ఒకప్పుడు ప్రేమలేఖ వుండేది!

photo by Peter Hellberg


ఒకప్పుడు ప్రేమ లో రాత కోతలుండేవి. ఇప్పుడు కోతలు మాత్రమే వున్నాయి. రాతలు ఎగిరిపోయాయి.
‘మమ్మీ మొబైల్స్‌ లేవు కదా? డాడీ, నువ్వూ ఎలా ప్రేమించుకునే వారు?’ ఇప్పటి టీనేజ్‌ గాళ్‌ అడిగితే, ఏ తల్లి మాత్రం ఏం సమాధానం చెబుతుంది.
‘పోనీ, ఈ మెయిల్స్‌, చాట్స్‌ వున్నాయంటే అవీ లేవు. స్కైప్‌ అనే ముచ్చటే లేదు. ఫేస్‌ బుక్‌, ట్విటర్లూ తెలియవు. మైగాడ్‌… ఇవేమీ లేనీ రోజుల్లో కూడా ప్రేమ వుందంటే… నాకు నమ్మ బుధ్ది కావటం లేదు.’ అని ఆ మళ్ళీ పిల్లే, నోరు వెళ్ళబెట్టిన తల్లి మీద జాలి పడుతుంది.
‘కరక్టే కదా! కాఫీడేలు లేని రోజుల్లో ప్రేమ జంటలు ఎక్కడ కూర్చునే వారు? పోనీ కేఎఫ్‌సీలూ, మెక్‌డొనాల్డ్స్‌ కూడా లేవాయె! హాయిగా అలా వెళ్లి సినిమా చూడాలంటే ఐమాక్స్‌ కూడా లేదు. డొక్కు సినిమా థియేటర్లలోకి లవర్స్‌ వెళ్ళలేరు కదా! ఒక వేల వెళ్ళినా ప్రైవసీ ఎక్కడ వుంటుంది? ఆరోజుల్లో లవ్‌ వుండేదంటే… నేను నమ్మను! నువ్వు అబధ్దమాడు తున్నావ్‌. గొప్ప కోసం మీది లవ్‌ మ్యారేజ్‌ అని చెబుతున్నావ్‌. డాడీ నిన్ను ఏ పెళ్ళి చూపుల్లోనో ఒకే చేసుంటారు. అంతేనా..?’ అని తల్లి ప్రేమను కొట్టి పారేసిన పదహారేళ్ళ పిల్లకు ఏం చెప్పాలి.
పాపం! ఆ పిచ్చితల్లికి తనది ఒక గొప్ప ప్రేమ కథ అని తెలుసు. కానీ ఎలా చెబుతుంది?
అప్పుడు, ఎక్కడినుంచో ఒక జ్యూయలరీ బాక్సు తెరుస్తుంది ఆ తల్లి. అందులోంచి పదిలంగా దాచుకున్న ప్రేమలేఖల దొంతర తెరుస్తుంది. పిల్ల చేతిలో పెడుతుంది.
అలా.. అలా.. ఒకటి తర్వాత ఒకటి.. అన్నీ చదివేసి…,
‘డాడీ మనసంతా నువ్వే కదా…!’ అనంటుంది ఆ పదహారేళ్ళ పిల్ల తడిసిన కళ్ళతో.
తెల్లని, మెత్తని, గుండ్రని మల్లెపువ్వులు గుదిగుచ్చినట్టు వున్న తండ్రి చేతి రాత చూసి,
‘డాడీ హ్యాండ్‌ రైటింగ్‌ ఎంత బాగుందో…! ఇప్పుడలా రాయరేమిటి?’ అనడగుతుంది.
‘రాస్తారు. ఇప్పటికీ రాయగలరు. నాకు ప్రేమ లేఖ రాయాల్సి వస్తే అంతే గుండ్రంగా రాస్తారు.’ తల్లి సమాధానం.
‘లెటర్‌ మీద ఎడమ వైపు, ఫుట్‌ పాత్‌లా వదిలిన మార్జిన్‌ ఎంత రిలీఫ్‌ గా వుంది. స్కేల్‌తో గీసిన గీతలా.. ఎలా సాధ్యం?’
‘ ఆ మార్జిన్‌ ఎందుకో తెలుసా? ఉత్తరం అందుకుని నా గదిలోకి వెళ్ళి, నా మంచం మీద నడుం వాల్చి, దిండు మీద తలపెట్టుకుని ఉత్తరం చదువుతానా? అప్పుడు, నా ఎడమ చేతి బొటన వేలు ఉత్తరం మీద ఏ మేరకు ఆక్రమించుకుంటుందో, ఆ మేరకే మార్జిన్‌ వదిలేస్తారు.’ తల్లి తృప్తిగా ఊపిరి వదలి చెబుతుంది.
‘మమ్మీ! సారీ, నీ పర్సనల్‌ థింగ్స్‌ అడుగుతున్నాను. ఒక్కటే ప్రశ్న. అన్ని ఉత్తరాలు చదివాను. ఎక్కడా ‘ఐ లవ్యూ’ అని డాడీ రాయలేదేమిటి?’ అని పిల్ల అడగ్గానే తల్లి పకాలను నవ్వింది. పిల్ల చిన్నబుచ్చుకుంది.
‘మీ డాడీ గ్రేట్‌ లవర్‌. గొప్ప ప్రేమికులెవరూ అలా ‘నా వోటు నీకే’ అన్నంత చవక బారుగా చెప్పెయ్యరు.’
‘ఎందుకని?’ ఈ సారి పిల్ల నోరు వెళ్ళబెట్టింది.
‘డాడీకి నువ్వు ముద్దుల కూతురివి కదా! నువ్వంటే ప్రాణం కదా! ఆ విషయం నీకు ఎప్పుడయినా చెప్పారా?’ ఎదురు ప్రశ్న వేసింది తల్లి.
‘చెప్పలేదు. కానీ నాకు తెలుసు.’ అంది పిల్ల.
‘ఎలా?’
‘ఎలా అంటే.. అదంతే..! మాటల్లో, చేతల్లో తెలిసిపోతుంది. కానీ, అదే రాతల్లో అయితే ఎప్పటికీ మిగిలిపోతుంది.’
‘ నీ గురించి డాడీ నాకు రాస్తారు.’ అని తల్లి చెప్పగానే…,
‘ ఏమిటీ? డాడీ నీకు ఇప్పటికీ ప్రేమ లేఖలు రాస్తారా?’
‘యస్‌..! ఏమిటలా చూస్తావ్‌? పెళ్ళిచేసుకుంటే మొగుడయిపోతాడా? నెవర్‌.. మీ డాడీ నాకు ఇప్పటికీ ప్రేమికుడే.. ఉత్తరాల సాక్షిగా…!’ అని తల్లి అలా పోజు కొట్టిందో లేదో,
‘ఏమోయ్‌! డైరీలో సగం రాసుకున్న ఉత్తరం ఏదీ.. కొట్టేశావా? అంత తొందరేమిటే నీకూ…!’ అంటూ ఆవిడగారి భర్త ఆయన గదిలోంచి బయిటకొచ్చాడు.
ఈ లోగా పదహారేళ్ళ ఆ పాప సెల్‌ఫోన్‌ లో మెసేజ్‌ వచ్చినట్టు బీప్‌ వచ్చింది.
నొక్కి చూస్తే, ఆ పిల్ల క్లాస్‌ మేట్‌ ఇచ్చిన ‘ఐ లవ్యూ’ అని ఎస్‌ఎమ్‌ఎస్‌ వచ్చింది. వెంటనే రిప్లయ్‌ కొట్టింది: ‘ప్రేమించటం నేర్చుకోరా శుంఠా!’ అని.
(ప్రేమికుల దినోత్సవానికి రెండు రోజులు ముందుగా…)
– సతీష్‌ చందర్‌
h

4 comments for “ఒకప్పుడు ప్రేమలేఖ వుండేది!

  1. ఈ ఆలోచనలతోనే సతమవుతున్నా రెండు రోజులుగా! ఐ లవ్ యూ చెప్పడం నేటి యువతకో అంతర్జాతీయ సమస్య! అది నేర్పడానికి బోలెడు సినిమాలు! ఒకప్పుడు ప్రేమ కవిత్వం ఉండేది! అదే ప్రేమలేఖ! ఈ యాంత్రిక ప్రపంచంలో యువత కోల్పోయిన సెన్సిటివిటిని ఎవరు అంచనా వేయగలరు?

Leave a Reply