Tag: Satish chandar short poems

అడుగు జాడ!

మబ్బుకీ మబ్బుకీ మధ్య ఎండలా, ఏడుపుకీ ఏడుపుకీ మధ్య నవ్వులా, విశ్రాంతికీ విశ్రాంతికీ మధ్య పనిలా ఏమిటో ఈ కవిత్వం? గాఢాలింగనంలో కూడా ఇంకా ఏదో దూరం మిగిలిపోయినట్లూ, ఎంతో గొప్పగా నడిచిపోతున్న జీవితంలో కూడా ఏదో వెలితి. ఏ ఫర్వాలేదు.. ఎక్కడ జాగా వుంటే అక్కడ బతకటానికి కాసింత అమాయకత్వం అవసరమయిందన్న మాట. నిజం చెప్పొద్దూ..? కవిత్వమూ, అమాయకత్వమూ రెండూ ఒక్కటే…!

శస్త్రకారుడు

ధ్వంసం చేసాకే సృష్టి. కానీ పాత కొంపను కూల్చిన వాణ్ణి ఎవరూ గుర్తు పెట్టుకోరు. కొత్త ఇల్లు కట్టిన వాడికే సత్కారం.గొయ్యి తీయటం మనకి నచ్చదు. దాంట్లో పునాది రాళ్ళు వెయ్యటం మురిపెంగా వుంటుంది. చెత్తను తగులబెట్టే వాడికి క్షణమైన శిరస్సువంచిన జాతి మాత్రమే ముందుకు వెళ్తుంది. నిర్మాణానికి ముందు వింధ్వంసమే నడుస్తుంది- హొయలు పోయే సీతాకోక చిలుకక ముందు, ముడుచుకు పోయే గొంగళి పురుగు నడిచినట్లు…!

కృతజ్ఞత!

(సొమ్ములు మాత్రమా కాదు. మనం బతకాల్సిన క్షణాలు కూడా బ్యాంకులో వుంటాయి. ఖర్చు చెయ్యాలి తప్పదు- మనకి మనం ఖర్చు చేసుకుని చాలా సార్లు దు:ఖపడుతుంటాం- నిల్వ తగ్గిపోతుందని. మనకిష్టమయిన వాళ్ళకు ఖర్చు చేసినప్పుడు మాత్రం ఎందుకో…బ్యాంకు బాలెన్స్ పెరిగినట్టుంటుంది. గణితానికి అందనిదే- అనుబంధమంటే…!)

బువ్వ దొంగలు

దు:ఖిస్తే ఏడుపే రావాలనీ, ఆనందిస్తే నవ్వే రావాలనీ సూత్రీకరణలు చెయ్యటం అన్నివేళలా నడవదు. సుఖపెట్టే రాత్రులూ, కష్ట పెట్టే పగళ్లూ వున్నట్లే, క్షేమం కోరే శత్రువులూ, అణచివేసే మిత్రులూ వుండే ప్రపంచంలో, ఏ జీవితమూ ఒక మూసలో ఇమడదు. గుండెలు తెరవాలే కానీ, ఒక్కొక్క అనుభవమూ ఒక మహా కావ్యం. అలాంటి ఏ గుండెలు ఏమి మాట్లాడుకున్నా, దోసిలి పట్టి కవిత్వం చేయాలనిపిస్తుంది.

అనుకరణ

అనుకుంటాం కానీ,మనసును కూడా పెట్టుకుని వెళ్ళటం-అంటే పసిపిల్లాడిని వెంటతీసుకుని వెళ్ళటమే.ప్రతి చిన్న వస్తువూ వాడికి వింతే. పువ్వు పూసేయటమూ, కోకిల కూసేయటమూ, పండు రాలిపడటమూ- ఏది చూసినా అక్కడ ఆగిపోతుంటాడు. మనల్ని ఆపేస్తాడు. మనసూ అంతే. ఎక్కడ పడితే అక్కడ తాను పడిపోతుంది.మనల్ని పడేస్తుంది.