ఊరక దూకరు మహానుభావులు!

టాపు(లేని) స్టోరీ:

vivekఅదే మొబైల్‌. అదే నెంబరు. మారేది ‘సిమ్‌ కార్డే’

అదే పదవి(ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు.) వీలైతే అదే నియోజకవర్గం. మారేది ‘కండువాయే’

రెండు పనులూ ఒకటే. మొదటి దానిని ‘నెంబర్‌ పోర్టబిలిటీ’ అంటారు. ఎయిర్‌టెల్‌ నుంచి టాటా డోకోమోకి మారినా అదే నెంబరు వుంటుంది. రెండో దానిని ‘మెంబర్‌ పోర్టబిలిటీ’ అంటే ‘మెంబర్‌’ ఆఫ్‌ పార్లమెంటు(ఎంపీ) లేదా ‘మెంబర్‌’ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ(ఎమ్యెల్యేలు) గతంలో ఎక్కడనుంచి కాంగ్రెస్‌ పార్టీనుంచి ఎన్నికయ్యారో, మళ్ళీ అక్కడ నుంచే టీఆర్‌ ఎస్‌ నుంచి ఎన్నిక కావచ్చు.

ఈ ‘మెంబర్‌’ పోర్టబిలిటీ స్కీమును మొదట కేసీఆర్‌ ప్రకటించినప్పుడు కొందరు నవ్వుకున్నారు. కానీ ఈ స్కీము కొంతలో కొంత పనిచేసింది. మంద జగన్నాథం, జి.వివేక్‌. జి.వినోద్‌ లు సంతోషంగా వచ్చేశారు. ‘మార్కెటింగ్‌’ అనేది శాస్త్రం. దానిని వాణిజ్య రంగంలోనే కాదు, రాజకీయ, సేవా, ఆధ్యాత్మిక రంగాలలో కూడా అధ్భుతంగా పనిచేస్తుందనటానికి ఇదో ఉదాహరణ.

అయితే ఈ ఏర్పాటు ఎలా వున్నా, చేరిన వారిని కానీ, చేర్చిన వారిని కానీ అడిగితే- చేరటానికి కారణం ‘తెలంగాణ’ అంటారు. తెలంగాణ విషయంలో ‘మాట తప్పటం’ అన్నది అతి మామూలు విషయం అయిపోయింది. ఇప్పడు కొత్తగా ‘మాట తప్పటం’ అన్నది లేదు. ‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడుతున్నామ’ని ప్రకటించి రెండు వారాల తిరగకుండానే కేంద్రం ‘మాట మార్చింది’. ఈ నేతలకు కోపమంటూ-వస్తే అప్పుడే రావాలి. ‘జంప’ంటూ చేస్తే ఆనాడే చేయాలి. కానీ అదీ ‘గెంతే’ సీజన్‌ కాదు. ఎన్నికలప్పుడే దూకటానికి వీలుగా పార్టీల మధ్య వున్న గోడల్ని చిన్నవి చేస్తారు. ఇప్పుడు ఈ ‘మెంబర్‌’ పోర్టబిలిటీ స్కీముతో గోడ మరీ నేలబారు అయిపోయింది. అందుకే సులభంగా దూకగలిగారు.

దూకిన వారు (కె. కేశవరావుతో పాటు) కాంగ్రెస్‌ లో వున్నప్పుడు ‘తెలంగాణ తెచ్చేదీ మేమే, ఇచ్చేదీ మేమే’ అని చెబుతూ వచ్చారు. కానీ వారికి అప్పటికే రహస్యం తెలిసి వుండాలి. తెలిసి వుంటే, వారు వేరే నినాదం ఇచ్చి వుండేవారు: ‘తెలంగాణ తేల్చేదీ మేమే, నాన్చేదీ మేమే’ అని అని వుండేవారు.

ఇన్నాళ్ళూ, ఇన్నేళ్ళూ నాన్చింది కాంగ్రెస్సే. అందుకు ఇతర పార్టీల మీద వంక పెడుతూ వచ్చింది. ఇప్పుడు నాన్చాలన్నా కుదరని పని కావచ్చు. రాష్ట్రంలోని పార్టీల్లో దాదాపు స్పష్టత వచ్చేసింది. టీఆర్‌ఎస్‌, బీజేపీయే కాకుండా, తెలుగుదేశం కూడా ప్రత్యేక తెలంగాణ కు అనుకూలంగా ప్రకటనలూ, తీర్మానాలు చేసేసింది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా అంతో ఇంతో స్పష్టత వైపే ప్రయాణించింది.

తెలుగుదేశం ఇంత స్పష్టంగా ప్రకటన చేసినా, ఇందుకు వ్యతిరేక ప్రకంపనలు సీమాంధ్రలో కలగలేదు. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలే సీమాంధ్ర, తెలంగాణలో సమానంగా విస్తరించి, వేళ్ళూనుకుని వున్నాయి. ప్రత్యేక తెలంగాణ పై అనుకూల ప్రకటన చేయటం వల్ల, సీమాంధ్రలో తెలుగుదేశ పార్టీకి వ్యతిరేకత రానప్పుడు, ఇదే పని కాంగ్రెస్‌ చేస్తే ఎందుకు వస్తుంది? ఇంత భరోసా వుంటే, కాంగ్రెస్‌ తేల్చకుండా వుంటుందా? ఎన్నికల ముందు తేల్చేసి, ప్రత్యేక తెలంగాణ తామే ఇచ్చామన్న ఖ్యాతి కొట్టకుండా వుంటుందా? సరిగ్గా ఇదే సమయంలో ముగ్గురు దళిత నేతలు( మంద, వివేక్‌, వినోద్‌లు) కాంగ్రెస్‌లో వుండకుండా టీఆర్‌ఎస్‌లోకి ఎందుకు వెళ్ళినట్లు? తెలంగాణ పై కేంద్రం అనుకూల ప్రకటనంటూ వెల్లడిస్తే, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో కలవచ్చు. అప్పుడు, ప్రత్యేక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటూ ప్రశ్న వస్తే, టీఆర్‌ఎస్‌ చేసిన భీషణ ప్రతిజ్ఞ ప్రకారం దళిత నేతనే చెయ్యాలి. అందుకేనా నాన్చినంత కాలం ముగ్గురు దళిత నేతలూ కాంగ్రెస్‌ లో వుండి, తేల్చేసే వేళకు కరెక్టుగా జంపు చేశారు? ఊరక దూకరు మహానుభావులు!!

న్యూస్‌ బ్రేకులు

తెలంగాణకు ‘పూల’ బాట!

టీఆర్‌ఎస్‌ ద్వారా తెలంగాణ ఎలా వస్తుందో ఆ పార్టీ లో చేరే నేతలే చెప్పాలి.

-నాగం జనార్థన రెడ్డి, తెలంగాణ నగారా సమితి నేత

అలా చెప్పితే జనం చెవుల్లో ‘గులాబీ’లు పెట్టినట్లవుతుంది. కానీ ‘గులాబీలు’ బదులు ‘కమలాలు’ పెడతానంటున్నారు. బీజేపీ ద్వారానే తెలంగాణ సాథ్యమంటున్నారు. దొరికిన వాళ్ళందరూ చెవుల్లో ‘పువ్వు’లో పెట్టేవాళ్ళే! ఏం చేస్తాం?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పై కాంగ్రెస్‌ నెల రోజులలోగా నిర్ణయం తీసుకునే అవకాశం వుంది.

-గులామ్‌ నబీ అజాద్‌, అంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి, కాంగ్రెస్‌ పార్టీ.

నెల అంటే 30 రోజులు కాదని గతంలో చెప్పారు. అంటే 365 రోజులని భావించవచ్చా?

ట్విట్టోరియల్‌

వంగమంటే, సాష్టాంగ పడకూడదు!
dlకిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేబినెట్‌ నుంచి వెళ్ళగొట్టిన ఇద్దరు నేతలూ (శంకరరావు, డియల్‌ రవీంద్రారెడ్డి) పార్టీ పట్ల ‘విధేయత’ను ప్రకటించటంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డిని మించిన వారు. పార్టీ అధిష్ఠానం వైయస్‌ జగన్మోహన రెడ్డి మీద కత్తి కట్టినప్పుడు, అధిష్ఠానం వైరాన్ని, తమ వైరాన్ని మార్చుకున్నారు వీళ్ళిద్దరూ. శంకరరావు జగన్‌ పై కోర్టుల్లో ‘కేసుల’కు కారణభూతుడయి, న్యాయపోరాటనికి సిధ్దపడ్డారు. డియల్‌ వోటమిని లెక్క చేయక తన ప్రతిష్టను పణంగా పెట్టి, జగన్‌కు వ్యతిరేకంగా పోటీ చేశారు. కానీ కడకు వేటు వీరిద్దరి మీదే పడింది. కారణం? వీరిద్ధరూ తమకున్న ‘వాక్‌ స్వాతంత్య్రాన్ని’ సంపూర్ణంగా వాడుకోవటం. చిత్రం! మంత్రుల్ని ప్రాసిక్యూషన్‌ చేయటానికి సిబిఐకి అనుమతి ఇవ్వాలని నాడు వాదించిన డీయల్‌ మీద వేటు పడింది. కడకు ఆ ( కళంకిత లేదా ఆరోపిత) మంత్రుల్నీ తప్పించటం తప్పలేదు. అందుకే ‘విధేయత’ ప్రకటించటంలో అత్యుత్సాహం ప్రకటించకూడదన్నది రాజనీతి.

‘ట్వీట్‌ ఫర్‌ టాట్‌

‘ఫోర్‌ట్వంటీ’ల మ్యాచ్‌

పలు ట్వీట్స్‌: హమ్మయ్య! ఎండలు పోయి రుతుపవనాలు వస్తున్నాయి!

కౌంటర్‌ ట్వీట్‌: అవును. వడదెబ్బలు పోయి, వరద దెబ్బలు వస్తాయి.

ఈ- తవిక

ఎంత దగ్గరో, అంత దూరం!

కేసీఆర్‌కు

హరీష్‌

మేనల్లుడు

చంద్రబాబుకు

జూనియర్‌ ఎన్టీఆర్‌

మేనల్లుడు.

అక్కడా, ఇక్కడా

మామా, మేనల్లుళ్ళకు

ఒకే దూరం!

బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘క్రికెట్‌ అన్నాక వికెట్లు పడకుండా వుంటాయా?’

‘అవును. ఒకప్పుడు క్రికెట్‌ ఆటలో పడేవి. ఇప్పుడు క్రికెట్‌ బోర్డులో పడుతున్నాయి.’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

దాత తిరిగి చెడితే, నేత తిరగక చెడ్డాడు.

-సతీష్ చందర్

(సూర్య దినపత్రిక 4 జూన్ 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

2 comments for “ఊరక దూకరు మహానుభావులు!

Leave a Reply