గురూజీ?
వాట్ శిష్యా!
‘మన్ మోహన్ సింగ్ కూడా ఉద్యమాల బాట పయినిస్తున్నారు. తెలుసా?’
‘ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటుంటే, ఉద్యమాల్లోకి దించుతావేమిటి శిష్యా?!’
దు:ఖిస్తే ఏడుపే రావాలనీ, ఆనందిస్తే నవ్వే రావాలనీ సూత్రీకరణలు చెయ్యటం అన్నివేళలా నడవదు. సుఖపెట్టే రాత్రులూ, కష్ట పెట్టే పగళ్లూ వున్నట్లే, క్షేమం కోరే శత్రువులూ, అణచివేసే మిత్రులూ వుండే ప్రపంచంలో, ఏ జీవితమూ ఒక మూసలో ఇమడదు. గుండెలు తెరవాలే కానీ, ఒక్కొక్క అనుభవమూ ఒక మహా కావ్యం. అలాంటి ఏ గుండెలు ఏమి మాట్లాడుకున్నా, దోసిలి పట్టి కవిత్వం చేయాలనిపిస్తుంది.
క్షణం కూడా కాలమే. ఒక్కొక్క సారి క్షణమే శాశ్వతమైన చిత్తరువయిపోతుంది. చెరిపేద్దామన్నా చెరగదు. అందుకే నుదుటి మీద చెమట బొట్టును విదల్చేసినట్టు క్షణాన్ని విసిరేయకూడదు. అది ఎవరో ఒక అపరిచితురాలు అలా నవ్వుతూ చూసిన క్షణం కావచ్చు. లేదా, అమ్మ తన పని తాను చేసుకుంటూ తలను నిమిరి వెళ్ళిన క్షణం కావచ్చు. లేదా, కేవలం ఆత్మగౌరవం కోసం రాజీనామా పత్రాన్ని యజమాని ముఖం మీద కొట్టిన క్షణం కావచ్చు. బతికిన క్షణమంటే అదేనేమో కూడా..!
ఇరవయ్యేళ్ళ క్రితం నాటి మాట. ఒక ప్రముఖ దినపత్రికకు చీఫ్ రిపోర్టర్ గా వుంటూ, వుంటూ అలిగి, రాజీనామా చేసి, రాజమండ్రి వచ్చి ‘కోస్తావాణి’ అనే ఒక ప్రాంతీయ దినపత్రికకు సంపాదకుడిగా చేరిపోయాను. పాపం… నా కోసమే అన్నట్టు ఈ పత్రికను స్థాపించి, ఒక మార్గంలో పెట్టి, ఆ పోస్టును ఖాళీ చేసి వెళ్ళారు సీనియర్ పాత్రికేయులు కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం గారు. అప్పుడు. సరదాగా కొన్ని కాలమ్స్ ప్రవేశ పెట్టాను. కొన్ని నేనే రాశాను. వాటిలో ఒకటి. ‘గురూజీ? వాట్ శిష్యా’.ఇప్పటి రాజకీయాలను విశ్లేషించటానికి మళ్ళీ రాస్తున్నాను… ఇలా …)
(ఏడ్చి ఏడ్చి ఊరుకున్న కళ్ళల్లోకి చూడండి. ఒక మెరుపు. ఒక ఆశ. ఒక ఇంధ్రధనువు. మాటా, మాటా అనుకున్న ప్రతీసారీ, ఈ అనుబంధం ఇలా ముగిసిపోతుందనే అనుకుంటాం. కానీ, మరుసటి రోజు ఇద్దరి కరస్పర్శతో ఓ కొత్త ఉదయం! అంత పెద్ద చెట్టు కూలి పోయిందనే భావిస్తాం. కానీ కాస్సేపు విత్తనం లో దాక్కొని విరాట పర్వానికి తీస్తుంది. చినుకు పడగానే విచ్చుకొని మెల్ల మెల్లగా విశ్వరూపం ధరిస్తుంది.)
జెండాలూ, ప్లకార్డులూ, బ్యానర్లే కాదు…
బూట్లూ, చెప్పులు కూడా ఉద్యమసంకేతాలుగా మారాయి.
తాను గీసిన గీతలో, తాను కోరిన రీతిలో తెలంగాణ ఉద్యమానికి సహకరించని నేతల్ని ‘బూట్ పాలిష్ గాళ్ళు’ అనేశారు ఓ పెద్దమనిషి. ఈ మాట ఇంకెవరయినా అంటే మరోలా వుండేదేమో. కానీ సామాజికంగా ‘అగ్ర’ స్థానంలో వుండి అనటం వల్ల అర్థాలు మారిపోయాయి.
ఏమిటీ ‘దొర’హంకారం.. సారీ… దురహంకారం…! అనిపించింది ఇంకో నేతకు. ఆయన అట్టడుగు వర్గాలనుంచి వచ్చిన నేత.
(ఏదీ గొప్ప కాదు. ఏదీ వింత కాదు. అలవాటయితే అన్నీ పాతవే. అసలు అలవాటే పాతదనం. పేదరికమూ భరించగా భరించగా పాతపడిపోతుంది. వాడెవడో వీపున కొరడా తీసుకుని కొట్టుకుంటాడు- పిడికెడు మెతుకుల కోసం. వాడికి దెబ్బలు పాతపడిపోయి వుంటాయి. సన్మానాలంత పురాతనమయిపోయి వుంటాయి. కానీ వాడిని కన్నతల్లికి మాత్రం ప్రతీ దెబ్బాకొత్తదే.)
తెలివి తక్కువ వాళ్ళ గురించిన బాధేం లేదు.
దిగులంతా ‘తెలుగు తక్కువ’ వాళ్ళ గురించే.
తక్కువయిన వాళ్ళు తక్కువయినట్లు వుంటారా? ఎక్కువ మాట్లాడతారు. అక్కడితో కూడా అగరు. తెలుగును ఉద్ధరించే సాహసానికి కూడా ఒడిగడతారు.
ఈ ఉధ్ధారకులు అన్ని రంగాల్లోనూ వుంటారు. ప్రసార మాధ్యమాల్లోనూ, విద్యాలయాల్లోనూ కాస్త ఎక్కువగా వున్నట్లు అనిపిస్తారు.అందుకు కారణం వారి గొంతులు పెద్దవని కాదు కానీ, వారి ముందు అమర్చిన మైకులు పెద్దవి.