తుంటరి ‘చేతి’కి ఒంటరి ‘గులాబి’

కేసీఆర్‌ మాటకారే. కానీ మౌనం దాల్చారు.

నిన్నమొన్నటిదాకా, ఆయనే తెలంగాణకు ఏకైక విలాసం. తెలంగాణ ఉద్యమానికి ఆయన గీసిందీ గీత, కూసిందే కూత, రాసిందే రాత. ఇప్పుడలా కాదు. పలు చిరునామాలొచ్చాయి.

-తెలంగాణలో తిరగటానికి జంకి ఎక్కడో మహరాష్ట్రలో బాబ్లీ నిరసనలు చేసిన తెలుగుదేశం నేతలు తెలంగాణ ఉద్యమంలో వాటా కొచ్చారు.

-వెనకే వెనకే, పక్కపక్కనే వుంటూ వున్న బీజేపీ, కేసీఆర్‌నీ, టీఆర్‌ఎస్‌నీ పక్కన పెట్టి మహబూబ్‌ నగర్‌ అసెంబ్లీ సీటు కొట్టేసింది.

-ఉస్మానియా యూనివర్శిటీ లో తెలంగాణ ఉద్యమం రగిలినప్పుడు, పరామర్శకు పోయి విద్యార్థుల చేతుల్లో పరాభవం పొందిన నాగం జనార్థన రెడ్డి తెలంగాణ పేరు మీద స్వతంత్రుడయి తన స్థానంలో విజయ కేతనం ఎగుర వేశాడు.

వీరంతా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) కున్న ‘పేటెంట్‌ హక్కు’ ను సవాలు చేశారు.

దీనికి తోడు తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(టీజాక్‌) కేసీఆర్‌ ఆడిస్తే, ఆడే సంస్థ కాదని నిరూపించుకుంది. కేసీఆర్‌ నీడలా పేరు తెచ్చుకున్న కన్వీనర్‌ కె.కోదండరామ్‌ ‘ఉద్యమం ముందు కేసీఆరూ చిన్నవాడే’ అన్న ధోరణిలోకి వెళ్ళారు. టీఆర్‌ ఎస్‌ కలసి వచ్చినా, రాకున్నా సెప్టెంబరు 30 నుంచి 48 గంటల పాటు హైదరాబాద్‌ దిగ్బంధనం చేయాలన్న నిర్ణయంతో ముందుకు వెళ్ళిపోతున్నారు.

ఇదంతా తెలంగాణ ఉద్యమానికి ప్రాతినిథ్యం వహించటంలో ముందు వెనుకల తగవే. వీరందరీ లక్ష్యమూ ప్రత్యేక తెలంగాణా సాధనే. కాబట్టి ఎప్పటికయినా వీరిలో కొందరయినా తన వెంట వస్తారని కేసీఆర్‌ భావించ వచ్చు.

కానీ, ఒకప్పుడు ‘సమైకాంధ్ర’ నినాదమిచ్చిన సీమాంధ్ర నేతలెవరూ, తెలంగాణ గడ్డ మీద కేసీఆర్‌కు ఎదురు నిలువ లేదు. ఆ మాట కొస్తే ఉద్యమం ఉధ్ధృతం అయ్యాక కాలు కూడా మోప లేదు. అలాంటిది- ఒకప్పుడు ఇదే కారణం మీద మహబూబా బాద్‌ నుంచి వెనుతిరిగిన వై.యస్‌ జగన్‌, తన తల్లి(విజయమ్మ)నీ, చెల్లి(షర్మిల)నీ తెలంగాణ ఉప ఎన్నికకు ప్రచారానికి పంపిస్తే, కేసీఆర్‌ చోద్యం చూశారు. అంతే కాదు, పరకాలలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ‘నువ్వా-నేనా’ అన్నంతటి పోటీ ఇచ్చి ముచ్చెమట్లు పోయించారు. స్వల్ప ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ పరువు నిలుపు కున్నది కానీ, పట్టు కోల్పోయింది.

అక్కడితో వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఆగలేదు. ఇంకాస్త ముందుకు వెళ్ళింది. కేసీఆర్‌ తనయుడు కె. తారకరామారావు(కేటీఆర్‌) నియోజకవర్గ పరిధి(సిరిసిల్ల) లోని చేనేత కార్మికుల పరామర్శకు విజయమ్మ వెళ్ళారు. అప్పుడూ ఆమెకు జనం వచ్చారు. టీఆర్‌ఎస్‌ తరపున మహిళా కార్యకర్తలు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తమయ్యింది.

తర్వాత ఆమె కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహించే మహబూబ్‌ నగరే వెళ్ళవచ్చనుకున్నారు.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ తెలంగాణ ప్రవేశంతోనే రాష్ట్ర రాజకీయ సమీకరణల్లో వేగవంతంగా మార్పులు వచ్చాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం వైఖరిలో మార్పులు కొట్టొచ్చినట్లు కనిపించాయి. అప్పటి వరకూ ‘తెలంగాణ’ పై ఏదోఒకటి తేల్చక తప్పదు-అని ఒక నిర్థారణ కొచ్చినట్లు వార్తలొచ్చాయి. బహుశా వీటినే కేసీఆర్‌ ‘తెలంగాణ ఏర్పాటుకు సంకేతాలు’ గా భావించి వుండవచ్చు. అందుకోసమే, తెలంగాణ ఏర్పాటు ఎంతో దూరంలో లేదని- కొన్ని వారాల క్రితం సింగరేణి కార్మికుల విజయోత్సవ సభలో చెప్పారు.

అప్పటి వరకూ టీఆర్‌ఎస్‌ను మచ్చిక చేసుకునే ధోరణిలోనే కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రవర్తించింది.

 ‘చెయ్యి’చ్చి తీసుకున్నారు!

అయితే, ‘సమైక్యాంధ్ర’ ముద్ర వున్న పార్టీయే (వైయస్సార్‌ కాంగ్రెసే) తెలంగాణలో దూసుకు పోతున్నప్పుడు, ఒక వైపు కాంగ్రెస్‌కు ఇబ్బందిగా వున్నా, మరో వైపు సంతోషించింది. తెలంగాణ సాధనలో టీఆర్‌ఎస్‌కున్న చిత్తశుధ్ధిని తెలంగాణ ప్రజలు శంకిస్తున్నారనే అవగాహనకు కాంగ్రెస్‌కు వచ్చింది. పరకాల ఉప ఎన్నికలలో పార్టీల బలబలాలు తెలిసినప్పుడు, కాంగ్రెస్‌ అక్కడ ఖంగు తిన్నా సరే, ‘టీఆర్‌ఎస్‌’ వణికినందుకు సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు సంతోషించారు. ఆ ఆనందాన్ని వ్యక్తం చేయకుండా ఉండలేక పోయారు. ‘ఇక ప్రత్యేక తెలంగాణ ఉద్యమమూ లేదు, సమైక్యాంధ్ర ఉద్యమమూ లేదు’ అని విజయవాడకు చెందిన కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యానించారు. ఈ మేరకే రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు పార్టీ అధిష్ఠానానికి తెలంగాణపై నివేదించి వుంటారు. టీఆర్‌ఎస్‌ మరికాస్త చిన్న బోతే, తన షరతుల మేరకే ఆ పార్టీని చేరదీయ వచ్చనే ఆశ కాంగ్రెస్‌కు పెరిగింది. అందుకే ఎప్పటిలాగా, సాచివేత ధోరణి వైపు వెళ్ళిపోయింది. అందుకు అప్పుడప్పుడూ ఈ విషయంపై పెదవి విప్పుతున్న కాంగ్రెస్‌ నేతల వైఖరే సాక్ష్యం. ఒకప్పడు కేంద్ర హోం మంత్రిగానే ‘తెలంగాణ ఏర్పాటు’ పై అర్థరాత్రి ప్రకటన చేసిన చిదంబరం, ఏళ్ళ అంతరం తర్వాత మళ్ళీ అదేశాఖను స్వీకరిస్తూ ‘తెలంగాణ పై నిర్ణయం తీసుకునేది హోం శాఖ కాదనీ, కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని కేవలం అమలు పరుస్తుందని’ తేలికగా కొట్టేశారు.

మారిన ఈ వైఖరితో, కేసీఆర్‌ కాంగ్రెస్‌కు ఎంత దగ్గరగా వచ్చారో, అంత దూరంగా జరగాల్సి వచ్చింది.

 జగనంటే నాడు ప్రియం, నేడు భయం!

అలాగే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పట్ట టీఆర్‌ఎస్‌ కున్న వైఖరిలో కూడా పూర్తి మార్పులు వచ్చాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, సీమాంధ్రలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభంజనాలను చూసినప్పుడూ- రెండూ పార్టీలూ కలిస్తే, మధ్యంతరం వచ్చినా, 2014 వరకూ ఎదురు చూసినా, ప్రభుత్వాన్ని సులభంగా స్థాపించ వచ్చన్న ధీమా తో కేసీఆర్‌ ఉండేవారు. కాబట్టే ఒక దశలో పూర్తి మిత్రపూరిత వైఖరినే ఈ పార్టీతో కొనసాగించారు. అందుకనే, తొలుత జగన్‌ ఆర్మూరు(నిజామాబాద్‌) వచ్చినప్పుడు అడ్డుకునే పని చేయలేదు. ఆ విధంగా పరోక్ష సహకారం అందించారు. కానీ, పరకాల, సిరిసిల్లల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ హవా చూశాక, ఇదే పార్టీని శత్రుపక్షంగా చూడటం మొదలు పెట్టారు. అప్పటికీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ తన పై ‘సమైక్యాంధ్ర’ ముద్ర లేకుండా జాగ్రత్త పడింది. ‘తెలంగాణ ఇచ్చే స్థానంలో తాము లేమ’ంటూ బాధ్యతను కాంగ్రెస్‌ మీదే నెట్టింది. పైపెచ్చు కొండా సురేఖ తెలంగాణ నినాదం వెనుక తామున్నామంటూ విజయమ్మ కూడా ప్రకటించారు. దాంతో అందరూ వాడిన ‘అవినీతి ఆరోపణల’ అస్త్రాలనే టీఆర్‌ఎస్‌ నేతలూ వాడటం మొదలు పెట్టారు. అంతవరకూ తెలుగుదేశం పార్టీ మీద ఎంత తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారో, ఇప్పుడు అదే స్థాయిలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ మీదా విరుచుకు పడ్డారు.

ఆ రకంగా చూసినప్పుడు టీఆర్‌ఎస్‌ నేడు ఏకాకి అయింది. ఇటు తెలంగాణ సాధనలో తోడ్పడే మిత్రులకు దూరమవటంతో పాటు, తెలంగాణ వెలుపల రాజకీయంగా చెలిమి చేయగల వైయస్సార్‌ కాంగ్రెస్‌కూ దూరమయింది.

 ‘ఉప ఎన్నికల’ తర్వాత ఉపాయం?

కేసీఆర్‌ గత మూడేళ్ళుగా అన్ని అస్త్రాలూ వాడేశారు. అంతకు ముందు ఆయన నడిపిన రాజకీయం వేరు. వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం పెల్లుబికిన తెలంగాణ ఉద్యమంతో రాజకీయం నడిపిన తీరు. ఈ సారి ఇటు అధికార రాజకీయాన్నీ, అటు ఉద్యమ రాజకీయాన్నీ – జమిలిగా ప్రయోగించారు. రెంటిలోనూ ‘అంచులు’ చూసేశారు.

అధికార రాజకీయాల్లో భాగంగా, ఎమ్మెల్యేలూ, ఎంపీల రాజీనామాలను అస్త్రాలుగా వాడారు. అవే అస్త్రాలను సమైక్యాంధ్ర వాదులూ ప్రయోగించారు. తర్వాత ఉపసంహరణలు లేకుండా, రాజీనామాలను అంగీకరింప చేసుకుని, ఉప ఎన్నికల మీద ఉప ఎన్నికలతో వోట్ల శాతాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇతర పార్టీలనుంచి శాసన సభ్యుల వలసల్ని ప్రయోగించారు. అది పాక్షికంగా మాత్రమే విజయవంతమయ్యాయి. అంతే కాదు, ఈ ఉప ఎన్నికలు ఒక దశ తర్వాత నష్టాన్ని తెచ్చి పెట్టాయి. ఏ పార్టీ శాసన సభ్యుడు, లేదా పార్లమెంటు సభ్యుడు రాజీనామా చేసినా తిరిగి గెలిపించుకోవాలన్న జాగాలోకి ఇతర పార్టీలు కూడా ప్రవేశించగలిగాయి. ఇండిపెంటెంట్లూ, బీజేపీ వంటి పక్షాలు కూడా లాభ పడ్డాయి. ఇలా గెలిపించే బాధ్యతను నెత్తిన వేసుకున్న టీజాక్‌- టీఆర్‌ఎస్‌ ను మించి జనంలోకి చొచ్చుకు పోయింది. పార్టీలకు అతీతంగా టీజాక్‌ను ప్రజలు ఆదరిస్తున్నారు. దాంతో అధికార రాజకీయాల్లో తదుపరి వేసే పాచికలు పెద్దగా మిగల్లేదు.

ఇక ఉద్యమ రాజకీయాల్లో, తొలుత విద్యార్థులే కేసీఆర్‌ను నడిపించారు. తర్వాత విద్యార్థుల్ని కేసీఆర్‌ నడిపించారు. కడకు రాజీనామా చేసిన ప్రజాప్రతినిథులను తిరిగి గెలిపించుకోవటం లోనూ, విద్యార్థులే ప్రధాన పాత్ర పోషించారు. వారి ప్రాణ త్యాగాలే, ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకు పోయాయి. అయితే ఉద్యమం మలి దశలో, విద్యార్థుల స్థానంలోకి తెలంగాణ ఉద్యోగులు వచ్చేశారు. విద్యాసంస్థలతో పాటు, అన్నీ మూత పడే విధంగా ఉద్యోగుల నేతృత్వంలో సకల జనుల సమ్మె శ్రీకారం చుట్టారు. విద్యాలయాల క్యాంపస్‌లు మూతపడటం తో విద్యార్థులు తమ తమ స్వస్థలాలలోనే ఉండి పోవాల్సి వచ్చింది. క్యాంపస్‌లో వుంటేనే విద్యార్థులు సంఘటిత శక్తిగా కనిపిస్తారు. ఈ విషయాన్ని కేసీఆర్‌ ఎందుకు విస్మరించారో తెలీదు కానీ, సకల జనుల సమ్మెలో విద్యార్థులు చోదక శక్తులు గా లేరు. ప్రభుత్వ ఉద్యోగులూ, ఆర్టీసీ కార్మికులూ, సింగరేణి కార్మికులూ- కీలక పాత్ర వహించారు. కానీ ప్రభుత్వాన్ని ‘ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌’ పై లొంగ దీయకుండానే సమ్మె ముగిసి పోయింది. బ్రహ్మాస్త్రం వాడేశాక, ఇంక అస్త్రాలేముంటాయి? అందుకే వ్యూహ కర్తలు చివరి అస్త్రంగా వాడాల్సిన దానిని ముందు గా వాడరు.

అంటే కేసీఆర్‌ అటు అధికార రాజకీయం లోనూ, ఇటు ఉద్యమ రాజకీయంలోనూ చివరి అస్త్రాలు వాడేశారు. అక్కడ ఉప ఎన్నికలతోనూ, ఇక్కడ సకల జనుల సమ్మెతోనూ ఆయన దారికి గోడ తగిలేసింది. అందుకనే, యూపీయే అధికారంలో వుండగానే, కొన్ని సడలింపులతో ఏదో ఒక ప్రకటన చేయించవచ్చని ఆశ పడ్డారు. కాంగ్రెస్‌ కూడా ఆ మేరకూ ‘సంకేతాలు’ ఇచ్చింది?(ఆయన మాటల్లోనే.). ఇప్పుడు అష్ట దిగ్బంధనంలో చిక్కుకున్న కేసీఆర్‌ మరింత బలహీన పడితే. తన పని మరింత సులువు అవుతుందని కాంగ్రెస్‌ మాటు వేసుకుని కూర్చుంది. దాంతో రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యం లో ఏర్పడ్డ పరిణామాలు కూడా టీఆర్‌ఎస్‌ నేతల్ని మరింత నిరుత్సాహానికి గురిచేశాయి. యూపీయే అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ కే వోటు వేయాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ నిర్ణయించుకోవటంతో, టీఆర్‌ఎస్‌ ఇరకాటంలో పడింది. అప్పటికే వైయస్సార్‌ కాంగ్రెస్‌ను శత్రుపక్షంగా చూస్తుందేమో, ఆ పార్టీ వేసిన అభ్యర్థికే తామెందుకు వెయ్యాలని భావించిందో ఏమో- మొత్తం ఎన్నికలనే బహిష్కరించింది. పైకి చెప్పిన కారణం మాత్రం- తెలంగాణ పై ఏ విషయం తేల్చటం కాదు కాబట్టే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి విషయంలో కూడా ఇదే నిర్ణయం తీసుకోవచ్చు. కాక పోతే తెలంగాణలో ముస్లింల వోట్ల శాతం ఎక్కువే కాబట్టి, యుపీయే అభ్యర్థి హమీద్‌ అన్సారీనీ బలపరచకుండా వుండటం వల్ల ఆ వోటర్ల మద్దతు కొంత కోల్పోయే ప్రమాదం కూడా వుంది.

 సొంత కులం, సొంత కుటుంబం!!

ఇంత వరకూ తెలంగాణ ఉద్యమం సామాజిక వర్గాలకు అతీతంగానే నడిచింది. కానీ ఇటీవల కులం కోణం వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్‌ సామాజిక వర్గం(వెలమ దొరలే) వారే నాయకత్వం వహిస్తున్నారంటూ, బడుగు బలహీన వర్గాల వారు ఎప్పటిలాగానే జెండాలు మోస్తున్నారన్న వాదన కొంత వరకూ లేచింది. ఉద్యమం ఉధ్ధృతి మీద వున్నప్పుడు ఈ వాదనను పెద్దగా స్వీకరించలేదు. ఆ తర్వాత ఈ వాదన ప్రచారంలోకి వెళ్ళింది. ఇది అక్కడితో ఆగ లేదు. కులం నుంచి కుటుంబం వరకూ వచ్చింది. ఎటు చూసినా కేసీఆర్‌ కుటుంబ సభ్యులే పార్టీని నడుపుతున్నారన్న వాదన వచ్చింది. తనయుడు కేటీఆర్‌, మేనల్లుడు హరీష్‌ రావు, కూతురు కవిత- అత్యంత కీలకమైన స్థానాల్లోకి వెళ్ళిపోయారు. తన పార్టీ ని( తల్లి తెలంగాణను) టీఆర్‌ఎస్‌లో కలిపిన విజయశాంతికి సమ స్థానం ఇస్తున్నట్లు కనిపిస్తున్నా, ప్రతీ వేదిక మీదా కేసీఆర్‌ ఆమెను పక్కనే కూర్చోబెట్టుకుంటున్నా- ఆమె ది ‘డైలాగుల్లేని పాత్ర’ లాగే అయిపోయింది. కవిత మాత్రం ఆందోళనల్లో, దీక్షలో అగ్రభాగాన నిలిచి దూసుకు పోయారు.

ఇన్ని పరిమితుల మధ్య కేసీఆర్‌ కొత్త పాచిక వేయాల్సి వుంది. అయితే అందుకు ఆయన వ్యవధి కూడా తీసుకుంటున్నారు. సెప్టెంబరు 30 లోగా కాంగ్రెస్‌ ఏదో ఒకటి చేయక పోతే, ‘తేల్చుకుంటాం’ అని అంటున్నారు. అంతవరకూ మౌన ముద్ర వహించారు. ఎలాగోలా, యూపీయే చేత కొత్త ప్రకటన చేయించుకోవటం వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఒకటి మాత్రం నిజం:ఇన్ని పరిమితుల మధ్య కూడా తెలంగాణ లో అగ్రనేత స్థానంలో ఇప్పటికీ కేసీఆరే వున్నారు. రాజకీయ చతురత లోకూడా ఆయనతో పోటీ పడగలిగిన వారు రాష్ట్రంలో కొద్దిమందే.

కాంగ్రెస్‌ కూడా శ్రీకృష్ణ కమిటీ శిఫారసులపై ఇతర పక్షాల అభిప్రాయలకోసం ఎదురు చూసే సాకును ఎల్ల కాలం వాడ లేదు. కాంగ్రెస్‌ అభిప్రాయాన్ని వెల్లడించాల్సిన అవసరం ఏర్పడింది. కాంగ్రెస్‌ కున్న ఈ ఒక్క బలహీనత మీదనే కేసీఆర్‌ ఆధారపడ్డారు. ‘రాయల తెలంగాణ’ యే కాంగ్రెస్‌ అభిప్రాయం అవుతుందేమోనన్న భయం కూడా టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కూడా లేక పోలేదు. అయితే కేసీఆర్‌ విషయంలో తెగే వరకూ లాగితే, కాంగ్రెస్‌ తన గొయ్యి తాను తవ్వుకున్నట్లవుతుంది. కేసీఆర్‌ దిగ్బంధనానికి మాత్రమే గురయ్యారు. పూర్తిగా దెబ్బతినలేదు. ఇది మాత్రం వాస్తవం.

-సతీష్‌ చందర్‌

2-8-12

 

 

 

 

 

 

 

3 comments for “తుంటరి ‘చేతి’కి ఒంటరి ‘గులాబి’

Leave a Reply