
జైలు గదిలో ఒక రాత్రి ఇద్దరికి నిద్రపట్టటం లేదు. అందులో ఒకడు దొంగా, ఇంకొకడు హంతకుడు.
బయిటున్నప్పుడూ ఇద్దరూ నైట్ డ్యూటీలే చేసేవారు.
‘సరదాగా ఒక కల కందామా?’ అన్నాడు దొంగ.
‘నిద్ర పట్టి చస్తే కదా- కలకనటానికి!’ హంతకుడు విసుక్కున్నాడు.
‘కలంటే కల కాదు. ఒక ఊహ.’
‘అది పగటి కల కదా! రాత్రిళ్ళు కనటం కుదరదు’.
హంతకుడంతే. మాట్లాడితే పొడిచినట్లో, ఎత్తి పొడిచినట్లో వుంటుంది.వృత్తికి కట్టుబడ్డ మనిషి.
అంత మాత్రాన దొంగ వదులుతాడా? చిన్న సందు దొరికితే చాలు. దూరిపోడూ..?!