వున్న వారే. తీరా చూస్తే, మన దేశంలో అన్ని రాష్ట్రాలలోనూ తొట్ట తొలుత నమోదవుతున్న కోవిద్‌-19 పాజిటివ్‌ కేసుల్లో అధిక శాతం వీరే.
ముందు చైనా దేశం కకావికలమైనా, తర్వాత ఈ మహమ్మారి ఐరోపా ఖండాన్ని చుట్టబెట్టేసి, అమెరికాలో తిష్ట వేసింది. ఇటలీ, స్పెయిన్‌లలో మృత్యువే పహారా కాస్తోంది. ఇప్పుడు యావత్‌ ప్రపంచాన్ని వణికించేస్తోంది.ఒకప్పుడు ‘రవి అస్తమించని సామ్రాజ్యం’గా బ్రిటష్‌ సామ్రాజ్యాన్ని గుర్తించే వారు. ఇప్పుడు బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌, ప్రధాని బోరిస్‌ జాన్‌సన్‌ సైతం కరోనా బారిన పడ్డారు. ఇప్పుడున్నది ‘రవి అస్తమించని ‘కరోనా’ సామ్రాజ్యమే. ఇక ఇప్పటి ఏకైక అగ్రరాజ్యాన్ని కూడా కరోనా గడగడ లాడిస్తోంది. న్యూయార్క్‌ నగరం గాలి సోకితే చాలు, అందులో ‘కరోనా’ వుందేమోనని అనుమానిస్తున్నారు. ఎప్పుడూ కిటకిట లాడే టైమ్ స్క్వేర్‌ లో పిట్ట కనిపిస్తే వొట్టు. ఈ దేశాల్లో వుండే మన దేశీయులు, విమానయానం ఆగిపోయేంతవరకూ వస్తూనే వున్నారు. ఎంతో మంది క్రమశిక్షణతోనే వున్నారు. కానీ వీరిలో కొందరు పరీక్షలను తప్పించుకుంటున్నారు. ‘క్వారంటీన్‌’ చేద్దామంటే, తమకు తామే తమ ఇళ్ళ దగ్గర ‘స్వీయ నిర్బంధం’ లోకి వెళ్తామని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే దేశభక్తి ప్రపూరితమైన ‘టాటూ’ లాంటి మార్కు ‘ముంజేతి మీద వేసి’ మరీ పంపించారు. చెరిపేసినా 20 రోజుల పాటు చెరగని సిరా (వోటు వేసిన ప్పుడు వేలు మీద వెయ్యటానికి వినియోగించే ఇంకు) తో ఈ ముద్ర వేస్తున్నారు. ఆ ‘ముద్ర’లు వేసుకునే స్వేఛ్చగా తిరుగుతున్నారు. విశేషమేమిటంటే, సోషల్‌ మీడియాలో ‘వార్తల సృష్టి కర్తలు’న్నారే… ఈ వ్యాధి వీరి వల్ల ప్రబలుతోందని పొరపాటను కూడా అనరు.
ప్రధాని మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రుల వరకూ దండం పెట్టి మరీ చెబుతున్నారు-‘సామాజిక దూరాన్ని’ పాటించండి- అని. వీరెవ్వరూ వినరు. వీలు దొరికితే వీరందరూ, దేశభక్తి మీద లెక్చర్లు దంచేవారే.
ప్రధాని నరేంద్ర మోడీ వీరికి ఈ మధ్య పరీక్షే పెట్టారు. ఒక రోజు (మార్చి22)ను ‘జనతా కర్ఫ్యూ’ ఐచ్చికంగా పాటించాలని పిలుపు నిచ్చారు. ఆ రోజు ఆదివారం కూడా అయ్యిందేమో. ‘సామాజిక మాధ్యమాల’ మీద ప్రధానంగా ఆధారపడే నగర మధ్యతరగతి వర్గం గొప్పగా స్పందించింది. సెలవురోజు కావటం వల్ల ఆలస్యంగా లేచి మధ్యాహ్నం బ్రేక్‌ ఫాస్టూ, సాయింత్రం మూడుగంటలకూ లంచూ చేసేటప్పటికి అయిదయి పోయింది. అంతే. ప్రధాని పిలుపు మేరకు, బాల్కనీల నుంచి ‘చప్పట్లూ, తాళాలూ’ మోతెక్కించేశారు ఈ ‘సామాజిక మాధ్యమాధారిత సగటు జీవులు’. వీటిని కృతజ్ఞత కు చిహ్నాలని ప్రధాని చెప్పారు. మనం ఇళ్ళల్లో వుంటే, మనకోసం ప్రాణాలకు తెగించి ‘కరోనా’కు ఎదురు వెళ్తున్న వైద్యులకూ, నర్సులకూ, వైద్యసిబ్బందికీ, పోలీసులకూ, పారిశుధ్ధ్య కార్మికులకూ-మనం రుణపడి వున్నట్టుగా చేసే ప్రకటన- అని కూడా ఆయన తాత్పర్యం చెప్పారు. ఆ తర్వాత కానీ తెలియలేదు. అది రాబోయే 21 రోజుల ‘లాక్‌ అవుట్‌’ కు డ్రెస్‌ రిహార్సల్‌ అని.
తీరా అసలు పరీక్ష వచ్చేసింది. ఈ చప్పట్లు కొట్టిన బాపతు సగటు జీవులే, తమ తమ ఫ్లాట్లనుంచి వైద్యుల్నీ, నర్సుల్నీ ఖాళీ చేయించటం మొదలు పెట్టారు. ఎవరు రోగం మీద యుధ్ధం చేస్తున్నారో, వారి ద్వారానే, రోగం వస్తుందని. అంతే కాదు, విదేశీయానం చేసొచ్చి రోడ్ల మీద తెగబడి తిరుగుతున్నవాళ్ళని అదుపు చేస్తున్న పోలీసుల లాఠీ చార్జీని తమ ‘మొబైల్స్‌’తో చిత్రించి, చూశారా.. వీళ్లు గూండాలా? పోలీసులా?’ అని అంటూ ఇవే మాధ్యమాల్లో తిట్లూ, శాపనార్థాలు.(కొందరు అతిగా ప్రవర్తించవచ్చు.రోగం వ్యాప్తి చేస్తూ యధేచ్ఛగా తిరగటం అంతకు మించి అతి.)  గుమిగూడి రాష్ట్ర సరిహద్దులు దాటుతున్న వారిని నిలుపు చేస్తే పోలీసుల మీద దాడులు అతికి మించిన అతి. అన్ని దేశాలకూ ‘కరోనా’ ఒక్కటే వైరస్‌. మనదేశంలో ‘కరోనా’తో పాటు, అంతకన్నా ప్రమాదంగా మారుతుచన్న ‘కల్చరల్‌ వైరస్‌’ మీద కూడా యుధ్ధం చెయ్యాలి.
-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక28 మార్చి2020లో ప్రచురితం)

2 comments for “కరోనా పక్కనే కల్చరల్‌ వైరస్‌ కూడా!

Leave a Reply