రైళ్ళు పట్టాలపైనా, బస్సులు రోడ్లపైనా, విమానాలు మబ్బులు పైనా నడుస్తాయని- చెబితే ఎల్‌కేజీ కుర్రాడు కూడా నమ్మడు. వాహనం ఏదయినా నడిచేది ఢరల పైన.
కేంద్రంలో ఒకప్పటి ఎన్డీయే సర్కారయినా, ఇప్పటి యుపీయే ప్రభుత్వమయినా నడిచేది పాలసీల మీద కాదు. ఉత్త పొత్తుల మీద.
అటు వాహనాలకూ, సర్కారుకూ సంబంధం వుందేమో! అబ్బే అవేమన్నా మోకాలూ, బోడిగుండూనా? ఉండనే ఉండదు- అని అనిపిస్తుంది. కానీ నిజం కాదు. రైల్లో ప్రయాణిస్తూ ఒక్క సారి గొలుసు లాగి చూడండి. ఆగేది రైలు కాదు. సర్కారు.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అదే పని చేశారు. ఓ సాయింత్రం పూట, కోల్‌కొత్తాలో గొలుసు లాగారు. ఢిల్లీలో ‘మన్‌మోహన్’ ఎక్స్‌ప్రెస్ ఆగింది.
‘రైల్వే మంత్రి (దినేష్ త్రివేది) మా వాడే కావచ్చు. కానీ, పనికి రాడు. తీసేస్తున్నాను.’ అన్నారు. ‘సడన్ బ్రేకు’ వేస్తే, పెద్ద చప్పుడు చేసి ఆగినట్లు, ‘మన్‌మోహన్ బండి’ అర్థాంతరంగా ఆర్థరాత్రి పూట ఆగింది.
ఏదయినా విలువయిన వస్తువు పడిపోయినప్పుడు గొలుసు లాగడం ఆనవాయితీ. అత్యంత నిరాడంబరంగా, నిరలంకృతంగా వుండే మమత దగ్గరనుంచి ఈ రాత్రి పూట ఏ వస్తువు పడిపోయింది? అధికారాన్ని మించి నగ ఏ నేతకయినా వుంటుందా?
నిజంగానే త్రివేది ఆ నగను పోగొట్టారు. పనిగట్టుకుని వేరే ‘చేతి’లో వేసేశారు.
భారతీయ రైల్వేలను- మమత పుట్టింటి ఆస్తిగా భావిస్తారు. ఇప్పుడు కాదు. ఎన్డీయే సర్కారు వున్నప్పుడు కూడా ‘పొత్తు’ పేరిట వాజ్ పేయీ సర్కారు నుంచి అతి భద్రంగా ఆ శాఖను తనవైపు తీసుకోవటానికి ప్రయత్నించేవారు.
సాక్షాత్తూ తానే ఆ శాఖను తర్వాత యూపీయే-1 సర్కారులో కూడా పుచ్చేసుకున్నారు. తాను ముఖ్యమంత్రయ్యాక కూడా, ఈ శాఖ జారిపోకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడయిన ముఖుల్ రాయ్‌కి ఇవ్వాలని పట్టుపట్టారు. అందుకు మన్‌మోహన్ అడ్డం తిరిగితే, ఇంకాస్త తక్కువ సన్నిహితుడయిన దినేష్ త్రివేదిని చెయ్యటానికి సరే అన్నారు.
తక్కువ సన్నిహితుడు ఆమెకు తక్కువే చేశారు.
ఇంత పెద్ద రైల్వే బడ్జెట్‌ను ఆమెకు చెప్పా,చెయ్యకుండా ప్రవేశపెట్టేస్తున్నట్టు ముందే తెలిసిపోయింది. పట్టరానంత కోపం వచ్చేసింది మమతకు. అయినా త మాయించుకున్నారు. ‘బడ్జెట్ అన్నాక బడితె పూజే కదా! సామాన్యుడి నడ్డికి కొంచెమయిన ఫ్రాక్చర్ చేస్తారు కదా!’ అని ఊపిరి బిగబట్టి రైల్వే బడ్జెట్ సమర్పించేంత వరకూ ఎదురు చూశారు. కానీ ఆయన ఆచి, తూచి వడ్డించారు. సామాన్య ప్రయాణికుడి మీద కిలోమీటరు మీద రెండు పైసలు పెంచారు. ‘వామ్మో! ఏకంగా రెండు పైసలే!’ అని భారీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు మమత. ఒక రెండు పైసలు బదులు ‘పైసా’ పెంచినా, ‘ఎంత దారుణం. ఎకాఎకిన, ఒక్కసారిగా పైసాపెంచేస్తారా? అసలు హృదయం వుందా?’ అని వెక్కి వెక్కి ఏడ్చేవారు. అది వేరే విషయం. అలా దు:ఖిస్తూ, దు:ఖిస్తూ, గొలుసు లాగేశారు.
కాస్సేపు మమత విలాపాన్ని అలా వుంచితే, త్రివేది తన బడ్జెట్‌లో ‘ఎంత చెట్టుకు అంత గాలి లాగా’ ‘ఎంత మనిషికి అంత ఏడుపు’ మిగిల్చారు. ఫస్ట్ క్లాస్‌కు 30 శాతం ఏడుపూ, సెకెండ్ క్లాస్ ఏసీకి పది శాతం ఏడుపూ, ఆ తర్వాత తరగతుల వారికి 5 శాతం లోపు ఏడుపూ పంచారు.
ఇంతమందిని ఇంత పధ్ధతి ప్రకారం ఏడిపించిన, దినేష్ త్రివేదీని ఏడిపిస్తే, ఎన్ని కోట్ల మంది కళ్ళు చల్లారతాయి? దేశంలో అందరి సంగతీ అనవసరం. ముందు తన సొంత రాష్ట్రం( పశ్చిమ బెంగాల్)లో వోటర్ల కళ్ళు చల్ల బడతాయి. అలా చల్ల బడితే, ఢిల్లీ నుంచి కోల్ కొతా వెళ్ళే ‘మమతా’ ఎక్స్‌ప్రెస్ బోగీలు పెరుగుతాయి. ఇప్పుడున్న 19 బోగీల( ఎం.పీల)తోనే యూపీయే సర్కారుకు ఊపిరాడకుండా చేస్తుంటే, 2014 ఎన్నికల్లో ఇంకాస్త పెరిగాయంటే, కేంద్రాన్ని ఒక ఆట ఆడించ వచ్చు. అందులోనూ ‘రాహుల్ గాంధీ డ్రైవర్ గా వున్న కాంగ్రెస్ ఎక్సెప్రెస్ ఇటీవల పట్టాలు తప్పటం’తో మన్‌మోహన్ సర్కారు, ‘పొత్తుల వాళ్ళ’కి మరీ లోకువ అయి పోయింది. ఎవరికి వారే బెదరిస్తున్నారు. ఒక వేళ, ఇంత కన్నా ఎక్కువ బోగీలున్న ‘ములాయం ఎక్స్ ప్రెస్’ తో యుపీయే ప్రయాణం సాగించాలనుకుంటే, ఆయన రూటే వేరు. తిక్కరేగిందంటే, రైలు ఇంకా బయిలుదేరకుండానే ‘గొలుసు లాగ’ గలరు. ఇక ‘మాయా’ ఎక్స్ ప్రైస్ నిజంగా మాయే. పొత్తు వుందంటే వుంది. లేదంటే లేదు. యూపీలో రాహుల్ కాంగ్రెస్‌ను గెలిపించింది లేదు కానీ, మాయాను గెలవనిచ్చింది కూడా లేదు. కాబట్టి అవకాశం రావాలి కానీ, ఆమె మాత్రం యుపీయే సర్కారును నిలవనిస్తారా? అయితే ‘మధ్యంతరంగా’ మనమోహన్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవటం పొత్తుల వాళ్ళకి కూడా ఇష్టం లేదు. కాబట్టి కేంద్రం నిలవగలదు. పొత్తుల వాళ్ళు తమ శక్తి పెరిగిందని ఏ రోజు అనుకున్నా, ఎవరికి వారు వారి ‘నగలు’ పడకపోయినా పర్మనెంటుగా గొలుసులు లాగేస్తారు. ‘సంకీర్ణ సర్కారు’ అంటేనే అలాగుంటుంది. పేరుకే ఎక్స్‌ప్రెస్. ఎక్కడబడితే అక్కడ ఆగుతుంది. లోపల వున్నవాళ్ళంతా గొలుసులు లాగే వాళ్ళే.
-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రిక 15-3-12 వ సంచికలో ప్రచురితం)
meru ma manusu lagakandi sir