బాగా ఉక్కబోస్తున్నప్పుడు, అలా కిటికీ లోంచి మెత్తని గాలి ముఖాన్నితాకి వెళ్ళిపోతుందే, అలా ఏదో ఒక భావన మనసుని తాకి వెళ్ళి పోతుంది. కాస్సేపు కూడా నిలవదు. దానిని పట్టుకోలేను. విడవ లేను. అనుభవించటం తప్ప వేరే ఏమీ చేయలేను. అదుగో అలాంటి భావనలే ఇలా ’పదచిత్రాలు’ అయ్యాయి. పొందింది, పొందినట్లు పొందుపరిచాను. నేను కొన్ని దినపత్రికలకు సంపాదకుడిగా వున్నప్పడు, ఎడతెరపిలేని రాజకీయ వార్తలూ, విశ్లేషణలూ, సంపాదకీయాల మధ్య, ఈ ఊహలే నన్ను సేద తీర్చేవి. ముందు‘మహావృక్షం’తో మొదలు పెడదాం.