చాసో పసివాడు కూడా..!

చిత్రం: అన్వర్

చాసోకి చుట్టకాల్చడం ఇష్టం. అంతకన్నా కథలు రాయడం మరీ యిష్టం. ఎన్ని చుట్టలు కాల్చాడో లెక్కలేదు. కథలు మాత్రం కొన్నే రాశాడు. ఆ కొన్నింటిలోనూ సగం చించి పారేశాడు. నచ్చిన కథలు నలభై దాటతాయేమో. అంతే.

చుట్ట సొంత సుఖం. చాసో లెక్క ప్రకారం సొంత సుఖానికి ఆట్టే ఆనందం వుండకూడదు.

కానీ, చాసోకి చుట్ట కలల్నిస్తుంది. కథల్నిస్తుంది, కథల్నిండా సామాజిక దుఃఖాలూ; ఆ దుఃఖాలకి కారణాలూ; కారణాల మీద తన కత్తిగాట్లు. అంతా యుద్ధమే. చాసో చుట్ట యుద్ధనౌకకుండే పొగగొట్టం. పొగ కొద్దీ వేగం. వేగం పెరిగే కొద్దీ ఆనందం.

చాసో కథ రాస్తున్నంత సేపూ తన చుట్టూ ఆనందం గువ్వ పిట్టలాగా గుబాళిస్తుంది.

చాసో చుట్ట ఆరిపోవచ్చు. నౌక ఆగడానికి నాలుగడుగులు ముందే చిట్టచివరి పొగ నల్లమబ్బుల్లో కలిసిపోయినట్లు కనిపించవచ్చు.

అంతా అబద్ధం. ఇక నుంచి చాసో కథ ‘అడ్డచుట్ట’ (నిప్పున్న వైపుని నోట్లో పెట్టుకుని కాల్చడాన్ని అడ్డ చుట్ట అంటారు) అది లోలోపల వెలుగుతుంది. చుట్టూ ఎంత తేమ ఆవరించినా నిలిచి కాలుతుంది. దరిద్రం గురించి పరమ దరిద్రంగా రాసిన వాళ్ళు చాలా మంది వున్నారు. చాసో మాత్రం సంపన్నంగా రాసాడు. అలా రాయడాన్ని శిల్పమంటారు కాబోలు.

నవ్వులూ, పలకరింపులూ, నమస్కారాలూ అందరివీ ఒక లావుండవు. ఎందుకూ? ఎవరి సంస్కారం వాళ్ళదని సరిపెట్టుకోవచ్చు. సంస్కారం కిటుకు కూడా డబ్బులో వుందంటాడు చాసో. యజమాని కూలీని ఒక లాగా పలకరిస్తాడు. మధ్యతరగతి వాడి మందహాసం మరోలా ఉంటుంది. సకల హావ భావాలను మేకప్పు చేస్తున్నది డబ్బు. చాసో ఈ లోగుట్టును విప్పుతాడు. అయితే ఈ ఆర్థిక జీవన విశ్లేషణ… కథలో అంతర్వాహినిగా నడవడం చాసో విశేషమంటాడు ఆరుద్ర. అంటే చాసో పనిగట్టుకుని వర్గ స్పృహ మీద కథల్లో ఉపోద్ఘాతాన్ని, ఉపన్యాసాలూ దంచలేదన్న మాట. మబ్బులు తమంతట తాము విడిపోయినట్లుగా చాసో కథల్లో వర్గ నైజాలు తేటతెల్లమౌతాయి.

‘డబ్బుచేసిన’ మిత్రుడు ఒకడు ఊటీ కథ రాయాలనుకుంటాడు. నెలసరి ప్రియురాళ్ళతో కథలు నడపడం వచ్చు కానీ, వాడికి కథలు రాయడం రాదు. నెల రోజులూ తనతో హాయిగా గడపడం మానేసి, పెంపుడు కుక్క చచ్చిందని ఏడ్చిందట వాళ్ళల్లో ఒక ప్రియురాలు. ఆ ఏడుపు కూడా తన ఖర్చు మీద. కులకాల్సిన డబ్బుతో కుమిలిపోయి, తన కన్యాయం చేసిందంటాడు వాడు. చూశారా! ఏడ్పుల వెనకాల డబ్బు ఎంత చక్కగా దాక్కుందో! అదే ‘బూర్జువా కుక్క’ కథయిది. ఈ కథని చెప్పి రచయితని రాయమంటాడా మిత్రుడు. ”ఆ వర్గ జీవితాన్ని దులపవలసిన రీతిగా దులిపి దులిపి రాసాను” అంటాడు రచయితా. అదే చాసో లక్ష్యం.

ఆయన రకరకాల వ్యక్తుల మీద కథలు రాశాడు. ఒక కథకీ ఇంకో కథకీ పొంతనే ఉండదు. అంతటి వస్తు వైవిధ్యం మరి. కొడవటిగంటి కుటుంబరావు గారు చాసో కథల్ని అయిదు విభాగాలు చేస్తాడు:

-ప్రేమకూ కుటుంబజీవితానికి సంబంధించినవీ;

-దారిద్య్రం, దోపిడీ, రాజకీయాలూ;

-వేదాంతమూ, దేవుడూ;

-పిల్లలూ;

-ప్రకృతి చిత్రాలూను.

కావాలంటే మరో రెండు విభాగాలు పెట్టుకోవచ్చు. ఏ విభాగంలోనైనా అదే లక్ష్యం; వర్గ నైజాన్ని బయట పెట్టడం.

ప్రేమ ప్రకటించుకోవాడికీ, డబ్బుకీ సంబంధం వుంటుందా? ఉంటుందంటాడు చాసో. జబ్బుపడి లేచిన భార్యకి ఇష్టమయింది కొనిపెట్టాలి. భర్త కొంటాడు. జరీ అంచు చీర. కాని ఎలా? ఆమెకంత కంటే ఇష్టమైన ఫిడేల్‌ని అమ్మేసి. బాధపడుతుందామె. కానీ భర్తను బాధపెట్టదు. తల్లి (ఫిడేల్‌) వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ తల్లి తల్లిగుణాన్ని చూపించుకొంది. నాకు ప్రాణం పోసింది. వెళ్ళిపోతూ నాకో చీరారవికల గుడ్డా పెట్టింది” అనంటుంది. ఒక కన్ను కాపాడుకోవడానికి మరో కన్నును బలి పెట్టాలి. ఇదే దరిద్రం.

ఈ స్థాయిలో కథ చెప్పడం ‘గిఫ్ట్‌ ఆఫ్‌ ది మాగీ’ రాసిన ఓహెన్రీకి మాత్రమే చెల్లుతుంది. అందులోనూ అంతే. భార్యభర్తలు ఒకరికొకరు క్రిస్మస్‌ బహుమతులిచ్చు కోవాలనుకుంటారు. ఆ బహుమతులతో ఒకరినొకరు గాయపరుచుకుంటారు. అది కూడా దరిద్రం నడిపిన ‘పారడాక్సే’ కానీ, చాసో కలిగించిన వర్గస్పృహని ఓ హెన్రీ కలిగించలేడు.

ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ‘అక్రమ సంబంధం’ వుందని తేలిగ్గా అనెయ్యవచ్చు. కానీ తిండీ తిప్పలకీ నీతి నియమాలకీ సంబంధం ఉంది. దరిద్రాన్నుంచి భర్తనీ, పిల్లల్నీ దాటవెయ్యడానికి శరీరాన్ని తాకట్టు పెడుతుంది ఓ భార్య. తప్పు. పెద్ద తప్పే. కానీ భర్త కరుణాకరం చాలా గొప్పవాడయిపోతాడు. అతడికి ‘నైట్‌ హుడ్‌” వస్తుంది.

”నేను నైటు గారి సతీమణిని. రేపణ్ణుంచి నేను గవర్నరు సతితో విందులకెళతాను. ఐయామ్‌ లేడీ కరుణాకరం. ఏమంటారు?”

తప్పు ధనస్వ్యామ సూత్రాలది కాబట్టి, ఆవిడ ‘మహాపతివ్రతే’ నంటాడు చాసో బాధగా.

”బదిలీ” అనే మరో కథలోనూ ఇలాంటి అక్రమ సంబంధం గురించే చెబుతాడు. అసలు మనిషికీ మనిషికీ మధ్య వున్న ఆర్థిక సంబంధమే అక్రమ సంబంధం. సమ సమాజంలో మాత్రమే మనిషిని మనిషి నిష్కపటంగా ప్రేమించే క్రమసంబంధాలు ఏర్పడతాయన్నది చాసో సిద్ధాంతం.

”మీ అత్తారు స్థితి పరులట. మీకు ముద్దూ ముచ్చటా తీరుతుంది” దగా చేసిన ప్రియుడితో ఒక గృహిణి ఆడిన వెటకారమిది. భార్య అందవికారంగా ఉన్నా” స్థితిని బట్టే ముద్దు వుంటుందని వెక్కిరింత నిజమే కదా!

”కుంకుడాకు” అనేది పిల్లల కథే కావచ్చు. ఇద్దరు పిల్లలుంటారు. ఒకమ్మాయి పారమ్మ; ఇంకో అమ్మాయి గవిరి.

”పారమ్మ మెడలో పగడాలున్నాయి. చేతులకీ, కాళ్ళకీ సిల్వరు కడియాలున్నాయి. గవిరి ముక్కు గోక్కుంది. దాని ముక్కులో రాగి కాడలున్నాయి”

ఇక అర్థమయిపోతుంది కదా చాసో కథ ఎలా నడిపిస్తాడో! ఇద్దరూ పొలం వెళ్తారు.

”గవిరి కూలివాడి కూతురు. పొలాల్లో పడి దొంగతనంగా తినడానికి ధైర్యం చాలదు” నిజమే. దొంగతనానికి చొరవ ఉండాలి. దానికీ స్థితికీ లింకుంది. గొప్పవాళ్ళు చేస్తే పెద్ద దొంగతనం సైతం కమ్ముకుపోతుంది. బీదవాళ్ళు చిన్న దొంగతనాలు చేసినా పెద్ద నేరాలౌతాయి. అందుకే గవిరికి ధైర్యం చాల్లేదు.

ఇదే తేడా టిక్కెట్టు లేకుండా రైల్లో ప్రయాణించే పేదదయిన ముసిల్దానికి, ఆమెను పట్టుకున్న రైల్వే ఉద్యోగికీ వుంది.

రైల్లోంచి అన్నవరం సత్యనారాయణ మూర్తి ఆలయం… లంచాలు మరిగిన రైల్వే ఉద్యోగికి రాజహంసలా కనిపిస్తే, ముసిల్దానికి.. ఎంతచూసినా తుమ్మడొంకే కనిపించింది. చాసో ఏ కథ రాసినా ఈ ‘కాంట్రాస్ట్‌’ తప్పదు.

కడకు ముష్టి వాళ్ళ కథలో కూడా ఆర్థిక సంబంధాల్ని పట్టుకున్నాడాయన. ఒక ముష్టివాడు తన కూతురికి భర్తగా ఒక గుడ్డి ముష్టి వాణ్ణి తెస్తాడు. ఎందుకంటే ”గుడ్డోడు మారాజు. కళ్ళు లేని కబోది. ఆడి జనమ కదొక్కటే శాన. ఆణ్ణి చూస్తే జాలి పుడతాది. ఏ యమ్మేనా మనసు కరిగి ఇన్ని గింజలేస్తాది” అంటాడు. అదీ రహస్యం.

చాసో రాసిన పిల్లల కథల్లో గొప్పవి. ”చిన్నాజీ” ఎందుకు పారేస్తాను నాన్నా’ . ‘చిన్నాజీ’ ‘చిన్నాజీవినేనే” అంటారు చాగంటి తులసి. ఆవిడ చాసోగారి కూతురు. పిల్లల్ని అందరూ ప్రేమిస్తారు. కానీ చాసో, చెలంలే ఆ ప్రేమని ప్రపంచం పట్టనంతగా ప్రకటిస్తారు. చెలంగారి అమ్మాయి సౌరిస్‌.

కవిత్వానికి రూపం వుంటే ‘చిన్నాజీ’ (తులసి) లా వుంటుందంటాడు చాసో; సౌరిస్‌ లా వుంటుందంటాడు చలం.

”చిన్నాజీ మనం పిలిస్తే రాదు. ఉన్నత కవిత్వానికి మల్లే దాని రాకపోకలకీ మూడ్సు వున్నాయి” అంటాడు చాసో.

అయితే చాసోకీ, చెలానికి ఒక తేడా వుంది.

ప్రేమను, ప్రేమగానే వుంచుకొని చాసో తులసిని రచయిత్రిని చేస్తే, ప్రేమను, ఆరాధనగా మార్చుకొని చలం సౌరిస్‌ను ఏకగా ‘ఈశ్వరుణ్ణి’ చేసేశాడు. తులసిగారు కూడా చాసోలాగే కథల్లో శిల్పి.

శిల్పం అంటే సౌందర్యమే. ధైర్యం వున్నవాడు మాత్రమే సౌందర్యాన్ని ఆవిష్కరిస్తాడు. వెన్నెల్లో కారడవి చూడడానికి ధైర్యం వుండాలి.లేకపోతే ప్రతీరాయీ, రప్పా భయం గొలిపే ‘దుమ్ముల గొండె’ లా కనిపిస్తుంది. చీకట్లో, ఘాటీలో, పైకి ఎక్కే ప్రయాణాన్ని పిరికి వాళ్ళు సగంలో ఆపేసే కథని రాశాడు.

చాసో ధైర్యవంతుడు. చేప్పేది నిర్భయంగా నిర్మొహ మాటంగా చెపుతాడు. అందుకే కథలో సౌందర్యాన్ని ఆవిష్కరిస్తాడు. ఇ.ఎం.ఫాస్టర్‌ కథ ‘ది సెలిస్టియల్‌ ఓమ్నీ బస్‌” లో పసివాడు ధైర్యంగా వెళ్ళగలిగిన ఉన్నత కవితా శిఖరాలకి, ఒకానొక ప్రసిద్ధ సాహితీవేత్త చేరుకోలేకపోతాడు.

చాసో పసివాడు కూడా.

-సతీష్ చందర్

(సుప్రభాతం, ఫిబ్రవరి 1994)

సతీష్ చందర్ సాహిత్య విమర్శ ’నిగ్రహ వాక్యం‘ లో వుంది. ఈ గ్రంథం వెల: రు.250. హైదరాబాద్ ’నవోదయ‘, విజయవాడ ’విశాలాంధ్ర‘ పుస్తకాల షాపుల్లో దొరకుతుంది.

Leave a Reply