ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షర ఫ్యాక్షనిజం!

చదవం. చదవబడతాం.

వినం. వినబడతాం.

చూడం. చూడబడతాం.

కారణం? మీడియా.

మీకు నచ్చింది పొందలేరు. ఇచ్చింది తీసుకోవాలి.

అది వార్త కావచ్చు. వ్యాఖ్య కావచ్చు.

అందుకే పత్రిక చదివాక, మనకొచ్చే అభిప్రాయాలు మనవి కావు. రెడీమేడ్‌ వస్త్రాలు తయారు చేసినట్టు ముందుగానే అవి తయారు చేయబడతాయి.

పార్టీకో మీడియా సంస్థ. లేదా మీడియా సంస్థకో పార్టీ. ఇంకాస్త లోతుకు వెళ్ళితే- సామాజిక వర్గానికో పార్టీ, పార్టీకో సామాజిక వర్గం.(కులం అని నేరుగా అనవచ్చు. కానీ సభ్యత పేరుమీద ముసుగులో గుద్దులాట) అందుకనే ‘వర్ణం’అంటని మీడియా వుండదు.

నిజం – అన్నది ఒక పత్రికలో కాకుండా, రెండు పత్రికల మధ్య ఇరుక్కుంటోంది. రెండు చానెళ్ళ మధ్య నలిగిపోతోంది.

తెలుగునాట, మీడియా అంతా ఒకలాగా లేదు. ఒక పత్రిక పీక నొక్కితే, అన్ని పత్రికలకూ నొప్పిగాలేదు. ఆ ఒక్క పత్రిక మాత్రమే గిలగిల లాడుతోంది. ఆ పత్రిక మాత్రమే ‘బ్లాక్‌డే’ అని పెద్ద అక్షరాలతో వేసుకుంటుంది. ‘యమర్జన్సీ’ని తలపిస్తోందని ప్రకటనలు చేస్తుంది. ఈ ఆందోళనను గమనించినప్పుడు- పత్రికా స్వేఛ్చ- అంటే పలు పత్రికల స్వేఛ్చ కాదేమో, ఆ ‘ఒక్క పత్రిక స్వేఛ్చ’ మాత్రమే నేమో అన్న అనుమానం కూడా వేస్తుంది.

ఇప్పుడు ఈ కష్టంలో వున్నది ‘సాక్షి’ పత్రిక, ‘సాక్షి’ చానెల్‌. ఆ ప్రసార సాధనాలను నడిపే కంపెనీల ఖాతాలను సిబిఐ స్తంభింప చేసింది. రెండు వేలకు పైగా పాత్రికేయులూ, వేల సంఖ్యలో ఇతర ఉద్యోగులూ, ఏజెంట్లూ ఆధార పడి వున్నారు. కారణాలు ఏమైనా, యాజమాన్యం తో పాటు వీరందిరికీ కష్ట కాలమే. ఈ ప్రసార సాధనాలు పెట్టటానికి వై.యస్‌ జగన్మోహన రెడ్డికి- అంత డబ్బెక్కడిదీ – అన్న ఆరాలు తీసి, తీసి, కేసును సిబిఐ ఇక్కడ వరకూ తెచ్చింది. పొందిన లబ్ధికీ- పెట్టిన పెట్టుబడికీ ‘అక్రమ సంబంధం’ (క్విడ్‌-ప్రో-కో) వుందనే నిర్ధారణకు వచ్చి, ఈ చర్యకు పాల్పడింది. అంటే ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వై.యస్‌ వివిధ వాణిజ్య సంస్థలు చేసిన సేవలకు, ప్రతిగా(సిబిఐ దృష్టిలో లంచంగా) ఈ పెట్టుబడులు పెట్టారన్నది ఆరోపణ.

సరే, ఈ పెట్టుబడుల వల్ల ‘సాక్షి ‘లబ్ధి పొందింది. మరి ‘సాక్షి’ వల్ల ఎవరు ‘లబ్ధి’ పొందారు. కేవలం వై.యస్‌ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడూ నా..!? కాదు. రాష్ట్రంలో వున్న కాంగ్రెస్‌ పార్టీ. ఈ పత్రిక స్థాపించక ముందు కాస్త పెద్ద గొంతు వున్న పత్రికలు దాదాపు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే వున్నాయి. అందుకనే కదా- మొదటి సారిగా వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ‘ఆ రెండు పత్రిలూ’ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాస్తున్నాయని, అంటూనే వుండేవారు ( అవే ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’.). ఈ రెండు పత్రికలూ ఒకే సామాజిక వర్గం (కమ్మ ) అండతో ఒకే పార్టీని(తెలుగుదేశం) పార్టీ స్వరాన్ని వినిపించేవి. అంటే కాంగ్రెస్‌ కంటూ ఒక పత్రికలేదన్నది వైయస్‌ చెప్పకనే చెబుతుండేవారు. ఫలితంగానే ‘సాక్షి’ పుట్టిందని వేరే చెప్పనవసరం లేదు.

ఆయన అకాల మృతి తర్వాత, వై.యస్‌.జగన్‌ కాంగ్రెస్‌లో కొనసాగకుండా, (పోనీ, కొనసాగ లేక) వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టారు. అప్పుడు అనివార్యంగా ‘సాక్షి’ తెలుగుదేశం పార్టీకే కాకుండా, కాంగ్రెస్‌ కు కూడా వ్యతిరేకమయ్యింది. అంతే కాదు. అంతవరకూ కాంగ్రెస్‌ తో ఉన్న కొన్ని సామాజిక వర్గాలు ( ఎస్సీలతో పాటు రెడ్లు) కాంగ్రెస్‌ను ఖాళీ చేసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కొచ్చారు. అంటే ‘కమ్మ’ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రత్యర్థి వర్గమైన రెడ్లు ఇప్పుడు జగన్‌తో వున్నారు.

ఇప్పుడు ఏ వర్గం మీడియా వారికి వుంది.

దాంతో ఎవరి నొప్పి వారే భరించాల్సిన స్థితి కూడా ఏర్పడింది.

వైయస్‌ వెటకారమాడే ‘ ఆ రెండు పత్రికలకు’ కూడా కష్ట కాలం వచ్చింది.

‘ఈనాడు’ వారి ‘రామోజీ ఫిల్మ్‌ సిటీ’ నిర్మాణానికి ‘మర్గదర్శి’ పొదుపు నిల్వలను నిబంధనలకు విరుధ్దంగా మళ్ళించారంటూ, విచారణ మొదలు పెట్టినప్పుడు, ఆ నొప్పి, ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’లకే అర్థమయింది.

అలాగే ‘బడుగు నేతలా? బాడుగ నేతలా’ అన్న శీర్షికన ఆంధ్రజ్యోతి రాశాక, బడుగువర్గాల కు చెందిన నేతలకీ, ఆ సంస్థకీ మధ్య స్పర్థ ఏర్పడి, ఆ పత్రికకు చెందిన వారిని కొందరిని అరెస్టు చేసినప్పుడు కూడా, ఆ బాధ ‘ఆంధ్రజ్యోతి’, ‘ఈనాడు’ లకే అర్థమయింది.

అప్పుడూ వారూ ‘బ్లాక్‌ డే’లు పాటించారు. ‘యమర్జన్సీ రోజుల్ని’ తలపోసుకున్నారు. ‘పత్రికా స్వేఛ్చ’ను దెబ్బతీస్తున్నారన్నారు.

ఒకప్పుడు ఒక పత్రిక మీద దాడి జరిగితే, అన్ని పత్రికలూ (యాజమాన్యాలు) ఒక్కుమ్మడిగా అరిచేవి. కానీ, ఇప్పుడు అలాలేవు. కొద్దో, గొప్పో పాత్రికేయులే తమ తమ యాజమాన్యాలు గీసిన ‘లక్ష్మణ రేఖల్ని’ సైతం దాటి, ఈ దాడులన్నిటికీ స్పందించారు. స్పందిస్తున్నారు కూడా. నిజానికి పత్రికా స్వేఛ్చ అన్నది- పత్రికా రచయితలదే కానీ, యజమానులది కాదు. తెలుగు నాట డెభ్భయ్వవ దశకం నుంచే, ఈ స్వేఛ్చ యజమానులకు వెళ్ళిపోయింది. వారు తమ తమ స్వతంత్ర అభిప్రాయాలతో రచనలు చేసే అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. అయినప్పటికి తమది కాని, తమ దగ్గర లేని ‘పత్రికా స్వేఛ్చ’ పోయినప్పుడెల్లా ఈ పాత్రికేయులే పోరాడుతున్నారు.

మీడియాలో ఈ రెండు శిబిరాలూ, రెండు ఫ్యాక్షనిస్టు శిబిరాలుగా మారిపోవటం- ఎవరికయినా బాధగానే వుంటుంది. అయితే ఈ శత్రుత్వం ఈ నాటిది కాదు. దశాబ్దాలుగా సాగుతూనే వుంది.

తొంభయ్యవ దశకం తొలి పాదంలో కాంగ్రెస్‌ నేత మాగుంట సుబ్బ రామి రెడ్డి నేతృత్వంలో ‘ ఉదయం’ దినపత్రిక నడుస్తోంది. అప్పుడు (1989-94) కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వుంది. రాష్ట్రంలో పేద వర్గాల మహిళలు ‘సారా వ్యతిరేక పోరాటం’ చేస్తున్నారు. ఈ పోరాటం పుట్టింది ప్రధానంగా ఆరోగ్య కారణాల వల్ల కాదు- ఆర్థిక కారణాల వల్ల. దీనికి కూడా నేపథ్యం లేక పోలేదు. ఈ ‘సారా వ్యతిరేక ఉద్యమా’నికి ముందు, అక్షరాస్యతా ఉద్యమం నడిచింది. కూలి మహిళలు చదువు నేర్చుకున్నారు. దాంతో తమ కొచ్చే ఆదాయ, వ్యయాల్ని లెక్క చూసుకున్నారు. భర్తలు తాము సంపాదించిందంతా తాగుడికే తగలేస్తుంటే, బిడ్డల కడుపుల్లో గంజి పోయటమే కష్టమవుతుందన్న స్పృహ వచ్చింది. వారు ప్రభుత్వ సారాయి దుకాణాల మీద దాడులు చేశారు. ‘నాటు సారా’ను బంద్‌ చేయమన్నారు. అయితే ‘ఈనాడు’ ఈ ఉద్యమానికి మద్దతునిస్తూనే, ఈ ఉద్యమ విస్తృతిని పెంచింది. దీని ఐఎంఎప్‌ఎల్‌ (ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌) కు కూడా వర్తింప చేసింది. అంటే ‘నాటు సారా’ యే కాదు, ‘బ్రాందీ, విస్కీ’లను కూడా బంద్‌ చేయించటానికి మధ్యతరగతి మహిళల్ని పురికొల్పింది. అందుకు ‘ఆరోగ్య’ కారణాలను ప్రధానంగా ఎత్తి చూపించింది. అందుకోసం ఆ పత్రిక కంకణం కట్టేసుకుంది. ఇటు సారా, అటు మద్యం – వెరసి ‘సంపూర్ణ మద్య పాన నిషేధం’ అమలు లోకి తెచ్చే వరకూ ఆ ప్రతిక నిద్రపోలేదు, ఆ పత్రిక కోరినట్లుగానే , ‘తెలుగుదేశం’ తిరిగి అధికారంలోకి వచ్చాక ‘సంపూర్ణ మద్య పాన నిషేధం’ మీద ముఖ్యమంత్రి గా ఎన్టీరామారావు తొలి సంతకం చేశారు.

సీన్‌ కట్‌ చేస్తే,

కాంగ్రెస్‌కు వత్తాసు పలికే ‘ఉదయం’ దినపత్రిక కష్టకాలంలో పడింది. కారణం? దాని ఆర్థిక మూలాల మీద వేటు పడింది. మాగుంట సుబ్బి రామి రెడ్డి ఒక ప్రముఖ లిక్కర్‌ కంపెనీకి దక్షిణ బారత దేశానికి డీలర్‌ గా వున్నాడు. దాంతో ఆయన వ్యాపారం కుంటుపడింది. ఆ తర్వాత అనుకోకుండా, ఆయన నక్సలైట్ల చేతుల్లో మృత చెందటం, వ్యాపార నష్టాల వలన ఆ పత్రికను కొనసాగించలేకపోవటమూ, ఆ పత్రిక శాశ్వతంగా మూతపడటమూ, ఆ పత్రికలోని సిబ్బంది నిరుద్యోగంలోకి నెట్టబడటమూ తెలిసినవే.

‘సారా వ్యతిరేకోద్యమాన్ని’ , ‘మద్యవ్యతిరేకోద్యమంగా’ మార్చటంలో నాడు ‘ఈనాడు’ చూపిన చొరవ మీద అనేక అనుమానాలు వచ్చాయి. ‘ఈనాడు’ కు పోటీగా నిలిచిన ‘ఉదయం’ దినపత్రికను దెబ్బతీయటానికే ఈ పని చేశారని వారు తమ తమ ప్రయివేటు సంభాషణల్లో చర్చించుకునే వారు.

నాడు ‘ఉదయం’. నేడు ‘సాక్షి’.

కారణాలు వేరయినా ఫలితం ఒక్కటే. వేటు ఆర్థిక మూలాల మీద పడింది.

రెండు మీడియా శిబిరాలు

రెండు కులాలు

రెండు పార్టీలు.

రెండేసి ప్రచారాలు.

ఒకరి జీవిత చరిత్రను మరొకరి మీడియాలో చదువుకోవచ్చు.

‘డెయిలీ జర్నలిజం’ కాస్తా ‘డెయిరీ’ జర్నలిజంగా మారిపోయింది.

లక్షలమంది పాఠకులు అన్నీ చదువుతున్నారు. ఇష్టపడి చదువుతున్నారో, విధిలేకే చదువుతున్నారో, మరో మార్గాంతరం లేకే చదువుతున్నారో ఎవరికి ఎరుక.

ఈ రెండు శిబిరాల పత్రికల్లో అన్ని హంగులూ, అన్ని రంగులూ వుంటాయి. లేని దెల్లా ఒక్క ‘విశ్వసనీయత’ మాత్రమే.

అందుకనే కొద్దో, గొప్పో చదువుతో పాటు, ఇంటర్నెట్‌ సౌకర్యం వున్నవారు తమ తమ బ్లాగులు తెరచుకుని, తమ తమ అభిప్రాయాలను స్వేఛ్చగా చెప్పుకుంటున్నారు. ఫేస్‌ బుక్‌ , ట్విట్టర్‌ వంటి ‘సోషల్‌ మీడియా నెట్‌ వర్క్‌లలో’ తమకు తెలిసిన వ్యక్తీకరణతో నిజాలను ఆవిష్కరిస్తున్నారు. ఇదే ప్రత్యామ్నాయ పత్రికా రచన. మరో భాషలో చెప్పాలంటే పౌర పత్రికారచన (సిటిజన్‌ జర్నలిజం). ఈ పత్రికా రచనకే గల్ఫ్‌ దేశాల్లో రాజ్యాలకు రాజ్యాలే కుప్ప కూలిపోయాయి.

తెలుగు నాట ఈ రెండు శిబిరాలూ ‘అక్షర ఫ్యాక్షనిజాని’కి స్వస్తి చెప్పాలి.

పత్రికా స్వేఛ్చను ప్రజల హక్కుగా, పాత్రికేయుల స్వేఛ్చగా గుర్తించాలి.

అలా చెయ్యని పక్షంలో – చైతన్యవంతులైన విద్యావంతులు మిన్నకుండరు. ఫలితంగా ఖరీదయిన పాఠాలు నేర్చుకోవాల్సి వుంటుంది.

పేజీలకు రంగులు వేసుకోండి కానీ, అక్షరాలకు ‘వర్ణాల'(కులాలను, పార్టీలనూ) అద్దకండి.

పత్రికా స్వేఛ్చ వర్థిల్లాలి!

-సతీష్‌ చందర్‌

10 comments for “ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షర ఫ్యాక్షనిజం!

Leave a Reply