తా చెడ్డ ‘కొడుకు’ ‘వనమె’ల్లా చెరిచాడు?

వనమా రాఘవేంద్ర రావు


అడిగేశాడు. అడక్కూడనిది అడిగేశాడు. కోరకూడనిది కోరేశాడు. ‘పిల్లలు కాకుండా, కేవలం నీ భార్యతో రా!’ అని అనేశాడు. అడిగిందెవరో కాదు. ఒక ఎమ్మెల్యే కొడుకు. ‘ఆస్తి తగాదా ను పరిష్కరించాలంటే, ఇంతకు మించి మార్గం లేదు’ అని బెదరించాడు. ఎవర్నీ? ఒక మధ్యతరగతి మనిషిని. ఇదీ అభియోగం; ఆ మధ్యతరగతి మనిషి చేసిన ఆరోపణ. అది కూడా ఎప్పుడూ? చనిపోయే ముందు. తాను మాత్రమే కాదు. తనతో పాటు తన భార్య, తన ఇద్దరు కూతుళ్ళూ చనిపోవాలని నిర్ణయించుకునే ముందు. ఇది తన మొబైల్‌ లో వీడియో రికార్డింగ్‌ చేసి చనిపోయాడు.
ముందు వెనుకలు తెలియకుండా వింటే. ఇదేదో ‘క్రైవ్‌ు’ సినిమా కాబోలు అనుకుంటారు. కానీ జరిగిపోయింది. మధ్యతరగతి మనిషి నిర్ణయించుకున్నట్లుగానే వంటగదిలో గ్యాస్‌ స్టౌ భగ్గుమంది. ముగ్గురూ చనిపోయారు. చిన్న కూతురు మాత్రం ఎనభయి శాతం గాయాలతో ఇంకొన్ని గంటలు నరక యాతన అనుభవించింది.


ఇలా బుగ్గిపాలయిన కుటుంబం పాల్వంచలోని మండిగ నాగ రామకృష్ణ, అనే చిరువ్యాపారి కుటుంబం. తనతో పాటు చనిపోయింది. ఈ ఘటన కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాది (2022) జనవరి 2 న జరిగింది. తన భార్య శ్రీలక్ఖ్మి, కూతుళ్ళు సాహిత్య, సాహితిలు. తన భార్యను కోరింది సాక్షాత్తూ కొత్తగూడెం శాసన సభ్యుడు వనమా వెంకటేశ్వరావు కొడుకు వనమా రాఘవేంద్రరావే అని ‘వీడియో’లో చెప్పాడు రామకృష్ణ.


‘మాది పన్నెండేళ్ళుగా ఆనందంగా వుంటున్న కుటుంబం. నేను రక్షిస్తాననే నా భార్యకు వాగ్దానం చేశాను. నేను అలా పంపించలేను. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని రామకృష్ణది భావిస్తున్న వీడియోలో చెప్పాడు.
ఇంతకీ రామకృష్ణ సమస్య. ఆస్తి సమస్య; ఆదాయం సమస్య. అది కూడా తన సొంత తల్లితోనూ, తన సొంత సోదరి తోనూ. తనకు రావలసిన ఆదాయన్ని వాళ్ళిద్దరూ అడ్డుకుంటున్నారు. కానీ తాను వ్యాపారంలో దెబ్బతిని, ఇంటి అద్దె కట్టుకోలేని స్థితిలో, తనకు రావాల్సిన భాగం మీదే అశలు పెట్టుకున్నాడు. రాఘవకు బాగా పలుకుడి వుందని తెలుసుకుని, అతన్ని సంప్రదిస్తే, వచ్చిన సమాధానం ఇదీ అని రామకృష్ణ చనిపోతూ వీడియోలో ఇచ్చిన వివరణ సారాంశం.

‘మాది పన్నెండేళ్ళుగా ఆనందంగా వుంటున్న కుటుంబం. నేను రక్షిస్తాననే నా భార్యకు వాగ్దానం చేశాను. ’

తెలంగాణలో (అధికార) టీఆర్‌ఎస్‌ పార్టీ శాసన సభ్యుడిగా వున్న సీనియర్‌ నేత వనమాకు ఇది గడ్డు సమస్యే. పోలీసులు రాఘవ తో పాటు రామకృష్ణ తల్లి మీద కూడా ‘హత్యకు పురికొల్పారనే’ అభియోగం మీద కేసు నమోదు చేశారు. కానీ, వెంటనే అరెస్టు చెయ్యలేదు. అదే జిల్లాలో తిరుగుతున్న రాఘవను పట్టుకోవటానికి అయిదు రోజులు పట్టింది. దీంతో సహజంగానే ప్రతిపక్షాలు పాలక పక్షాన్ని తప్పుపడుతున్నాయి. కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే ప్రకటనలు గుప్పిస్తున్నారు. బీజేపీ కూడా అవకాశాన్ని వదలు కోవటం లేదు. శాసనసభ్యులు వనమా, తన తనయుడిని తప్పుగా ఇరికించారనే అర్థంలోనే మాట్లాడుతూ, దర్యాప్తుకు సహకరిస్తానంటున్నారు. అంతే కాదు అతనిని (రాఘవను) టీఆర్‌ఎస్‌ పార్టీకీ, నియోజక వర్గానికీ దూరంగా వుంచుతానంటున్నారు. తాను వుంచేదేమిటి? పార్టీయే దూరంగా వుంచుతుంది. లేకుంటే పార్టీ పరువు పోదూ..!?

ఇద్దరికీ ‘పుత్ర’ గండాలే!
కొడుకు వల్ల పదవిలో వున్న తండ్రి ఇరకాటంలో పడిన సందర్భం, ఇటీవలి కాలంలో ఇది రెండవది. కేవలం మూడు నెలల క్రితం ఉత్తరప్రదేశ్‌ లోని లఖీంపూర్‌ లో కేంద్ర మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా తనయుడు అశిష్‌ కుమార్‌ మిశ్రా మీద వేరే తీవ్రమైన అభియోగం. అది హత్యాయత్నం. ఎందుకంటే ఆందోళన చేస్తున్న రైతుల మీద నుంచి కారు దూసుకు పోనిచ్చాడని కేసు నమోదు చేశారు. ఇంత బహిరంగమయి పోయాక అరెస్టు చెయ్యకుండా వుంటారు. అరెస్టు చేసి జైలుకు (రిమాండుకు) కూడా పంపారు. పైపెచ్చు తండ్రి వున్నది కేంద్రంలో వున్న ఎన్డీయే కేబినెట్లోనే. ఘటన జరిగిందీ బీజేపీ అధికారంలోవున్న ఉత్తరప్రదేశ్‌ లోనే.
రెండు చోట్లా నేతల ‘పుత్రరత్నాల’ నేరచరిత మీడియాకు అప్పుడే గుర్తుకు వచ్చింది. గతంలో కూడా ఇతని మీద కేసులు వున్నాయి’ అని, ఇక్కడ రాఘవ గురించి చెప్పినట్లే, అక్కడ అశిష్‌ గురించి కూడా ప్రసారసాధనాలు చెప్పాయి. అయితే రాఘవ విషయంలో మీడియా రాయటంతో పాటు, రామకృష్ణ తన వీడియోలోనే, ‘గతంలో ఇతని(రాఘవ) వల్ల చాలా కుటుంబాలు బుగ్గి పాలయ్యాయి’ అని చెప్పాడు.
రాఘవ, అశిష్‌ ల మీద వున్న నేరారోపణలు వేరు; వాళ్ళ తండ్రుల పార్టీలు వేరు. కానీ తీరు ఒక్కటే. అదే ‘అధికార దుర్వినియోగం’. అంతే కాదు, అధికారం వల్ల వచ్చిన ‘అహంకారం’. అంతే కాదు. ఎప్పుడో మధ్యయుగాల్లో, రాచరికాల్లో.. రాజుకొడుకులు ప్రవర్తించినట్లు, ప్రజాస్వామ్యంలో కూడా వెలగబెట్టటం.
అయితే, అశిష్‌ చేసిన పనికి అతని తండ్రి అజయ్‌ కుమార్‌ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌ ను జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు చేశాయి. పార్లమెంటును కూడా స్తంభింప చేశాయి. కానీ, పార్టీగా బీజేపీ కానీ, ప్రభుత్వంగా ఎన్డీయే కానీ దిగి రాలేదు.


ఇప్పుడు రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరరావు పై టీఆర్‌ఎస్‌ పార్టీ ఎలాంటి వత్తిడి తెస్తుందన్నది ఆసక్తికరమైన అంశమే. ఇంకా ఏడాది వుండగానే తెలంగాణలో ఎన్నికల రాజకీయాలు ఊపందుకున్నాయి. అధికారంలో వున్న టీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది? తండ్రిని, కొడుకుని వేరుగా చూస్తుందా? తండ్రి అండతోనే ఇంత పని చేశాడని, తండ్రిని దూరంగా వుంచుతుందా? ఎలాగూ వనమాకు మంత్రి పదవి లేదు. కాబట్టి దానినుంచి తొలగించమని ఎవరూ కోరరు. ఉన్నది ఒక్కటే శాసన సభ్యత్వం. దానికి రాజీనామా చేయిస్తే, ఉపఎన్నిక వచ్చిపడుతుంది. ఇప్పటికే ఈటల రాజీనామా తెచ్చిన ఉప ఎన్నిక, టీఆర్‌ఎస్‌ను ఇబ్బందిలో పడేసింది.
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెయ్యగలిగింది ఒక్కటే. రాఘవను సర్కారు రక్షించటంలేదు- అనే ముద్ర నుంచి బయటి పడాలి. పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేశారూ- అని అనిపించుకోవాలి. ఇదే అదనుగా స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు పార్టీలో ఏ నేత మీద వున్నా, విరుచుకు పడాలి. అలా చెయ్యటంలో ఏ మాత్రం జాప్యం చూపినా, విపక్ష మాధ్యమాలు అత్యుత్సాహంతో పూర్తి చేస్తాయి.


లేకుంటే, వనమా రాఘవేంద్ర రావు తెచ్చిన మచ్చ తన తండ్రికే కాదు, తండ్రి వున్న పార్టీకి, తెలంగాణలో అధికారంలో వున్న ప్రభుత్వానికి కూడా. ఈ మురికిని కడుక్కోవటం అంత సులభమైన పని కాదు. కానీ చెయ్యాలి.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 8-14 జనవరి 2022 సంచిక లో ప్రచురితం)

1 comment for “తా చెడ్డ ‘కొడుకు’ ‘వనమె’ల్లా చెరిచాడు?

  1. Excellent Analysis of crime originated from Politically motivated background raising moit questions on the integrity of government and ruling party. Presented the voice of the people who really suffered the mental trauma finally ended with suicide. The ending of the story presentation is correctly pointed out as beginning for rethinking to exhibit the trustworthiness and credibility of the government organisations including the attitude of the political parties. Thank you sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *