Tag: చీకటి

ఒక గ్రాము ప్రేమ

ఏమిటో. ఇలా అనుకోవటం పాపం, అలా జరిగిపోతుంది. సరిగ్గా చిట్టి చేపను చూసి వల

వేస్తుంటాడతడు. పిచ్చిచేప పిల్ల పారిపోతే బాగుండునూ అనుకుంటాను. అది అనుకున్నట్టే

తుర్రుమంటుంది. అదేదో చానెల్లో లేడిపిల్లని పులి వేటాడుతుంటుంది. దగ్గరవరకూ వచ్చేస్తుంది. పులి

ఆగిపోతే బాగుండుననుకుంటానా, సరిగ్గా అదే సమయానికి దాని కాలికి రాయి తగిలి బోర్లా

పడుతుంది. లేడి పిల్ల తప్పుకుంటుంది. ఇలా ఎలా జరిగిపోతోంది? ఏదయినా అతీత శక్తా? అవును.

దాని పేరే ప్రేమ.

ఉనికి

ఆమె ఎవరో… ఖరీదయిన దుస్తుల్లో, విలువయిన ఆభరణాలతో, అరుదయిన పెర్ప్యూమ్ పూసుకుని

ఎదురుగా నిలబడింది. పట్టించుకోలేదు. నేనే కాదు. నా మిత్రులు కూడా. చిన్నగా నవ్వింది.

అందరమూ చూశాం. అవును నవ్వే చిన్నది. ఆ నవ్వు పూసిన పెదవులు మరీ చిన్నవి. నిలువెత్తు

అందగత్తెకు ఉనికి ఆ చిన్న నవ్వే. నేను రోజూ వెళ్ళే పార్కుకు ఉనికి చెరువుకు ఓ మూలగా వున్న

చిన్న సిమెంటు సోఫా కావచ్చు. అక్కడ కూర్చున్నప్పుడే పల్చటి గాలి వచ్చి పలకరించి పోతుంది.

చిరు అనుభూతే పెద్ద జీవితానికి ఉనికి.

వేట

ఒక్కొక్కసారి దు:ఖమే కాదు, సంతోషమూ అలజడిని రేపుతుంది. అనుకోని విజయం కలిగిన రోజు కూడా, మనసు కుదురు ఉండదు. కల్లోల సాగరమవుతుంది. అలల్లా కలలు పోటెత్తుతాయి.
గొప్పకలలే కావచ్చు. కలవర పరుస్తాయి. ప్రేయసి కనిపించకుండాపోయినప్పడే కాదు, హఠాత్తుగా కౌగిలి చేరినప్పడూ గుండె గిలాగిలా కొట్టుకుంటుంది. అప్పడు ఎవరన్నా వచ్చి దేవత ప్రశాంతతను బహూకరిస్తే బాగుండునని పిస్తుంది. ఆ దేవత వెలుతురే కానక్కర్లేదు, చీకటి కూడా కావచ్చు.