‘ఇన్నొసెంట్‌’ ఖాన్‌!?

కేరికేచర్: సల్మాన్ ఖాన్

కేరికేచర్: సల్మాన్ ఖాన్

పేరు : సల్మాన్‌ ఖాన్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘ఇన్నొసెంట్‌ మ్యాన్‌’ (‘హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నన్ను నిరపరాధిగా ప్రకటించింది. ఇకనైనా నన్ను ‘ఆలిండియా అమాయకుడు’ గా గుర్తించాలని అభ్యర్థిస్తున్నాను.

వయసు :ఐదు పదులు దాటవచ్చు. అయినా నాకు పెళ్ళీడు వచ్చిందని నేను భావించను. ఇంకా ‘డేటింగ్‌’ చేసే వయసులోనే వున్నాను. ‘హంటింగ్‌’ అంటే నేరమవుతుంది.

ముద్దు పేర్లు :’కండల్‌’ ఖాన్‌, ‘పహిల్వాన్‌’ ఖాన్‌ (పొట్టల హీరోల శకం నుంచి కండల హీరోల శకం తెచ్చింది నేనే. హృత్తిక్‌ రోషన్‌ లాంటి వారికి నేనే స్ఫూర్తి. అందుకే అప్పటి నుంచి హీరోలు కావాలనుకునే వారు ‘యాక్టింగ్‌’ ఇన్సిట్యూట్లకు వెళ్ళటం మాని, ‘జిమ్ము’ల చుట్టూ తిరగుతున్నారు.)

‘విద్యార్హతలు : చెప్పాను గా నటనంటే శరీరంతో పని కానీ, బుర్రతో కాదని. కాబట్టి విద్య ఎంత వున్నా ఒక్కటే. (షూటింగ్‌, డ్రైవింగ్‌- వీటిని విద్యలుగా ఒప్పుకోవటానికి ఇష్టపడటం లేదు. పైపెచ్చు వాటిని ప్రదర్శిస్తే కేసులు కొని తెచ్చుకోవాల్సి వస్తోంది. షూట్‌ చేస్తే ‘అంతరించి పోతున్న సంతతికి’ (చింకారా, వగైరా) చెందిన జంతువులను వేటాడామంటున్నారు. ‘డ్రైవ్‌’ చేస్తే, ‘హిట్‌ అండ్‌ రన్‌’ కేసు పెడతారు.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: పారితోషికం పొందటంలోనూ, ‘గాళ్స్‌’ తో స్నేహం చెయ్యటంలోనూ నేను బాలీవుడ్‌ నటులతో పోటీ పడతాను.

రెండు: నాకు జాలి యెక్కువ. అఫ్‌ కోర్స్‌ అనాధల మీద వున్న జాలి అందగత్తెల మీద వుండదు. అయినా ఇద్దరి మీదా సమానంగా ఖర్చు పెడతాను.

సిధ్ధాంతం : చాలా మంది ఆస్తులతో పాటు సమానంగా అప్పులను కూడా బెట్టుకుంటారు. అలాగే నేను కీర్తితో సమానంగా అపకీర్తిని కూడా కూడబెట్టుకుంటాను. నాకు అపకీర్తి కాంక్ష మెండు.

వృత్తి : ‘డేటింగ్‌’ చెయ్యటం. అనగా అందమైన అమ్మాయిలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం. ‘విశ్వ సుందరుల’ దగ్గర నుంచి ‘విలేజ్‌ సుందరుల’ వరకూ ఒక్కరూ నాకు అర్థం కాలేదు. కానీ నేను వాళ్ళకు అర్థం కావటం లేదని నా మీద ఫిర్యాదు చేస్తారు. ఈ ప్రయత్నంలో నేను ‘వేధింపుల కేసుల’ వరకూ తెచ్చుకున్నాను.

హాబీలు :1. ‘తాగి డ్రైవ్‌ చెయ్యటం’ నా హాబీ కాదు.

2.వన్య మృగాలను వేటాడటం నేను హాబీగా పెట్టుకోలేదు. మీరు నమ్మి తీరాల్సిందే.

అనుభవం : నటనకు ‘కండలు’ సరిపోతాయి. ప్రేమకు ‘గుండెలు’ సరిపోతాయి. మరి పెళ్ళికి..? ఏవి సరిపోతాయో ఇప్పటికీ తెలియదు. అందుకే వాయిదా వేస్తున్నాను.

మిత్రులు : నా మీద కేసులు కొట్టి వేసినప్పుడు మాత్రమే వచ్చి అభినందించే వారు కారు. అఫ్‌ కోర్స్‌ వారిని నేను ‘సహజ నటులు’ గా ఎప్పటికీ గుర్తిస్తాను.

శత్రువులు : అమ్మా.. ఆశ! చెబితే… వారితో కూడా నా మీద కేసులు వెయ్యిద్దామనా?

మిత్రశత్రువులు :ఏ ఇండస్ట్రీలో నయినా వుంటారు. సినిమాలో మరీ యెక్కువ. వారిని చచ్చినా నమ్మను. అందుకే అంత పైకి వచ్చాను.

వేదాంతం : జైల్లో వున్నారు వెలుపలి వారినీ, వెలుపల వున్న వారు బయిటక వారినీ చూసి జాలిపడతారు- స్వేఛ్చ లేదని.

జీవిత ధ్యేయం : నిజం చెప్పమంటారా? ఒక ధ్యేయముంటే జీవితం ఇలా ఎందుకుంటుందీ…!?

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 11-16డిశంబరు 2015 సంచికలో ప్రచురితం)

Leave a Reply