‘ఉత్తరు’ణ్‌ విజయ్‌!

వ్యంగ్య చిత్రం: బలరాం

పేరు : తరుణ్‌ విజయ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘ఉత్తర’ భారత పౌరుడు ( భారతమంటేనే ఉత్తర భారతం. ఇదే ‘శ్వేత’ భారతం. ‘దక్షిణ’ భారతీయులు కూడా వుండవచ్చు. కానీ ఉత్తర భారతీయులకు విధేయులుగా.)

వయసు : వివాదాల్లో తల దూర్చే వయసు కాదు. వివాదాలను సృష్టించే వయసు. (ఒకప్పుడు నేను ఆర్‌ ఎస్‌ ఎస్‌ అధికార పత్రిక ‘పాంచజన్య’ సంపాదకుణ్ణి మాత్రమే. కాబట్టి వార్తల్ని రాసేవాణ్ణి. ఇప్పుడు పార్లమెంటు సభ్యుణ్ణి కాబట్టి నేనే వార్త అవుతున్నాను.)

ముద్దు పేర్లు : ‘ఉత్తరు’ణ్‌ విజయ్‌(‘ఉత్తర’ బారతీయులం కదా!), ‘ఉత్తర’ కుమారుడు. ( భారతంలో ఉత్తర కుమారుడు ప్రగల్బాలకు పెట్టింది పేరు.)

విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఆఫ్‌ ‘నార్త్‌’ పాలిటిక్స్‌.( లేకుంటే అలాంటి వ్యాఖ్య చెయ్యగలిగే వాణ్ణి కాదు: ఉత్తరాది వాళ్ళమయిన మేం ‘తెల్లటి భారతీయుల’ మైనా, దక్షిణాన వున్న ‘నల్లటి భారతీయుల’ను భరిస్తున్నామా.. లేదా..? అని)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: ఆర్యులమైన మేం తెల్లగా వున్నా, నీలమాఘ శ్యాములయిన( నల్లగా వున్న) రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్ళనే కొలుస్తాం. ( మనుషులు నల్లగా వుంటేనే… ‘భరిస్తామ’ని అంటాం.)

రెండు: భాషా పరంగా మీది ఏ దేశమని- అంటే ‘హిందీ’ దేశమని కూడా చెబుతుంటాను. ( ఎందుకంటే హిందీ అన్నది తెల్లగా వుండే ఉత్తర భారతీయుల భాష. నల్లగా వుండే దక్షిణ భారతీయులు మాట్లాడే భాష వేరుగా వుంటుంది. )

సిధ్ధాంతం : మీకు తెలియదా.. నేను ఆర్‌.ఎస్‌. ఎస్‌ ‘జాతీయ వాదానికి’ సిధ్ధాంతకర్త నను కూడా. ఇప్పుడు ఈ పదాన్నే సవరించాల్సి వుంది. ‘ఉత్తర శ్వేత జాతీయ వాదం’ అని మార్చుకోవాల్సిన అవసరం వుంది.

వృత్తి : నారాయణ… ! ఈ మాట అంటూ ముల్లోకాల్లోనూ ప్రత్యక్షమయ్యే పురాణాల్లోని ‘నారదుడి వృత్తే నావృత్తి’ కలహాలు పెట్టటం. ( ఇండియా లో వుండే నైజీరియన్ల మీద- ఎందుకయ్యా ఇండియన్లు నోయిడాలో దాడులు చేస్తారూ- అంటే అవి జాత్యహంకార దాడులు కావు… మాకు జాత్యహంకారం లేదు… అలాగయితే ఇన్నేళ్ళూ నల్లగా వున్న దక్షిణ భారతీయులను భరించటం లేదా…!? అన్నాను. ఇక చూస్కోండి… పార్లమెంటులోనే కాదు… దేశమంతటా గొడవలే…!)

హాబీలు :1. ఫోటో గ్రఫీ.( ఉత్తర భారతీయులే కాదు. ఉత్తర భారతం ఎంత అందమైనదో చూపించే ఎన్నో ఫోటోలను తీసాను. వాటితో దేశమంతటా ప్రదర్శనలు పెట్టాను)

2. పుస్తకాలు రాయటం. ( ఇవి కూడా టిబెట్టూ, హిమాలయాల మీదే…దక్షిణం వైపు చూస్తే వొట్టు.)

అనుభవం : కాషాయంలో పుట్టాను. కాషాయంలో పెరిగాను. ఇంకో ‘వర్ణాన్ని’ అసలు పోల్చుకోలేను. నలుపునయితే పోల్చుకోవటానికి సాధ్యమే కాదు.

మిత్రులు :ఉన్నారు. అందరూ ‘తెల్ల’ భారతీయులే.

శత్రువులు : అదే చెబుతున్నాను. నాకు ‘జాత్యహంకారం’ లేదంటున్నాను. కాబట్టే ‘నల్ల’గా వున్న దక్షిణ భారతీయులను ‘భరిస్తున్నాం’ అంటున్నాను. ( అంతే కదా.. తెల్లగా వుండే వాళ్ళే నల్ల వాళ్ళను భరిస్తాను. నల్లగా వుండే వాళ్ళు తెల్లవాళ్ళను భరించే ప్రశ్న వుండదు కదా.. తెలుపంటే వారికి మోజు కదా!)

మిత్రశత్రువులు : తెలుపూ, నలుపూ కాని వారు. అంటే ‘ఉత్తర’ భారతంలో వుండే నల్లని వారు.

వేదాంతం : ఆర్యులు వేరే చోటనుంచి ఈ దేశానికి వలస వచ్చారని చరిత్రకారులు అంటారు. అందుకే నేను చరిత్రను కాకుండా పురాణాన్ని నమ్ముతాను. అప్పుడు మనశ్శాంతిగా వుంటుంది. పురాణాలు ‘అప్పుడు ఉత్తరాదిన తెల్లగా వున్న మేమే అసలు భారతీయులమ’ని చెప్పుకోవచ్చు. భూమధ్య రేఖ పక్కనుంచి వెళ్తున్నా, అంత తెల్లగా ఎలా వున్నారని… ఎవరూ అడగటానికి ఆస్కారం వుండదు.

జీవిత ధ్యేయం : వాస్తు రీత్యా దేశానికి ఉత్తరాన వున్న వాళ్ళే గొప్ప వాళ్ళు, దక్షిణాదిన వున్న వారు కాదూ… అని నిరూపిస్తూ గ్రంథం రాయాలని.

-సతీష్‌ చందర్‌

14ఏప్రిల్2017

Leave a Reply