నిఘా. నిఘా.. కుడి ఎడమల నిఘా, నిఘా. ఇంటి కింది కాపురాలు, ఒంటి మీది వస్త్రాలు, పంటి కింది ఆహారం- అన్నింటిమీదా నిఘా. ఇష్టమైన పిల్లను చేసుకుంటే పరువు హత్య. నచ్చిన దుస్తులువేసుకుందనే నెపం మీద అత్యాచారం. దొరికిన ఆహారం తింటే మారణహోమం. వీటికి వత్తాసుగా సర్కారు నడిపే వారి వ్యాఖ్యలు, హుకుంలు, నిర్ణయాలు. బీఫ్ అని అరికట్టే కేంద్రం నిర్ణయం పై లేస్తున్న దుమారం తెలిసిందే. ఈ సందర్భంగా నేను రాసిన ’గోధనం‘ నవల నుంచి ఒక కోర్టు సీనును నా మిత్రులతో పంచుకోవాలనిపించింది. చదవండి.
క్షణాల్లో సీను కోర్టులోపలికి మారిపోయింది.
జడ్జిగారు రాగానే అందరూ లేచి, ఆయన కూర్చోగానే అందరూ కూర్చున్నారు. ఆయనకు తల నెరిసిందో, లేదో ఎవరూ కనిపెట్టలేరు. ఆధారంగా నెత్తిమీద ఒక్క వెంట్రుకా వుంచుకోలేదు. నిత్యయవ్వనులుగా వుండే కిటుకు సత్య నాదెళ్ళకు తెలుసు; ఈ జడ్జిగారికి తెలుసు.
కోర్టులోపల అదనంగా వచ్చిన ఆడియన్సునూ, లాయర్లనూ, బంట్రోతుల్నీ, పోలీసుల్నీ, సిబ్బందినీ కళ్ళజోడులోంచి ఒకసారి, అదే కళ్ళ జోడుని ముక్కుమీదకు జార్చుకుని ఒక సారీ చూశాడు. న్యాయానికి రెండు చూపులండాలన్న మాట- అనుకుంది గోమహాలక్ష్మి.
నాలుగయిదు కేసుల వాయిదాలను, క్లాసులో మాస్టారు అటెండెన్స్ వేసినంత వేగంగా, యాంత్రికంగా ముగించేశాడు.
‘లూథర పాల్… లూథర్ పాల్.. లూథర్ పాల్! అని పిలిచాడు కోర్టు బంట్రోతు.
బయిటే బూట్లుతీసుకుని మెత్తగా,పిల్లిలాగా నడిచి వచ్చి చెక్కబోను ఎక్కి వున్నాడు
‘పీపీ గారూ! టేక్ హిజ్ ఓత్’ అన్నాడు
‘భగవద్గీత కాదు… బైబిల్ అనుకుంటా’ అని తియ్యబోతుంటే.
‘ఆ బొక్కు లేదేటిండే… ఈటికన్నా మందంగా…దుడ్డుగా వుంటాదీ.. ఆ బొక్కుండే…!?’ అనడిగాడు లూథర్ పాల్.
‘ఖురాన్..!’ పీపీ ఆరా తీశాడు
‘మా పేట్లో పెద్దాయనుంటాడే… ఆయన సేతిలో సూసానండే!? పేరూ…?’
‘ఈ పుస్తకమంటే, ఆ పుస్తకం- మీద చేయించ కూడదు. పవిత్రగ్రంధమయి వుండాలి.’
‘పయిత్తరం.. మీకా.. నాకా..?’ ..అనేసి, కొంచెం గ్యాప్పిచ్చి ‘ఏవనుకోకండే.. నాకు తెలక అడిగేశాను?’
‘నీకు, నీ విశ్వాసాన్ని బట్టి ఏది పవిత్ర గ్రంథమో అది. ఏదీ లేక పోతే మనస్సాక్షి మీద ప్రమాణం చెయ్చొచ్చు.’ అని పీపీ అనేటప్పటికి,
‘ఐతే…ఆ బొక్కే. తెప్పించేయండి బాబయ్యా.. దయుంచి’ అని సెటిలయిపోయాడు లూథర్ పాల్.
జడ్జిగారు ముద్దాయి వైపు రెండో చూపు చూశారు. అంటే, ముందు కళ్ళజోడు లోంచి చూసినప్పుడు అర్థం కాలేదు కానీ, కళ్ళజోడును ముక్కుమీదకు జార్చి చూసినప్పుడు బల్బెలిగింది.
‘ హి నీడ్స్ కాన్‌స్టిట్యూషన్ ఆవ్ ఇండియా’ అని ఆయన టేబుల్ మీద ఉన్న ‘భారత రాజ్యాంగాన్ని’ పాస్ ఆన్ చేశారు.
ప్రమాణంలో పలువురు అలవాటుగా ఆడే అబధ్ధమే తాను చెప్పేశాడు: ‘అంతా నిజమే చెబుతాను’
‘ఇంతకీ! నువ్వు పోలీస్ స్టేషన్ బయిట ఎందుకు న్యూసెన్స్ చేశావ్..?’ అడిగారు పీపీ.
‘ఇంతాసేసి.. నా మీద నూసెన్స్‌కేసెట్టారా..? అంటే జరిమానా ఏసి వొదిలేత్తారా…? మోసం!’
చిన్నగా కోర్టులో గుసగుసలు వినిపించాయి. జడ్జిగారు చిన్నగా నవ్వి, కళ్ళజోడు ముక్కుమీదకు జార్చుకుని పైనుంచి చూశారు. అంతే. అంతటా నిశ్శబ్దం. అనుభవానికి చప్పుడు వుండదు. అలాగే నిశ్శబ్దంగా మాట్లాడుతుంది.
‘మరింకే కేసునుకున్నావ్?’ అడిగాడు పీపీ అదే నిశ్శబ్దాన్ని ఛేదించటానికి తాను మాత్రమే లైసెన్సు పొందిన వాడిలాగా.
‘బతికున్న ఆవుని అడ్డంగా నరికేత్తే.. ఇదా కేసు..!?’ లైసెన్సు లేని వాడిలాగా అదే నిశ్శబ్డాన్ని ఛేదించాడు న్యూసెన్సుకేసులో ముద్దాయి లూథర్ పాల్.
ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఛేదించారు. కలకలం.
‘ఆర్ యూ మాడ్? ఆవు దొరికేసింది కదా!? పొరపడి మిమ్మల్ని కొట్టిన వారిమీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. కోర్టు విచారించి రిమాండ్ మీద జైలుకు పంపిందీ..?! పీపీ సరిదిద్ద బోయాడు.
‘తప్పు సార్. ఆల్లడ్డంగా బొంకేత్తన్నారు. ఆవు ను నా సేత్తో, నేనే సంపేసాను. ఆల్లు యేరే ఆవును సూపించి దొరికేసిందంటన్నారు.’
జడ్జిగారికి చికాకొచ్చింది.
‘హాజ్ ది హౌసాఫీసర్ కమ్?’
‘ఎస్సై గారొచ్చారు సార్!’
‘గెట్ హిమ్ ఇన్’
అటు పక్క బోనులో ఎస్సయి నిలబడి ఫార్మలిటీస్ పూర్తి చేశాడు.
‘ఎస్సయిగారూ? ఏమిటీ న్యూసెన్స్? ఆర్యూ ప్లేయింగ్ వితి దీ కోర్ట్?’ అని కళ్ళజోడు లోంచి చూసే అడిగారు.
‘అ బెగ్ యువర్ పార్డన్ మిస్టర్ జస్టీస్. ఇతను తెల్లవారు ఝామున పారిపోయి వచ్చినప్పటి నుంచీ ఇలాగే మాట్లాడుతున్నాడు. గోవు దొరికేసిందయ్యా… అంటే. ‘లేదూ, నేనే చంపాను’ అంటాడు సార్. ‘వెళ్ళిపోవయ్యా! నీమీద ఏ కేసూ లేదూ- అంటే స్టేషన్ బయిటకొచ్చి భోరు భోరున ఏడుస్తూనే వున్నాడు సార్. ట్రాఫిక్ నిలిచి పోయింది యువరానర్. ఇక అప్పుడు చేసేది లేక సెక్షన్ 268 ఇన్వోక్ చేసి న్యూనెన్స్ కేసు పెట్టాను యువరానర్.’ అని చెప్పి దిగిపోయి, టోపీ పెట్టుకుని వెళ్ళిపోయాడు సబ్ ఇన్సెక్టర్.
‘ఏడిస్తే న్యూసెన్సా..? సెక్షన్ అట్రాక్ట్ కావటం లేదు. కేసు కొట్టేస్తున్నా. లెట్‌హిమ్ గో ఫ్రీ.’ అనేసారు జడ్జి.
‘సా….ర్’ అని పెద్దగా అరిచాడు లూథర్ పాల్.
‘సైలెన్స్’ అన్నట్టు వినపడిందో ఏమో, అందరూ నోళ్ళు బంద్ చేశారు.
‘సంపేత్తారండే…కొట్టి సంపేత్తారండే..!’
‘ఎవరూ?’ ఈ సారి జడ్జిగారు కళ్ళజోడు రెండో చూపు చూశారు.
‘ఆల్లే..!’
‘వాళ్ళు జైల్లో వున్నారు.’
‘కరెట్టే సార్. ఆల్లే. మమ్నల్ని కొట్టి నోల్లే లోపలున్నారు. కొట్టి సంపాలనుకున్నోల్లూ… సత్తే సూద్దామనుకున్నోల్లూ.. బయిటే వున్నారు.’
‘ప్రాథమిక సాక్ష్యాలున్నవాళ్ళనే నిర్బంధిస్తాం. లేని వాళ్ళ మీద చర్య వుండదు కదా!’
‘నన్ను ఏదో రోజునేసేత్తారు. నొన్కొణ్ణే కాదు. ఎనమండుగుర్నీ లేపేత్తారు. ఆల్లు బయిటుంటే నేను లోనుండాలి. మీకు దండమెడతా.. ఎదవ న్యూసెన్స్ కాకుండా.. ఏదన్నా నాన్ బెయిలబుల్ కేసు చూసి తోసెయండి సార్?’
జడ్జిగారికి ఇదెలాగూ ట్రయిల్ కాదని తెంపు చేసుకుని, కళ్ళ జోడు మొత్తం తీసి పక్కన పెట్టి ఖాళీ కళ్ళతో చూశాడు. ఆ బాడీలాంగ్వేజ్ పీపీకి కూడా అర్థమయింది. ఇప్పుడు నడుస్తున్నది పెళ్ళి తర్వాత మ్యూజికల్ నైట్ లాంటి, విచారణానంతర కార్యక్రమమే.
‘బాబూ రూథర్…!
‘ గబుక్కున అలా అనేసారేటండీ? నే పేరు లూథరండి బాబూ! రూథర్.. అంటే రూథర్ ఫర్ట్ అనుకుంటారు. ఆయన అల్లూరి సీతారామరాజు లాంటి పెద్ద పెద్ద ఇప్లవ కారుల్ని సంపేసాడు. నా మీద ఒకే పాలు అంత సికాకొచ్చేసిందా..? దేస ద్రోవు లు గుర్తొచ్చేసారా..? కొంప తీసి రాజ ద్రోవం కేసెట్టేత్తారా ఏంటీ.. ఎట్టేండి దయిద్రం వొదిలి పోద్ది.’ అనేశాడు.
‘డోంట్ డ్రాగ్ టూ మచ్. రాధ్దాంతం చెయ్యకు. లూధర్ పాల్! బయిటింకా ముద్దాయిలుండి పోయారన్నావ్? ఎక్కడుంటారో తెలుసా? కెన్ యూ ట్రేస్ దెమ్?’
‘తెల్వకపోటమేంటీ సారూ..? తెలుసు. అనుమానం… అనుమానం ఎక్కడుంటే అక్కడుంటారు. అనుమానం సార్.. మేం ఆవకాయతో అన్నం తింటన్నా, ఆల్లకి ఆవు మాసంతో తింటన్నట్టుంటది. అది కూడా ఆవును మేమే సంపుకుని, మేమే వొండుకుని తిన్నట్టుంటాది.’
‘ఏం మాట్లాడుతున్నావ్..? మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో గోవధ నిషేధంలేదు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల వున్నది షరతులుతో వున్న నిషేధమే.’ ప్రాసిక్యూటర్ సరి చెయ్యబోయాడు.
పకాలున నవ్వాడు లూథర్ పాల్. అతడొక్కడే నవ్వాడు. కారణం: పాయింటు అతనికొక్కడికే తెలుసు.
‘అంటే… అంటే… అంటే… దేశంలో బీఫ్ తినే అంటరానోల్లంతా కేరళో, బెంగాలో ఎల్లిపొమ్మంటారు. ఏం సెప్పారు సార్. అదుర్స్. ఇలా కూడా ఎలి యెయ్యొచ్చన్న మాట. అసలు ఊరూరుకీ దిట్టిబొమ్మల్లా, ఈ ఎలివాడలెందుక్కాని. దేశం మొత్తానికి ఓ ఎలి రాస్ట్రం యెట్టెయండి. ‘గోరాస్ట్ర’ అని పేరెట్టుకుని బతికేత్తాం. ‘
అర్థరాత్రి స్మశానంలో వున్న నిశ్శబ్దమే కోర్టులోకి సాక్ష్యం చెప్పటానికి వచ్చినట్టు వచ్చింది.
‘ఇంటరెస్టింగ్!’ అనే చిన్న వ్యాఖ్య చేసి, టేబుల్ మీద వున్న కళ్ళజోడును తీసి పెట్టుకుని, ముక్కు మీదకు జార్చారు జడ్జిగారు. నిజంగా ఆయన ముక్కు పొడుగ్గా, వాలుగా, జారుడు బల్లలాగా వుంది.
‘అంటే గోమాంసం తింటున్నారనే వెలి వాడల్లో పెట్టారంటావా..?’ కేసుకు సంబంధంలేక పోయినా, లూథర్ పాల్ చేత ఏదో ఒప్పించాలనే తాపత్రయం పీపీ మాటల్లో కనిపించింది.
‘తప్పు సార్. లేని గొప్పలు మేమెందుకు చెప్పుకుంటాం సార్. దేసంలోనే తొలిగుండా మేమే బతికున్న గోవును యేటకి సంపేసి, వొండుకుని తిన్నామని ఇర్రవీగలేం సార్. మాకు మంత్రాలు రావు సార్ వోమం సేసి గోవును బలిచ్చేటప్పుడు ఏమనాలో కూడా తెలీదు సార్. యేదాలు రావాలంటే ఏల మైల్లు దాటి ఏ ఇరాన్నుంచో రావాలి కద్సార్.’
‘నవ్వు చరిత్రను వక్రీకరిస్తున్నావ్!?’ అని హుంకరించాడు పీపీ.
‘పోనీ. దానికేమన్నా కేసుంటే ఎట్టేయండి సామీ.. లోపలికెల్లిపోతాను.’ అని ప్రాధేయపడ్డాడు లూథర్ పాల్
‘ఆవుల్నీ, ఎద్దుల్నీ మీరు తినకుండానే మిమ్మల్ని ఊరికి దూరంగా పెట్టారా??’ పీపీ ఉడుక్కుంటూ లోతుకెళ్ళాడు.
‘అమ్మతోడు. అమ్మమ్మమ్మమ్మ తోడు. మేం బుద్దుడి ఫాలోయర్సం సామీ. మూగజీవాల్ని దేవుల్లకీ, దయ్యాలకీ బలివ్వటం ఈ మతంలో లేదు. అదంతా బేంబల మతం. బేంబల మతపోల్లొచ్చి- బేంబల రాజుల్ని ముందెట్టి- ఆల్ల మతంలోకెచ్చయ్యమని పీక మీద కత్తెట్టేసారు. జంకలేదు..పెతీవూల్లోనూ నాలాంటి మతానికెదురోల్లు. సత్తే బుద్దుడి పాలోయర్లగా సత్తామన్నారు. అంతా నా లాగా సదుంకున్నేల్లే కదా… మనం ఇంటర్ ఫెయిలనుకోండి…. ఆల్లలాక్కాదు. మేదావులు..జంకలేదు. ఎదవలు సావుకి జంకేలా లేరని.. ఎలేసేసారు.’
‘కమ్ టూ ది పాయింట్ స్ట్రెయిట్లీ..! వెలికి గురయ్యాకయినా మీరు గోవును తిన్నారా? లేదా?’ పీపీ ఉక్రోషం పతాక స్థాయికి వచ్చింది.
‘గుర్రానికి డుపు కాలితే.. ఏం సేత్తాదీ… ఎండుగడ్డయినా తింటాది. తినకే. గోవును తిన్నాం. సంపి తిన్లేదు. సచ్చాక తిన్నాం. మిమ్మల్ని లోపలేసి, ఓ వారం రోజులు నీల్లూ, గీల్లూ, తిండీ, గిండీ బంద్ సేత్తే ఏం సేత్తారు? తినేత్తారు.. నేనెదురొత్తే.. నన్ను తినేత్తారు. దొరికింది తిన్నాం. మీరు ముక్కు మూసుకునే పనులు సేసాం. అయినా సారూ… మీరు పర్మిసనిత్తే… నేనో పస్నేత్తాను: గొడ్డు ఎందుకు తిన్నావ్? గడ్డి యెందుకు తిన్నావ్? అనీ అడిగే పతీవోడూ… అరెయ్ ఏకంగా మూడు వేల యేల్లు యెలేత్తే ఎలా బతికార్రా అని అడిగారా…? అసలు మేం బతకటమే ఓ యింత సార్. అయినా దేసం మొత్తం మీద పాతిక కోట్ల మంది బతికాం. ఒక్కోచోట దేస జనాబా కూడా అంతుండదు. ఇప్పుడు మా ఇల్లలో కొచ్చేసి. మా కూర దాకలు సూసేసి. మేం తినేదేదో కనిపెట్టేసి.. సంపుకుంటూ పోతారా..!?’
వాదన శ్రుతి మించుతోందని భావించిన జడ్జిగారు, కళ్ళజోడు కళ్ళదగ్గరకు చేర్చుకున్నాడు.
‘నీతో ఏకీభవించక పోయినా, వియ్ అండర్‌స్టాండ్ యువర్ ఎగొనీ. అయినా, దళితుల పై దాడులు జరిపిన వాళ్ళపై కేసులు పెడుతూనే వున్నారు.’
‘ఎందుకు పెట్టరు సార్? బొక్కు మహిమ! అని చిన్నగా నవ్వాడు లూథర్ పాల్
‘దేశ ప్రధాని, మన ముఖ్యమంత్రులు కూడా ఈ దాడుల్ని ఖండిచారు. విచారాన్ని వ్యక్తం చేశారు’
‘చెప్పాను కదా! బొక్కు మహిమ!’
‘లోక్ సభ స్పీకర్,రాష్ట్రపతి వంటి అతి గొప్ప పదవుల్ని దళితులు చేశారు.’
‘బొక్కు మహిమ’
‘కరెక్టు… కానీ ఆ బుక్కు, నీ భయాన్ని ఎందుకు తియ్యలేక పోతోంది?’
జడ్జిగారి ప్రశ్నా? మజాకా? సమాధానం అంత ఈజీ కాదు.
‘కరెక్టు సారూ! బుక్కున్నా ఇక్కడ అమలు జరగటం లేదు.’
‘వాట్ డూ యూ మీన్…?’
‘గోవు బతికే వుందని తెలీటం ఓ పావుగంట లేటయితే, నేను మీ ముంగట వుండే వోణ్ణి కాను సారూ. కారణం అనుమానం. ఏ నేరమయినా ఈ ఎదవలే సేత్తారనే – ఎదవ నమ్మకం పైకులపోల్లకి.. ఈ బొక్కు లేని సోట్లే వుంటాది. అందుకే సార్ మీకు దండమెడతాను. నన్ను వొట్టి సేతుల్తో పంపించ కండి. ఓ రొండేల్లయినా సిచ్చేసయండి.’
అతడి అభ్యర్థను నవ్వుతూ త్రోసిపుచ్చుతూ జడ్జిగారు లేచారు.
(సతీష్ చందర్ ‘గోధనం‘ నవల నుంచి చిన్న భాగం)
ఈ నవల వెల రు.50లు. పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. లేకుంటే రచయిత ను సంప్రదించవచ్చు.
excellent sir
A master piece in a small piece of art… Congrats Satishji….
Bramhandam
Satishji sunnitanga sutimettaga vyanganni kalipi drohanni baitapettincharu asalu oka line lo 3000 sam vachada undi ela badikamu matalu ravatamledu superb awasum
mee vaakya vinyasam anitara sadhyam