ఎదురు ‘దాడి’

కేరి కేచర్: బలరాం

కేరి కేచర్: బలరాం

పేరు : దాడి వీరభద్రరావు

ముద్దు పేరు : ‘గాడి'( బాబును నమ్మి ఒక గాడిలో ‘సైకిలు’తొక్కాను. ఏముంటుంది. ఎదుగూ లేదు. బొదుగూ లేదు.) ‘దాడి'( బాబును నమ్ముకుని కాంగ్రెస్‌నూ, వైయస్సార్‌ కాంగ్రెస్‌నూ అనరాని మాటలన్నాను. ఇప్పుడు వాటిల్లో ఏదో ఒకటి ద్కియ్యేట్టుంది.) ‘ఎదురు దాడి’ (ఇన్నాళ్ళకు తెలివి వచ్చి బాబు మీదకు దాడికి సిధ్ధపడ్డాను. అది కూడా శాసన మండలి పదవీ కాలాన్ని చిట్ట చివరి రోజు కూడా అనుభవించాక.)

విద్యార్హతలు : ఎం.ఎఫ్‌.ఎ (మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ మేనేజ్‌మెంట్‌). అందుకే నేను ఏ శాఖ మంత్రిగా వున్నా నిర్వహించే శాఖ మాత్రం- ‘కుటుంబ సంక్షేమం’. అంటే పార్టీనే కుటుంబంలా చూసుకుంటానని అనుకునేరు. ముఫ్ఫయ్యేళ్ళు పాటు అలాగే భావించాను. కానీ బాబు కళ్ళు తెరిపించారు. ‘కుటుంబమే పార్టీ’ అని ‘జ్ఞానోదయం’ కలిగించారు. ఆయనకు ‘లోకేశ్‌’ ఎంతో, నాకు నా కొడుకు ‘రత్నాకర్‌’ అంతే. నేను ఏ పార్టీలోకి వెళ్ళినా ‘ఫ్యామిలీ ప్యాకేజ్‌’ తోనే వెళ్తాను.

హోదాలు : ముందు ‘మాజీ’ అని పెట్టుకుంటే ఎన్ని హోదాలయినా వెలగబెట్టినట్లు రాసుకోవచ్చు. లేదూ, ‘రాజీ’ అని రాసుకున్నా భవిషత్తులో కొన్ని పదవులు వెలగ బెట్టవచ్చు. (శాసన మండలి లో సభానాయకుడికే ‘టికెట్టు’ ఇవ్వలేదన్నాక కూడా ‘రాజీ’ అవసరమంటారా? అందుకే వచ్చేశాను.)

గుర్తింపు చిహ్నాలు : ఒకటి: ‘పిట్ట కొంచెం కూత ఘనము’ అన్న సామెతను మీరు ఎప్పుడు మరచిపోయినా నన్ను తలచుకో వచ్చు. ముప్ఫయ్యేళ్ళు ఒకే కూత కూసాను. ఇప్పుడు గొంతు సవరించుకుంటున్నాను.

రెండు: ‘పిట్ట కొంచెం ‘పోరు’ ఘనము’ అన్న కొత్త సామెత గురించి త్వరలో బాబు తెలుసుకుంటారు.

అనుభవం : అనకాపల్లిలో బెల్లం మాత్రం దొరుకుతుందని చంద్రబాబుకు తెలుసు. ‘కారం’ కూడా దొరుకుతుందని ఇక మీదట తెలుసుకుంటారు. నేను ఆ నియోజక వర్గం నుంచి వరసగా నాలుగు సార్లు శాసన సభ్యుడిగా ఎన్నికయిన వాణ్ణి . ఇక చూస్తారు తమాషా.

వేదాంతం : ఉన్న చోటనే వుండి పోతే ఊడల మర్రికి కూడా విలువ వుండదు.

వృత్తి : చంద్రబాబు నాయుడు ఒకప్పుడు గాను ‘వృత్తి రాజకీయ నాయకుణ్ణి’ అని చెప్పుకున్నాడు. కానీ ఆపని చెయ్యడు.( ఆయన అయితే ఆటో క్రాట్‌లా వుంటాడు. లేకుంటే బ్యూరోక్రాట్‌లా వుంటాడు.) కానీ నేను చెప్పుకోను. కానీ అదే వృత్తి చేస్తాను.

హాబీలు :1. ‘సమాచార సేకరణ’ ( పూర్వం సంబంధిత మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించాను లెండి. సమాచారం లేకుండా నిర్ణయం తీసుకోను. ఇప్పుడు ‘ఫ్యామిలీ ప్యాకేజి’ లో భాగంగా అనకాపల్లి కానీ, విశాఖ పశ్చిమ అసెంబ్లీ స్థానం కానీ రత్నాకర్‌ కి ఇస్తారా? ఏ పార్టీలో పోటీ ఎంతెంత వుంది? ఈ వివరాల సేకరణ దాదాపు పూర్తయింది.

2. నిశ్శబ్ద విప్లవం. నేను ఉత్తరాంధ్రుణ్ణి. ఉత్తర కుమారుణ్ణి కాను. ప్రగల్బాలు పలకకుండా పనిచేసుకుంటూ వెళ్ళిపోతాను. ఉత్తరాంధ్ర వోటర్లూ అంతే. వారి నాడి అంచనాకు దొరకదు. వోడించాలనుకున్నా, గెలిపించాలనుకున్నా పోలింగ్‌ బూతులకు అంతే సైలెంట్‌గా వెళ్ళిపోతారు.

నచ్చని విషయం : ‘యూజ్‌ అండ్‌ త్రో’ సిధ్ధాంతం. తెలుగుదేశం పార్టీలో అందర్నీ అలాగే చేసినా. నన్ను మాత్రం చేయరనుకున్నాను. కానీ చేశారు. అదీ చాలా కాలం తర్వాత. కారణం: నా ‘యూసేజ్‌ వాల్యూ’ చాలా ఎక్కువగా వుండటం.

మిత్రులు : రాజకీయ కుటుంబాలున్న వారందరూ నాకు మిత్రులే. వారికి మాత్రమే ‘కుటుంబ సంక్షేమం’ అర్థమవుతుంది.

శత్రువులు : ‘బీ’ పాం చేతికి వచ్చే వరకూ చెప్పలేను. చూశారా. శాసన మండలిలో సభ్యత్వానికి చివరి రోజు వరకూ ఎలా రాజీనామా చెయ్యలేదో- అలాగన్నమాట. అప్పుడే కదా- శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా మారేదీ…!?

జపించే మంత్రం : ‘మాకూ మంచి సంబంధాలు వస్తున్నాయి’ అన్నట్లుగా ‘నాకూ అన్ని పార్టీలనుంచీ ఆహ్వానాలు అందుతున్నాయి.’ (అలాగని ఏ బీజేపీలోనో, సీపీఐలోనో చేరిపోతామా!?’

విలాసం : నా మాజీ పార్టీ నేతే నిన్నటి దాకా ‘కేరాఫ్‌ రోడ్స్‌.’ నాదంటారా…? ‘క్రాస్‌ రోడ్స్‌’!(వైయస్సార్ కాంగ్రెస్ లో చేరినా సరే)

గురువు : ఎన్టీఆర్‌. (అయినా కానీ, ‘వెన్నుపోటు’ బాబుతో కొనసాగక తప్పలేదు.) రాజకీయాల్లో గురువులకు అలాంటి సత్కారాలే తరచుగా జరుగుతుంటాయి.

జీవిత ధ్యేయం : గెలిచే పార్టీలో, గెలిచే స్థానంలోనుంచి, నా కొడుకును గెలిపించుకుని, కొత్త కేబినెట్‌లో అతని పేరు చూసి మురిసిపోవటం.

-సతీష్ చందర్

(గ్రేట్  ఆంధ్ర వార పత్రిక 4-10 మే 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *