రెండు తెలుగు రాష్ట్రాలలలో పెద్దల సభలు యుధ్ధానికి సిధ్ధమవుతున్నాయి. ఈ యుధ్ధం ఆంధ్రప్రదేశ్‌లో అంతర్గతం; తెలంగాణలో బహిర్గతం. ఆంధ్రప్రదేశ్‌లో నిజంగానే తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలాగ మొదలయింది. తెలంగాణలో అలా కాదు, ఇది పార్టీల మధ్య పోరులాగా మారింది. కానీ రెండు చోట్లా అధికారపక్షాలకు ‘పెద్దలు’ అన్నమాటకు నిర్వచనాలు మార్చుకున్నారు.
మన పార్లమెంటరీ వ్యవస్థలో ‘ఎగువ’ ‘దిగువ’ సభలు వున్నాయి. ఇవి మనం బ్రిటిష్ పార్లమెంటరీ విధానం నుంచే సంక్రమింప చేసుకున్నాం. ఎక్కడయినే నేరుగా ప్రజలు ఎన్నుకునే ప్రతినిథుల సభ ‘దిగువ’ సభే. బ్రిటన్ లో అయితే ‘హౌస్ ఆఫ్ కామన్స్’ అంటారు. ఇక మేధావులూ, బుధ్ధిజీవులూ ఎన్నుకునేది ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’. ఇదే ‘ఎగువ’ సభ. మన పార్లమెంటులో అయితే వీటినే లోక్‌సభ, రాజ్యసభ అని ముచ్చటగా పిలుచుకుంటున్నాం. రాష్ట్రాలలో కూడా ఇదే విధానాన్ని పాటించే అవకాశం వుంది. కానీ ఇది తప్పని సరి కాదు. శాసన సభ లేదా విధాన సభ (లెజిస్లేటివ్ అసెంబ్లీ) ఏ రాష్ట్రంలో అయినా వుండాల్సిందే. కానీ శాసన మండలి లేదా విధాన పరిషత్ ( లెజిస్లేటివ్ కౌన్సిల్) మాత్రం రాష్ట్రాలు కావాలంటే వుంచుకోవచ్చు; లేదా తొలగించుకోవచ్చు. మొదటిది ‘దిగువ’ సభ; రెండవది ‘ఎగువ’ సభ. ఈ రెండవ సభే రాష్ట్రంలో పెద్దల సభ. ఈ సభ కేవలం ప్రస్తుతం ఏడు రాష్ట్రాలలో మాత్రమే వుంది. రెండు తెలుగు రాష్ట్రాలూ కలసి వున్న సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ శాసన మండలి కొన్నేళ్ళు వుంది; కొన్నే ళ్ళు వుంది. గత శతాబ్ది ఎనభయ్యవ దశకం తొలి పాదంలో, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన, కొంత కాలానికే శాసన మండలిని రద్దు చేశారు. మళ్ళీ ఈ శతాబ్దం తొలి దశకంలో వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక, మళ్లీ ఈ ‘పెద్దల’ సభను పునరుధ్ధరించారు. రాష్ట్రం విడిపోయాక కూడా రెండు రాష్ట్రాలూ ఈ పెద్దల సభను కొనసాగిస్తున్నాయి. ఖాళీలను పూరించుకుంటున్నాయి. తెలంగాణలో గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుంచీ, ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల నియోజకవర్గాలనుంచీ ఇటీవలనీ ఖాళీలను పూరించుకున్నాయి. ఇప్పుడు, శాసన సభ్యుల (ఎమ్మెల్యేల) ద్వారా ఎన్నికయ్యే ఖాళీ అయిన స్థానాలను పూరించుకునేందుకు రెండు చోట్లా రంగం సిధ్ధమయ్యింది. ఎన్ని కల షెడ్యూలు విడుదలయింది. జూన్ ఒకటో తేదీ నాటికే, రెండు చోట్లా మండలికి కొత్త సభ్యులు వచ్చేస్తారు.
అయితే రాజ్యాంగకర్తల దృష్టిలో పెద్దల సభ ఉద్దేశ్యం గొప్పది. నేరుగాప్రజలు ఎన్నుకునే ప్రతనిథులకు జనాదరణ వుండవచ్చు కానీ, విషయపరిజ్ఞానం ఉండక పోవచ్చు. అలాంటప్పుడు దిగువ సభ తీసుకునే నిర్ణయాల మీద, ఎగువ సభ ఒక ‘చెక్’ గా వుంటుంది. అందుకే వారిని ‘పెద్దల’న్నారు. వీరు జ్ఞానంలోనే కాకుండా ‘నైతికత’ లో కూడా ఉన్నత స్థాయిలో వుండాలి. అయితే రాను రాను, జ్ఞానంలోనూ, నైతికతలోనూ ‘పెద్దల’ ప్రమాణాలు తగ్గిపోతున్నాయేమో అన్న అనుమానం కలుగుతోంది. వెనకటికి ‘పరమానంద శిష్యుల కథ’ అనే ఓ పాత చిత్రంలో ని పాట కొత్తగా గుర్తుకు వస్తోంది: ‘పెద్ద మనుషులంటేనే బుధ్ధులన్ని వేరు రా!’ అని. ‘ఒపీనియన్స్ చేంజ్ చేస్తేనే కానీ పాలిటిష్యన్’ కాలేడన్నది కూడా పాత నానుడే కానీ, ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లోనూ అధికార పక్షం చేస్తున్న ఎంపికను బట్టి ఈ నానుడి కొత్తగా వినిపిస్తోంది. ‘పార్టీ ఫిరాయిస్తేనే కానీ పెద్దమనిషి కాలేడు’. రెండు చోట్లా, ఈ సీట్లను కేటాయించేటప్పుడు ఈ పధ్ధతిని అవలంభిస్తోంది. అయితే తెలంగాణలో అయితే టీఆర్‌ఎస్ ఈ పనిని బాహాటంగా చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో శాసన సభ నుంచి ఎన్నికయ్యే నాలుగు సీట్లలో మూడింటికి అభ్యర్థుల చేత టీడీపీ- బీజేపీ పాలక పక్షం నామినేషన్ వేయించింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ నుంచి పార్టీ ఫిరాయించిన జూపూడి ప్రభాకరరావుకు సీటు కేటాయించింది కానీ, ఆయన ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్డు వోటరు కానందు వల్ల మాత్రమే ఆ సీటును ప్రతిభా భారతికి బదలాయించింది. లేకుంటే, ‘ఫిరాయింపునకూ జై’ అనటంలో తెలుగుదేశం పార్టీ కూడా ముందే వుంది.
కానీ తెలంగాణ కొచ్చేసరికి ఇదే పార్టీ ‘ఫిరాయింపునకూ నై’ అంటోంది. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి అలా వుంది. ఇక్కడ ఎమ్మెల్యేలతో నింపే ఎమ్మెల్సీల సంఖ్య ఆరుగురు. ప్రతీ 18 సీట్లకు ఒక ఎమ్మెల్సీలను ఎన్నుకోవచ్చు. ‘గులాబీ ఆకర్ష్’ ఫలితంగా తొలుత 63 మంది వున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 75 మంది అయ్యారు. కాబట్టి 72 వోట్లతో నాలుగు సీట్లను టీఆర్‌ఎస్ సునాయాసంగా గెలుస్తుది. వోట్లు సీట్లు వున్న కాంగ్రెస్ ఒక సీటును దక్కించుకుంటుంది. ఎటొచ్చీ టీడీపీ పరిస్థితే కష్టంగా వుంది. దానికి 11 వోట్లే వున్నాయి. ఇంకా ఆరు వోట్లు కావాలి. బీజేపీకి అయిదు వోట్లు వున్నాయి. రెండు కలిపినా ఇంకా రెండు వోట్లు కావాలి. చెరో ఒక్క వోటు వున్న సిపిఐ, సిపిఎంను అడగవచ్చు కానీ, పక్కలో బీజేపీని పెట్టుకుని వామ పక్షాలను ఎలా అడుగుతుంది. టీడీపీ నుంచి ఫిరాయించాక కూడా సాంకేతికంగా తమతోనే వున్న వారికి ‘విప్’ జారీ చేసే యత్నం చేస్తోంది. ఇదంతా ఒక యెత్తయితే, టీఆర్‌ఎస్ సీట్లు కేటాయించిన వారిలో ముఖ్యులు ఫిరాయించిన వారే వున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఫిరాయించిన వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టటమే కాకుండా, ఆరు నెలల తిరగకుండా ఉభయ సభల్లో ఏదో ఒక సభనుంచి ఎన్నిక కావాలి కాబట్టి, ‘పెద్దల’ సభలో చోటిస్తున్నారు. కొన్నాళ్ళకు ‘పెద్దలంటేనే ఫిరాయిపుదారులు’ అనే అర్థం స్థిర పడుతుందేమో!
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 23-30 మే2015 వ సంచికలో ప్రచురితం)