నిజం నాకు తెలుసు – నెపం నగ్నముని మీదకి!

ఒక జలప్రళయం ముగిశాక, సమస్త సృష్టీ సర్వనాశనమయ్యాక, నీటమునిగిన నేలతల్లి తేరుకున్నాక, ఒక వెలుగు కిరణం తొంగిచూశాక నోవహు తన ఓడనుంచి ఒక పిట్టను వదలుతాడు. ఒక పచ్చని మొక్క మొలకెత్తిన జాడను పిట్ట ముందుగా కనిపెడుతుంది. ఆ ‘వెలుతురు పిట్టే’ కవి. (ఈ మాటనిచ్చిన కవి మిత్రులు శ్రీమన్నారాయణ గారికి కృతజ్ఞతలు)

అదే జలప్రళయం తర్వాత నగ్నముని, రోడ్లపక్క ప్లాస్టిక్‌ చెట్ల’ను నాటడం చూసి వచ్చాడు. ప్లాస్టిక్‌ కంకుల్నీ, ప్లాస్టిక్‌ ఆవుల్నీ, ప్లాస్టిక్‌ గేదెల్ని, ప్లాస్టిక్‌ పొదుగుల్ని కడకు ప్లాస్టిక్‌ పాలను కూడా తిలకించి వచ్చాడు.
ఓడ దిగవద్దని నోవహును హెచ్చరించడానికి వచ్చాడు. నోవహు మెట్టుదిగితే చాలు సిద్ధంగా ‘కొయ్యగుర్రం’ భీకరంగా సకలిస్తోంది. నగ్నముని ప్రాధేయపడుతున్నాడు. మొత్తుకుంటున్నాడు. మందలిస్తున్నాడు.
ఇది అశ్రునయనాల అశ్వంకాదు, ఇనుప నాడాల కొయ్యగుర్రం.
‘‘నోవహూ! నౌకను దారిమళ్ళించు! ఈ మాటను సూటిగా నోవహు గుండెల్లో నాటగలగడమే కవిత్వం. అందుకు పాత సంకేతాలూ పాతభావాలూ సరిపోవు. కొత్తకాంతులీనాలి. కవి కడలి కెదురు నిలవాలి. నిలువెత్తు లైట్‌హౌస్‌గా అవతారమెత్తాలి. పాత సూచికల్ని పాతిపెట్టాలి.
నగ్నముని చెప్పింది నిజం. హంతకుడు కానివాడు కవికాలేడు. వాడేకాటి కాపరి కూడా. కవిత్వమొక యుద్ధం, పదాలు వీరమరణం పొందితే తప్ప శాంతి నెలకొనదు. పాతపడ్డ పదాల్ని పొడిచి, చంపి, మరీ పాతిపెడతాడు కవి. చెప్పొద్దూ ‘‘వీరుల శవాలన్నీ నిండు చూలాళ్ళే‘, అని నేనెక్కడో( నా ’శిశువు నేడు లేచెను‘ కవితలో) రాసుకున్నాను. పద సమాధులూ అంతే. కవి పేరుపెట్టి పిలవగానే ధవళవస్త్రాలతో, కొత్తభావాలతో మూడోరోజు తిరిగి లేస్తాయి. వాటిని చూసి పోల్చుకోగలిగిన వాళ్ళు పోల్చుకుని తరిస్తారు. తర్కవితర్కాలు తెలిసిన విమర్శకులు అరచేతి రంధ్రాల్లో వేళ్ళుజొనిపి ‘‘అవును కొత్తగా లేచిన పదాలే’’నని నిర్ధారిస్తారు.
కవిత్వాన్ని కవిత్వంతో కాకుండా కూడా పోల్చుకోవచ్చు. ‘కదిలేదీ కదిలించేదీ పెను నిద్దుర వదిలించేదీ’ అన్న వాక్యంలో ‘కదలిక’ లోని మామూలు అర్థాన్ని హత్యచేసి దాని దేహంలోకి చైతన్యాన్ని ప్రవేశపెట్టాడు కవి.
కొత్త చైతన్యం కొత్త యుద్ధాన్ని చేస్తుంది. కొత్త అభివ్యక్తిని తెస్తుంది. కొయ్యగుర్రం కవిత్వం 1977 నాటికి కొత్త కవిత్వం. అందులోని పదాలు మన కళ్ళముందు మరణించిన పదాలే. కొత్త ప్రాణాలు పోసుకొని వచ్చాయి.
కవి నుంచి బయటపడ్డ ప్రతి అక్షరం భావాన్ని భ్రూణహత్య చేసి మరీ బయట పడుతుంది. కవిని హంతకుడిగా చిత్రిస్తుంది.
ఇంతకీ కొంపలు మునిగిపోయేటంత ఆ గొప్ప చైనత్యమేమిటి? దిగంబరుడైన నగ్నమునికి ధవళవస్త్రమెందుకవసరమయ్యింది?
ఒక నిజం నగ్నమునికి తెలిసిపోయింది.
మనల్ని పాలించేది ప్రభుత్వం కాదని తెలిసిపోయింది.
పిడికిలెత్తిన వాళ్ళని పిచ్చుకల్లా కాల్చగల ప్రభుత్వం, పూరిగుడిసెలున్న వాడని కల్లోలితప్రాంతంగా ప్రకటించగల ప్రభుత్వం, పంచవర్ష ప్రణాళికలలో పేదరికాన్ని పదికాలాల పాటూ కాపాడగల ప్రభుత్వం, కర్ఫ్యూలు  పెట్టగల ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేయగల ప్రభుత్వం…, ‘అలగాజనాల’ శవాల ముందు చిన్నబోయింది. ‘ఉఫ్‌’’ అంటే ఎగిరిపోయే ప్రభుత్వానికి ఎన్నెన్ని భారాలు మోపుతున్నాం? ఎన్నెన్ని పనులు అప్పగిస్తున్నాం?
ఒక వెన్నుపోటుతోనో ఒక పెన్నుపోటు తోనో కూలిపోయే ప్రభుత్వానికి మారు పేరే ‘కొయ్యగుర్రం’ దీనితోనా యుద్ధం? చేసినా ఒక్కటే చెయ్యకపోయినా ఒక్కటే. కాని కొయ్యగుర్రం ఉందనుకోవడం అబద్ధం. పరుగెత్తుతుందనకుకోవడం వంచన. అందుకే ఆనాడు కొయ్యగుర్రాన్ని కొయ్యగుర్రంగా గుర్తించడమే పెద్ద చైతన్యం.
‘‘కొయ్యగుర్రం
స్తబ్దతకీ మూర్ఖతకీ
అజ్ఞానానికీ, అహంకారానికీ
అసమర్థ పరిపాలనకీ ప్రతీక’’
మరి కొయ్యగుర్రాన్ని ఏం చెయ్యాలి? తగలెయ్యాలి.
‘‘కొయ్య గుర్రాన్ని తగలబెట్టగల ఇంధనం కనిపెడతాను.’’
మరి యుద్ధం ఎవరితో? ‘కొయ్య గుర్రాన్ని సృష్టించిన వాళ్లతో. కొయ్యగుర్రం ధన మదం లోంచిపుట్టింది. దేవాలయం మీది బూతు బొమ్మల్లోంచి పుట్టింది.
ధనానికీ విధ్వంసక శక్తి ఉంది. మంచినే కాదు. చెడునూ ధ్వసం చేస్తుంది. ‘నీగ్రో’ ను ‘నల్లవాణ్ణి’ చెయ్యగలిగింది. బానిసను మనిషిగా కాకపోయినా సరకుగానైనా మార్చగలిగింది. ఆడవాళ్ళ ముఖం మీద పరదాలను తొలగించింది. మానవమూర్తిని చెయ్యకలేకపోయినా షోకేసులో బొమ్మను చేసింది.
‘‘మనిషిని మనిషి చేసే మోసం కాలానికి తెలుసు. కారణాలు కారల్‌ మార్క్స్‌కి తెలుసు’’.
ఆ గుట్టు తెలిసిన మార్క్సే పెట్టుబడికి దుర్గుణాలతో పాటూ కొన్ని సుగుణాలు కూడా ఉన్నాయి. (Capital has its own virtues along with vices).
మనదేశంలో ధనస్వామ్యం అవతరించలేదు. కేవలం ‘వలస’ వచ్చింది. అందుచేత దాని దుర్గుణాలను పంచింది, కానీ సుగుణాలను ఇవ్వలేదు. వ్యక్తిస్వేచ్ఛ , చైతన్యం మనకి సంక్రమించలేదు. కాబట్టే నీగ్రోతనం పోయినట్టు కులం పోలేదు. సతీసహగమనాలు చెక్కుచెదరలేదు.
కులాన్ని కొయ్యగుర్రం అమలు జరపదు. కావాలంటే అంతరానితనం నేరమని కొయ్యగుర్రం చట్టాలు కూడా చేస్తుంది. అయినా దాని మాటని ఎవరూ ఖాతరు చెయ్యరు.
వరకట్నాన్ని కొయ్యగుర్రం నిషేధిస్తుంది. దాని నిషేధం చట్టసభ దాటిరాదు.
కాబట్టి కొయ్యగుర్రం ఉత్తడొల్ల. అయినా ఈ డొల్ల అవసరం దాన్ని సృష్టించిన వాళ్ళకి ఉంది. అదే సమాజం. ప్రభుత్వాన్ని మింగిన ప్రభుత్వం సమాజం.
సమాజం అంటే జనం ఎంతమాత్రమూ కాదు. సమాజం అంటే ధనం, కులం, జెండర్‌ ఇంకా ఎన్నో.
మనిషి మీద ఈ సమాజమే దాష్టీకం చేస్తుంది.
‘‘వ్యక్తి మీద ప్రభుత్వం అమలు జరిపే పీడన దుర్మార్గం కన్నా ఎన్నో రేట్లు ఎక్కువగా సమాజమే అమలు జరపగలదన విషయాన్ని చాలామంది గుర్తించరు’’  (Most people do not realise that society can practise tyranny and oppression against an individual in a far greater degree than a government can)అన్నాడు బి.ఆర్‌. అంబేద్కర్‌. ధన, కుల,లింగ మదాంధులు కూటమిగా ఉన్న ఈ సమాజం అలగాజనానికి ఆకలినీ, అవమానాల్నీ పంచుతున్నది.
మన సమాజంలో కులమూ, లింగమూ దేవాలయం మీద బూతుబొమ్మలే. ఈ బొమ్మల్ని తొలగిస్తేనే దేవాలయానికి విముక్తి. ఆ విధంగా విల్లు ఎక్కుపెట్టిన నగ్నముని ‘చేపకన్ను’ ను చూడగలిగాడు. నిజశత్రువును తిలకించగలిగాడు. చాలా చిత్రంగా నగ్నముని చూసినట్లే ‘కొయ్యగుర్రం’ కావ్యం తరువాత గడిచిన రెండు దశకాల్లో తెలుగు కవిత్వంలోకి వరుసగా స్త్రీవాద దళిత వాద కవిత్వాలు వచ్చాయి. ఇవేమీ సర్కారులను తిట్టిపోసే కవిత్వాలు కావు. సమాజాన్ని ఎత్తిచూపే కవిత్వాలు. వీళ్ళు అప్పటికే కొయ్యగుర్రాన్ని తమ హృదయం నుంచి తగలేశారు. ఇంకా తగలెయ్యాల్సింది అవమానంనుంచి ఆకలిని వేరుచేసి సర్కారును కూల్చేద్దామని భ్రమించే శుద్ధ ‘వర్గ’ వాదులే.
నగ్నముని కవిత్వం ప్రజాస్వామిక కవిత్వం. సాహిత్య పరిభాషలో చెప్పుకుంటే ఆధునిక కవిత్వం. నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన ఆధునిక కవిత్వం రెండూ పర్యాయపదాలు. ప్రజాస్వామ్యం లేకుండా ఆధునికత ఉంటుందా? ఉంటుంది. అందుకు ప్రజాస్వామ్య కాంక్ష చాలు. వ్యక్తి, వ్యక్తిత్వం, స్వేచ్చ.. ఈ మాటలు గుర్తొస్తే ప్రజాస్వామ్య కాంక్ష ఉన్నట్టే లెక్క.
ఈ కోరిక మనం బాగా ఆడిపోసుకునే మధ్య తరగతి వర్గానికుంటుంది. వీరు ధనాన్ని ప్రేమిస్తారు కానీ బానిసత్వాన్ని ద్వేషిస్తారు. రాజీపడాల్సి వస్తే నలిగిపోతారు. ఈ సంఘర్షణలోంచి వచ్చే తిరుగుబాటు ఆధునిక కవిత్వానికి ప్రాణం.
ఆధునికతలో నీతివాక్యాలుండవు. నీతివాక్యమంత చిన్నది కాదు, ఆధునిక జీవితం. అందుకే ఏ ఆధునిక కావ్యమూ సరళరేఖలా ఉండదు. పూర్తి విషాదాంతాలు పూర్తి సుఖాంతాలు ఆధునికతలో చెల్లవు.
నవ్వులూ, ఏడ్పులూ కలిసి ఉంటాయి. శ్రీశ్రీ చెప్పినట్లు ఆధునికత చాప్లిన్‌ తీసిన సినిమాలా ఉంటుంది. నాలుగైదు రసాలు ఏకకాలంలో వ్యక్తమౌతాయి.
సహజంగా స్వేచ్ఛ ను కోరే ఆధునికత తెలుగులో వచనకవిత్వాన్ని ఆశ్రయించింది. ఛందస్సుతో పాటూ నీతికథల్ని కూడా విదలించుకొన్నది. ఛందస్సునీ, కథనీ శ్రీశ్రీ వదిలించుకున్నా వాటి నీడల్నీ, ఛాయల్నీ తనకు తెలీకుండా ప్రేమించాడు. కానీ ఆయన తర్వాత ఆయన మార్గంలో నడిచిన కవులు వాటి నీడల్ని కూడా వెతికి పట్టి విసిరేశారు. వారిలో ముఖ్యుడు నగ్నముని.
‘కొయ్యగుర్రం’ కావ్యంలో వాటిని విదిలించుకొని కొత్త మార్గాలను అన్వేషించుకున్నాడు. వాటిలోనే కొత్త ప్రతీకలు దొరికాయి. వ్యతిరేక ప్రతీకగా కొయ్యగుర్రాన్ని ఎలా ఎంచుకున్నాడో అనుకూల ప్రతీకలుగా జీసస్‌నీ, బుద్ధుణ్ణీ స్వీకరించాడు. మరీ ముఖ్యంగా జీసస్‌ మోసిన శిలువనూ, బుద్ధుణ్ణి దించిన అశ్రునయనాల అశ్వాన్నీ ఎంచుకున్నాడు.
ఇటు జీసస్‌ని కానీ, అటు బుద్ధుణ్ణి కానీ మతం నుంచి వేరేచేసి చూడటం లోకానికి చేతకాదు. ఇద్దరినీ మత ప్రతీకలుగానే చూస్తుంది. దేవుళ్ళుగానే చిత్రిస్తుంది. అయితే దేవుణ్ణి నిరాకరించాడు కొయ్యగుర్రం నగ్నముని.
‘‘ఏ క్షణంలో దేవుడు పుట్టాడో
ఏ క్షణంలో విధిరాత నుదుటిపై
లిఖించబడిందన్నారో
ఆ క్షణమే మనిషి చచ్చాడు’’
అలాంటి నగ్నమునికి వీరిద్దరూ అవసరమయ్యారు. తమకాలపు నీతుల్ని కాలదన్నిన వారిగా ఇద్దర్నీ నగ్నముని స్వీకరించాడు. మోసగిస్తారని తెలిసి కూడా ప్రేమించగలగటం చిన్న విషయం కాదు. కొడుకు గుండెల మీద తన్నుతాడని తెలిసి కూడా ప్రేమించగల తల్లికి మాతం ఈ తత్వం తెలుస్తుంది.
ఈ సమాజం తన బిడ్డల చేత మనల్ని తన్నిస్తుంది. ఒక నాయకుణ్ణి తన సహచరుడే ఎప్పుడూ ఇన్‌ఫార్మర్‌గా పట్టి అప్పగిస్తూ ఉంటాడు. అసలు దొంగ వేరే ఉంటాడు. ఇన్‌ఫార్మర్‌ నెపం. దొంగ నిజం. దొంగ ముద్దు పెట్టి జీసస్‌ను అప్పగించిన జూడాస్‌ నెపం. జూడాస్‌కు వెండి నాణేలిచ్చిన పాత ధర్మం నిజం.
ఇక్కడ ప్రభుత్వం నెపం. సమాజం నిజం.
నిజం, నెపాల వైరుధ్ధ్యమే ‘కొయ్యగుర్రం’ సారాంశం.
‘‘చివరి విందులో
చివరికి తననెవరు మోసం చేస్తారో
జీసస్‌కి తెలుసు’’
ఈ వాక్యం కొయ్యగుర్రం అంతటా విస్తరిస్తుంది. ఇది ఒక ఎరుక. ఒక జ్ఞానం. ఒక మహాబోధి.
ఒక స్త్రీకి మరొక స్త్రీనీ, ఒక దరిద్రుడికి మరొక దరిద్రుణ్ణీ, ఒక దళితుడికీ మరొక దళితుణ్ణీ శత్రువును చెయ్యగల మర్మం ఈ ఎరుకలో ఉన్నది. దొంగముద్దును తడి ఆరకముందే గుర్తుపట్టాలి. దొంగముద్దు పెట్టిన జూడాస్‌ అర్భకుడు. కొయ్యగుర్రం అర్భకురాలు. ఇద్దరికీ సృష్టికర్తలున్నారు. సూత్రధారులున్నారు. వారే హంతకులు. జీసస్‌ నాగలిమోసే రైతుకు గుర్తు. ఆకలిని మింగి, అన్నాన్ని పంచగల ప్రేమ అతడికున్నది.
మరొక ప్రతీక బుద్ధుడు. త్యజించడానికి ప్రతీక. వదులుకోవడం చేతకానివాడు వీరుడు కాలేడు. సకల సంపదల్నీ పరిత్యజించినవాడు బుద్ధుడు. యుద్ధం చెయ్యడానికి అశ్రునయనాల అశ్వాన్నిచ్చినవాడు. ప్రేమను ప్రకటించగల ఏకైక సాధనం త్యాగం.
ఏ తిరుగుబాటుకయినా ప్రతిఫలాలు రెండే రెండు కావాలి. ప్రేమ, త్యాగం.
నిజానికి కొయ్యగుర్రం తిరుగుబాటు కాదు. ఒక స్పృహ. కొయ్యగుర్రం ఒక నిరుపయోగ విగ్రహం అన్న ఎరుక. ఈ కొయ్య గుర్రం మీదుగా సమసమాజాన్ని చేరలేమన్న తెలివి. సర్కారీ అర్భకత్వాన్ని బట్టబయలు చేసిన కావ్యం.
నగ్నముని ఈ కావ్యాని వర్గ స్పృహలోనే రచించి ఉండవచ్చు. కాని ప్రభుత్వమే ఒక వర్గం కాదని, అది దోపిడీ వర్గం చేతిలో కీలుబొమ్మ అని గుర్తించారు.
సమర్థమైనది సమాజమని మేం గ్రహించుకుంటున్న నేపథ్యంలో కొయ్యగుర్రం సకిలింపు మరోసారి వినబడింది. సర్కారుతో అనుబంధం లేకుండా అమలు జరుపుతున్న కుల, జెండర్‌, మెజారిటీ పీడనల్ని ఎవరు అమలు జరుపుతున్నారో మరోసారి స్పష్టమైంది.
ఈ దేశంలో సర్కారు కన్నా పితృస్వామ్యం బలమైంది. సర్కారు అమలు జరిపే భారత శిక్షా స్మృతి కన్నా మనుస్మృతి శక్తిమంతమైంది. కేంద్ర ప్రభుత్వం కన్నా మతతత్వ కేంద్రం గొప్పది.
దళిత, స్త్రీవాద కవిత్వం ప్రజాస్వామిక కవిత్వం కిందికి వస్తే వాటి అంకురాన్ని ముందు చూసిన వెలుతురు పిట్టల్లో ఒకరు నగ్నముని.
నిజం నాకు తెలుసు. నెపం కాసేపు నగ్నముని మీదకు!!

నోవహూ! ఇప్పుడు నౌకను మళ్ళించు.

-సతీష్ చందర్

(ఆంధ్రప్రభ, ఫిబ్రవరి 1999)

15 మే నగ్నముని జన్మదినం. అందుకే మరోసారి. నా సాహితీ మిత్రుల కోసం.. సతీష్ చందర్

1 comment for “నిజం నాకు తెలుసు – నెపం నగ్నముని మీదకి!

  1. జై భీం సార్.
    నీలాంటి వాళ్ళు చదవాల్సిన వ్యాసం అని కాబోలు పంపారు. నేను మరికొంత జ్ఞానవంతుణ్ణయ్యాను. నేను హైదరాబాద్ రాజునైతే ఈ మీ వ్వాసం టేంక్ బాండ్ మీద శిలాశాసనం రాయించే వాణ్ణి. ఆ అవకాశం లేదు కావున నా హృదయం మీద చెక్కుకున్నాను.
    మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
    శుభాకాంక్షలు.
    -డాక్టర్ బండి సత్యనారాయణ

Leave a Reply