అజ్ఞాతం వీడిన లక్ష్మీదేవి!

మనుషులకేనా స్వేఛ్చ!
దేవతలకు మాత్రం వుండొద్దూ? స్త్రీలను ఇళ్ళల్లో బంధించినట్లు దేవతల్ని గుళ్ళల్లో బంధిస్తానంటే అన్నివేళలా చెల్లుతుందా?
ఇద్దరి దేవతల పరిస్థితి అయితే మరీ దయనీయం. వెలుతురే చొరబడని తాటాకుకట్టల్లోనూ, ఇనప్పెట్టెల్లోనూ బందించేస్తారు. వాళ్ళు ఎన్నాళ్ళని ఈ చీకట్లలో మగ్గుతారు?
వారెవరో కాదు. సరస్వతి, లక్ష్మీదేవి.
సరస్వతి కాస్త ముందుగా తన విముక్తిని ప్రకటించుకుంది. తాళపత్రాలను దాటి ముద్రణా యంత్రాలను దాటి శ్రవణ, దృశ్య మాధ్యమాల మీదుగా, ఉపగ్రహాల సాయంతో అంతరిక్షంలో అడుగడి అక్కడి నుంచి సకల జనుల మునివేళ్ళ దగ్గరకు చేరిపోయింది.
ఇలా జరగ్గానే కొద్డి మంది గుప్పెట్లో వుండే జ్ఞానానికి కాలం చెల్లిపోయిందనుకున్నారు.
ఇద్దరూ బందీలయి వున్నంత కాలం సమస్యే వుండేది కాదు. కానీ ఒకరు విముక్తమయ్యాక, మరొకరు బందీగా వుంటే బాగుంటుందా? తోడికోడళ్ళలో ఒకరు ఆఫీసుకు వెళ్ళి వస్తూ, మరొకరు వంటింట్లో వుండిపోయారనుకోండి. సదరు వంటింటి కుందేలు, చిరుతపులిగా మారదూ?
సరస్వతి కున్న స్వేఛ్చా స్వాతంత్య్రాలు చూసి లక్ష్మీదేవికి కన్నుకుట్టేసినట్టుంది.
ఈర్ష్య ఇచ్చిన తెగువ- ఏ సిధ్ధాంతమూ ఇవ్వలేదు.
దాంతో లక్ష్మీదేవి వెలుగులోకి రావాలనుకుంది. అజ్ఞాతానికి స్వస్తి చెప్పాలనుకుంది. స్వేఛ్చావాయువులు పీల్చాలనుకుంది.
దాంతో ఎక్కడ దాచినా బయిటకొచ్చేస్తోంది.
పద్మనాభస్వామి ఆలయ నేల మాళిగలను చీల్చుకుని వచ్చింది. సత్యసాయి యజుర్మందిర ద్వారబంధాలను బద్దలు కొట్టుకుని మరీ వచ్చేసింది.
గనిలో, వనిలో, కార్ఖానాలో- ఎక్కడయినా శృంఖలాలు తెంచుకొంటోంది.
బాబాలూ, ఆశ్రమాలూ, పీఠాలూ- ఎవరి వద్ద దాచినా నిలవనంటోంది.
తనను బంధించిన వాళ్ళను తానే పట్టియిస్తూ బహిర్గతమవుతోంది.
అటు మొన్న రాజా, మొన్న కనిమొళి, నిన్న దయానిధి, నేడు యెడ్యూరప్ప, ఆయనకు తోడు గాలి సహోదరులూ.., అహో! లక్ష్మీ దేవి ఎవరి పేర్లను దాచటం లేదు. రేపు స్విస్‌ బ్యాంకు ఖాతాలను బయిట పెట్టినా ఆశ్చర్యం లేదు.
అంటే, నేడు గుప్త ధనానికీ, గుప్త జ్ఞానానికీ కాలం చెల్లినట్లేనా?
ఇన్నాళ్ళూ సరస్వతీ దేవికీ, లక్ష్మీ దేవికీ పడదని- సౌకర్యవంతంగా నమ్మాం. ఒకరున్న చోట మరొకరుండరని భావించి, వారిలో ఎవరో ఒక్కరి కటాక్షంతోనే తృప్తి పడ్డాం.
దాంతో సమాజంలో ఇన్నాళ్ళూ రెండు తరగతులే వుంటాయని నమ్ముతూ వచ్చాం.
వారు: దరిద్రపుగొట్టు మేధావులూ, శుంఠలయిన సంపన్నులూ.
అయితే, స్వేఛ్చ పొందిన ఏ యిద్దరు స్త్రీలూ ఒకరి మీద ఒకరు అసూయ పడరు. లక్ష్మీ, సరస్వతులకు ఇక మీదట వైరం వుండక పోవచ్చు. ఇలా కలిసిన వాళ్ళను కలహభోజనుడయిన నారదుడు కూడా విడదీయ లేడు.
వీరి కలయక వల్ల లోకానికి మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా?
మిలియన్‌ డాలర్ల ప్రశ్న లా వుంది కదూ?
మిలియన్‌ మాట నాకు తెలియదు కానీ, ఇది ‘డాలర్‌’ ప్రశ్న అని మాత్రం ఢంకా భజాయించి చెప్పగలను.
‘చెట్టు ముందా? విత్తు ముందా?- అని సరదా కోసం మనం చర్చించుకుంటున్నాం కానీ, అమెరికా వ్యాపారి ‘విత్తే’ ముందని తేల్చి అవతల పారేశాడు. అతడి ‘విత్తులు’ కొంటేనే మనకి మొక్కలూ, చెట్లూ. అలా నాటిన చెట్లు మళ్ళీ విత్తనాలివ్వలేవు. అందుకే డాలర్లు పోసి మనం కొనుక్కోవాలి.
గింజలడ్డురాకుండా ద్రాక్షల్నీ, పీచులేని తియ్యని మొక్క జొన్న గింజల్ని సృష్టించింది విముక్తమయిన సరస్వతి.
ఈ సరస్వతి వున్న చోటకే పేటెంటు అవతారమొత్తి చేరిపోయింది విముక్తమయిన లక్ష్మీదేవి.
నేడు జ్ఞానమంటే ధనం. ధనమంటే జ్ఞానం.
ఈ సరికొత్త యుగంలో సరికొత్త తరగతులొచ్చాయి:
జ్ఞాన కుబేరులు, అజ్ఞాన కుచేలురు.
దరిద్రుణ్ణి పూర్వం లక్ష్మీదేవి కరుణించక పోయినా, సరస్వతి కరుణిస్తూ వుండేది. ఇప్పుడా ప్రశ్నేలేదు. ఇద్దరూ కటాక్షించరు.
ఈ సంపన్న మేధావులు- ధనార్జనకీ, జ్ఞానార్జనికీ కొన్ని గీతల్ని గీశారు.
విశ్వవిపణిలోని వాణిజ్యసూత్రాలకు అనుగుణంగా కాకుండా- ఎలా ధనార్జన చేసినా, వారిని లక్ష్మీదేవే పట్టి యిస్తుంది.
నేడు డాలర్‌దే నీతి! రూపాయిది అవినీతే!
డాలర్‌ కళ్ళు కప్పి సంపాదించిన రూపాయిలన్నీ నేడు రోడ్డెక్కాల్సిందే.

– సతీష్‌ చందర్‌
(31 జులై 2011 నాడు ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమయినది)

2 comments for “అజ్ఞాతం వీడిన లక్ష్మీదేవి!

Leave a Reply