సర్కారు ‘సౌండు’ పార్టీయే!

కొందరు ‘సౌండు’ పార్టీలుంటారు. వాళ్ళకు నిశ్శబ్దం పడదు.
రైస్‌మిల్లులో పనిచేసే కుర్రాణ్ణి, ధ్యాన మందిరానికి తీసుకొస్తే చచ్చిఊరుకుంటాడు.
సుల్తాన్‌ బజార్‌లోని సేల్స్‌బోయ్‌ను తీసుకొచ్చి, ఎయర్‌ కండిషన్డ్‌ మాల్‌లో ఉద్యోగమిప్పిస్తే మంచం పట్టేస్తాడు.
రైల్లోనూ, బస్సులోనూ మాత్రమే నిద్రపోయేవాళ్ళని ఇంట్లో పడుకోపెడితే మాత్రం నిద్రపోతారా?
అంతెందుకు? మునిసిపల్‌ స్కూలు టీచర్‌ను తీసుకొచ్చి కార్పోరేట్‌ స్కూల్‌లో పాఠం చెప్పమంటే నోరు పెగులుతుందా? రొదలో మాత్రమే అర్థం కాకుండా చెప్పుకు పోయే ఆ పంతులయ్యకు, పరమ నిశ్శబ్దంగా వున్న చోట అర్థమయ్యేలా చెప్పాలంటే కష్టం కాదూ…!?
నా కిప్పటికీ సందేహమే.. అసెంబ్లీ సమావేశాల ముగిసిన తర్వాత స్పీకర్‌కు నిద్రపడుతుందా…అని! బహుశా ఏ కూరగాయల మార్కెట్లోనో, చేపల బజారులోనో.. సౌండ్స్‌ రికార్డు చేసుకుని వింటే తప్ప కునుకు పట్టే పరిస్థితి ఆయనకు ఉండక పోవచ్చు.
శబ్దంలో వున్న సుఖం నిశ్శబ్దంలో వుండదు.
ఆంధ్రప్రదేశ్‌లో సర్కారు చాలా కాలంగా అలాంటి సుఖాన్నే అనుభవిస్తోంది. ఈ భోగాన్ని చూసి, పక్క రాష్ట్రాల ప్రభుత్వాలకు కించెత్తు ఈర్ష్యగా కూడా వుండొచ్చు.
ఇక్కడ ముఖ్యమంత్రిగా వున్న వారికి ఈ సుఖం స్పష్టంగా అర్థమౌతుంది. ఇటీవలి కాలంలో ఈ సుఖాన్ని అమితంగా అనుభవించిన వారు – పెద్దలూ, విజ్ఞులూ, అనుభవజ్ఞులూ కొణిజేటి రోశయ్య.
ఆ తర్వాత ఈ అదృష్టం- యువకులూ( రాజకీయాల్లో బాల్యం పోయి, యవ్వనం యాభయ్యేళ్ళ తర్వాత వస్తుంది), ఉత్సాహవంతులూ, క్రీడాస్ఫూర్తి గలవారూ నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని వరించింది.
అలజడులూ, ఆందోళనలూ, ఉద్యమాల నేపథ్య సంగీతంగా వున్నప్పుడు పాలనలోని సుఖం అనుభవించిన వారికే తెలుస్తుంది.
కొన్ని రకాల గోమాతలు సంగీతం వినిపిస్తే బాగా పాలిస్తాయని శాస్త్రజుఞలు చెపుతుంటారు.
అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ- రెండు ప్రాంతాల వారూ ఉద్యమ భేరీలు మోగిస్తుంటే,ప్రకతి బీభత్సాలు నిధుల కొరత, అధిక ధరలు – వంటి ఎన్నో సమస్యలను సునాయసంగా ఎదుర్కొంటూ( అనగా.. పక్కన పెడుతూ), రాష్ట్రాన్ని రోశయ్య బాగా పాలించారు.
కుడి ఎడమల డాల్‌ కత్తుల మెరయగ… కాదు, కాదు… కుడి ఎడమల డోలు దరువులు మోగగ.. నేడు రాష్ట్రంలో అంతకన్నా హాయిగా రాష్ట్రాన్ని కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాలిస్తున్నారు.
నిన్నటి వరకూ తెలంగాణ మాత్రమే వేడెక్కింది. ఇప్పుడు సీమాంధ్రకూడా ఉడుకుతోంది.
ఎడా పెడా డప్పుల మోతలో… అన్ని చప్పుళ్ళూ చిన్నవే.
చార్జీల పెంపుతో ఎర్రబస్సు డబడబ లాడింది. సామాన్య జనం దడదడ లాడారు. అయినా ప్రాంతాల హోరులో ఎవరికీ వినిపించలేదు.
ముంబాయి ప్రేలుళ్ళతో మళ్ళీ హైదరాబాద్‌ నగరం ఉలిక్కిపడింది. శాంతి భద్రతల గురించి నగరవాసులు గుండెలు బాదుకున్నారు. వినపడలేదు.
పెట్రోవాతతో గ్యాస్‌ బండ బరువు పెరిగి గృహిణులు వంటసామాన్లు మోగించారు. అది మాత్రం వినపడిందా? లేదే..!
ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయాయి. ప్రజలు మూలిగారు. అరిస్తేనే వినపడనిది- మూలిగితే వినిపిస్తుందా..?
విత్తనాల, ఎరువుల కొరతతో రైతులు అల్లాడిపోయారు. వినిపిస్తే కదా!
ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగ్యూ వంటి విషజ్వరాలు వచ్చి పేదలు వణికి పోతున్నారు. సారీ! రొదలో ఫోన్లు వినపడటం లేదు.
కుక్కలు కరుస్తూనే వున్నాయి, మనుషులు ర్యాబిస్‌తో తిరుగుతూనే వున్నారు. ఈ సమస్యకు చప్పుడే వుండదు. ఎందుకంటే కరిచే కుక్కలు మొరగవు.
విద్యార్థుల ఫీజు బకాయిలు సర్కారు చెల్లించాలి. నో ప్రోబ్లమ్‌. సర్కారు వణకాల్సిన పనిలేదు. విద్యార్థులు కాలేజీలకు వెళ్ళినప్పుడు కదా! మూడు బంద్‌లూ ఆరు సమ్మెలతో వారు బిజీగా వున్నారు.
అతి పెద్ద శబ్దం ముందు అన్నీ చిన్పచప్పుళ్ళే.
ఒక్క ముఖ్యమంత్రికే కాదు, ఆయన అధికార గణానికి కూడా ఎంతో ప్రశాంతత లభిస్తోంది. సగం మంత్రులు రోడ్లమీద వుండటంతో అధికారులే సర్వస్వతంత్రులుగా సచివాలయాన్ని పాలించుకోవచ్చు. ఎలాంటి రాజకీయ జోక్యమూలేని రోజులు లేని సువర్ణ యుగం- ఇన్నాళ్ళ కొచ్చిందని రహస్యోత్సవాలు జరుపుకోవచ్చు.
ఇప్పుడు చెప్పండి. పరిపాలన సుఖమా? కాదా?
కానీ, తెలంగాణ వాదులూ, సమైక్యాంధ్ర వాదులూ- తమ ఉద్యమాలను తీవ్ర తరం చేస్తున్నారు- సర్కారును ఇరుకున పెట్టాలని.
పాపం- వారెప్పుడు గ్రహిస్తారో… తమ ఉద్యమాలతో సర్కారును సుఖపెడుతున్నామని; తమ ‘సౌండు’తో సర్కారునే ‘సౌండు’ పార్టీగా చేస్తున్నామని..!
ఇప్పుడు హఠాత్తుగా ఉద్యమాలు ఆగిపోతే…!? వామ్మో! సర్కారు రోడ్డున పడిపోదూ…!?

-సతీష్‌ చందర్‌

Leave a Reply