ఎఫెక్టు ఎవరికీ పట్టదు. సైడ్ ఎఫెక్టులే అందరికీ కావాలి. వైద్యుడు మందిస్తాడు. ప్రాణాలు దక్కుతాయి. ఆ మందే లేకుంట,ే పోయే వాడే. కానీ అందుకు సంతోషించడు. ‘హత్తిరికే. నీ మందుకు తలనొప్పి వచ్చిందయ్యా డాక్టరూ!’ అని కయ్యానికొస్తాడు. మూడు వేల యేళ్ళు మూలన పెట్టేసిన వారి కోసం భారత రాజ్యాంగం రెండు చిన్న చిన్న మందులు ‘రాసిచ్చింది’. వాళ్ళింకా మందులు పూర్తిగా వాడనే లేదు. అప్పుడే ‘సైడ్ ఎఫెక్టుల’ ఫిర్యాదులు! ఈ ఫిర్యాదులు మందులు వాడిన వాళ్ళు, వాడిన తర్వాత చెయ్యాలి. కానీ చిత్రం! ఫిర్యాదు చేసింది వాడిన వాళ్ళు కాదు.., పక్క వాళ్ళు. వాడాక కాదు. వాడక ముందే. వీళ్ళని చూశాక ‘సైడ్ ఎఫెక్ట్’ కు కొత్త అర్థం తీయాల్సి వుంటుంది. (‘సైడ్’ ఎఫెక్టు అంటే ‘సైడ్’ న వున్నవారికి వచ్చే ‘ఎఫెక్టు’ అనుకుంటున్నారు కాబోలు.)
రెండు ఔషధాల పేర్లు: రిజర్వేషన్లు, దాడుల నుంచి పరిరక్షణ. రాసిచ్చింది కూడా ఎవరో కాదు. ఊరికి ‘వెలుపల’ వున్న షెడ్యూల్డు కులాల వారికి(ఎస్సీలకి); జనావాసాలకు ‘దూరంగా’ వున్న షెడ్యూల్డు తెగలవారికి(ఎస్టీలకి).
పాపం! ‘పుట్టు’ జ్ఞానులు వారు!
విద్య, ఉపాధి రంగాల్లో ఇంకా రిజర్వేషన్లను ఈ వర్గాలు పూర్తిగా ఉపయోగించుకునే లేదు. దాని ‘సైడ్ ఎఫెక్టు’ గురించి మాట్లాడారు. ‘ప్రతిభ’ సర్వనాశనమవుతుందని ఊరేగారు. మండల్ సిఫారసుల ద్వారా ఈ రిజర్వేషన్లను బీసీలకూ సైతం అమలు జరిపే సరికి, ‘సైడ్ ఎఫెక్టు’ మరింత ఎక్కువయిందన్నారు. అవింకా అమలు జరగనే లేదు. విద్య, ఉపాధి- దాదాపు (80శాతానికి పైగా) ప్రయివేటు రంగంలోకి వెళ్ళిపోయాయి. ఈ ‘రిజర్వేషన్ వ్యతిరేక ‘ ఆందోళనలు పెద్దగా సాధించలేదు కానీ, రిజర్వేషన్ లేని వర్ణాల వారు ‘సహజ ప్రతిభావంతులమో’ నన్న అనుమానాన్ని బలంగా కలుగ చేశాయి. నేను ‘ఒపెన్ క్యేటగరీ’ లో పుట్టాను కదా.. నాకీ విద్య పుట్టుకతోనే వచ్చే వుంటుంది’ అనే నమ్మకాన్ని బలపరచింది. ఈ ‘పుట్టు జ్ఞాను’లు తిన్నగా వుండరు. ‘రిజర్వేషన్ వర్గాల’ మీద అప్పుడప్పుడూ భౌతిక, సాంఘిక, సాంస్కృతిక దాడులకు పాల్పడుతుంటారు.
దాడి ‘ఉగ్ర’ రూపమే వెలి!
ఆ మాట ఇన్ని వేల యేళ్ళూ ‘అస్పృశ్యులు’గా చూడటమే పెద్ద దాడి. వెలిని మించిన దాడిలేదు. కానీ వెలి పలు రూపాల్లో కొనసాగుతూనే వుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో వ్యవసాయపనులకు రానివ్వకుండా ఊరు ఊరు మొత్తం వెలివేసిందనే ఆరోపణలు వచ్చాయి. దాడీ, వెలీ రెండూ ఒక్కటే. ఈ దాడుల పరిరక్షణ కోసమే ఎస్సీ,ఎస్టీ (లపై దాడుల నిరోధక) చట్టం వచ్చింది. ఈ చట్టం వున్నా వారిపై దాడులు జరుగుతూనే వున్నాయి. దేశం మాట తర్వాత. తెలుగు రాష్ట్రాలలోనే పలు చోట్ల జరిగాయి. కానీ శిక్ష పడ్డ వారు తక్కువే. చుండూరు లో ఊరు ఊరంతా కలిసి షెడ్యూల్డు కులాల వారి మీద పడి, దొరికిన వారిని దొరికి నట్లు నరికి, గోనెసంచుల్లో కట్టి, కాల్వలో పడేస్తే, కేసు దశాబ్దాలు గడిచింది. హత్యాకాండ నిజం. చావులూ నిజం.హంతకులు వీరు కారని (సాక్ష్యాధారాలు లేవనే కారణంతో) ముద్దాయిలనందరినీ విడుదల చేశారు. అంటే ఉన్న ఈ చట్టాన్ని ఎస్సీ,ఎస్టీల రక్షణకు వాడటం ఇంకా మొదలు కాలేదని స్పష్టమవుతుంది. ఏ నివేదిక ఎప్పుడు విడుదల చేసినా, ఈ చట్టం కింద అరెస్టయిన వారికి శిక్షలు పడలేదనే వస్తుంది. ఈ గణాంకాలను కూడా రెండు రకాలు వ్యాఖ్యానించుకున్నారు. ‘నేరం చేసి కూడా తప్పించుకుంటున్నారు’ అని దళిత, గిరిజన సంఘాలు ఆరోపిస్తుంటే, ‘తప్పుడు కేసులు పెడితే ఎలా నిలుస్తాయి?’ అని కొందరు వాదిస్తూ వచ్చారు. రెండవదే పెద్దగా కనిపించింది. దాంతో ‘ఎస్టీఎస్టీ లపై దాడుల నిరోధక చట్టం’ వల్ల ‘సైడ్ ఎఫెక్ట్’ వుందని భావించి సుప్రీం కోర్టు , ఈ చట్టానికి మూడు సవరణలు చేసింది. జాగ్రత్తగా చూస్తే, ఇవి సవరణలు కావూ, చిల్లులని ఇట్టే తెలిసిపోతుంది.
మొదటి చిల్లు: నిందితుడు ముందస్తు బెయిలు పొందవచ్చు.
రెండవ చిల్లు: నిందితుడు ప్రభుత్వోద్యోగి అయితే పై అధికారి, కాకుంటే జిల్లా ఎస్పీ స్థాయి అధికారి అనుమతి పొందాకనే అరెస్టు చెయ్యాలి.
మూడవ చిల్లు: ఫిర్యాదు రాగానే చర్యలు మొదలు పెట్టకుండా ప్రాథమిక దర్యాప్తు జరపాలి.
ఈ ‘చిల్లులు’ పెట్టాక, ఇంక అది ‘దాడుల నిరోధక చట్టమెందుకవుతుందీ’ అని దళిత సంఘాలు ఎదురు తిరిగగాయి. ఏప్రిల్ లో జరిగిన నిరసనల్లో 12 మంది చనిపోయారు కూడా. ఇప్పుడు ఆగస్టు 9న అన్ని సంఘాలూ ‘భారత్ బంద్’ కు పిలుపు నిచ్చాయి. దాంతో దిగి సర్కారు దిగివచ్చి, ఈ ‘చిల్లుల్ని’ పూడుస్తూ, చట్టం చేయాలని తీర్మానించింది.
అవహేళనా? ఆప్యాయతా?
అనుమానం లేదు. మనది ‘కుల’ భారతం. ఈ సవరణ వెనుక కూడా ‘కుల’ భారతమే వుంది. ‘వెలి’ ఇప్పుడెక్కడ వుంది? అని అప్పుడప్పుడు ‘పుట్టు’ జ్ఞానులు ప్రశ్నిస్తుంటారు. కానీ వారే ఈ ‘వెలి’కి పాల్పడుతుంటారు. గ్రామాల్లో భూస్వాములు దళితుల్ని ఇప్పటికీ ‘అరెేయ్’ ‘ఒరెేయ్’ అని పిలవటం విశేషం కాదు. ప్రయివేటు రంగ సంస్థల్లో తలపండిన ‘పుట్టు’ జ్ఞానులు కూడా తమ దగ్గర పనిచేసే ఎస్సీ, ఎస్టీ (ఉద్యోగులను (పొరపాటున వుంటే) ‘అరెేయ్’ అనేస్తారు. అదేమంటే ‘ఆప్యాయత కిందసర్ది పుచ్చుకో’ అంటారు. బాసే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తి అయి వుంటే.. ఆ తీరే వారు. కానీ, అంగుష్ట మాత్రులు ఆజాను బాహుణ్ని వెన్నుతట్టినట్టు, అగ్రవర్ణ గుమస్తా వచ్చి దళిత మేనేజర్ని ప్రోత్సహిస్తానంటాడు. ప్రయివేటు కళాశాలల్లోనూ అంతే. పొట్టచించితే అక్షరమ్ముక్క రాని అగ్రవర్ణ విద్యార్థి కూడా ఉపాధ్యాయుడు ఎస్సీ, ఎస్టీల వర్గానికి చెందిన వాడయితే, భుజమ్మీద చెయ్యి వేసి ‘ఏక వచనం’లో సంబోధిస్తానంటాడు. ‘గురువుగారూ’ లో ‘గారూ’ కత్తిరించి ‘గురూ’ అంటాడు. అదేమంటే, ఆయన నాకు ‘ఫ్రెండ్’ లా చూస్తాడు. ఇది ‘చనువు’ కాదు, ‘అవహేళన’ తర్వాత రుజువు అవుతుంది. ఊరు ఊరంతా కలిసి, ఒక ఎస్సీనో, ఎస్టీనో వెలి వేసినట్లు, ఆఫీసు ఆఫీసంతానో, కళాశాల, కళాశాలంతానో కలిసి ఆ ఒక్కణ్ణీ ‘వెలి’ వేస్తారు. చిత్రమేమిటంటే, ఇందులో వెన్నెముకలేని ఒకరో, ఇద్దరో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన సిబ్బందో, విద్యార్థులో వుంటే, వారి చేత కూడా ఈ ‘వెలి’కి ఆమోద ముద్ర వేస్తారు.
నిజానికి ఈ చట్టంలో ‘పైకి కుల ప్రస్తావన తేక పోయినా సరే’ ఎస్సీ,ఎస్టీ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా, కించపరచే ఏక వచన సంబోధన చేసినా అరెస్టు చేసి జైలుకు పంప వచ్చని వుంది. ఉపాధి అంతా ప్రయివేటురంగంలోకి మారిపోయాక ఈ చట్టం అవసరం గ్రామాల్లో ఎంత వుందో, నగరాల్లోనూ అంతే వుంది. తిరిగి పదునెక్కిన బిల్లును మరింత పదునుగా ఉపయోగించాలి. కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిదో షెడ్యూలులో చేరిస్తే, ఏదోమేరకు చట్టానికి రాజ్యాంగ భద్రత కూడా వుంటుంది. ఎప్పుడయినా ఏ న్యాయమూర్తులంగారయినా ‘వర్ణ అంధత్వం’ తో (ఉండకూడదని రాజ్యాంగ చెబుతోంది.) ‘న్యాయ సమీక్ష’ పేరు మీద ఈ చట్టాన్ని నీరు గార్చకుండా ఈ షెడ్యూలు కాపాడుతుంది. దళిత న్యాయమూర్తి ఖాళీ చేసిన కుర్చీలో కూర్చోవటానికి ఓ అగ్రవర్ణ న్యాయమూర్తి ఆ కుర్చీనే శుధ్ధి చేయించుకున్న ఉదంతాలు కూడా స్వతంత్ర భారత చరిత్రలో వున్నాయి. చేరసమాచార హక్కు చట్టానికి పట్ల కలిగించిన స్పృహను ఈ చట్టం పట్లా కూడా కలిగించటానికి ఆయావర్గాల విద్యావంతులు నడుం కట్టాలి.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్రవార పత్రికలో ప్రచురితం)
Excellent sir..
Excellent sir,
పుట్టు జ్ఞానులు రిజర్వేషన్ల వారిని పుట్టు అ జ్ఞానులు అని అనుకుంటారు. వారికి సపోర్ట్ చేసే వారితొ సహా!