విసుగు వచ్చింది కానీ, విసగ లేకపోయింది రోజమ్మ. తుమ్ము వచ్చి, తుమ్మలేక పోతుంటే ఎలావుంటుందీ..అలా అన్నమాట.
నిజానికి విసుగే ఆమె భాష. మురిపానికీ విసుగే. ముఖమాటానికీ విసుగే.
‘ఒసేయ్ కర్రిదానా! ఇంత కమ్మగా ఎవడొండమన్నాడే నిన్నూ కొబ్బిరన్నం…? ఉబ్బి సావాలనా..?’ అని సొంత కూతుర్నే విసుగుతుంది. ఆ పిల్ల ఆగుతుందా? ఉబ్బి తబ్బిబ్బయి.. ఇంకో రెండు గరిటెల అన్నం అదనంగా వడ్డించదూ..!
నర్సుగా ఆ నాలుగురోజులూ అందించిన సేవలకి, ఏ పేద పేషెంటో సంతోషం కొద్దీ ఏ ఆపిల్ పళ్ళో ఇస్తుంటే..
‘సాలు సాల్లే అమ్మా..! యిన్ని పళ్ళు నేనేం సేస్కోవాలీ..? మా ఈది సివర పళ్ళకొట్టెట్టుకోవాలి..’ అంటూ విసుగుతూ, రెండుసార్లు తిరగ్గొట్టి, మూడోసారి తప్పదన్నట్టు తీసుకుంటుంది. ఆమె విసుగుకి వార్డువార్డు అంతా ఉలిక్కిపడతారు.
ఒకసారి ఇలాగే ఆమె డ్యూటీలో వున్నప్పుడు, కోమాలోకి వెళ్ళాడనుకున్న పేషెంటు చటుక్కున లేచికూర్చున్నాడట. ఆమె విసుగు అతడికి కోడికూతలా అనిపించిందో ఏమో అని సాటి నర్సులు రోజమ్మను ఆటపట్టించారు కూడా.
ఇప్పుడంటే రోజమ్మా, రోజమ్మా అంటున్నారు కానీ, ఓ పాతికేళ్ళ క్రితం కాలేజీ ప్రాంగణంలో ఆమె రోజీ. అదే కాలేజీ రికార్డుల్లో రోజెలిన్.
గులాబీకి ముల్లులా, రోజీకి విసుగు రక్షక కవచం.
పేటలో పుట్టిన అందగత్తెలకు ముందూ, వెనకా ఎవరూ వుండరు. కన్నవాళ్ళున్నా కాపు కాయలేరు. కూలికే వెళ్తారా, కూతురునే చూసుకుంటారా? అన్నాదమ్ములున్నా అండగా వుండరు. చదువుకోవాలనుకున్నవాళ్ళు సర్కారీ హాస్టళ్ళకు తరలిపోతారు.చదువెక్కని వాళ్ళకేమో ‘మందు’ సులువుగా ఎక్కేస్తుంది. ఫలితం ఒక్కటే. ‘అన్నా!’ అని ఆపదలోని ఆడబిడ్డ అరిస్తే, మొదటి రకం వాళ్లు పలకలేరు. రెండో రకం వాళ్లు పలికినా లేవలేరు. అంతమాత్రాన అక్కడి సౌందర్యవంతులందరూ కంచెలేని చేలు కారు.
తమకు తామే ముళ్ళకంపలు! అందుచేత అక్కడి ఆడపిల్లలు తమ నోళ్ళను తినటానికి తక్కువగానూ, తిట్టటానికి ఎక్కువగానూ వాడతారు.
రోజమ్మ తన కూతుర్ని తిట్టుకుంటూ కన్నది. తిట్టుకుంటూ పెంచింది. దాంతో ఆమెక్కూడా విసుగే మాతృభాష అయ్యింది.
ఓ తిట్టులాడి స్టీరింగ్ పట్టుకుంటే, ఇంకో తిట్టులాడి ఆమెపక్క సీట్లో కూర్చుంది. కూతురు డెలీలాతో కలిసి రోజీ చర్చికి వెళ్తోంది. ఎర్ర ఆల్టో కారు. యూజ్డ్ కారే. కొని నాలుగేళ్ళయ్యిందేమో. చిన్న స్పీడు బ్రేకరుకు కూడా పెద్దగా స్పందిస్తుంది.
మిగిలిన సమయాల్లో అయితే, కాస్త కుదుపుకయినా పెద్దగా విసిగేది రోజమ్మ. ‘సూసి నడపవే కర్రి దయ్యమా!’ అని అరిచేది. డెలీలా ఊరుకునేదేమిటి? ‘సీటు బెల్టు పెట్టుకోవే ముసలి పీనుగా!’ అని బదులిచ్చేది
కానీ, ఆ పూట కారు ఎన్ని కుదుపులు కుదిపినా, రోజమ్మ ఉలకటంలేదు. పలకటం లేదు. డెలీలా ఎన్ని తిట్లు తిట్టినా నోరు మొదపటం లేదు.
‘ఉత్త పిండి వుడక బెట్టేసి. ఉప్మా అంటావ్ కదే చట్నీ మొకందానా..? పిల్లులు కూడా ముట్టనిది.. పిల్లను.. నేనెలా తింటాననుకున్నావే ముదనష్టపు దానా..ఆదివారమొచ్చిందంటే..నరకమయిపోతందనుకో..!’ అని డెలీలా డోసు కూడా పెంచింది.
కూతురు మీద విసుగు పీకలవరకూ వచ్చింది కానీ, పెదవులు దాటటంలేదు.
కారణం వార్త.
‘వాడు పోయాడు.’ అంతకు ముందే మొబైల్ మోగింది. మరణ వార్తను ఇంతే నిర్దాక్షిణ్యంగా చెప్పింది ఎవరో కాదు. రోజమ్మకు కావలసిన వాడే. సమరిటన్!
—
నిజానికి పీడా విరగడయ్యిందని సంతోషించాలి. చీకటి తొలగిపోయింది కదా, అని ఎగిరి గెంతెయ్యాలి. అతడు ఆమె పాలిట చీకటే. అతడే ఒక రాత్రి! నల్లని త్రాచులా చుట్టేసే రాత్రి!
మొగుడే. అతి మృదువుగా తన వేలికి ఉంగరం తొడిగి, మెడను ఏ మాత్రం తాకకుండా మూడు మూళ్ళూ వేసిన అతిసుకుమారపు మొగుడే.
కానీ వాడి పేరే హింస. అలాగని సూదులతో పొడవడు. సిగరెట్టుతో కాల్చడు.
వాడి పక్కలోకి వెళ్ళటమంటే, పడక మీదవాలటం కాదు, వాడి పడగ కింద దాక్కోవటంÑ వణకుతూ కళ్ళు మూసుకోవటం.
‘నువ్వు తెలుపూ. నేను నలుపూ. మిస్ మ్యాచ్. కళ్ళు తెరిస్తే, నన్ను చూడాల్సివస్తుంది. ఈ నాలుగు నిమిషాలూ గడవాలంటే, పాత పరిచయిస్తుణ్ణి ఎవణ్ణో ఊహల్లోకి తెచ్చుకోవాలి కదా! ఎంతయినా ఆళ్ళంతా పెద్ద కులపోళ్ళు ..ఆ మోజే వేరులే..!’
ఇలా భర్త అంటున్నప్పుడు రోజమ్మ విసుగు తారాస్థాయికి చేరేది. వచ్చిన బూతులన్నీ తిట్టేది. బావురుమని ఏడ్చేది. గోడకేసి తలకొట్టుకునేది. చేతికి ఏది దొరికితే, దానితో తనని తాను గాయపరచుకునేది. అది అతి చిన్న చాకు కావచ్చుÑ కూరగాయల కత్తి కావచ్చు. అప్పుడామె బంగారు రంగు దేహం మీద`ఎర్ర పెన్సిల్ తో గీసిన గీతల్లా`నెత్తుటి చారికల్ని చూసేవాడు. అతడి కళ్ళు మెరిసేవి. ‘ఈజీ.. ఈజీ.. టేకిటీజీ రోజీ!’ అని, తాను తేరుకునేవాడు.
పేరు విక్టర్. కానీ పరాజితుడు. రోజీవాళ్ళ పేటే అతడిది కూడా. పదోతరగతి తప్పి పేటలో వుండిపోయాడు. ఆ తర్వాత మూడేళ్ళకు బయిటపడి, హాస్టల్ తర్వాత హాస్టల్ మారుతూ యూనివర్శిటీ హాస్టల్లో సెటిలయ్యాడు. డిగ్రీ తర్వాత డిగ్రీ చేసుకుంటూ, ఉచిత భోజన, వసతులను కష్టపడి సాధించి, గ్రూప్ వన్ నుంచి కానిస్టేబుల్ వరకూ నిర్వహించే సమస్త పోటీ పరీక్షలకూ కూర్చునేవాడు. అలా అతడికి నలభయ్యేళ్ళు నిండిపోయాయి.
ప్రతీ క్రిస్మస్‌కు వచ్చిపోయేటప్పుడు రోజీని చూసేవాడు. అలా చూస్తుండగానే రోజీ గౌన్లనుంచి ఓణీలవరకూ ఎదిగిపోయింది. పేట కుర్రాళ్ళు విక్టర్‌కు ఆమె గురించి కథలు కథలుగా చెప్పేవారు.
ఆమె రోజూ ఎర్రబస్సు మీద పక్క పట్నంలోని కాలేజికి వెళ్ళివస్తున్నప్పుడే.. కనీసం ఎవడో ఒక యువకుడు ఆమెను పేటవరకూ వెంబడిరచేవాడు. పేటలోకి వచ్చాక ఆమెకు స్థానబలం వచ్చేది. ఆప్పుడు ఆమె తన విసుగు భాషను ప్రయోగించేది. అది మచ్చుకు ఇలా వుంటుంది: ‘ఎప్పుడూ ఆడ ముకం చూడ్లేదంట్రా పేడి మూతోడా..!’ ముకమెప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా..? తెగులొచ్చిన చేలో మొలకల్లా వున్నాయి మూతి మీద వెంట్రుకలు! అయి మీసాలనుకుంటన్నావేంట్రా..?’
ఇలా ప్రతీ రోజూ పేటవరకూ ఎస్కార్టు ఇచ్చినందుకు, ఆ‘ఊర’ రోమియో, ఇలా ఆమె ఇచ్చిన ‘విసుగు’ నజరానాను పుచ్చుకుని వెళ్ళేవాడు.
ఈ రోమియోల్లోనూ పట్టువదలని విక్రమార్కులూ, ‘మరో సారి తిట్టవా’ అని ప్రాధేయపడే ఘోరీలూ వుండేవారు. వీళ్ళ దండయాత్రల వల్ల, రోజీ ఉరఫ్ రోజెలిన్‌లో రెండు భావనలు ఏకకాలంలో కలిగేవి. ఒకటి: ‘మరీ ఇంత అందగత్తెనా నేనూ’ అనే కించెత్తు గర్వం. రెండు: ‘అయితే మాత్రం ఇంతగా అడుక్కోవాలా?’ అన్న జాలి.
దాంతో, కొందరితో విసుగులోనే కొంత ఆనందాన్ని చేర్చేది.
ఒకరోజిలాగే ఓ విక్రమార్కుడితో, ‘దా.. మా ఇంటి దాకా వచ్చేత్తావా… కాఫీలో పురుగుమందు కలిపిచ్చేత్తాను. తాగి పోదువు గాన్లే!’
‘తాగటానికి నేను రెడీయే కానీ, ఆ చచ్చేదేదో నీ వొళ్ళో పడి చావొచ్చా..?’ అనేశాడు ఆ విక్రమార్కుడు. నవ్వేసుకుంది. రాను రాను చనువు ఇచ్చేసుకుంది.
దాంతో పేటలో కుర్రాళ్ళి ఈ ఇద్దరి వ్యవహారం మీద పోస్టర్లు వెయ్యటం ఒక్కటే తక్కువ. కొన్నాళ్ళ తర్వాత ఈ రోజెలిన్‌కీ, ఆ విక్రమార్కుడికీ ఎక్కడ చెడిరదో చెడిరది.
‘ఇందులో పెద్ద మిస్టరీ ఏముందిలే..! తాళి దాకా వచ్చాక, వాడు జారుకుని వుంటాడు. ఊరోడొచ్చి పేటదాన్ని మనువాడేస్తాడేంటీ..?’ అని తెంపు చేసేస్కున్నారు పేట కుర్రాళ్ళు. ఆ ముక్కే క్రిస్మస్ కు వచ్చిన ముదురు పట్ట భద్రుడు విక్టర్ చెవిన పడిరది.
‘పిల్లా, నువ్వు నర్సింగ్ చెయ్యాలి’ అంటూ ఆమెను ఆగ్జిలియరీ నర్సింగ్ ట్రెయినింగ్ కు దరఖాస్తు చేయించాడు. రోజెలిన్ తల్లి వున్న ముప్ఫయి సెంట్ల భూమీ అమ్మేసి పైసలిచ్చింది. ఆమెకు విశాఖపట్నం నర్సింగ్ ఇన్సిట్యూట్లో సీటు వచ్చేంతవరకూ, రోజూ గంటలు గంటలు విక్టర్ ఆమెతోనే వుండేవాడు.
రోజెలిన్, విక్టర్లు ఎంత దగ్గరగా వున్నా, వాళ్ళ మీద పుకారు వ్యాప్తి చెయ్యటానికి వీలయ్యేది కాదు. ఇద్దరికీ మధ్య ఒకటీ రెండేళ్ళు కాదు. ఏకంగా పదిహేనేళ్ళ తేడా. వీళ్ళద్దరూ పక్కపక్కన నిలబడితే చూసేవాళ్ళు ‘బాబోయ్!’ అనాల్సిందే. ఎందుకంటే అతడు ‘బాబాయ్’ లా వుంటాడు. ఏమయితేనేం? విక్టర్ విజయవంతంగా ఆమెను పేట దాటించాడు. విమెన్స్ హాస్టల్లో చేర్పించాడు. తాను ఓ ప్రయివేటు స్కూల్లో ఇంగ్లీషు టీచరుగా చేరాడు.
రోజెలిన్‌కు విక్టర్ మీద గురీ, గౌరవమూ పెరిగిపోయాయి. ఓ సారి ఆమెకు జ్వరం వస్తే, ఆసుపత్రినుంచి నేరుగా తనగదికి తీసుకు వెళ్ళి సపర్యలు చేసే క్రమంలో దగ్గరయిపోయి, పెళ్ళి ప్రతిపాదన చేశాడు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నాడు. నవ్వేసింది.
‘ఎర్రిముకమోడా..! పువ్వుని పవ్వుల్లో పెట్టి చూసుకోవటమేంట్రా..? నేను రోజీని.. రోజాని..!’ అని తన అంగీకారాన్ని విసుగు భాషలో ఇచ్చేసింది రోజెలిన్. అప్పటికే ఆమెకు నర్సింగ్ పూర్తయిపోయింది. పెళ్ళి తంతుని రిజిస్ట్రార్ ఆఫీసులో కానిచ్చేశాడు.
రోజీ పుట్టింటి నుంచి అత్తింటికి రాలేదు. హాస్టల్ గది నుంచి, విక్టర్ గదికి వచ్చింది. గది అంటే గదే. ఇల్లు ఒక్కటే. పక్కపక్కనే నాలుగు పోర్షన్లు. అన్నీ ఒంటి గది పోర్షన్లే. కాకుంటే ప్రతీ గదికీ లోపల ఒక టాయలెట్ వుంది లెండి. ఇల్లు ముందు కొంచెమే జాగా. ఆపై వుందా, లేదా అన్నట్టుండే ప్రహరీ గోడ. కట్టించిన వాడెవడో రైలు పెట్టెలు తయారు చేసే కర్మాగారంలో పనిచేసి వుండాలి.
ఆ గదే తనకు జైలు గది కాబోతుందని, రోజీకి తర్వాత కానీ తెలియలేదు. అందాన్ని కోరుకున్న ప్రతీవాడికీ, చూసేటంత శక్తి వుండదు. విక్టర్ పరిస్థితి అదే. ఆమె అందం అతణ్ణి అనుక్షణం చిన్నబుచ్చుతోంది. మాటమాటకీ ‘నువ్వు తెలుపు. నేను నలుపు’ అంటాడు. ‘కలసి సినిమాకు వెళ్దామ’న్నా వద్దంటాడు. ‘బీచ్‌లో కూర్చొనద్దామా?’ అన్నా కాదంటాడు. ఒక రోజు ఇలాగే బలవంతాన రోజీ, షాపింగ్‌కు తీసుకు వెళ్ళితే, విక్టర్ క్లాస్‌మేట్ ఎవడో ఎదురయి, ‘ఏరా.. ఇంత వయసొచ్చిన కూతురుందని ఎప్పుడూ చెప్పలేదేమిట్రా..!’ అని రోజీని పైనుంచి కిందవరకూ లొట్టలు వేసుకుంటూ చూసినట్టు, చూశాడు. వాడెవడో కానీ, ఆక్షణమే రోజీకి యావజ్జీవ కారాగార శిక్ష వేశాడు.
అందం ముందు చిన్నబోయిన ప్రతీవాడూ, అందాన్ని బంధించాలని చూస్తాడు. ఆపనే విక్టర్ చేశాడు. ఒక వారం రోజులు గడిచాక, ‘రోజులు బాగాలేవు. సిటీలో క్రైమ్ బాగా పెరిగిపోయింది’ అని చెప్పి, గదికి బయిటనుంచి గొళ్ళెం పెట్టి, ఒక పెద్ద తాళం కప్పను తగిలించటం పెట్టటం మొదలు పెట్టాడు. అవును. ఆమెను లోపల వుంచేసే…! ఆమె ఒంటికి తాళం వెయ్యటం కుదరకే, ఇలా ఇంటికి తాళం వేశాడు.
ఉదయం తొమ్మిది గంటలనుంచి సాయింత్రం ఏడుగంటల వరకూ రోజీ ఆ గదిలోనే. వీధి వైపు చిన్న కిటికీ. అదే ఆమె ప్రపంచం. వంట చేసి` తిన్నా, తినకున్నా, తినాలని లేకున్నా` ఆ కిటికీ ముందే నిలబడేది. పక్క పోర్షన్లలోని వాళ్ళు నోళ్ళు నొక్కుకోవటం తప్ప పలకరించేవారు కారు. టీవీలున్నా, మొబైళ్ళు లేని రోజులవి. దాంతో పలకరింపే కరువయ్యింది రోజీకి. ఎప్పుడన్నా ఏ పిచ్చుకో కిటికీ దగ్గరకు వచ్చి కిచ్‌కిచ్ మంటే ప్రాణం లేచివచ్చేది, ‘పలకరిచటానికి వచ్చిందన్న’ అనుమానంతో.
అనుమానం! అవును అనుమానమే! ఆ గది పేరే అనుమానం. అనుమానం వల్లే గదికి తాళం. అలాగని సాయింత్రం విక్టర్ వచ్చి, తాళం తీస్తున్న చప్పుడయితే, ఉత్సాహం వచ్చేది కాదు రోజీకి. వొళ్ళు చల్లబడిపోయేది.
దొంగవాడన్న అనుమానంతో, దుస్తులు తీసేసి, లాకప్పులో వేసి, కొట్టి కొట్టి వెళ్ళిపోయిన పోలీసు, మళ్ళీ వచ్చి లాకప్పు తలుపు తెరుస్తుంటే ఎలా వుంటుందీ? విక్టర్ గదివెలుపలనుంచి తాళం తీస్తున్న అలికిడి వింటే రోజీకి అలా వుండేది.
ఇక్కడా అనుమానమే. రోజీ మనసు మీదా, దేహం మీదా` రెంటి మీదా అనుమానమే. అతడు వచ్చాక, అతడి పడక మీదక వెళ్ళాక రోజీ వణకిపోయేది.
రోజీకి వచ్చిన బూతులన్నీ మరచిపోయేది. తన విసుగు మీదే తనకు విసుగు వచ్చేది. మూగతనం నిలువెల్లా ఆవహించేది. తనను తాను చచ్చిన శవంగా భావించుకునేది.
అలాంటి రోజుల్లోనే తన కడుపులోకి మరో ప్రాణి వచ్చిపడిరది.
రోజీకే దిగులు మరింత పెరగింది. కానీ విక్టర్ కళ్ళల్లో మాత్రం వింతయిన ఆనందం కలిగింది. అదేదో పగతీరిన వాడు పొందే ఆనందంలాగా వుంది. ఈ ఆనందం పెరిగి పెరిగి వికృతమయ్యింది.
ఓ రోజు సాయింత్రం అతడు వెలుపల నుంచి తాళం తీస్తున్నప్పుడు, తాళం చప్పుడుతో పాటు గాజుల చప్పుడు కూడా వినిపించింది. గది తెరవగానే నాలుగు కాళ్ళు లోపలికి ప్రవేశించాయి. అందులో రెండు ఆడకాళ్ళు. రోజీ ఆమెను చూసింది. చామన ఛాయ. వయసులోనే వుంది. కానీ గుప్పెడు కండ కూడా లేదు. అస్థిపంజరానికి చీర చుట్టినట్టుంది.
‘ఇది కూడాఈ రాత్రి మనతోనే వుంటుంది.’ అని పొలితిన్ బ్యాగ్ లోని రెండు బీరు బాటిళ్ళు తీసి పైన పెట్టాడు. ఆమెకు ఎందుకో కోపం రాలేదు. చికాకూ రాలేదు. చిన్న ఆశ కలిగింది. ‘ఐతే నన్నొదిలేస్తావా.. బయిటకి పోతానూ..! అని అడిగింది
‘ఎక్కడికి పోతావ్..? పోయి బస్టాండ్లో పడుకుంటావా..? ఎందుకూ, కిందే చాపేసుకుని పడుకో..!’ అన్నాడు. అన్నట్టే రోజీని చాపమీద పడుకో బెట్టాడు. వాళ్ళిద్దరూ మాత్రం మంచం మీద..!
శవాలకి కోపతాపాలు వుంటాయా..? తానెప్పుడో శవమయిపోయంది. చూడకూడని దృశ్యాలు కళ్ళముందే జరిగిపోతున్నాయి. వినకూడని చప్పుళ్ళు చెవుల్ని చేరుతూనే వున్నాయి. రోజీ ఒక శవం. ఊపిరి మాత్రమే ప్రాణమని అనుకుంటే.. ఆమె బతికి వున్నట్లు లెక్క .
అలాగే తెల్లారి పోయింది. దృశ్యాలూ మాయం. శబ్దాలూ మాయం. మళ్ళీ ఆమె బతుక్కి తాళం.
నెలలు నిండుతున్నకొద్దీ రోజీకి ఆకలి పెరిగేది. రెండు ప్రాణాల ఆకలి అది. కడుపులోని నలుసుదీ ప్రాణమే కదా! కానీ, తినలేక పోయేది. ఎలాగూ తాను ఊపిరున్న శవమే కదా! సిగ్గేమిటీ, ఎగ్గేమిటీ అనుకుని, ఓ రోజు, అతడు తాళం కప్ప తీసుకుని, డ్యూటీకి వెళ్తుంటే, వంగలేక వంగి విక్టర్ కాళ్ళు పట్టుకుంది రోజీ.
‘కడుపుతో వున్నదాన్ని నామొకం ఎవడు చూస్తాడయ్యా..! ఇప్పుడయినా ఇంటికి తాళం వెయ్యకయ్యా..!’ అని అంటే, విక్టర్ డొక్కలో తన్న లేదు కానీ, అంత పని మాటతో చేశాడు. ‘నాకా విషయం తెలుసు. ఎవడూ నిన్ను చూడడు. కానీ నువ్వు చూడొచ్చు కదా!’ అన్నాడు. కుప్పకూలిపోయింది రోజీ.
సరిగ్గా ఈ మాట అన్న రోజే విక్టర్ సాయింత్రం ఇంటికి రాలేదు. రాత్రీ రాలేదు. మరుసటి రోజూ అంతే. రెండు రోజులు గడచిపోయాయి. బియ్యం అయిపోయాయి. కూరగాయలు కూడా లేవు. వంట లేదు.
ఆకలి. రెండు ప్రాణాల ఆకలి.
కిటికీ దగ్గర దీనంగా రోడ్డు మీదకు చూస్తూ వుంది.
‘అమ్మా!’ దీనంగా పిలుపు. అన్నది లోపలి బిడ్డేమో అని, తన కడుపు తడుముకుంది. కానీ కాదు. ఆ పిలుపు వెలుపల నుంచే… వీధిలోనుంచే..!. అదీ తన గుమ్మం ముందు నుంచే..! వంగి కర్ర ఆసరాగా ఆగి వున్న వృధ్ధురాలు. ‘దరమం సెయి తల్లి.. టీ నీల్లు తాగుతాను. ముసలి పేనం పోయేలాగుంది.’ అంటూ మూలిగింది.
ఎవరు ఎవర్ని చూసి జాలిపడాలో అర్థం కాలేదు రోజీకి. ముచ్చెమట్లు పోసి, కళ్ళు తిరిగినట్లయింది. సరిగా అప్పుడే తాళం తీసిన చప్పుడు.
విక్టర్ లోపలికి వచ్చినట్టే వచ్చి, మళ్ళీ బయిటకు వెళ్ళి ‘అవ్వా ఆగు!’ అని, తన జేబులోంచి రెండు రూపాయిల నోటు తీసి ఆమె చేతిలో పెట్టాడు.
అంతవరకే రోజీకి గుర్తుంది. ఆ తర్వాత కళ్ళు తెరిచేసరికి ఆమె ఆసుపత్రిలో వుంది. చేతికి సెలైన్. నాలుగు రోజుల తర్వాత ప్రసవం. ఈ లోకంలోకి వచ్చేసింది డెలిలా. వస్తూ వస్తూ నే తల్లికి బెయిల్ తెచ్చేసింది.
రోజీని ఆసుపత్రిలో చేర్పించింది విక్టర్ కాదు. విక్టర్ క్లాస్ మేట్. తనను చూసి ‘ఇంత వయసొచ్చిన కూతురుందా?’ అని షాపింగ్ మాల్లో అన్నాడే అతడే. మనిషి వెకిలి. కానీ బలహీనుడు కాడు. విక్టర్ అంత బలహీనుడయితే అసలు కాదు. సరిగా బిచ్చగత్తె ను చూసి రోజీ స్ప ృహ తప్పే సమయానికి, విక్టర్ వెంటే, అతడూ వచ్చాడు. అతడే రోజీని ఆసుపత్రిలో చేర్పించాడు.
మరి విక్టరో..!?
పంపేశాడు. వెకిలి వాడే కొట్టి తోసేశాడు. కారణం విక్టర్ చేసిన కామెంట్.
‘ఏంట్రా..! నా పెళ్ళాం కడుపుతో వుంటే, నువ్వు నొప్పులు పడుతున్నావ్.. పుట్టేది నా బిడ్డా,.. నీ బిడ్డా..?’ అనేటప్పటికి వెకిలి వాడు పెద్దగా అరిచాడు. కాలర్ పట్టుకున్నాడు. ‘ఛీ..దరిద్రుడా..అనుమానానికి హద్దుండాల్రా..! ’ అని తోసిపారేస్తే పెద్ద గొడవయిపోయింది.
ఆ తర్వాత, రోజీ తల్లికి ఆ వెకిలి వాడే కబురు పెట్టాడు. తాను స్ప ృహలో లేనప్పుడు, తనను ఆదుకున్న వెకిలి వాడికి, మెలకువ వచ్చాక ‘అన్నయ్యా!’ అని దండం పెట్టింది. ఆ వెకిలి వాడే డెలిలాకు మామయ్య కూడా అయిపోయాడు. డెలిలా కొంచెం పెద్దయ్యాక ఓ రోజు అడిగింది ‘మామయ్య పేరేమిటే..?’ అని. రోజమ్మకు తెలిస్తే కదా, చెప్పటానికి. సాయానికి పేరుండదు. పేరు తెలిసేలా చేస్తే అది సాయం కాదు. అందుకే కాబోలు ‘సమరిటన్ మామయ్య’మ్మా..!’ అని బదులిచ్చింది.
—
ఇప్పుడా సమరిటనే, ‘విక్టర్ పోయాడ’న్న వార్త చెప్పాడు.
‘ప్లీజ్ అన్నయ్యా…! వాడి గురించి చెప్పొద్దన్నయ్యా..!’ అని అంటున్నా, విక్టర్ వివరాలు ఎప్పటికప్పుడు చెబుతూనే వుండేవాడు. ‘ఓడిపోయినోడు కాదమ్మా.. ఇంకెప్పటికీ గెలవలేననుకున్నవాడు చాలా ప్రమాదకరం.. విక్టర్ గాడు సిక్ మ్యాన్..! నేను తెల్లషర్టు వేసుకు వెళ్తే.. వాడు తాగే టీ నా మీద వొంపి.. సారీరా.. అని నవ్వేవాడు. చేతకాని చవటకు ఏం మిగులుతుందీ..? తాగుడూ, తిరుగుడూ తప్ప! వాటితోనే తీసుకుని, తీసుకుని చచ్చాడు.’ అనేశాడు.
ఈ వార్తే రోజమ్మలోని విసుగును మింగేసింది. తల్లి రోజమ్మ విసగక పోతే, కూతురు డెలిలాకు నచ్చదు. అందుకే రోజమ్మను కవ్విస్తోంది. ఒక పక్క చర్చికి ఆలస్యమయ్యిందన్న తొందరపడుతోంది. వేగంగా పరుగెత్తటానికి పాత కారు మొరాయిస్తున్నా, యాక్సిలేటర్‌ను తొక్కుతూనే వుంది డెలీలా. నిజం చెప్పాలంటే, ఈ జాప్యానికి డెలీలాయే కారణం. ఆదివారం అని తెలిసి కూడా, ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్ళి బయిట చక్కర్లు కొట్టివచ్చింది.
‘బెల్లం కొట్టిన రాయిలా మాటాడవేంటే..! పొద్దున్నే బయిట తిరిగొచ్చానానా..? మొగోడిలా నన్నెవరు పెంచమన్నారే..? నీ దరిద్రగొట్టు పెంపకానికి.. నాకు కాలు కుదురుండదు.!’ అని రోజమ్మ ముఖాన్నీ. ముందు రోడ్డునూ మార్చి, మార్చి చూస్తూ కారు నడుపుతోంది డెలీలా. కనీసం అప్పుడయినా రోజమ్మ విసుగుతుందేమోనని చిన్న ఆశ.
రోజమ్మ కూడా తన కూతురు వైపు చూసింది. కనీసం చూపులో కూడా విసుగులేదు.
డెలీలావి తల్లిపోలికల.ే కానీ, తండ్రి రంగూ, జుత్తూ వచ్చాయి. అందుకే మాటి మాటికీ ‘కర్రి దానా, నల్లదానా’ తనకు తెలియకుండానే కూతురిని ఎత్తి పొడుస్తుంటుంది రోజమ్మ.
రోజమ్మ దృష్టిలో అసహ్యానికి పేరు వుంటే, ఆ పేరే విక్టర్. కోపం అయితే చల్లారేది. పగయితే తీరేది. కానీ అసహ్యం! అతడంటే అసహ్యం! అతడి ఊపిరంటే ఆసహ్యం! అతడి దేహమంటే అసహ్యం! అతడికి చెందిన ఏ గురుతయినా అసహ్యమే.. ఒక్క తన కూతురు డెలిలాకు తప్ప.
తండ్రి ఒకడుండేవాడని డెలీలాకు తెలుసు. అతడితో తన తల్లి రోజమ్మ వేరు పడ్డట్టూ తెలుసు. అప్పుడప్పుడూ ఈ విషయంఅడిగేది కూడా. అదీ తన సహజమైన మాతృభాషలోనే: ‘నీకోమొగుడుండాలి కదే.. ఆడెక్కడ చచ్చాడూ.. నీ బూతులు వినలేక ఉరేసుకునుంటాడు..!’ అని ఆటపట్టించేది. అందులో డెలీలా కున్న వెలితి ఏదో రోజమ్మకు కనిపించింది.
అయినా ఆ ‘అసహ్యం’ గురించి తన కూతురికి తెలియటానికి ఆమెకు ఇష్టం లేదు. కానీ ఒక తండ్రి అంటూ వుంటే బాగుంటుందనీ, చూడాలనీ, కలవాలనీ వుంటుంది కదా..! ఫోటో అయితే చూసేసింది.
ఎలా వుంటాడో కూడా తెలుసు. కానీ కలవలేదు. అసహ్యాన్ని దాచేసి, ఒక్క తండ్రినే చివరి సారిగా తన కూతురికిచూపిస్తే..? తనను విక్టర్ వేధించినట్లు డెలిలాకు తెలీనే తెలీదు. చచ్చినవాడు ఎలాగూ మాట్లాడడు.
ఈ ఆలోచనలు రోజమ్మను కమ్మేశాయి.
ఇలా అనుకునేలోగా కారు చర్చి ప్రాంగణంలో ప్రవేశించింది. పార్కింగ్ భాగమంతా నిండిపోయి వుంది. బయిటే రోడ్డు మీద పార్కు చెయ్యాలి. దాంతో డెలీలా కారు బ్యాక్ చేసింది.
‘కర్రిదానా.. గవర్మెంటు ఆస్పటల్‌కి పోనీయ్ వే..!’ అంది రోజమ్మ.
విసిగేసింది. తన తల్లి విసిగేసింది. తనలోకి తాను వచ్చేసింది. ఆనందం పొంగుకొచ్చింది డెలీలాకు.
‘పోతావే ముసిలిదానా.. డెరెక్టుగా నరకానికి పోతావ్.. దేవుడు చూస్తాడు. చర్చికొచ్చి తిరిగెళ్ళిపోవటాన్ని..! క్షమిస్తాడా..? ’ ఉడికించింది డెలీలా.
కారు గవర్నమెంటు హాస్పటల్ దాటి పోతోంది.
‘ఆపవే…! ఇదేనే ఆసుపత్రి’ అని అంటున్నా వినిపించుకోకుండా కారు ముందుకు పోనిచ్చి, ఒక రెస్టారెంట్ దగ్గర ఆపింది.
‘ఇదీ మంచిదే..! టీ తాగేటప్పుడు చెప్పొచ్చులే’ అనుకుంది రోజీ. తన కూతురితో లోపలికి అనుసరించింది.
ఇద్దరూ టీ తాగుతుండగా.. ‘ఒసేయ్ కర్రి దయ్యమా.. నీకు నీబాబుని కలిపించనా .?’ అనడిగింది రోజమ్మ విసుగు ఏమాత్రం తగ్గకుండా.
‘వద్దు..!’ అనేసింది డెలీలా. ఈమె మాటలో విసుగులేదు. కొంచెం సేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు.
రోజమ్మ గొంతుసవరించుకుని, ‘ఫీలవకు. ఓ కబురు చెపుతాను. నీ బాబు చచ్చిపోయాడు.’ అని తలవంచుకుంది.
కొద్ది సేపు ఇద్దరూ మౌనం.
‘తెలుసు..! చంపింది నేనే…!!’ డెలీలా తీవ్రస్వరంతో చెప్పింది.
రోజమ్మకు మాటలేదు. ‘నువ్వు సంపటమేంటే తింగరదానా..?’ అని కూతురు చెయ్యిపట్టుకుంది రోజమ్మ.
‘పొద్దున్నే ఎక్కడికెళ్ళాననుకున్నావ్..? ఎవడో చావుబతుకుల్లో వున్నాడూ… బ్లడ్ ట్రాన్స్‌ఫ్జూజ్ చెయ్యాలీ.. బీ` నెగెటివ్ బ్లడ్ కావాలీ..అని నా ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులో పెడితే.. నాది ఆ బ్లడ్ గ్రూపే కదా అని పరుగెత్తాను. తీరా ఆస్పత్రి స్టాఫ్ రెడీ చేశాక, లోపలికి వెళ్ళి చూస్తే.. ఆడే.. సాతాను గాడు.. నీ మొగుడు విక్టర్ గాడు..! అంతే బ్లడ్ ఇవ్వాలనుకోలేదు. నేనివ్వలేదు.. అంతతేకాదు. ఇంకెవ్వరినీ ఇవ్వ నివ్వలేదు. కడుపు తిప్పుతుందనీ.. వాంతి వస్తుందనీ, బెడ్ మీద నుంచి పది సార్లన్నా లేచాను.! ఇలా రెండు గంటలు నాటకమాడాను.. ఆడు పోయాడు..!’ అని ఆగింది డెలీలా.
రెస్టారెంట్ టేబుల్ మీద తెల్లటి తన తల్లి చేతుల్ని చాపించి, ఆ చేతుల మీద గీతల్లా వున్న మచ్చల్ని అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ తన మునివేళ్ళతో తడిమింది. డెలీలాకు తెలియకుండానే, తన రెండు కన్నీటి బొట్లు తల్లి అరచేతుల్లో పడ్డాయి.
‘అమ్మా..!’ అని పెద్దగా మూలిగి, ‘ఎలా భరించావే..! వాడి టార్చర్ గురించి, చాలా సార్లు సమరిటన్ మామయ్య చెప్పాడు.’ అని కుమిలి కుమిలి ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి తేరుకుంది.
రోజమ్మ మాత్రం బొమ్మలా మారిపోయి చూస్తూనే వుంది.
‘ఏయ్ ముసలీ..! ఇంకోసారి ఆ సచ్చినోణ్ణి నా బాబూ, గీబూ అన్నావంటే గూబ గుయ్యమంటాది..’ అని నవ్వింది. ఏడ్చింది.
‘ఇలాగే ముల్లులా బతకవే.. నా బంగారమా? పువ్వు గట్టిబడ్డా పర్లేదు. కానీ, ముల్లు మెత్తబడకూడదే..! ’ అని అంటూ రోజమ్మ ఏడ్చి, నవ్వి, కూతురిని తనివితీరా దీవించుకుంది.
సతీష్ చందర్
(ఆదివారం ఆంధ్రజ్యోతి 24 డిశంబరు 2023న ప్రచురితం)
`
‘
‘