కారులో రేప్‌ చేస్తే, కొలిచి మరీ కోప్పడతారా?

మీడియాలో ముద్రితమైన ఇన్నోవా కారు.

కోపం.
రావచ్చు; తెచ్చుకోవచ్చు.
తెచ్చుకునే కోపాల్లో ఎక్కువ తక్కువలు వుండవచ్చు. ఎంత తెచ్చుకోవాలో అంతే తెచ్చుకునే స్థితప్రజ్ఞులు వుంటారు. అన్ని రంగాల్లోనూ కనిపిస్తారు. రాజకీయ నేతల్లో అయితే మరీను.
కానీ, వచ్చే కోపం అలా కాదే. అది తన్నుకుని వచ్చేస్తుంది. దానికెవరూ ఆనకట్ట కాదు కదా, కనీసం బరాజ్‌ కూడా నిర్మించలేరు. సాదా సీదా మనుషులకు వచ్చేవి ఇలాంటి కోపాలే నని అందరూ నమ్ముతారు. జనాగ్రహమంటే, ధర్మాగ్రహం అనుకుంటారు. ఇందులో ‘అధర్మాగ్రహం’ వుంటుందనే అనుమానం రాదు.
జనం జనంలాగే స్పందిస్తే బాగానే వుంటుంది. కానీ గుంపులు, గుంపులుగా స్పందిస్తారు. ఈ గుంపుల కోపాలకు కొలతలుంటాయి; కోటాలుంటాయి. తూనికలుంటాయి; తూకాలుంటాయి.


ఆడబిడ్డ మీద అత్యాచారం. అదీ సామూహిక అత్యాచారం.
ఈ మధ్య ఈ ఘటనలు పెరిగి పోతున్నాయి; దుండగులు పేట్రేగిపోతున్నారు.
ఈ ఘటనలు జరిగినప్పుడు నిజంగానే గుంపులకు కోపం వస్తుంది. ఈ కోపంతో పలు సందర్భాల్లో రోడ్ల మీద కొస్తున్నారు. బాధితురాలికి ‘న్యాయం’ చెయ్యమంటున్నారు. అక్కడితో ఆగటంలేదు. ఏది న్యాయమో కూడా తేల్చేస్తున్నారు. ‘మరణ శిక్షే’ న్యాయమంటున్నారు. అది కూడా ‘తక్షణం అమలు’ జరగాలంటున్నారు. దర్యాప్తులూ, విచారణలూ, వాయిదాలూ.. ‘న్యాయం’లో జాప్యాన్ని సహించలేమంటున్నారు. దొరికిన వాణ్ణి దొరికినట్లే కాల్చి పారెయ్యమంటున్నారు. దొరికిన వాడే నేరస్తుడా..? అన్న అనుమానాల జోలికి వెళ్ళొద్దంటున్నారు. ‘ఎదురు కాల్పుల’ ద్వారా పూర్తి చెయ్యమని పోలీసులను ఎగదోస్తున్నారు. దొరికిన వాళ్ళు పారిపోతూ, కాల్పులు జరిపితే కదా, ‘ఎదురు కాల్పులు’ జరిపేదీ (‘ఎన్‌కౌంటర్లు’ చేసేదీ)?
నిందితులు పారిపోకపోతేనో..? అసలు వారికి పోలీసులదగ్గర నుంచి పిస్తోళ్ళు లాక్కోక పోతేనో..? లాక్కొన్నా పోలీసులవైపు గురి పెట్టి పేల్చటం చేత కాక పోతేనో..?
‘ఏమో! ఇవన్నీ మాకు తెలీదు. పోలీసులే చూసుకోవాలి. దుష్టశిక్షణ చేసెయ్యాలి.’ ఇవీ గుంపుల డిమాండ్‌. చివరికి వారికి కోరిక నెరవేరిపోతుంది. అంతే. పోలీసులకూ, వారిని నడిపించిన అధికారులకూ పుష్పగుఛ్చాలిచ్చేస్తారు. ఈ ప్రశంసలకు అలవాటు పడ్డ పోలీసులు ‘మేం తీర్పు చెప్పటమేమిటి? దర్యాప్తు చేసి కోర్టులకు ఒప్పగించటం కదా మా విధీ..?’ అని గుంపుల ముందు అనరు. కానీ, ఎప్పుడన్నా కోర్టులు జోక్యం చేసుకుని, ఈ ‘ఎన్‌కౌంటర్‌’ ల మీద విచారణ జరిపిస్తే..?

మీడియాలో ముద్రితమైన సీన్ రికన్స్ట్రక్షన్ సీన్

‘దిశ’ అత్యాచారం, హత్య అనంతరం జరిగిన ‘ఎన్‌కౌంటర్‌’ కేసులో అదే జరిగింది. విచారణ చేపట్టిన కమిషన్‌, వివరాల్లోకి వెళ్ళితే, నిందితుల్లో కొందరు ‘మైనర్లు’ అని తేలింది. స్కూళ్ళ సర్టిఫికెట్లను తనిఖీ చేస్తే, వారి అసలు వయసు బయిట పడింది.
అత్యాచార నిందితులను కోర్టులు శిక్షించలేవా? తప్పించుకునే వాళ్ళు వుండనే వుంటారు.అందుకు కారణాలు వేరుంటాయి. బాధితురాలు సమాజంలోని బలహీన వర్గాలు, బడుగు కులాలకు చెందిన మహిళ అయతే, నిందితులు సులభంగా బయిటపడి పోతారు. ఐనా, అప్పుడప్పుడూ, అక్కడక్కడా అధికారుల నిబధ్ధత వల్లనో, లేక ఆందోళనకారుల వత్తిడి వల్లనో, కేసు దర్యాప్తు సవ్వంగా జరిగి ఈ తరహా కేసులు సజావుగా, కోర్టులకు చిక్కుతాయి. అక్కడ శిక్షలు కూడా పడతాయి. ‘నిర్భయ’ అత్యాచారం కేసులో శిక్షలు పడలేదా? ఉరి శిక్ష వేశారు కదా! అలాగే, ‘దిశ’ అత్యాచారం, హత్యకు కొన్ని రోజుల ముందే, తెలంగాణ రాష్ట్రంలోనే టేకులపల్లి లో బడుగు కులాలకు చెందిన మహిళ పై సామూహిక అత్యాచారం, చేసి చంపేశారు. కానీ, చిత్రం! అప్పుడు ఆ అత్యాచారం కేసులో ఈ గుంపులు లేదా సమూహాలు ‘ఎన్‌కౌంటర్‌’ చెయ్యాలని పట్టు పట్ట లేదు. కానీ ఆ కేసు కోర్టుకు వచ్చింది. అప్పుడు కోర్టు శిక్ష విధించింది.


పలు అత్యాచారం కేసులు నమోదే కావు. నమోదయిన కేసుల దర్యాప్తు సమయంలోనే వీగిపోతాయి. ఈ భయాలు సమూహాల్లో వుండి పోతాయి. దర్యాప్తు, విచారణ, శిక్ష – ఈ విషయాలు చట్టానికి వదిలేద్దాం. కానీ, స్పందన. ఒక అన్యాయం పట్ల వచ్చే ప్రజాగ్రహం. ఇక్కడ తూకం తప్పుతుందా? లేదా? ఇటీవల (28 మే 2022)న హైదరాబాద్‌ జూబిలీ హిల్స్‌లో అత్యాచారం జరిగింది. సామూహిక అత్యాచారమే. బాధితురాలు మైనరు బాలిక కూడా. కారులో జరిగిన సామూహిక అత్యాచారం. ఇందుకు సంబంధించి అయిదుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు మినహా మిగిలి వారు కూడా మైనర్లే. (‘దిశ’ కేసులో అతిపాశవికంగా ప్రవర్తించిన వ్యక్తి కూడా మైనరు బాలుడే. అది వేరే విషయం. అప్పుడు అందరికన్నా అతని మీద ప్రజాగ్రహం పెల్లుబికింంది.)
ఈ అత్యాచారం కేసులు గుంపులూ, సమూహాలు మరీ తీవ్రంగా కోపంగా తెచ్చుకోలేదు. కానీ, రాజకీయ పక్షాల నేతలు మాత్రం ఎక్కువగా కోపపడ్డారు. కారణం? ఉంది.


ఆ అమ్మాయిని నిందితులు పట్టపగలే పబ్‌ లో కలిశారు. అక్కడి నుంచి ఆమెను నమ్మబలికి, కారులో ఒక బ్యాకరీకి తెచ్చారు. అక్కడ వేరే కారులో, నిందితులు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు ఈ హీనమైన చర్యకు పాల్పడి, తిరిగి ఆమెను రాత్రి ఎనిమిది గంటల ప్రాంతలో పబ్‌ దగ్గర దిగబెట్టారు. చిత్రమేమిటంటే, వారు కారులో ఆమెను ‘ముద్దులు పెడుతున్న’ దృశ్యాలను వీడియో తీశారు కూడా. మూడు రోజుల తర్వాత ఆమె మెడమీద వుండే గాయాలను చూసి, బాధితురాలి తండ్రి తెలుసుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదీ పోలీసుల కథనం.


ఆమె పై అత్యాచారం జరిగినందుకు కోపం తెచ్చుకోవాల్సిన గుంపులు, అసలామె పబ్బుకు ఎందుకు వెళ్ళాలీ- అని సన్నాయి నొక్కులు నొక్కారు. తన మీద జరిగిన ఘోరానికి తననే బాధ్యురాలిని చెయ్యబోయారు.
గుంపులకు రాని కోపం, రాజకీయ నేతలకు వచ్చింది. మరీ ముఖ్యంగా బీజేపీ నేతలకు వచ్చింది. కారణం? ఈ అత్యాచారానికి ఉపయోగించింది ప్రభుత్వ వాహనం(?). నిందితిల్లో ఒకరు మజ్లిస్‌ శాసన సభ్యుడి తనయుడు. ఇంకొకరు ‘వక్బ్‌ బోర్డు’ లో పదవి వున్న నేత కు చెందిన వాడు. దాంతో ఒక బీజేపీ శాసన సభ్యుడు నిందితులు, బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తిస్తున వీడియోను షేర్‌ చేశారు. దీని వల్ల ఆయన చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కుంటారనుకోండి.


కాకుంటే, ఒక అఘాయిత్యం గుడి దగ్గరో, బడి దగ్గరో, నడిరోడ్డుమీదో జరిగితే గుంపులకు వచ్చే కోపం, పబ్బు దగ్గరో, బార్‌ దగ్గరో ఎందుకు రాదూ..? ఇది శేష ప్రశ్న కాదు, పురుషాహంకార అవశేష ప్రశ్న.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 11-15 జూన్ 2022 సంచికలో ముద్రితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *