అదేమిటో కానీ, గట్టెక్కిన వాడు నీళ్ళలో వున్న వాడికీ; పై మెట్టు మీద వున్న వాడు, కింద మెట్టు మీద వున్న వాడికీ- పాఠం చెప్పేయాలని తెగ ఉత్సాహపడిపోతాడు. సంపన్నుడు మధ్య తరగతి వాడికీ; మధ్య తరగతి వాడు, పేదవాడికీ ఇలా నీతిని బోధించాలని తెగ ఉబలాట పడిపోతారు. ఈ మధ్య కాలంలో మధ్యతరగతి వారి ఉత్సాహం కట్టలు తెంచేసుకుంటోంది. ఏ ఐటీ చదువో వెలగబెట్టి, అంతకు తగ్గ కార్పోరేటు కొలువు పట్టేస్తే చాలు- కింద వారికి చెప్పడానికి నీతి కథలు తన్నుకుంటూ వచ్చేస్తాయి. అలాంటి నీతి పాఠాల్లో, తొలి నీతి పాఠం- ‘అవినీతి పాఠం’.