Category: What I speak (నా మాట)

ఎక్కడో అక్కడ, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటాను. మాట కూడా నా బలహీనతల్లో ఒకటి. అది ఉపన్యాసం కావచ్చు, పిచ్చాపాటీ కావచ్చు. ఈ మాట నా మిత్రులు అందరూ వింటే…! ఒక్కోసారి వినవచ్చు. వినక పోవచ్చు. వారి కోసం ఆ నాలుగు మాటలూ రాసి పెట్టేస్తే బావుంటుంది కదా!

కవులూ.. కొన్ని ‘లవ్వు’లూ…!

కవిత్వమా? అంటే ఏమిటి?

ఆ మాత్రం కూడా తెలియదా- అని అంటారని అడగరు కానీ, చాలా మందికి ఈ ప్రశ్న వేయాలనే వుంటుంది.

ఒక వేళ నిజంగా చొరవచేసి అడిగేశారనుకోండి. చెప్పేవాడు మాత్రం ఏమి చెబుతాడు? కవి అయితే మళ్ళీ కవిత్వం మీద కవిత్వం చెబుతాడు. ‘కదిలేదీ, కదిలించేదీ, పెను నిద్దుర వదిలించేదీ’ అని అనొచ్చు. అలా అని ఏ విమర్శకుణ్టో, పరిశోధకుణ్ణో అడిగితే, ఎవరి ‘కొటేషన్నో’ చెప్పి ఊరుకుంటాడు.

పైన తీపి, లోన కారం! ఇదే గోదావరి వెటకారం!!

పిచ్చివాళ్ళకీ, మేధావులకీ నెలవు మావూరు. ఇద్దరూ వేర్వేరా? కాదేమో కూడా. జ్ఞానం ‘హైపిచ్చి’లో వుంటే మేధావే కదా! నర్సాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) మా వూరు. అన్నీ అక్కడ కొచ్చి ఆగిపోతుంటాయి. రైళ్ళాగిపోతాయి. బస్సులాగిపోతాయి. కడకు గోదావరి కూడా మా కాలేజి చుట్టూ ఒక రౌండు కొట్టి కొంచెం దూరం వెళ్ళి ఆగిపోతుంది( సముద్రంలో కలిసిపోతుంది.) నాగరికత కూడా మా వూరొచ్చి ఆగిపోతుంది.
రైళ్లు ఆగిపోయిన చోట పిచ్చి వాళ్ళూ, నాగరికత పరాకాష్టకు చేరిన చోట మేధావులూ వుండటం విశేషం కాదు.